ఎన్నికల ఫలితాలు వచ్చిన సంబరంలో యువతీ యువకులు కేరింతలు కొడుతూ ఒక చోట చేరారు. ఓటు హక్కు వినియోగించుకుని, అవినీతికి వ్యతిరేకంగా నవతరం తీర్పునిచ్చి ఆ ఫలితాలను ఆస్వాదిస్తున్న వాళ్లంతా సంబరాలు చేసుకుంటున్నారు.
'ఇప్పుడు అందరం సరదాగా తలా ఒక పాట పాడాలి...' అన్నాడో సరదాల కుర్రాడు.
'అయితే ఓ షరతు. అన్నీ పేరడీ పాటలే పాడాలి...' అందో కిలకిలల కన్నెపిల్ల. అందరూ సరేనంటే సరేననుకున్నారు.
ఆ రాగాల సరాగాలు ఇలా సాగాయి.
* * *
'ఎందుకొచ్చిన ఎన్నిక
ఓ అవినీతి బాలకా!
గెలవడమంటే తేలికా?
జైలుకి పదమ్మా చాలిక!'
అన్నాడో తుంటరి. అంతా కిసుక్కున నవ్వారు.
తరవాత వంతు అందుకున్నాడొక యువకుడు
'కారులో కటకటాలకెళ్లే
కరుకు బుగ్గల కటికవాడా!
కొల్లగొట్టిన కోట్ల సొమ్ము
ఎలా వచ్చెనో చెప్పగలవా?' అంటూ నవ్వేశాడు. ఇంతలో పక్కనున్నవాడు అందుకుని
'కడుపు కాలే కష్టజీవులు
కూలికెళ్లి పన్నులు కడితే...
వాళ్ల సొత్తును అక్రమంగా
మింగినావు తెలుసుకో!'
అందరూ చప్పట్లు కొట్టారు.
ఒకమ్మాయి గొంతు సవరించుకుంది-
'అండా దండా ఉంటాడని
మీ నాన్న మాటకు అండనిస్తే
గుండె లేని మనిషల్లే...
కొండా కోనలు కాటేశాడా?
అప్పనంగా... దోచి...
మహ గొప్పలు నీవు చెప్పుకొంటే
వస్తుందమ్మా ఒక రోజు...
అక్రమాలకు జైలు ఆ రోజు!' అంది రాగయుక్తంగా. కుర్రాళ్లంతా వంత పాడుతూ కేరింతలు కొట్టారు.
మరో అమ్మాయి లేచి సన్నని గొంతుకతో ఇలా పాడింది
'ఇది కుట్రల కాలమనీ... తప్పుల తరుణమనీ
తొందరపడి ఓ కాకిపిల్ల ముందే కూసింది...
విందులు చేసింది
ఇక కసిరే కేసులు కాల్చునని
మరి ముసిరే తప్పులు తరుమునని
ఎరుగని కాకిపిల్ల ఎగిరింది
విరిగిన రెక్కల ఒరిగింది
నేలకు కూలింది...' అనగానే నవ్వులు మిన్నంటాయి.
ఇంతలో ఓ బండకళ్లద్దాల బుల్లోడొకడు లేచాడు
'బాబూ వినరా
తండ్రీ కొడుకుల కథ ఒకటి
కలతలు ఉన్న కమ్మని సీమలో
సాగించారు కుతంత్రాల కాపురం...' అనగానే అందరూ ఫకాలుమని నవ్వారు.
ఇంతలో ఓ అమ్మాయి లేచి నిలబడి స్టెప్పులు వేస్తూ మొదలెట్టిందో పాట
'డిఫెక్ట్‌గాడే బలే డిఫెక్ట్‌గాడే...
కటకటాలకు కనెక్ట్ అయితే...
డిస్కనెక్ట్ కాడే...!' అనేసరికి పకపకలు మిన్నంటాయి.
మరో కుర్రాడు లేచి అందుకున్నాడు
'ఎవడు వాడు? ఎచటి వాడు?
ఇటు వచ్చిన కంత్రీగాడు...
ప్రజల ధనం జనుల ధనం
దోచుకునే దొంగవాడు
భూమి ధనం గనుల ధనం
కబళించే దుండగీడు
తగిన శాస్తి చేయరా... ఆ...ఆ...ఆ...
తరిమి తరిమి కొట్టరా' అంటూ పాడుతుంటే కుర్రాళ్లంతా కోరస్ పాడి రక్తి కట్టించారు.
ఇంతలో ఓ యువకుడు అలనాటి ఓ అందాల నటుడిని అనుకరిస్తూ ఓ చేత్తో కాలర్ పట్టుకుని మరో చేతి చూపుడు వేలు పైకెత్తి పాడసాగాడు...
'ఎవరి కోసం ఎవరి కోసం
ఈ దోపిడీ పర్వం? ఈ అవినీతి సర్వం?
ఎవరి కోసం... ఎవరి కోసం...
పథకాల భిక్ష నువ్వే పెట్టి
పేదల ఆశలు కొల్లగొట్టి
భూములన్ని చుట్టబెట్టి జనుల జెల్ల కొట్టావు
బతుకు నీకు ఇచ్చాము...
ఉతికి ఉతికి దోచావు...'
అనేసరికి అందరూ పగలబడి నవ్వసాగారు.
ఇంతలో ఓ పెద్దాయన అటుకేసి ముసిముసిగా నవ్వుతూ వచ్చారు. 'సరేలెండర్రా... పోయిన అవినీతి సంగతి వదిలేసి ఇప్పుడు వచ్చిన కొత్త శకం గురించి కూడా పాడండి మరి' అన్నారు.
యువతరమంతా ఒక చోట చేరి కోరస్‌గా అందుకున్నారు
'అదిగో నవలోకం... విరిసే మన కోసం' అంటూ పాడారు.
'ఉందిలే మంచి లోకం ముందుముందున
అందరూ సుఖపడాలి నందనందన' అంటూ కేరింతలు కొడుతూ ఆనందించారు!
PUBLISHED IN EENADU ON 19/05/2014
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి