"ఏంట్రా మొహం అలా కందగడ్డలా ఉందేం? ఏంటి కత?" అంటూ పలకరించారు గురువుగారు, శిష్యుడు రాగానే.
"ఏం చెప్పమంటారు గురూగారూ! మా అపార్ట్‌మెంట్లో
పార్కింగ్ దగ్గర గొడవొచ్చిందండి. మా పక్కింటాయన నా మీద నోరు పారేసుకున్నాడండి...
ఆ గొడవ నుంచి నేరుగా ఇలా వచ్చానండి..."
"ఏమన్నాడ్రా ఆయన? తిట్టాడా?"
"ఆయ్... అవునండి... దగుల్బాజీ, బోసిడీకే, లమ్డిక్కే, జఫ్పా, లోఫర్,
మాదచ్చోద్, బంఛత్, బడాచోర్,
బడుద్దాయ్... ఇలా రకరకాల మాటలన్నాడండి..."
"ఇంతకీ ఆ గొడవకి కారణం ఏంటి?"
"నిజం చెప్పాలంటే నాదే తప్పండి. ఆయన పార్కింగ్
ప్లేస్‌కి అడ్డంగా నా వెహికిల్ పెట్టానండి... అందుకనే నోరు మూసుకుని చక్కా వచ్చానండి...
అయినా ఆ దరిద్రపు తిట్లేంటండీ బాబూ..."
గురువుగారా అంతావిని పడక్కుర్చీలో తాపీగా జారగిలపడి
కళ్లు అరమోడ్పుగా పెట్టుకుని, తాపీగా చెప్పారు, "ఒరేయ్... తిట్లని తిట్టకురా... తిట్లు
ఎంతో పవిత్రమైనవివరా..."
"ఊరుకోండి గురూగారూ! తిట్లు పవిత్రమైనవేంటండీ? మీరన్నీ అడ్డదిడ్డంగా చెబుతారు..."
"ఓరి... నా వెర్రి శిష్యా! నా దగ్గర ఇన్నాళ్ల
నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నావు కానీ నీకు తిట్ల ప్రయోజనం ఏమిటో తెలియకపోతే
ఎలారా?"
"తిట్లకి ప్రయోజనం ఏంటి గురూగారూ? నాక్కాస్త అర్థమయ్యేలా చెప్పండి..."
గురువుగారు నవ్వి, "ఒరే... నీకు గానీ రాజకీయ పురాణంలో తిట్ల
కాండ గురించి తెలిసి ఉంటే... ఇలా మొహం కందగడ్డలా పెట్టుకుని నా దగ్గరకి దిగాలుగా
వచ్చే వాడివి కావురా... పైపెచ్చు నీ పక్కింటాయన్నే బెంబేలెత్తించేసే వాడివి... అర్థం
అయిందా?"
"ఎలా అర్థమవుతుందండీ? తప్పేమో నావైపు పెట్టుకుని,
ఆయన్ని బెంబేలెత్తించడమేంటండీ? అడ్డగోలు వ్యవహారం
కాకపోతేనూ?"
"అదేరా మరి, రాజకీయ కిటుకు! నీ చుట్టూ జరుగుతున్న
రాజకీయ తతంగాన్ని గమనించకుండా ఒట్టి వెర్రిబాగులోడిలా వచ్చేస్తే ఎలారా?
ఇప్పుడు నీ పరగణాలో తిట్ల చుట్టూనే కదరా రంజైన రాజకీయం నడుస్తుంట?"
"సరే... సార్! నాకంత తెలివే ఉంటే, మీ దగ్గరకి రాజకీయ పాఠాలకి
ఎందుకొస్తానండీ? మరింతకీ నేనేం చేస్తే మా పక్కింటాయన బెంబేలెత్తిపోయేవాడో
చెప్పండి..."
"ఏం చేయాలా? వెంటనే ఆయన ఇంటికి వెళ్లి అద్దాలు పగలగొట్టాలి... ఫర్నిచర్ ధ్వంసం చేయాలి...
నానా విధ్వంసం సృష్టించాలి... అంతే కాదు ఆయన
బంధువుల ఇళ్లకి నీ వాళ్లని పంపించి వాళ్ల ఇళ్లపై కూడా దాడి చేయాలి... ఆపై నీ అపార్ట్‌మెంటు
వాళ్లందరినీ పిలిచి ఆయన తిట్ల వెనుక అందరూ మర్చిపోయిన అర్థాలను వెతికి,
అవన్నీ ఏడుపు మొహం పెట్టుకుని వివరించి, సానుభూతి
కూడా సంపాదించాలి... అక్కడితో ఆగకూడదొరేయ్... ఆయన మీద కేసు పెట్టి జైలుకి కూడా
పంపించాలి... అర్థమైందా?"
"అయ్యబాబోయ్... అంత ఘోరమా? ఆయన తిట్టడం కరెక్ట్ కాకపోవచ్చు
సార్... కానీ అసలు తప్పు నాదే కదండి? మరి ఆయన ఇంటిని ధ్వంసం
చేస్తే అది ఇంకా నేరమవుతుంది కదండీ?
పైగా ఆయన బంధువులు ఏం చేశారండీ పాపం... ఆయనేదో ఆవేశంలో తిడితే,
చేతనైతే నేనూ తిట్టాలి కానీ, ఇంతగా రెచ్చిపోతే
అది నీచం కదండీ? పైగా
నేనే నేరం చేసి కేసు పెట్టడం ఏంటండీ?
దారుణం కాకపోతేనూ?"
"ఓరోరి బుర్రలేని శిష్యా! మరి నీ రాష్ట్రంలో
జరిగింది అదే కదరా? మీ ముఖ్యమంత్రిని ఎవడో ఏదో అన్నాడని
తెలుసు కదా? అప్పుడేమైంది? ఆయన అనుచరులంతా
వీరంగం ఆడలేదూ? ఓ పథకం
ప్రకారం ఎగస్పార్టీ ఆఫీసులన్నింటిపైనా దాడులు చేయలేదూ? అక్కడితో
ఆగారా? ఆ తిట్టినాయనపై పోలీసు కేసు పెట్టి జైల్లోకి తోయలేదూ?
మరి ఇవన్నీ తిట్లతో సమకూరిన ప్రయోజనాలే కదరా? ఇదంతా మర్చిపోయి నువ్వు మొహం ఎర్రగా చేసుకుని వచ్చేస్తే ఎలారా? ఇలాగైతే నువ్వు రాజకీయాల్లో ఎప్పుడు ఎదుగుతావు? నువ్వే చెప్పు?"
శిష్యుడు బుర్ర గోక్కున్నాడు... ఆనక వెర్రిమొహం
పెట్టుకుని, "అవునండోయ్...
మీరు చెప్పిందంతా నిజమే... కానీ నాదొక సందేహమండి... ఎంత రాజకీయాలైనా ఉచితానుచితాలు
మర్చిపోయి ఇలా తిట్టడం తప్పు కాదంటారా?"
"కచ్చితంగా తప్పేరా... నీ పక్కింటాయన నిన్ను తిట్టినా, నీ ముఖ్యమంత్రిని ఎగస్పార్టీ
వాడు తట్టినా రెండూ తప్పే. కానీ నువ్వు గమనించాల్సింది అది కాదురా... ఆ తిట్టుని
అడ్డం పెట్టుకుని ఎంత డ్రామా జరిగిందో అది చూడాలి. ఎదుటి వాడు తిడితే దాన్ని రాజకీయంగా
ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో గమనించాలి.
ఆ తిట్టుని పదే పదే పలుకుతూ, దాని వెనుక ఉన్న అర్థాన్ని
విడమర్చి చెబుతూ, మొహం అమాయకంగా పెట్టుకని జనం సానుభూతిని
ఎలా పొందాలో తెలుసుకోవాలి. అందుకనే తిట్లు
పవిత్రమైనవని నేనన్నాను... ఇప్పటికైనా అర్థమైందా?"
"అర్థమైంది కానీ గురూగారూ, మీరు నన్ను మా పక్కింటాయన ఇల్లు,
ఆయన బంధువుల ఇళ్లు కూడా ధ్వంసం
చేసి ఉండాల్సిందంటున్నారు కదా? మరి అది నేరం కాదంటారా?"
"దాందేముందిరా? ఆయన తిట్టిన తిట్లకి నాకు బీపీ
వచ్చేసిందీ, ఆ బీపీ వల్ల ఏం చేస్తున్నానో తెలియలేదూ అంటే సరి...
మరి మీ సీఎంగారు తన పార్టీ వారు చేసిన దాడుల్ని అలాగే సమర్థించుకోలేదూ?
యథారాజా... తథాప్రజా అన్నారు కదా? అలాగన్నమాట..."
"కానీ... రేప్పొద్దున్న ఇలా ప్రజలందరూ
మాకు బీపీ పెరిగింది కాబట్టే ఎదుటివాడిని కొట్టేశాం, వాడిల్లు కూలగొట్టేశామంటూ రెచ్చిపోతే
రాష్ట్రంలో శాంతిభద్రతల మాటేమిటండీ?"
"ఓరే...నువ్వొక నీచ రాజకీయ నేతగా ఎదిగాక, ఇక శాంతి భద్రతల ఊసు నీకెందుకురా? ఈ వ్యవహారం నుంచి నువ్వు నేర్చుకోవలసింది,
తిట్ల కాండలో తిరకాసు అధ్యాయం... తెలిసిందా?"
"తెలిసింది కానీండీ, ఇంతకీ మీరు తిట్లని సమర్థిస్తున్నారా?"
"అస్సలు కాదురా... కానీ నువ్వు, నీ వాళ్లు ఎప్పుడూ ఎవర్నీ తిట్టలేదా?
ఎవర్నీ తిట్టకుండానే ఇంత వాడివైపోయావేంట్రా? మళ్లీ నీ రాష్ట్రం దగ్గరకే వద్దాం... తాజాగా ఈ తిట్ల వ్యవహారానికి సంబంధించిన
కేసుపై హైకోర్టు ఎలాంటి ఘాటు వ్యాఖ్యానాలు చేసిందో గుర్తుకు తెచ్చుకో... గౌరవం,
ప్రతిష్ఠలు ముఖ్యమంత్రికే కాదు, అందరికీ ఉంటాయనలేదూ? రాజ్యాంగబద్ధ వ్యవస్థలు,
న్యాయమూర్తులను దూషిస్తున్నవారి విషయంలో చర్యలు తీసుకునేందుకు ఉత్సాహం
చూపని పోలీసులు, ఈ విషయంలో ఎందుకింత అత్యుత్సాహం చూపించారని చురకలేయలేదూ?"
"అవునండోయ్... కానీ గురూగారూ, ఇంతకీ ఇందులో నేర్చుకోవాల్సిన
రాజకీయ పాఠం ఏంటండీ?"
"అలారా పాయింట్లోకి... ఇప్పుడు చెబుతాను
రాసుకో, రాజకీయ పురాణంలో
తిట్ల కాండ ప్రయోజనం. నువ్వు రాజకీయంగా ఎదిగే వరకు ఎగస్పార్టీ వాడిని నోటికొచ్చినట్టు
తిట్టు. ఆ తిట్ల ద్వారా ప్రజల మనసును ఏమార్చడానికి ప్రయత్నించు. నీకు అధికారం
అంది కుర్చీ ఎక్కాక, ఎవరైనా నీ మీద పల్లెత్తు మాటన్నా సహించకు.
విరుచుకు పడు. దాడులు చేయించు. కేసులు పెట్టు.
అరెస్టులు చేయించు. దెబ్బకి నిన్ను మరెవడైనా ఏమైనా అనడానికి కూడా భయపడిపోయేలా,
బెంబేలెత్తిపోయేలా చెయ్యి. ఇంత చేసి కూడా ఎదుటివాడు తిట్టిన తిట్లను
అడ్డం పెట్టుకుని ప్రజల ముందు ఏడుపు మొహం పెట్టుకుని ఆ తిట్ల అర్థాలు వివరించి మరీ,
సానుభూతిని పొందు. ఇలా చేస్తే నీకిక తిరుగుండదు. ఓ నికార్సయిన నీచ
నేతగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతావు. బుర్రకెక్కిందా?"
"ఓ... భేషుగ్గా గురూగారూ! ఇక వస్తానండి...
అర్జెంటుగా తెలుగు నిఘంటువు కొనుక్కోవాలి..."
"అదెందుకురా?"
"మా పక్కింటాయన తిట్టిన తిట్లకు అందరూ
మర్చిపోయిన అర్థాలు వెతకడానికండి... వాటిని
తెలుసుకుని మా అపార్ట్‌మెంట్లో మీటింగెట్టి ఊదరగొడతానండి... ఆయ్!"
"శెభాష్... పోయిరా!"
-సృజన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి