ఆయన సినిమాల్లో...గజ్జెలు ఘల్లుమంటే... ప్రేక్షకుల గుండెలు ఝల్లుమంటాయి...అందెల రవళి వింటుంటే... అభిమానుల హృదయాలు అంబరాన్ని తాకుతాయి...అమృతగానాలు చెవినపడి.... అమితానందపు యెదసడిని కలిగిస్తాయి...సంగీత, నృత్యాలు కలగలిసి... సాగరసంగమాన్ని తలపిస్తాయి...ఈ గాలి, ఈ నేల, ఈ సినిమా తమదనిపిస్తాయి...ఆయన సినిమాలు చూస్తుంటే...సరస స్వర సుర ఝరీ గమనం గుర్తొస్తుంది...నాద వినోద నాట్య విలాసాలు మురిపిస్తాయి... సత్సంప్రదాయ సంగీత జ్యోతులు వెలుగులీనుతాయి...సుమధుర సాహితీ సౌరభాలు మైమరపిస్తాయి...ఆయన కె. విశ్వనాథ్. కళాతపస్వి విశ్వనాథ్! ఇప్పుడు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ అవార్డు గ్రహీతగా ఆయన వెండితెర కృషి తెలుగు చిత్రసీమకే ఓ తీపి గుర్తు!
ఏ ఖజురహోలోనో, హాళీబేడులోనో, అజంతా ఎల్లోరా గుహల్లోనో శ్రద్ధగా చెక్కిన శిల్పాల్లాగా ఆయన సినిమాలు సినీ ప్రేక్షకుల కళ్లముందు కొలువుదీరాయి. విశ్వనాథ్ చిత్రాలన్నీ విలక్షణమైనవే అయినా వాటిలో శంకరాభరణం గురించి మొదటగా చెప్పుకోవాలి. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ సినిమాను చూస్తే మనవైన సంగీత, సాహిత్య, నృత్య కళలపై గౌరవం ఉప్పొంగి, గర్వం పెల్లుబుకుతుంది.
విశ్వనాథ్ అభిమానిగా తనను తాను చెప్పుకునే దర్శకుడు బాపు ఓ సందర్భంలో చెప్పిన ముచ్చట ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
శంకరాభరణాన్ని చూడ్డానికి బాపు ఓ థియేటర్‌కి వెళ్లార్ట. విరామ సమయంలో ఇద్దరు స్కూలు పిల్లలు పరుగున వచ్చి ఆటోగ్రాఫ్ అడిగార్ట. పెన్ను లేదమ్మా అంటే ఓ అమ్మాయి కంపాస్ బాక్స్ తెరిచి అందులోని పెన్సిల్ ఇచ్చిందిట. బాపు సంతకాన్ని చూశాక ఓ అమ్మాయి ‘మీరు విశ్వనాథ్ కారా?’ అని అడిగింది. కాదని బాపు చెబితే, ఆ పిల్ల రెండో పిల్లతో, ‘ఆ కంపాస్ బాక్స్‌లో లబ్బర్ ఇలా ఇవ్వవే’ అంటూ వెళ్లిపోయిందట.
అదీ... అప్పట్లో శంకరాభరణం పిల్లలపై సైతం కలిగించిన ప్రభావం!
ఆ సినిమా వచ్చినప్పుడు అప్పటి యువతీ యువకులు ఆ సినిమాను పదే పదే చూడ్డం ఉత్తమాభిరుచికి నిదర్శనంగా భావించారు. హాలు నుంచి బయటకి వస్తూ ‘దీన్ని నేను చూడ్డం తొమ్మిదో సారి’ అనో పదో సారి అనో చెప్పడాన్ని గర్వంగా అనుకున్నారు. ఇక పెద్దలైతే ఆ సినిమా ఆడినంత కాలం వీలున్నప్పుడల్లా ఏదో గుడికి వెళ్లినంత పవిత్రంగా థియేటర్స్‌కి వెళ్లి పదేపదే చూశారు.
వ్యాపారాత్మక సూత్రాలను పట్టుకుని వేలాడే చాలా సినిమాల్లో ఉండే అంశాలు ఏమున్నాయని శంకరాభరణంలో?
హీరో స్టారా... కాదు!
హీరోయిన్ అందాల తారా... కాదు!
ఫైటింగులు అదిరిపోయాయా... అసలు లేనేలేవు!
ఓ వయసు మళ్లిన సంగీత కళాకారుడికి, ఓ నృత్య కళాకారిణికి ఏర్పడిన అనుబంధంతో అల్లుకున్న కథ...
పాటలు చూస్తే సంగీత కచేరీకి వెళ్లినట్టు ఉంటాయి...
నృత్యాలన్నీ ఏ కళాక్షేత్రంలోనో సంప్రదాయ ప్రదర్శనకు వెళ్లినట్టు అనిపిస్తాయి...
మరేముంది ఆ సినిమాలో?
ప్రేక్షకులను కట్టిపడేసే కథనం ఉంది!
కళాభిరుచిని తట్టిలేపే మాయాజాలం ఉంది!
పాశ్చాత్య సంగీత పెనుతుపాను తాకిడికి రెపరెపలాడిపోతున్న సత్సంప్రదాయ సంగీత జ్యోతిని చేతులడ్డి కాపాడుకోవాలనే సంకల్పాన్ని కలిగించే అద్భుతమైన దృశ్య పరంపర ఉంది.
అందుకే అది జాతీయ అవార్డును గెలుచుకోవడమే కాదు, ఫ్రాన్స్‌లో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రేక్షకుల ప్రత్యేక అవార్డును కూడా అందుకుంది! అన్నింటికన్నా తెలుగు సినీ అభిమానులు గర్వంగా చెప్పుకోగలిగే ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది!
కె. విశ్వనాథ్ తొలిసారి దర్శకుడిగా మారి తీసిన ‘ఆత్మగౌరవం’ సినిమాలోనే ఆయన ప్రతిభ ఏంటో తెలుస్తుంది. తొలి చిత్రంతోనే నంది అవార్డును అందుకున్న ఆ సినిమాను అక్కినేని, కాంచన, రాజశ్రీలతో రైతుకుటుంబం నేపథ్యంలో తీశారు. అందులో ‘అందెను నేడే అందని జాబిల్లి... నా అందాలన్నీ ఆతని వెన్నెలలే...’ అన్న పాటని, ‘రానని రాలేనని వూరక అంటావు... రావాలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు?’ పాటని చూస్తే రొమాంటిజమ్ అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఆ పాటల చిత్రీకరణ తీరు ఈనాటి యువతరానికి కూడా గిలిగింతలు పెడుతుంది.
ప్రేమికుల మధ్య ఉండే సున్నితమైన భావజాలాన్ని ప్రేక్షకుల హృదయాలకు చక్కిలిగింతలు పెట్టే రీతిలో చిత్రీకరించే ఒరవడి ఆయన ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. సంగీత నృత్య భరితమైన శంకరాభరణంలో కూడా మరచెంబుతో ఆయన నడిపిన ప్రేమ రాయబారాలను ఎవరు మాత్రం మరిచిపోగలరు? ‘ఓ సీత కథ’లో ‘మల్లె కన్న తీయన మా సీత మనసు...’ పాటను గుర్తుకు తెచ్చుకోండి. బావామరదళ్ల మమకారం ఎంత సహజంగా తెరమీద ఒదిగిందో తెలుస్తుంది. ఒకరి మీద ఒకరికి కలిగీకలగని ఇష్టాన్ని, ఆ ఇష్టత వ్యక్తమయ్యే సున్నితమైన తీరుని అర్థం చేసుకోవాలనుకుంటే ‘సాగరసంగమం’లో ‘మౌనమేలనోయి... ఈ మరపురాని రేయి’ పాటను ఓసారి చూడండి. సరిగమలతో సైతం ప్రేమలేఖను పంపవచ్చనే సంగతిని ‘సప్తపది’ చెబుతుంది. ‘నగుమోము కనలేని నా బాధ తెలిసి... నను బ్రోవ రారాదా?’ అనే సంగీత కృతి స్వరకల్పనను కాగితంపై రాసి పంపితే ఏ ప్రేయసి పరిగెత్తుకుని సంకేత స్థలానికి రాకుండా ఉండగలుగుతుంది? ఇద్దరు కళాకారుల మధ్య అల్లుకున్న అనుబంధాన్ని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాత్తమైన సన్నివేశం ఏముంటుంది? ఇంత చక్కని ఆలోచన ఎవరికి కలుగుతుంది, కళాతపస్వికి తప్ప! ఇలా చూస్తే ‘శుభలేఖ’లో ‘రాగాల పల్లికిలో కోయిలమ్మ...’ పాటను తల్చుకున్నా, ‘ఆపద్బాంధవుడు’లో ‘ఔరా.. అమ్మకచెల్ల.. ఆలకించి నమ్మడమెల్ల..’ పాటను చూసినా, ఇలా ఒకటేమిటి, విశ్వనాథ్ సినిమాల్లో సున్నితమైన భావజాలాన్ని, ప్రేమ చేసే ఇంద్రజాలాన్ని మనసుకు హత్తుకుపోయే రీతిలో చిత్రీకరించే తీరుకు మెచ్చుతునకలు అనేకం కనిపిస్తాయి.
ఇక ఆయన వెండితెరపై మలిచిన పాత్రల్ని చూస్తే, కళాతపస్వి మహా సాహసి అని కూడా అనిపిస్తాయి. హీరో అంధుడు... హీరోయిన్ మూగది... ఇక వాళ్ల మధ్య సంబంధం కళానుబంధం! సినిమా రంగంలో వ్యాపారాత్మక సూత్రాలు, ఫార్ములాలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఈ కథను వూహించడానికి ఎంత ధైర్యం కావాలి? నిర్మాతకి చెప్పాలంటే తన ఆలోచనలపైన ఎంత స్పష్టత ఉండాలి? కానీ ఆ సినిమా వెండితెరపై ‘సిరివెన్నెల’ కురిపించింది. చూడలేనివారికి సైతం బృందావనాన్ని కళ్ల ముందు నిలిపింది. మరో సినిమాలో కథానాయిక పలుకే బంగారమైన మూగది. నాట్యమంటే మక్కువ. మరి కథానాయకుడు? డప్పు కళాకారుడు. ఆ కుటుంబంపై ఆధారపడే అతడే ఆమెకు రక్షకుడిగా మారతాడు. అతడి నిజాయితీ, అభిమానం ఆమెలో ప్రేమను రగిలిస్తే ఆ మూగ ఇష్టాన్ని తెరపై ఎలా చూపించాలి? ఎవరికైనా కష్టమేమో కానీ విశ్వనాథ్‌కేం? ఆమె కాలికి కట్టుకునే ‘సిరిసిరి మువ్వ’లు గాలికి అల్లాడి, అల్లాడి... కిందనే ఉన్న డప్పుపై పడి చప్పుడు చేస్తాయి. ఆ చప్పుడులో ఆమె గుండె చప్పుడు వినిపిస్తుంది ప్రేక్షకులకు. ఎంత చక్కని వ్యక్తీకరణ? ఎంత సున్నితమైన చిత్రీకరణ? ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులు తొలి రేయిని చూసి ఉంటారు. ఆ సన్నివేశంలో పాటల్ని కూడా ఆస్వాదించి ఉంటారు. కానీ తొలిరాతిరి భార్యను చూస్తూనే ఆమె చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ‘అయిగిరి నందిని... నందిత మోహిని... విశ్వవినోదిని నందినుతే...’ అంటూ పాడుతూ పూజ చేసే భర్తను చూశారా? ఆ సన్నివేశంలో భార్య తెల్లబోవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ, ఆలయంలో అమ్మవారు తప్ప మరో స్త్రీమూర్తిని వేరే దృష్టిలో చూడని ఆ యువ పూజారికి, మనసు అన్యాక్రాంతమైన భార్య జగన్మాతగా కనిపించడంలో వింత లేదని అర్థం చేసుకునే ప్రేక్షకుడు మాత్రం తెల్లబోడు. పైగా ఆ అద్భుత వైవిధ్య చిత్రీకరణకు జోహార్లు అర్పిస్తాడు. అందుకే ‘సప్తపది’, పది కాలాల పాటు చెప్పుకునే సినిమాగా మిగిలింది. ఇవన్నీ పక్కన పెడితే హీరో ఒట్టి వెర్రిబాగులవాడు. వయసు ఎదిగినా బుద్ధి మందగించిన వాడు. అమ్మాయి వీపు తోముతున్నా, గుడి మెట్లు కడుగుతున్నా పని మీద శ్రద్ధ తప్ప, మరే ధ్యాసలూ ఉండనంత అమాయకుడు. అలాంటి హీరోతో ‘స్వాతిముత్యం’లాంటి సినిమా తీశారు విశ్వనాథ్. అలా ఆయన ఓ చెప్పులు కుట్టేవాడితో స్ఫూర్తిని పంచగలరు. ఓ ఆవులు కాసేవాడితో మంచితనానికి అర్థం చెప్పించగలరు. ఓ జాలరితో బంధమంటే ఏంటో చూపించగలరు. బాధ్యతను తప్పించుకోడానికి సన్యాసులలోనైనా చేరడానికి సిద్ధపడే ఓ బద్ధకస్తుడితో పని విలువేంటో తెలియజెప్పగలరు.
సమాజంలో వేళ్లూనుకు పోయిన సమస్యలను కూడా విశ్వనాథ్ చిత్రాలు కట్టెదుట నిలిపి, నిలదీసి మరీ పరిష్కారాలు సూచిస్తాయి. ఆచార వ్యవహారాల కన్నా మానవత్వం గొప్పదని శంకరాభరణం చాటి చెప్పడాన్ని ఎలా మర్చిపోగలం? మనుషులను విడదీసే కుల వ్యవస్థను చెరిపివేయాలని ‘సప్తపది’ స్పష్టం చేస్తే ఎలా కాదనగలం? చేసే పని తపస్సయితే అదే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందని ‘స్వయంకృషి’ చెబితే ఒప్పుకోకుండా ఎలా ఉండగలం? అవినీతి అక్రమాలను ఎదుర్కొనడానికి హింస మార్గం కాదని, శాంతియుత మార్గమే ఉత్తమమని ‘సూత్రధారులు’ బోధిస్తే అంగీకరించకుండా ఎలా ఉండగలం? వరకట్నం సమస్యని సునిశిత హాస్యంతో మేళవించి ‘శుభలేఖ’ చూపిస్తే ఆలోచించకుండా ఎవరుండగలం? ఎంత ఉన్నతమైన వ్యక్తినైనా అసూయాద్వేషాలు అధఃపాతాళానికి దిగజారుస్తాయని ‘స్వాతికిరణం’ కళ్లు తెరిపిస్తే కాదనగలమా?
కె. విశ్వనాథ్, సమాజాన్ని సినిమా జాగృతం చేయగలదని మనసా, వాచా, కర్మణా నమ్మారు. ఆ నమ్మకానికి వూహను జోడించి, అందమైన కథను అల్లి ప్రేక్షకుల మనస్సులలో చెరిగిపోని ముద్ర వేసే అరుదైన, అద్భుత చిత్రాలను వెండితెరపై కమనీయంగా మలిచారు. అందుకే ఆయన కళాతపస్వి మాత్రమే కాదు, చిరకాలం తల్చుకోగలిగే అసమాన యశస్వి!!
published in EENADU on 24.04.2017
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి