‘వార్నీ నువ్వా? ఎంతకాలమైందిరా, చూసి... ఈమధ్య కనబడకపోతే, పార్టీ ఏదైనా పెట్టావేమో అనుకుంటున్నా...’
‘పలకరిస్తూనే పొలమారేలా చేసే వాక్చాతుర్యం సార్ మీది... ఎంతమాట... మీ దగ్గర రాజకీయాలు ఇంకా పూర్తిగా నేర్చుకోనేలేదు, అప్పుడే పార్టీ పెట్టేంతగా ఎలా ఎదిగిపోతాను గురూజీ, మీరే చెప్పండి...’
‘అంతలా ఉలిక్కి పడిపోకురా... ఈమధ్య ఆడపడుచులు కూడా పార్టీలు పెట్టి అదరగొట్టేస్తున్నారు కదా, అందుకని అలా అన్నా... చెల్లెమ్మ చలాకీతనం పేపర్లలో చూసి, నువ్వు కూడా స్ఫూర్తి కానీ పొందావేమో అనుకున్నా... అయినా అన్నంతటివాడివి నువ్వు ఎందుకు పెట్టలేవు చెప్పు పార్టీ?’
‘సార్... ఇలా ఎత్తి పొడిచి ఏడిపిస్తే పారిపోతాన్సార్... అయినా నాకు తెలియక అడుగుతాను, పార్టీ పెట్టడం అంత సులువాండీ?’‘ఎందుకు సులువు కాదురా... చులాగ్గా పెట్టేయచ్చు. కానీ కూసింత ఎనకా ముందూ చూసుకోవాలి. రంగంలోకి దిగేముందు దాని పొడవెంత, వెడల్పెంత, దాన్సిగదరగ లోతెంత అని లెక్కలూ గట్రా వేసుకోవాలి, అంతే!’
‘ఆహా... మీ మాటలు వింటుంటే ఉత్సాహం తన్నుకొచ్చేస్తోందండి, ఇప్పటికిప్పడు పరిగెత్తుకుంటూ వెళ్లి పార్టీ పెట్టేయాలని ఉందండి... కానైతే తొలి సభలో మీరే నన్ను జాతికి పరిచయం చేయాలండి, సరేనా?’
‘అద్గదీ సంగతి... ఇప్పటికి పైకి తేలావురా. నీ ఎదవాలోచన నీచేత కక్కిద్దామనే అలా మాట్లాడా... అయితే నీ మనసు లోతుల్లో అంతలేసి ఆశలు ఉన్నాయన్నమాట. అంతేనా?’
‘అంతేనా అని సూటిగా అడిగేస్తే చెప్పక తప్పదండి మరి. మీ దగ్గర అబద్దమాడలేను. మొన్న చెల్లెమ్మ హడావుడీ అదీ చూశాక అనిపించిన మాట వాస్తవమేనండి. ఇది ప్రజాస్వామ్యం కదా, ఎవరైనా పార్టీ పెట్టచ్చని, లోపల ఓ గొలిగేస్తోందండి. నిజం చెప్పాలంటే, అందుకే మీ దగ్గరకి వచ్చానండి... ఇన్నాళ్లుగా మీ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నాను కదా, ఆమాత్రం పనికిరానంటారా?’
‘మొత్తానికి లైన్లోకి వచ్చావురా శిష్యా! ముందుగా నేను కొన్ని కొశ్చన్లు అడుగుతాను. ఆటికి నీ జవాబుల్ని బట్టి, నువ్వు నేటి రాజకీయాలకి పనికొస్తావో లేదో తేల్చుకోవచ్చు. ఏమంటావ్?’
‘అడగండి సార్... భలే హుషారుగా ఉంది...’
‘నువ్వు పార్టీ ఎందుకు పెడదామనుకుంటున్నావ్?’
‘ప్రజాసేవ చేద్దామనండి…’
‘ఎలా చేస్తావ్?’
‘ఏముందండీ, చిన్నప్పుడు మహాత్మాగాంధీ, టంగుటూరి ప్రకాశం, లాల్ బహదూర్ జీవితాల గురించి పాఠాలు నేర్చుకున్నాం కదండీ, అవన్నీ తల్చుకుని తాడిత, పీడిత, సామాన్య, బడుగు, నిరుపేద, అభాగ్య జనుల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నిస్తానండి...’
‘ఆపరా శిష్యా ఆపు. నువ్వోపని చెయ్. నీ సందు మొగలో ఓ కిళ్లీ కొట్టో, కిరాణా కొట్టో పెట్టుకో. దాని ప్రారంభోత్సవానికి నేనొచ్చి రిబ్బన్ కట్ చేసి చక్కా పోతా...’
‘అయ్‌బాబోయ్!అదేంటండీ, అంతమాటనేశారు?’
‘అంతేరా... నువ్వు పప్పులు, ఉప్పులు అమ్ముకోడానికి తప్ప ఎందుకూ కొరగావని అర్థమైపోయింది.. నేటి రాజకీయాలకి నువ్వు పనికిరావని తేలిపోయింది...’
‘ఎందుకనండీ?’
‘కాకపోతే ఏంట్రా? ఓ పక్క చెల్లెమ్మను చూసి బరిలోకి దూకుతానంటావ్? మరో పక్క సత్తెకాలపు ఆదర్శాలు వల్లిస్తావ్? ఈ రెంటికీ మద్దెన పొంతన ఎలా కుదురుతుందిరా? గురువు దగ్గర కూడా అబద్దాలాడావనుకో, గురివింద పూసకి కూడా కొరగాకుండా పోతావ్. ఇప్పుడు నీ మనసులో అసలు ఉద్దేశం ఉన్నదున్నట్టు సెప్పు. పార్టీ ఎందుకు పెట్టాలనుకుంటున్నావ్?’
‘క్షమించండి గురూగారూ! మీ దగ్గర కూడా రాజకీయం ఉపయోగించాను. నిజానికి పార్టీ పెట్టి, ఒకేల కాలం గట్రా కలిసొచ్చేసి అధికారంలోకి వస్తే ఏదో ఓ యాభై తరాల వరకు సరిపడినంత సంపాదించుకుని ఏ సిట్జర్లాండో చెక్కేసి శేషజీవితం గడిపేద్దామనండి. ఆవలిస్తే పేగులు లెక్కెట్టే తమరి కాడ దొంగ కబుర్లు చెప్పాను. కోపగించకండి...’
‘అదీ... అలా రా దారికి! ఇప్పుడు ఆ చెల్లెమ్మను చూసి పార్టీ పెడతానని సెప్పు... కాస్త పద్ధతిగా ఉంటది. అయినా నీకు, ఆ చెల్లెమ్మకీ సాపెత్తమెక్కడిదిరా? నక్కకీ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది...’
‘అదేంటండీ... అలాగనేశారు? ఆడకూతురు పెట్టగాలేంది, వెధవ మగపుటక పుట్టి ఆమాత్రం పార్టీ పెట్టలేనంటారా?’
‘ఒరేయ్... ఆత్రగాడికి బుద్ధి మట్టం అని ఊరికే అన్నారా? ఓ ఎగేసుకునొచ్చేయడమే కానీ, కాస్త ఎనకా ముందూ చూసుకోవద్దూ? ఇడమరిచి సెబుతా, సెవులొగ్గి ఇనుకో. ఆ చెల్లమ్మకి ఓ అన్నయ్య ఉన్నాడు. ఆడో పరగణాని ఏలేత్తన్నాడు. అక్కడ జగన్‌నాటకాలాడేస్తా, అయిన వాళ్లందరికీ సెజ్‌లు, పోర్టులు, భూములు, గనులు, ర్యాంపులు, ఫ్యాక్టరీలు గట్రా కట్టబెట్టేస్తూ, పైకి మాత్రం ప్రజాసేవని అడ్డమెట్టుకుని అడ్డమైన పన్లూ చేసేత్తన్నాడు. ఆ అన్నా సెల్లెల్లిద్దరికీ ఓ నాన్న ఉండేవాడు. ఆయనగారైతే ఏకంగా హోలాంధ్రాని హోల్సేలుగా ఏలేసినోడే! కావస్తే కూసింత సెరిత్ర పాఠాలు సదువుకుని జ్ఞానం పెంచుకో. అప్పట్లో ఆయన అధికారంతో కథాకళి, కూచిపూడి లాంటి డ్యాన్సులాడేసి ఏకంగా... ఒకటా రెండా లక్ష కోట్ల అవినీతికి పాల్పడినట్టు దాఖలాలున్నాయి. ఆ తండ్రిగారి హయాంలో ఈ చెల్లెమ్మ అన్నలుంగారు డొల్ల కంపెనీల సాయంతో నొక్కేసిన ప్రజాధనం మీద బోలెడన్ని కేసులు అవీ సాచ్చికంగా ఉన్నాయ్ మరి. మరా నొల్లేసిన సొమ్మంతా అధికారానికి సోపానాలుగా ఉపయోగపడుతున్న దాఖలాలున్నాయి. పైకి విభేదాలు అవీ ఉన్నట్టు కనబడినా, ఈ చెల్లెమ్‌ాకి, ఆ అన్నయ్య అండదండలు ఉండవని కూడా గబుక్కుమని అనుకోడానికి లేదు. ఇప్పడు ఆసలు సంగతేంటంటే అన్నయ్య అక్కడేలితే, చెల్లెమ్మ ఇక్కడ పాగా వేద్దారని సూత్తోందని ఊరంతా కోడై కూస్తోంది మరి. ఆ కోడి కూతలు నీకు ఇనబడలేదు కామోసు. దానాదీనా సెప్పొచ్చేదేమంటే, ఈ చెల్లెమ్మకి అటు కట్ల కట్ల కొద్దీ కాసుల దన్ను, ఆ వైపు అధికారం ఊతం, ఇటేపు కుటుంబం నుంచి అండదండలు, మరోవైపు అవకాశం వస్తే చక్రం తిప్పేసే చొరవ, సాహసం లాంటివి సానా ఉన్నాయిరా కుంకా! మరిప్పుడు చెప్పు. నీ కాడ ఏముందీ? ఈడ్చి తంతే ఆశ, ఆవేశం తప్ప ఏమున్నాయీ అంట?’
‘అయ్యబాబోయ్! ఇంత లెక్క ఉందా? బుద్దొచ్చింది గురూగారూ! ఇక పార్టీ మాట ఎత్తితే ఒట్టు! నన్ను మన్నించండి...’
‘అదీ... అలా రా దారికి! వారం వారం వచ్చి ముందు నా దగ్గర నీచ రాజకీయ పాఠాలు నేర్చుకో. అవి ఒంటబట్టాక అప్పుడాలోచిద్దాం నువ్వు పార్టీ పెట్టడానికి పనికొత్తావో, కిరాణా కొట్టు పెట్టుకోడాని పనికొత్తావో! ప్రస్తుతానికి పోయిరా!’
-సృజన
published on 16.4.21 in Janasena website
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి