గురువారం, అక్టోబర్ 22, 2020

విచిత్ర పోరాటాల వీరుడు!: జాకీచాన్‌

 కళ్లకి కనిపించనంత వేగంగా చేతుల్ని తిప్పుతూ ప్రత్యర్థి మీద దాడి చేయగలడు...

ఊహించని విధంగా అకస్మాత్తుగా పైకెగిరి కాళ్లతో శత్రువుని తన్ని నేలకరిపించగలడు...

ప్రాణాంతకమైన సాహసాలు చూపిస్తూ పోరాట విన్యాసాలు చేయగలడు...

−ఇవన్నీ చేస్తూ సినిమా హాళ్లో ప్రేక్షకులను మునివేళ్లపై కూర్చోబెడుతూనే... చటుక్కున చిలిపి పనులతో నవ్వించనూగలడు!

అందుకే అతడంటే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు చెప్పలేనంత ఇష్టం!

ఆ ఇష్టమే అతడికి ప్రపంచ సినీ రంగంలో ఏకంగా 350 మిలియన్‌ డాలర్ల విలువ గలిగిన వ్యక్తిగా గుర్తింపు తీసుకొచ్చింది!

కానీ ఆ ఇష్టాన్ని పొందడానికి అతడు...

ఎన్నోసార్లు ముక్కు బద్దలు కొట్టుకున్నాడు!

దవడలు విరగ్గొట్టుకున్నాడు!

పక్కటెముకలకు గాయాలైనా లక్ష్యపెట్టలేదు!

ఎన్నో శస్త్రచికిత్సలు జరిగినా చలించలేదు!

ఆఖరికి ఎత్తుమీద నుంచి పడి మెదడు చిట్లిపోయి మరణం అంచుల వరకు వెళ్లినా తన పంథాను మార్చుకోలేదు!

ఆ విచిత్ర పోరాట వీరుడే జాకీచాన్‌!!




అందరూ జాకీచాన్‌గా పిలుచుకునే ఈ అంతర్జాతీయ నటుడి అసలు పేరు చాన్‌ కాంగ్‌ సాంగ్‌. అంటే అర్థం ఏమిటో తెలుసా? హాంగ్‌కాంగ్‌లో పుట్టిన డ్రాగన్‌ అని! అభిమానులు ‘బిగ్‌ బ్రదర్‌’గా పిలుచుకునే ఇతడు కేవలం నటుడు మాత్రమే కాదు, మార్షల్‌ యుద్ధవిద్యల నిపుణుడు, దర్శకుడు, నిర్మాత, స్టంట్‌మ్యాన్, గాయకుడు కూడా. ఇతడు కుంగ్‌ఫు, హాప్‌కిడో, కరాటే, టైక్వాండో, జూడో, జీత్‌కునే దో లాంటి విద్యల్లో ప్రవేశం ఉన్నవాడు. దాదాపు 160 సినిమాలకు పైగా నటించిన జాకీచాన్‌ తను నటించిన సినిమాల్లో పోరాటాలను తానే రూపొందిస్తాడు. ఆయా సినిమాల్లో పాటల్ని కంపోజ్‌ చేసి స్వయంగా పాడతాడు కూడా. విడిగా కూడా వందలాది ఆల్బమ్స్‌ ద్వారా పాప్‌ పాటల ప్రియులకు అభిమాన గాయకుడు. ఫోర్బ్స్ పత్రిక అంచనా ప్రకారం 2015 నాటికే 350 మిలియన్‌ డాలర్ల విలువ కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన జాకీచాన్, ప్రపంచంలోని మేటి పది మంది వితరణశీలురలో ఒకడు.

చిన్నప్పుడే నటనకేసి...

హాంగ్‌కాంగ్‌లో 1954 ఏప్రిల్‌7న చార్లెస్, లీలీచాన్‌లకు పుట్టిన జాకీచాన్‌ను తల్లిదండ్రులు ముద్దుగా ‘పావో పావో’ అని పిలుచుకునేవారు. అంటే చైనా భాషలో ‘ఫిరంగి గుండు’ అని అర్థం! ఒక క్షణమైనా ఒక్కచోట కుదురుగా ఉండలేని ఈ చిచ్చరపిడుగు హాషారును, ఉత్సాహాన్ని తట్టుకోవడం వాళ్లకి తలకిమించిన పనిగానే ఉండేది. ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా వలసపోయిన తల్లిదండ్రులు జాకీచాన్‌ను మాత్రం హాంగ్‌కాంగ్‌లోనే స్కూల్లో చేర్చి ఉంచేశారు. అక్కడున్న పదేళ్లకాలంలోనే చదువు సంగతి ఎలా ఉన్నా, యుద్ధవిద్యలు, అక్రోబాటిక్స్‌లో శిక్షణ వల్ల ఓ ప్రపంచ హీరోగా రాటుదేలడానికి కావలసిన తొలి బీజాలు జాకీచాన్‌లో పెంపొందాయి. ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలు వేసే ఇతగాడికి నటుడిగా ఐదేళ్ల వయసులోనే చిన్న చిన్న వేషాలు దొరికాయి. ఎనిమిదేళ్లకల్లా ‘బిగ్‌ అండ్‌ లిటిల్‌ వాంగ్‌ టిన్‌ బార్‌’ (1962), ‘ది లవ్‌ ఎటర్న్‌’ (1963), ‘కమ్‌ డ్రింక్‌ విత్‌ మి’ (1966) లాంటి సినిమాల్లో పాత్రలు మంచి గుర్తింపునే తీసుకొచ్చాయి. పదిహేడేళ్ల వయసు వచ్చేసరికి బ్రూస్‌లీ నటించిన ప్రపంచప్రఖ్యాత సినిమాలు ‘ఫిస్ట్‌ ఆఫ్‌ ఫ్యూరీ’, ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ సినిమాల్లో స్టంట్‌ మాస్టర్‌గా వ్యవహరించే స్థాయికి ఎదిగాడు. తర్వాత కొన్ని సినిమాల వైఫల్యంతో స్టంట్‌మాస్టర్‌గా అవకాశాలు రాక మళ్లీ నటుడిగా ఏవేవో పాత్రల కోసం ముఖానికి రంగు వేసుకోవాల్సి వచ్చింది. అయినా ఆశించినంత ప్రోత్సాహం లేక ఆస్ట్రేలియాలో తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయి అక్కడ కొన్నాళ్లు నిర్మాణ కార్మికుడి అవతారం ఎత్తాడు. అక్కడి బిల్డర్‌ ఇతగాడిని ‘లిటిల్‌ జాక్‌’ అని పిలిచేవాడు. అదే పొట్టి రూపం దాల్చి జాకీగా మారి చాన్‌కి ముందుకొచ్చి స్థిరపడిపోయింది.


భవిష్యత్తులో జాకీచాన్‌ జీవితం వెండితెరపై సర్వాంగసుందరంగా నిర్మాణం కావలసి ఉండగా, అతడెందుకు ఓ కార్మికుడిగా ఉండిపోతాడు? అందుకే హాంగ్‌కాంగ్‌లో ఓ నిర్మాత అతడికి ఫోన్‌ చేసి తన సినిమాలో నటించమని పిలిచాడు. భావి హీరో మళ్లీ కొత్తగా బ్యాగ్‌ సర్దుకుని వెండితెర వెలుగుల్లో నట ప్రస్థానం కోసం బయల్దేరాడు. ఏవో కొన్ని సినిమాలు చేశాక 1978లో వచ్చిన ‘స్నేక్‌ ఇన్‌ ది ఈగిల్స్‌ షాడో’ సినిమా అతడి జాతకాన్ని మార్చేసింది. అందులో హాస్యాన్ని మేళవిస్తూ జాకీచాన్‌ రూపొందించిన విచిత్ర పోరాట విన్యాసాలు హాంగ్‌కాంగ్‌ ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించి ఈలలు వేయించాయి. ఆ తర్వాత వచ్చిన ‘డ్రంకెన్‌ మాస్టర్‌’ విజయాల వీరుడిగా అతడి స్థానాన్ని సుస్థిరం చేసింది. తర్వాత ఒకో సినిమా అతడిని ఒకో మెట్టు ఎక్కించింది. ‘ది యంగ్‌ మాస్టర్‌’ (1980)తో జాకీచాన్‌ అంతక్రితం బ్రూస్‌లీ సినిమాల రికార్డులను కూడా అధిగమించి హాంగ్‌కాంగ్‌లో టాప్‌ స్టార్‌ హోదాకి ఎదిగాడు. ఆపై ‘ప్రాజెక్ట్‌ ఏ’, ‘పోలీస్‌ స్టోరీ’, ‘ఆర్మర్‌ ఆఫ్‌ గాడ్‌’ లాంటి చిత్రాల పరంపర అతడిని అంతకంతకు ఎదిగేలా చేశాయి. ఇక ‘రంబుల్‌ ఇన్‌ ది బ్రాంక్స్‌’, ‘సూపర్‌కాప్‌’, ‘రష్‌ అవర్‌’ సినిమాలు జాకీచాన్‌ను హాలీవుడ్‌లో కూడా ప్రముఖుడిని చేశాయి. అప్పటి నుంచి 2017లో ‘కుంగ్‌ఫు యోగా’ వరకు వచ్చిన సినిమాల చరిత్ర అంతా అభిమానులకు తెలిసిందే.

ఇదీ కుటుంబం...

జాకీచాన్‌ 1982లో జొవాన్‌ లిన్‌ అనే తైవాన్‌ నటిని పెళ్లి చేసుకున్నాడు. వారికి పుట్టిన జేసీచాన్‌ కూడా గాయకుడిగా, నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. జాకీచాన్‌కి మరో మహిళ ఎలైన్‌ ఎన్‌గ్‌ యిలీ ద్వారా ఓ కూతురు కూడా ఉంది.

గిన్నిస్‌ రికార్డులు...

‘ఎక్కువ పోరాటాలు చేసిన నటుడు’గా జాకీచాన్‌కి గిన్నిస్‌ ప్రపంచ రికార్డు ఉంది. అలాగే ఒక సినిమాలో ఎక్కువ విభాగాల్లో పనిచేసిన వ్యక్తిగా ‘చైనీస్‌ జోడియాక్‌’ (2012)కి మరో రికార్డు ఉంది. ఇందులో ఇతడు 15 విభాగాల్లో పనిచేశాడు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి