“ఓం నీచాయ నమః
నికృష్టాయనమః
అసందర్భ ప్రలాపాయనమః
అక్రమ కార్యకలాపాయనమః
అన్యాయ స్వరూపాయనమః
అడ్డగోలు వ్యవహార నిర్వహణ నైపుణ్యాయనమః
అధికార దుర్వినియోగ ప్రముఖాయనమః
నిత్యాహంకార స్వరూపాయనమః
నిర్లజ్జాకర ప్రణాళికా ప్రవీణాయనమః
దుష్ట చింతన నిమగ్నాయనమః
దుర్మార్గ యోచనా దుర్నిరీక్ష్యాయనమః....
-గురువుగారి గొంతు గంభీరంగా మార్మోగుతోంది. శిష్యుడు నిశ్శబ్దంగా వచ్చి కూర్చున్నాడు. గురువుగారు చేస్తున్న పూజేంటో అర్థంకాలేదు. పూజంతా అయ్యాక గురువుగారు లేచి శిష్యుడికి ప్రసాదం ఇచ్చారు. శిష్యుడు దాన్ని కళ్లకద్దుకుని నోట్లో వేసుకున్నాడు. గురువుగారొక పువ్వు ఇచ్చి సైగ చేస్తే దాన్ని వినయంగా చెవులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా అడిగాడు.
“గురూగారూ! ఎప్పుడూ లేంది, ఈ పూజేంటండీ?”
“ఒరే... నువ్వా నా దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకోడానికి వస్తున్నావు. పాఠాలు చెప్పగానే సరా? ప్రాక్టికల్ నాలెడ్జి ఉండద్దూ? అందుకే ఈ సరికొత్త అష్టోత్తరంతో మొదలెట్టాన్రా. అర్థమైందా?”
“అర్థమైతే ఇంకా మీ దగ్గర పాఠాల కోసం ఎందుకొస్తాను సార్? ఏ ఉప ఎన్నికలోనో నిలబడి నా ప్రయత్నమేదో నేను చేద్దును కదా?”
“అఘోరించావ్ కానీ, ఉప ఎన్నికంటే అంత తేలికేంట్రా? దానికెంత మందీ మార్బలం కావాలీ, ఎంత పకడ్బందీ ప్రణాళిక ఉండాలీ, ఎంత తెంపరితనం కావాలీ, ఎంత దుర్మార్గం తెలిసుండాలీ... ఇవన్నీ నీకెక్కడలే. ఆ స్థాయికి ఎదగాలంటే నీకెంతో కాలం పడుతుందిరా కుర్‌సన్నాసీ...”
“అర్థమైంది సార్... ఇంతకీ ఈ పూజ సంగతేంటో చెప్పండి, సస్పెన్స్ భరించలేకపోతున్నా...”
“అక్కడికే వస్తున్నారా... మొన్నామధ్య ఓ పూజారాయన ఏమన్నాడో గుర్తుందా? తనకు ఓ పదవి పడేశాడు కదాని సీఎంని ఏకంగా విష్ణుమూర్తిలంగారితో పోల్చేయలేదూ? దాన్ని బట్టి నీకేంటి అర్థమైందో చెప్పు చూద్దాం నీకెంత అవగాహన ఉందో తెలుస్తుంది...”
“గుర్తొచ్చింది సార్... చాలా ఆశ్చర్యమేసిందండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన విష్ణువు ఎక్కడ? ఓ చిన్న పరగణాకి అధినేత అయిన ఈ రాజకీయ నేతెక్కడ? పోలిక చెప్పడానికైనా కాస్త ఎనకా ముందూ చూసుకోవద్దండీ? మనకేదో లబ్ది జరిగింది కదాని, ఏకంగా దేవుడితో పోల్చేయడం ఏంటని మా చెడ్డ చికాకేసిందండి... అంతేనాండి?”
“ఏడిశావ్. నువ్వు తెలుసుకోవాల్సింది అది కాదురా. ఆ పూజారాయన పోలికలో పస సంగతి పక్కనెట్రా... అది ఆయన భక్తి భావం. ఆ భక్తిలో తడిసిముద్దయిపోయి, నీరుగారిపోయి, జలుబులూ జ్వరాలూ తెచ్చుకోనీ... మనకేం అభ్యంతరం? నువ్విక్కడ కానుకోవలసింది అది కాదురా. ఆయన మాటల్లో ఉన్న పొగడ్తని. ఈ పొగడ్త ఉంది చూశావూ? ఇది మాచెడ్డ కంత్రీదిరోయ్. పొగడ్డం ఎలాగో తెలిస్తే చాలురా. నువ్వు రాజకీయ సోపానాలు చకచకా ఎక్కేసినట్టే. ముందు అది గ్రహించు. ఆ పూజారాయనకి ఓ మెట్టు పైకి ఆలోచించావనుకో. ఏకంగా పూజలు మొదలెట్టేయవచ్చు. మరి పూజలు చేయాలంటే అష్టోత్తరాలు అవీ కావాలి కదా? అందుకనే నీకు కాస్త శాంపిల్ చూపించానన్నమాట. బుర్రకెక్కిందా?”
“అమోఘం సార్. ఇప్పటికి అర్థమైంది. ఇహ చూస్కోండి. పొగడ్డంలో పీహెచ్‌డీ చేసేవరకూ నిద్రపోను. కానీ నాదొక సందేహం గురూగారూ. మీరు చదివిన అష్టోత్తరం చూస్తే అది అర్చనా, లేక అడ్డమైన తిట్లకీ అందమైన రూపమా అనేది అర్థం కావడం లేదు సార్. కాస్త ఈ మట్టి బుర్రకి అర్థమయ్యేలా చెప్పరూ? “
“చెబుతానురా బడుద్దాయ్! అందుకేగా ఇవాళ పాఠం ఇలా మొదలు పెడత? ఇందాకా రాగానే నువ్వు ఉప ఎన్నిక ఊసెత్తావా లేదా? ఎందుకూ, ఈ మధ్యన ఆ ఏడుకొండలవాడి సమక్షంలో జరిగిన ఉప ఎన్నిక హడావుడి అదీ చూశావు కాబట్టే కదా? మరి ఆ ఎన్నికల్లో ఏం జరిగింది? అధికారం చేతుల్లోఉంటే ఎంత నీచానికి బరితెగించవచ్చో అర్థం కాలే? అడ్డగోలుగా వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ఆ ర్యాలీలేంటీ? ఎవరెవర్నో తీసుకొచ్చి అలా దొంగ ఓట్లు గుద్దించేయడమేంటీ? ప్రజాస్వామ్యాన్ని ఎంత చక్కగా నవ్వుల పాలు చేశారో గమనించావా? పోలీసులు, ఉన్నతాధికారులు, పోలింగ్ సిబ్బందిని కూడా ఎంత దుర్మార్గంగా, అడ్డగోలుగా వాడేసుకున్నారో అర్థం చేసుకున్నావా? నిజమైన ఓటర్ల ముందే దొంగ ఓటర్లు ఓటేసేలా చేశారంటే ఎంత తెంపరితనం ఉండాలో, ఎంత నీచానికి తెగబడాలో నేర్చుకున్నావా? ఇవన్నీ నీలాంటి వాడికి నాణ్యమైన పాఠాలే కదరా? నువ్వు కూడా అంతటి నీచ రాజకీయ నేతగా ఎదగాలంటే ఇలాంటి పాఠాలు ఎన్ని పాటించాలిరా? మరి అంతటి గొప్ప రాజకీయ నాయకుడికి మామూలు అష్టోత్తరాలు ఎలా సరిపోతాయిరా? అందుకే నిజాల్ని, పొడగ్తల్నీ కలగలిపి ఇలా వినూత్నమైన పూజా విధానం రూపొందించానురా. అలాంటి నీచ, నికృష్ట, నిర్లజ్జాకర, దుష్ట, దుర్మార్గ, దౌర్జన్య, దారుణ, దురహంకార, అన్యాయ, అకృత్య, అడ్డగోలు నేతకి ఇలాంటి అర్చనలు ఎన్ని చేస్తే సరిపోతాయిరా? ఏమంటావ్?”
“ఏమంటాను గురూగారూ! ఒళ్లు గగుర్పొడుస్తోందండి. కళ్ల నుంచి ఆనందభాష్పాలు రాలుతున్నాయి. మీరివాళ చెప్పిన పాఠం నాలాంటి వాడికి ఓ భగవద్గీత లాంటిది సార్. ఇక మీరు స్వయానా ఆ గీతాకారుడి అపర అవతారం అంటే నమ్మండి...”
“ఆపరా గాడిదా! నేను చెప్పిన పాఠం నా మీదే ప్రయోగిస్తావా? కోపం వచ్చిందంటే ఆ అష్టోత్తరం నీమీదే చదివేస్తా. ఏమనుకున్నావో? ఒళ్లు జాగ్రత్త పెట్టుకుని పోయిరా!”
“మన్నించండి గురూగారూ! శాంతించండి! ఇక వస్తా!”
-సృజన
Published in Janasenanewsletter.com on 24.4.21
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి