మంగళవారం, జూన్ 13, 2017

పాటలా... అవి కావు... నవ పారిజాతాలు! రసరమ్య గీతాలు!!


శివుడి శిరసు నుండి జాలువారిన గంగ...కొండకోనలదాటి... పంటసీమలు తడిపి...సామాన్యుడి కుండలో కొలువై దాహం తీర్చినట్టు...జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన సినారె కలం...సినిమా పాటలను సైతం సాహితీ సౌరభాలతో గుబాలించేట్టు చేసింది! 
సామాన్య ప్రేక్షకుడికి కూడా ఉన్నత సాహిత్య విలువలను పరిచయం చేసింది!అత్యుత్తమ భావజాలాన్ని అలతి పదాలతో అందించింది!
అందుకే సినారె...
‘సంగీత సాహిత్య సమలంకృతు’డయ్యాడు! ‘
లలిత కళారాధనలో ఒదిగే చిరుదివ్వెను నేను...’ అంటూనే వెండితెర సాహిత్యంలో సూర్యసమానుడయ్యాడు!! 
ఆయన పాటలు... నవపారిజాతాలు... రసరమ్య గీతాలు! 
సామాన్య ప్రేక్షక జన మనోరంజితాలు!!

సినిమా అంటేనే సామాన్య ప్రేక్షకుడిని ఆకట్టుకునేది. ఏది రాసినా, ఏది తీసినా చదువురాని వాడికి సైతం సులువుగా అర్థమయ్యేలా ఉంటేనే ప్రయోజనం నెరవేరుతుంది. ఇలాంటి రంగంలో కూడా డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి రాసిన పాటలు సాహితీ గౌరవం పొంది అలరించాయి. అదే సమయంలో సామాన్యుడిని సైతం ఆకట్టుకున్నాయి. 
‘గులేబకావళి కథ’ సినిమాలో ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని...’తో మొదలైన ఆయన సినీ సాహితీ ప్రస్థానం 3,500లకు పైగా గీతాలతో సుసంపన్నమైంది. ప్రేమగీతాలు రాసినా, జానపద గీతాలు రాసినా, భావగీతాలు రాసినా, విషాద గీతాలు రాసినా సినారె కలం తనదైన ముద్రతో ‘వెండి’తెరపై ‘బంగారు’ సంతకం చేసింది!

* అది...ప్రేయసీ ప్రియులు పాడుకునే యుగళగీతం. నటించేది ఎన్టీఆర్‌, జమున. 
తోటలో మాల కడుతూ ఎదురుచూస్తున్న ఆమె ఆలోచనలు ఎలా ఉంటాయి? 
‘తోటలో తొంగి చూసిన’ ఆ రాజు నవ్వులు ఆమెకెలా అనిపిస్తాయి?
‘నవ్వులా? అవి కావు... నవపారిజాతాలు...
రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు...’లా కనిపిస్తాయిట!

మరి అంతటి ప్రేమను ఆమెలో చూసిన ఆ రాజు ఏం చేశాడు?
‘ఎలనాగ నయనాల కమలాలలో దాగి...
ఎదలోన కదిలే తుమ్మెద పాట...’ విన్నాడు!

‘ఆ పాట నాలో తియ్యగ మోగనీ... అనురాగ మధుధారలై సాగనీ...’ అన్నాడు!
‘ఏకవీర’ చిత్రంలో ‘తోటలో నా రాజు...’ పాట 
అటు రసజ్ఞులను, ఇటు సామాన్యులను కూడా ఒకేలా ఆకట్టుకుంది.

* మరో సందర్భం... అభిమాన ధనుడైన సుయోధనుడి మయసభ మందిర ప్రవేశం. 
దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్‌ ధీరగంభీరంగా నడుస్తూ వస్తుంటే ఆయనకు స్వాగతం పలికే సందర్భంలో సినారె కలం కూడా అంతే గంభీరంగా ముందుకు ఉరికింది.

‘శత సోదర సంసేవిత సదనా... అభిమానధనా... సుయోధనా...’ అంటూ స్వాగతం పలికింది. అంతటితో ఆగలేదు. సుదీర్ఘ సంస్కృత సమాసాలతో ఆ సందర్భాన్ని సుసంపన్నం చేసింది.

‘ధరణి పాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా...’ అని సంబోధించింది.
‘కదన రంగ బాహుదండ ధృత గదా ప్రకట పటు  సౌర్యాభరణా...’ అని మెచ్చుకుంది. 

‘శ్రీక్రిష్ణ పాండవీయం’ సినిమాలో ఇలాంటి పదాలతో సాగిన ఈ పాట కూడా నేల ప్రేక్షకుడి చేత ఈలలు వేయించింది.

* హీరో హీరోయన్‌తో కలసి విహార యాత్రకు వెళ్లే సందర్భంలో పాట రాయాల్సి వస్తే ఇంకెవరైనా అయితే శృంగార పరంగా రాస్తారు. కానీ సినారె ఆ సందర్భానికి తెలుగు సంస్కృతి వైభవానికి అద్దం పట్టేలా పాటను మలిచి అందరినీ ఆకట్టుకున్నారు. 

శోభన్‌బాబు నటించిన ‘విచిత్ర కుటుంబం’లోని 
‘ఆడవే జలకమ్ములాడవే... కలహంస లాగ... జలకన్య లాగ...’ అంటూ మొదలు పెట్టి...

‘ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై జీవకళలొల్కు గోదావరి తరంగాల...’లోను, 
‘కృష్ణవేణీ తరంగిణి జాలిగుండెయే సాగరమ్మై రూపు సవరించుకొను నీట...’
‘నాటి రాయల పేరు నేటికిని తలపోయు తుంగభద్రానదీ తోయ మాలికలందు...’ 

-సాహిత్యాన్ని జలకాలాడించారు! 
సినిమా పాట చేత పుణ్యస్నానాలు చేయించారు!!

* ఇలా ఎన్నెన్నో పాటలు ఆయన కవితాశక్తికి నిదర్శనంగా నిలుస్తాయి. 
‘కంచుకోట’లో ‘సరిలేరు నీకెవ్వరూ...’ పాట విన్నా, 
‘స్వాతి కిరణం’లో ‘శృతి నీవు, గతి నీవు, శరణాగతి నీవు భారతీ...’ పాటను తల్చుకున్నా, 
‘కళ్యాణి’ సినిమాలో ‘లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను... మధుర భారతి పదసన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను...’ పాట చూసినా... 
ఇలా ఒకటా రెండా ఏ పాటను గమనించినా... అవన్నీ 
చిత్రసీమలో ‘చిత్రం... భళారే విచిత్రం...’ అనిపించేవే. 
‘ఛాంగురే... భళారే... సినారె’ అనిపించేవే!!

PUBLISHED IN EENADU ON 13/06/2017


1 కామెంట్‌: