బుధవారం, మే 07, 2014

అదీ అసలు సంగతి!




'ఏంటయ్యా సెక్రట్రీ... బయటేంటి కోలాహలం?' 
'ఎక్కడెక్కడి నుంచో చాలామంది తమ దర్శనానికి వచ్చారండి' 
'ఎవరు వాళ్లు?' 
'అదే అడిగానండి. అందరూ తమ తమ వృత్తి వ్యాపారాలేమిటో చెప్పారండి' 
'ఏమని చెప్పారు?'
'వాళ్లలో కొందరు దొంగలండి. మరి కొందరు దోపిడిదారులండి. కొందరు హత్యలు కూడా చేసిన వాళ్లున్నారండి. ఇంకా అవినీతిపరులు, అక్రమ వ్యాపారులు, కోర్టు కేసుల్లో నిందితులు, బెయిల్‌ మీద ఉన్నవాళ్లు, లంచగొండులు అంటూ చెప్పుకొచ్చారండి' 
'ఏంటిట సంగతి?' 
'మిమ్మల్ని కలుస్తామంటే ఠాఠ్‌... వీల్లేదని కేకలేశానండి. మరి ఇట్లాంటి దగుల్బాజీలు వచ్చారంటే మీకెంత అప్రతిష్ఠ, ఎంత నామర్దా అనండి. అయితే వాళ్లు వినలేదండి. నువ్వెళ్లి మేమెవరో అయ్యగారికి చెప్పూ, ఆయనకు అర్థమవుతుందిలే... నువ్వెవడివో కొత్తోడిలా ఉన్నావని హాల్లో కూర్చుండిపోయారండి. మరి పోలీసుల్ని పిలిపించి బయటికి గెంటెయ్యమంటారా?' 
'భలేవాడివయ్యా సెక్రట్రీ! నీకింకా కొన్ని విషయాలు బోధపడినట్టు లేదు. వాళ్లంతా మనకు కావలసిన వాళ్లేలే. త్వరలో అధికారంలోకి రాబోతున్నామనే అభిప్రాయంతో పరాకు లేకుండా పేర్లు చెప్పుకొని పోదామని వచ్చుంటారు' 
'అయ్యా... ఇలాంటివాళ్లతో మీరు కలిసి మాట్లాడితే అంతగా బాగుండదేమోనండి. సెక్రట్రీగా నా బాధ్యత గుర్తొచ్చి చెబుతున్నాను. ఆనక మీ ఇష్టం' 
'ఓరోరి... వెర్రి సెక్రట్రీ! మనం ఎదిగిందే ఇలాంటివాళ్ల అండదండలతోరా! వాళ్లందరూ వేర్వేరుగా చేసిన పనులన్నీ మనం ఒక్కళ్లమే ఎడాపెడా చేసేసి ఈ దశకొచ్చాం కదా? పులకరించిపోయి పలకరించడానికి వచ్చుంటారు. పద మాట్లాడదాం. అన్నట్టు... వాళ్లందరికీ కూల్‌డ్రింకులు పంపించు'

* * *
'దండాలండయ్య. తమరు పెద్ద మనసు సేసుకుని తమ దర్శనం కలిగించడమే మా అందరి పున్నెమండి. ఈల్లంతా తమర్ని దగ్గరగా సూడాలని, కుదిరితే ఒక్కసారి తాకాలని తెగ సంబరపడిపోతుంటే నేనే దగ్గరుండి తీసుకొచ్చానండి' 
'మీ అభిమానం సరేకానీ, ఇలా అందరూ ఒకేసారి వచ్చేస్తే ఎలాగయ్యా? మీడియా చూ స్తే కోడై కూయదూ?' 
'ఆ... మీడియాదేముంది లెండయ్య. ఎన్నిసార్లు తమరి లీలల గురించి రాయలేదూ? అది కోడై కూస్తే తమరు సూత్తా వూరుకుంటారా? పామై బుసకొట్టడం లేదూ. పత్రికల్లో తమరి కుంభకోణాలు, అక్రమార్జనలు, అవినీతి లావాదేవీలు, లోపాయకారీ యవ్వారాలు, దోపిడిలు, హవాలా పనులు... ఇవన్నీ చూసినప్పుడల్లా మేమంతా ఉబ్బితబ్బిబ్బైపోతామండి. అందుకనే అందరం కూడబలుక్కుని బయల్దేరి వచ్చామండి. తమరు మా యందు దయుంచాలి' 
'సర్లెండయ్యా, అధికారం అందనీయండి. ఇక మనందరికీ స్వర్ణయుగమే. ప్రజాపథకాలు పెట్టి వాటికి లబ్దిదారులుగా అర్హుల్ని పక్కనపెట్టి మిమ్మల్నే ఎంపిక చేయిస్తా. ప్రాజెక్టులు మొదలుపెట్టి అసలైన టెండర్లను నిరాకరించి మీకే కాంట్రాక్టులు ఇప్పిస్తా. మీరే పనీ చేయకపోయినా అంచనాలు పెంచేసి బిల్లులు పాస్‌ చేయిస్తా. పరిశ్రమలకని చెప్పి రైతుల నుంచి భూములు వూడలాక్కుని మీకే ఇప్పిస్తా. ఎంచక్కా రియల్‌ఎస్టేటు వ్యాపారం చేసుకుందురు గాని. ఇలా చిన్న చితక పనుల నుంచి పెద్ద పెద్ద గనుల దాకా అందరం కలిసి దోచుకుందాం. సరేనా? ఇక పోయిరండి...' 
'దండాలయ్య... ఇక ఉంటామండి'
* * *
'ఏం సెక్రట్రీ, ఇప్పుడర్థమైందా మన సంగతేంటో?' 
'అబ్బో... అద్భుతంగానండి. ఇంతలేసి పెద్దమనుషులొస్తే గ్రహించుకోలేకపోయాను క్షమించండి' 
'పర్లేదు లేవయ్యా. ఇంతకీ ప్రచారం బాగా జరిగిందా? మన ఉపన్యాసాలెలా ఉన్నాయి? జనం ఏమనుకుంటున్నారో వాకబు చేశావా?' 
'ఎందుకు చేయనండి. అది నా బాధ్యతే కదండీ? తమరు అమాయక జనాన్ని బాగా నమ్మించారండి. మిమ్మల్ని విమర్శించినవారి పుట్టుపూర్వోత్తరాలు బయటికి లాగి విషయం ఉన్నా లేకున్నా వూదరగొట్టి ప్రజల్ని గందరగోళ పరచారండి. దోచుకుతిన్న కోట్లాది రూపాయల్ని పకడ్బందీగా వూర్ల వూర్లకీ చేరవేసి చాపకింద నీరులా పంచి పెట్టించారండి. మందు సీసాలు లోడ్లకు లోడ్లు తరలించి తెగ తాగించారండి. రకరకాల పథకాలు ప్రకటించి ప్రలోభాలకి, భ్రాంతులకి గురి చేశారండి. ఇక దొంగ ఓట్లకి, రిగ్గింగులకి, బూత్‌కాప్చరింగులకి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారండి. ఇన్ని చేశాక ఇక తిరుగేముంటుందండీ?' 
'అయితే గెలుస్తామంటావ్‌?' 
'సార్‌... అక్కడే చిన్న సందేహమండి. తమరు కోప్పడనంటే చెబుతాను. మీరు చేసిన ప్రసంగాలే మిమ్మల్ని ఓడిస్తాయేమోనని నా భయమండి' 
'అదేం అపశకునమయ్యా, ఏమన్నాను నేను?' 
'ఏముందండీ? తమరు ప్రజల్ని నమ్మించే ఆవేశంలో అసలు సంగతి మర్చిపోయినట్టున్నారు. ప్రతీసభలో ఒకేరకమైన పిలుపునిచ్చారండి. అదే సందేహంగా ఉందండి' 
'చంపకుండా అదేంటో సెప్పవయ్యా...' 
'అదేసార్‌! నీతిపరులకే ఓటెయ్యమని, మేలు చేసేవారినే ఎన్నుకోవాలని, నిజాయతీ నేతలకే పట్టం కట్టాలని, సచ్ఛీలురనే గెలిపించాలని... పదే పదే చెప్పారండి. మరి జనమంతా మీ మాట వినేట్టయితే, ఆ లెక్కన ఓట్లన్నీ మీకు పడవు కదండి? తమరి చరిత్రను తమరే మరిచిపోయి ఇలా పిలుపిస్తే ఎలాగండి? అదొక్కటే నా బెంగండి. వెళ్లొస్తానండి!'

PUBLISHED IN EENADU ON 07.05.2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి