"అంతా అగమ్యగోచరంగా ఉంది... భవిష్యత్తు అంధకార బంధురంగా ఉంది... మీరే తరుణోపాయం చూపించాలి సిద్ధాంతి గారూ... కొత్త ఉగాది రాబోతున్న వేళ గంపెడాశతో మీ దగ్గరకి వచ్చా. కాస్త గ్రహచారం చూసి ఉపచారం ఏదైనా చెప్పాలి..."
-ఆదరాబాదరా వచ్చి చాప మీద కూలబడ్డాడు సామాన్యుడు.
సిద్ధాంతిగారు సావధానంగా చూసి, పంచాంగం తెరిచి అడిగారు, "చెప్పు నాయనా. నీ జాతక చక్రం ఏదైనా ఉందా?"
"కాలచక్రం ఇరుసుల్లో నలిగిపోతున్న వాడిని. కష్టాల కాష్ఠంలో కాలిపోతున్నవాడిని. నాకు జాతక చక్రం ఏముంటుంది స్వామీ..."
"పోనీ... నీ పేరైనా చెప్పు..."
"జన సామాన్యులలో ఒకడిని. సాధారణ సగటు జీవుడిని. నా పేరుతో పనేముంది స్వామీ..."
"సరే నాయనా... వచ్చిన కాలాన్ని బట్టి, అడిగిన సమయాన్ని బట్టి ఫలితం చెబుతా. నీకేం కావాలి?"
"అసలు ఈ ఆంధ్ర దేశంలో నాలాంటి సామాన్యుల గతి ఎలా ఉంటుంది సారూ... ఇంతకాలం ఇలా వర్తమానం వంకరటింకరగా మారిపోడానికి కారణం ఏమిటంటారు?"
సిద్ధాంతి గారు వేళ్ల మీద గణన చేశారు. కాగితం మీద గళ్లు గీశారు. వాటిని నిశితంగా పరిశీలించారు. ఆనక నిట్టూర్చారు. ఆపై చెప్పసాగారు...
"శని వక్ మార్గంలో ఉచ్ఛస్థానానికి చేరుకున్నాడు నాయనా. రాహువు అతడికి అధికారమై తోడు పడుతున్నాడు. కేతువు కేరింతలు కొడుతూ కులుకుతున్నాడు. అందుకే ఈ విపరిణామాలు. నీ సమస్య ఏంటో చెబితే, శాస్త్రపరంగా వివరణ ఇస్తూ, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నిస్తా..."
"ఏముంది సామీ... రాష్ట్రంలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై పోయాయి... ఆఖరికి ఆత్మగౌరవానికి ప్రతీకగా చెప్పుకునే ఆంధ్రులకు అది కూడా మిగిలేలా లేదు. దేశంలోనే ఆంధ్రులంటేనే చులకనగా చెప్పుకునే పరిస్థితులు అఘోరించాయి... మాకున్న పరువు ప్రతిష్ఠ మసకబారే దారుణ వ్యవహారాలు జరుగుతున్నాయి సామీ... అందుకే ఏం చేయాలో తోచక మీ దగ్గరకి వచ్చా...''
సామాన్యుడు చెబుతున్నది విని సిద్ధాంతిగారు నోరెళ్లబెట్టారు. ఆపై పంచాంగాన్ని పక్కన బెట్టి, "ఆశ్చర్యంగా ఉంది నాయనా నువ్వు చెబుతున్న వివరాలు వింటుంటే. రాష్ట్రం గ్రహచారం మొత్తమే భ్రష్టు పట్టినట్టుందే? కాస్త వివరంగా చెప్పు నాయనా. రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయ పంచాగం విన్నాక అసలు పంచాంగం తెరుద్దాం. ఇంతకీ... మీ రాష్ట్ర అధినేత ఎవరు నాయనా?"
"ఏమని చెప్పను స్వామీ? ఆయనో జగన్ నాటక సూత్రధారి. అధికారంలోకి రాగానే ఆయన చెప్పిన మాటలు వింటే, ఆహా... ఇన్నాళ్లకి ఓ ఆదర్శ నాయకుడు దొరికాడని తెగ సంబర పడిపోయామండి అందరం. తీరా చేతలు చూసేసరికి చెప్పేదొకటీ, చేసేదొకటీ అన్నట్టుగా తయారైందండి పరిస్థితి... "
సిద్ధాంతిగారికి సందేహం తలెత్తింది. సామాన్యుడి మాటలకి మధ్యలోనే అడ్డొచ్చి, "నాయనా ఇది ప్రజాస్వామ్యం కదా? అధినేత అంత అడ్డగోలుగా ప్రవర్తిస్తుంటే ఆపే వ్యవస్థలే లేకపోయాయా?"
"అయ్యో సిద్ధాంతిగారూ! మీకు గ్రహాలు, వాటి స్థితిగతులు తప్ప , నేటి రాజకీయ గ్రహాల చిత్ర విచిత్ర విన్యాసాలు పట్టినట్టు లేదండి... ఆకాశంలో గ్రహాలకు శాంతులు ఉంటాయోమో కానీ, మా రాష్ట్రానికి పట్టిన గ్రహాలకు అశాంతులు తప్ప మరింకేమీ ఉండవండి... ఉదాహరణకి న్యాయ వ్యవస్థ ఉంది కదండీ... దానికి పట్టుగొమ్మలైన హైకోర్టు, సుప్రీం కోర్టులు ఎన్నోసార్లు మొట్టికాయలు వేశాయండి. ఎన్నో విషయాలను తప్పు పట్టాయండి. అబ్బే... అవన్నీ దున్నపోతు మీద వర్షం కురిసినట్టే అయిందండి. పైగా ఆ తీర్పుల పైనా, న్యాయమూర్తుల పైనా కూడా ఫిర్యాదు చేసే తెంపరితనం మా అడ్డగోలు అధినేతకు ఉందండి మరి. ఆ ఫిర్యాదు కూడా పసలేనిదని సుప్రీం కోర్టు కొట్టేసిందండి. ఇప్పుడు చెప్పండి... ఇది రాష్ట్రంలోని ప్రజానీకానికి ఎంత అప్రతిష్ఠండీ... దేశంలో మేమందరం చులకనైపోయినట్టే కదండీ?" అంటూ సామాన్యుడు ఆవేశపడిపోయాడు.
"నిజమే నాయనా! నీ ఆవేదనలో అర్థం ఉంది. మరి చట్టం, చట్టానికి రక్షకులు వాళ్లూ ఏం చేయలేకపోతున్నారా?"
"అధికారం అడ్డదిడ్డంగా కథాకళి ఆడుతుంటే, చట్టం చుట్టం కాక ఏమౌతుందండీ? చట్టాన్ని కాపాడే పోలీసు అధికారులు, రక్షక భట వ్యవస్థ కూడా నీరుగారి పోయాయండి. అధినేతలుంగారి పార్టీ నాయకుల్లో అర్హత లేని స్థాయి వాళ్లు కూడా పోలీసుల్ని అదిలించే ఘోరమైన పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయండి. కింది స్థాయి పోలీసు అధికారులందరూ, తమ ఉన్నతాధికారుల ఆదేశాల కంటే, స్థానిక నాయకుల కనుసన్నల్లో మెలగాల్సిన నికృష్ట పరిస్థితులు ఏర్పడ్డాయండి. అందుకే కదండి దిక్కు తోచకుండా ఉంది?"
సిద్ధాంతి గారు ఆశ్చర్యపోయారు. తర్వాత గొంతు పెగల్చుకుని, "నేనెన్నో దేశ, కాల, మాన పరిస్థితులను లెక్క గట్టాను నాయనా! కానీ నువ్వు చెబుతున్న లాంటి దుస్థితి ఎక్కడా కనిపించలేదు. పోనీ... రాష్ట్రంలో నిత్య జీవన స్థితిగతులైనా సజావుగా సాగుతున్నాయా?"
"అయినదానికి అడ్డవిస్తరి లేదు కానీ, కానిదానికి కంచం ఎక్కడుంటుంది సామీ? నాలుగు డబ్బులు వెనకేసుకుని, దొరికిన దగ్గర అప్పు చేసి ఏదో కాస్త గూడు ఏర్పాటు చేసుకోవాలనే కదండీ, ప్రతి వాడూ కలలు కనేది? అలాంటిది ఇల్లు కట్టుకుందామంటే ఇసుక, సిమెంటు కూడా సరిగా దొరికే ఆశ లేకుండా పోయిందండి. వాటి ధరలు పెరిగిపోవడం సంగతలా ఉంచండి, వాటి మీద గుత్తాధిపత్యాన్ని అధినేతలుంగారి అస్మదీయులకు అప్పగించేస్తున్నారండి. అందుకు ప్రతిగా ప్రయోజనాలు ముడుతున్నాయనే విషయం నాలాంటి సామాన్యులకు కూడా అర్థం అవుతోందండి. అంతేకాదండి సెజ్‌లు, పోర్టులులాంటి జాతి సంపదల్ని కూడా ధారాదత్తం చేసేస్తున్నారండి. మొత్తానికి ఇప్పుడు కరెన్సీ కట్టలే రాజ్యమేలుతున్నాయంటే నమ్మండి. అదేమని ఎవడైనా నోరెత్తితే వాడి మీద లేనిపోని కేసులు బనాయించే గూండా రాజకీయం పెచ్చుపెరిగి పోయిందండి. ఏ అధికారైనా నచ్చకపోతే వాడిని తప్పించడానికి తొక్కని అడ్డదారి లేదంటే నమ్మండి. స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల కమీషన్‌కే తప్పలేదండి తలనొప్పులు. ఇలా చెప్పుకుంటూ పోతే, అంతూ దరీ కనిపించడం లేదండి, మా రాష్ట్ర నీచ, నికృష్ట, నిస్సిగ్గు, నిర్లజ్జాకర రాజకీయాల గురించి ఏకరువు పెట్టడానికి! అంచేత మీ పంచాంగం ప్రకారం రాబోయే కాలంలో మా గ్రహచారం ఎలా ఉంటుందో చెబుతారని వచ్చానండి..."
సిద్ధాంతి గారు నిట్టూర్చి పంచాంగం తెరిచారు. ఏవేవో లెక్కలు వేశారు. ఆనక చెప్పారు.
"తప్పదు నాయనా! కొన్నాళ్లు ఈ గ్రహచారం కొనసాగుతుంది. ప్రస్తుతం రసాధిపతి శని. అందువల్ల అధికారంలో ఉన్నవారికి కొంతకాలం అడ్డూ ఆపూ ఉండదు. ఇక నీరసాధిపతి గురుడు. కాబట్టి ప్రజలకు నీరసం తప్పదు. పైగా పాప గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. శుభ గ్రహాలు నీచపడ్డాయి. అందుకే ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కాలం ఎల్లకాలమూ ఇలా ఉండదు నాయనా. ప్రజల్లో చైతన్యం పెల్లుబుకుతుంది. జనం సైనికులై పిడికిలి బిగిస్తారు. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రచండ పవనాలై కళ్యాణం జరుగుతుంది నాయనా! అప్పుడు అన్నీ మంచి రోజులే".
సామాన్యుడు సంబరపడిపోయాడు. ఉగాది సందర్భంగా కొత్త యుగాది కోసం కలలు కంటూ ఇంటి దారి పట్టాడు.
-సృజన
PUBLISHED IN JANASENA WEBSITE ON 9.4.21
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి