శనివారం, మార్చి 29, 2014

ప్రచారమా... మజాకా?




'నమస్కారం గురూగారూ!' 
'ఏంట్రోయ్‌! ధగధగలాడిపోతున్నావ్‌? ఇస్త్రీచేసిన ఖద్దరు చొక్కా వేశావ్‌. మొహాన పౌడర్‌ దట్టించావ్‌. మూతి కొసలు చెవులకు అంటుకునేలా నవ్వేస్తున్నావ్‌. ఏంటి సంగతి?' 
'మీకు తెలియనిదేముంది గురూగారూ! ఎన్నికల్లో నిలబడ్డా కదండీ? ప్రచారానికి ఏమైనా కిటుకులు చెబుతారేమోనని వచ్చానండి' 
'రాక రాక నా దగ్గరికే వచ్చావా? కానీ, నా సలహాలు నీకంతగా నచ్చవేమోరా!' 
'అమ్మమ్మ ఎంతమాట. తమరు రాజకీయ దురంధరులు. రాజకీయాలను కాచి వడపోసినవారు'
'ఆపరా ఆపు. కాచి వడపోసి కాఫీలా తాగేశాననలేదు. రాజకీయాలకు తొలిమెట్టయిన పొగడ్తలు బాగానే ఒంటపట్టాయి కానీ, అవన్నీ నా దగ్గర ప్రయోగించకు. సరే, అడిగావు కాబట్టి చెబుతున్నా వినుకో. ముందా చొక్కా తీసి, నలిపేసి, మళ్ళీ వేసుకో. దట్టించి కొట్టిన ఆ పౌడర్‌ తుడిచేసుకుని ఇన్ని నీళ్లచుక్కలు మొహాన కొట్టుకో. ఆ నవ్వులాపేసి, సాధ్యమైనంత ఏడుపు మొహం పెట్టుకో!' 
'అదేంటి గురూగారూ! అలా చెప్పారు?' 
'కాదేంట్రా మరి? చక్కగా ఇస్త్రీచేసిన వెయ్యి రూపాయల నోటులాగా ప్రజల దగ్గరికి వెళ్లావనుకో... ఏమనుకుంటారు? కిందటిసారి మనం ఓటేశాక మనిషిలో చాలా మార్పొచ్చిందీ, ఆడిమటుకు ఆడు సుఖాలు అనుభవించేత్తన్నాడూ, మన బతుకులు మాత్రం ఇట్టాగే పడి ఏడుస్తున్నాయీ అనుకోరా?'

'ఓహోహో, అర్థమైందండీ మీ మాటల్లో మర్మం. కానీ, నవ్వితే తప్పేంటండీ?' 
'మరి కాదా! ప్రజానీకం పుట్టెడు బాధల్లో ఉంటే- నీకు నవ్వెలా వస్తుందిరా? వాళ్ల బాధలు చూసి, కష్టాలు విని, మనసంతా తల్లిడిల్లిపోతున్నట్టు, ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి ఇక తప్పక కళ్లు తుడుచుకుని ప్రచారానికి చక్కా వచ్చినట్టు, ప్రజలకు సేవచేసే అవకాశాన్ని మరోసారి ఇవ్వకపోతే ఇప్పటికిప్పుడే గుండె పగిలి ప్రాణం పోయేట్టు... నీ వాలకం కనిపించాలిరా! వాళ్లని ఓదారుస్తూ, నువ్వూ ఓదార్పు పొందుతున్నట్టు ఆకట్టుకోవాల్రా. రాజకీయాల్లోకి రాగానే సరిపోదురా, కిటుకులు లేకపోతే చుట్టూ ఉన్నవాళ్లని చూసి నేర్చుకో!'

'ఇంతలా నేర్చుకోవడానికి ఎవరున్నారండీ?' 
'నామినేషన్‌ వేసిన ఉత్సాహంలో బుర్ర మసకేసిపోయిందేంట్రా? రాష్ట్రంలో సుడిగాలిలా తిరిగేస్తున్న యువనేతను మర్చిపోయావా? దొరికిందే ఛాన్సుగా తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని భూములు, గనులు ఎవరెవరికో ధారాదత్తం చేయించి, ఆ లోపాయికారీ లావాదేవీల సాక్షిగా కోట్లు కొల్లగట్టి, కోటలు కట్టి కూడా జనం కోసం జావగారిపోతున్నట్టు, వాళ్ల కోసమే బతుకీడుస్తున్నట్టు, మనసేడుస్తున్నట్టు, తనువంతా తపించిపోతున్నట్టు కనిపించడంలే? అద్దిరా ప్రజల ముందుకెళ్లే జోరూ ఓట్లడిగే తీరూను. నేర్చుకోండ్రా... ఎప్పుడు బాగుపడతార్రా?'

'గురూగారూ! కోప్పడకండి. మీరు చెప్పినట్టే వేషం, భాష, హావభావాలూ మార్చేస్తా. ఇంకా ఏం చేయాలో కాస్త చెబుదురూ?' 
'నేను చెప్పడం కాదురా, నీ చేతే చెప్పిస్తా. ఉదాహరణకి నువ్వు ప్రచారంలో భాగంగా ఓ గుడిసెలోకి వెళ్లావనుకో. అక్కడొక ముసిలోడు సీవెండి బొచ్చెలో బువ్వ తింటున్నాడనుకో. అప్పుడేం చేస్తావు?'

'ఏముందండీ? ఆడు అన్నం తినేదాకా బయట అరుగుమీద చతికిలబడి, చేయి కడుక్కోవడానికి బయటకొచ్చినప్పుడు నమస్కారం చేసి ఓటడుగుతానండి' 
'మరదే, ఇవన్నీ ఎప్పటివో పాత పద్ధతులు. ఇప్పుడు కొత్త తరహాలొచ్చేశాయి. మొన్న పేపర్లో చదవలే? నువ్వు చటుక్కున చొరవ తీసుకుని గుడిసెలోకి జొరబడిపోయి ఆడు తింటున్న సీవెండి బొచ్చె చనువుగా తీసేసుకుని లోపలున్న కలో గంజో, అన్నం మెతుకులో తీసి ప్రేమగా నోట్లో పెట్టేయాలి. ఆడు ఆశ్చర్యపోయి నోరెళ్లబెడితే పక్కనున్న ఏ ఆవకాయ పిండో నంజుకో అన్నట్టు నాలిక్కి రాసేయాలి. ఆడికి పొలమారితే చటుక్కున బుర్రమీద తట్టి, గ్లాసులో నీళ్లు తీసి పట్టించేయాలి. ఈ పన్లన్నీ చేస్తూనే... 'ఈసారి గనక నాకే ఓటేస్తే ఇంతకంటే చాలా చేస్తా'నని చెప్పి ఒప్పించేయాలి. ఆడు తేరుకునేలోగా ముందుగానే ఏర్పాటు చేసుకున్న ఫొటోగ్రాఫరు క్లిక్కుమనిపించాడో లేదో చూసుకుని బయటకొచ్చేయాలి. తెలిసిందా?'

'అద్భుతం సార్‌! ఈ మాత్రం అందిస్తే ఇక ఆపై రెచ్చిపోతానండి. వీధి కుళాయి దగ్గర ఏ మహిళైనా నీళ్లు పట్టుకుంటుంటే చనువుగా వెళ్లి బిందె తీసి చంకకందిస్తానండి. ఇంకా వీలుంటే ఇంటి దాకా బిందె మోసుకెళ్లి దించి వస్తానండి. ఏ అక్కో ఎసట్లోకి బియ్యం తీసుకుని కనిపిస్తే చొరవగా వెళ్లి బెడ్డలేరుతానండి. ఏ తల్లయినా పిల్లాడికి మొహం కడుగుతూ కనిపిస్తే చటుక్కున నాలిక గీసేస్తానండి. ఏ పిల్లకో జడ వేస్తుంటే దువ్వెన తీసుకుని చిక్కులు తీసేస్తానండి...'

'వార్నీ! అల్లుకుపోవడంలో నీ తరవాతేరా. కానీ, జాగ్రత్తరేయ్‌. ఇక తరవాత ముఖ్యమైనవి హామీలురా. అవి సాధ్యమా, కాదా, వీలవుతాయా, లేదా అనే మీమాంసలు పక్కనపెట్టి ఎడాపెడా ఏది తోస్తే దాన్ని వాగెయ్యి. జనాల కాళ్లకి వేళ్లకి అడ్డంపడుతూ, ఇంటి వాకిట్లోనే ప్రభుత్వాన్ని నడిపేస్తానను, నీ సొమ్మేం పోయింది? ఎలాగోలా అధికారంలోకి రావడమే కదా నీ లక్ష్యం?'

'అవునండోయ్‌, ఇక చూస్కోండి ప్రచారంలో దున్నేస్తా'
'పోయిరా... శుభం!'

PUBLISHED IN EENADU ON 28.03.2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి