దీపావళి కదా... పిల్లలకి బాణసంచా
కొందామని బజారుకెళ్లిన సామాన్యుడికి అక్కడి ధరలు చూసి కళ్లు భూచక్రాల్లా గిర్రున
తిరిగాయి. గుండె నారబాంబులాగా ధడేలుమని పేలింది. కుదురులేని సిసింద్రీలాగా మనసు
పరిపరివిధాల పోయింది. దాంతో అతడి నోటమ్మట తిట్లు సీమటపాకాయల్లాగా టపటపలాడాయి.
"థూ... దీనెవ్వా సర్కారు. సీటికీ మాటికీ గొప్పలు సెప్పుకోడమే కానీ
సేసిందేటీ నేదు. పిల్లకాయలకి టపాకాయలు కొందారంటే జేబులోని కూసిని సొమ్ములు ఎందుకూ
రావు. ఊరూవాడా తిరిగి ఓదార్చుకుంటూ ఏడిస్తే ఓటేసాం. కుర్సీ ఎక్కి రెండేళ్లు గిర్రున
తిరిగినా నాబోటి సామాన్యల బతుకులు బాగుపడింది లేదు. పైగా నవ రత్నాలంట... అదంట...
ఇదంట... సెప్పుకోడానికైనా సిగ్గుండాల..." అంటూ గొణుక్కున్నాడు. తొందరగా వెళ్తే
పిల్లలు టపాకాయలు అడుగుతారని,
పొద్దు పోయేదాకా అక్కడాఇక్కడా
తిరిగి పిల్లలు నిద్రపోయాక ఇంటికెళ్లి అరుగు మీద తుండు పరుచుకుని పడుకున్నాడు సామాన్యుడు.
* * *
"లెగు మావా... మంచి ఊసుంది లెగు..." అంటూ భార్య
లేపుతుంటే కళ్లు నులుముకుంటూ లేచాడు సామాన్యుడు.
"ఏటే దిక్కుమాలిన గోల? కాసేపు నిద్రయినా పోనివ్వవు..." అంటూ అరిచాడు.
"ఎహే... లెగు మావా. మన జగనన్న సర్కారు
బాణసంచా పథకం పెట్టింది మావా! మన సామాన్యుల బతుకుల్లో దీపావళి జరిపించడానికంట..."
"బాణసంచా పథకం ఏంటే? నీకేమన్నా మతిపోయిందా?"
"ఔ... మావా... బాణసంచా భరోసా అంట! నిన్నగాక
మొన్న సినేమా టిక్కెట్లు కూడా అమ్ముతామందిగా?
అలా టపాసుల అమ్మకాలు కూడా సేపట్టిందంట. నేనెళ్లి పిలగాళ్ల కోసం
ఓ సంచీ బాణసంచా తెచ్చా..."
ఇంతలో పిల్లలు చుట్టూ మూగి "భలే... భలే..." అంటూ గెంతసాగారు.
సామాన్యుడికి అంతా కలలాగా ఉంది. లేచి కూర్చుని
"సరే... ఎలిగించండి. ఎలా కాల్తాయో సూద్దారి..." అన్నాడు.
పిల్లలు సంచీలోంచి మతాబులు తీశారు. సంబంరంగా
వాటిని ముట్టించారు. వాటిలోంచి ఒకట్రెండు ముత్యాలు రాలి... అపై అంతా పొగ రావడం మొదలెట్టింది. ఆ పొగకి పిల్లలకి ఊపిరాడలేదు.
"ఇయ్యేంటి మావా? ఇలా కాల్తన్నాయి?" అంది భార్య.
సామాన్యుడు ఆ మతాబులు తీసుకుని ఆ గొట్టాల మీది
కాగితాలు చూసి పగలబడి నవ్వాడు.
"ఓర్నీయవ్వా... ఈ మతాబులు సుట్టిన కాగితాలేంటో తెలుసా? ఎన్నికల నాటి వాగ్దానాలు. మేం
గెలిస్తే ఇంత సేత్తాం... అంత సేసేత్తాం అంటూ పత్రికల్లో అచ్చెత్తించారు సూడు. అయ్యన్నమాట.
ఆటిని అదేంటబ్బా... ఆ... మానిఫెస్టో అంటార్లే. అందులో రాసిన వాగ్దానాలు సిట్లం కట్టేసాయన్నమాట.
అందుకే ముత్యాలు లేవు... అంతా పొగే" అన్నాడు.
ఇంతలో పిల్లలు "నానోయ్...
కాకరపూవొత్తులు" అంటూ సంచీలోంచి పెట్లు తీశారు. గబగబా దీపం
దగ్గరకి వెళ్లి ముట్టించారు. అవి కాసేపు వెలిగి ఆరిపోయాయి. తర్వాత ఉన్నట్టుండి
వాటంతట అవే అంటుకుని చిటపటలాడాయి. కాసేపు ఎర్రగా, కాసేపు ఆకుపచ్చగా రంగులు మారి
మధ్యలోనే ఆరిపోయాయి.
"ఇయ్యెక్కడి కాకరపువ్వొత్తులు మావా?" అంది భార్య.
"సర్లెయ్యే... సర్కారు పథకం అనగానే
అనుకున్నాను, ఇట్టాంటిదేదో
జరుగుతాదని. కొలువు దీరి రెండేళ్లు దాటాయి. ఓ పద్ధతి లేదు పాడూ లేదు. రోజుకో రంగు
మారుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రంగులు మారుత్తారో. ఆళ్లు సేసిన కాకరపువ్వొత్తు
అలా కాక ఇంకెలా వెలుగుద్ది సెప్పు?" అన్నాడు.
"నానోయ్! చూడు ఎంత పెద్ద భూచక్రమో..." అంటూ పిల్లలు
సంబరంగా తెచ్చారు. సామాన్యుడు దాన్ని తీసుకుని చూస్తే దాని మీద అదానీ గ్రూప్ తయారీ
అని ఉంది.
"ఒరే... ఇది మాత్రం భలే తిరుగుద్దిరా.
గేరంట్రీ..." అన్నాడు. పిల్లలు వెలిగించగానే అది నిప్పులు
చిమ్ముకుంటూ గిరగిరా తిరుగుతూ అక్కడ భూమంతా తిరుగుతూ సందడి చేసింది.
"ఇదేటి మావా! ముందే ఎలా సెప్పేశావ్...
ఇది బాగా తిరుగుద్దని?" అంది భార్య.
సామాన్యుడు నిట్టూర్చి చెప్పాడు... "మరి కాదంటే? దాని మీద రాసుంది గందా అదానీ అని?
నిన్నటికి నిన్న విశాఖ పట్నంలో 130 ఎకరాలు రాసిచ్చేసారు
మన సర్కారోళ్లు. మొన్నటికి మొన్న గంగవరం ఓడరేవులో పాగా వేసిందీళ్లే గదా. మరాళ్ల
పేరుతో సేసిన భూసెక్రం ఊరుకుంటదేటి?
ఎక్కెడెక్కడి భూములూ సుట్టబెట్టేయదూ? అందుకనే
సెప్పగలిగా".
"కానీ మావా! అలా ఆళ్లు భూములు తీసుకుని
ఏవో అభివృద్ధి సేశారనుకో. మంచిదేగందా మరి?"
"సూద్దారే ఏం జరుగుద్దో? ఆళ్లు ఏం సేత్తారనేది తర్వాతి
ఇసయం. ముందయితే కోట్లకు కోట్లు ఖరీదు సేసే ఎకరాలకెకరాలు పట్టేశారనేదే గందా
పాయింటు? ఏంటతావ్?"
"నానేటంటాను... నువ్వేటంటే నానూ అదే అంటాను"
ఇంతలో పిల్లలు పరిగెత్తుకు వచ్చారు... "అమ్మోయ్...
నానోయ్... తారాజువ్వలు కూడా ఉన్నయే" అంటూ తెచ్చారు.
సామాన్యడు వాటిని తీసుకుని చూస్తే వాటి మీద నవరత్న
బ్రాండ్ అని ఉంది.
పిల్లలు ఓ జువ్వ తీసి వెలిగించారు. అది ఆకాశంలోకి
ఎగిరినట్టే ఎగిరి మళ్లీ కిందకి దూసుకొచ్చి సామాన్యుడి జేబులోకి దూరిపోయింది.
"ఓర్దీనెవ్వ..." అంటూ సామాన్యుడు కంగారు పడి, దులుపుకునే సరికి జేబంతా చిల్లులు.
"ఇయ్యేం జువ్వలు మావా? పైకెళ్లడం మానేసి మనమీదకొచ్చి పడతన్నయేంటి?" అంది భార్య.
"అదంతేలేయే.. మన సర్కారోళ్లు ప్రవేశ
పెట్టిన నవరత్న పథకాల్లాగే మరి! ఎక్కడెక్కడ లేని అప్పులూ సేత్తా, ఆ సొమ్మంతా మళ్లిస్తా,
కొందరికి సొమ్ములు పంచినట్టే పంచుతున్నారా? ఆ
వంకెట్టుకుని గొప్పగా జబ్బలు కొట్టుకుంటున్నరా? కానీ నిజానికి జరుగుతున్నదేంటి?
ఆ పథకాల వల్ల మన జేబుకే సిల్లలు పడుతున్నాయి. ఓట్ల కోసం పందేరం
సేసే సొమ్ముల్ని రాబట్టుకోడం కోసరం,
ధరలు, పన్నులు పెంచేత్తన్నారా లేదా? చివరాకరికి చెత్త మీద కూడా పన్నులేసేత్తన్నారు
కదే? మద్యం మావే అమ్ముతామంటా మొదలెట్టి నాసిరకం మందు పోత్తన్నారు.
ఇక ఇసక సంగతి సెప్పాలా? ఓల్సేలుగా ఆళ్లకి కావలసినోళ్లకి
అప్పజెప్పేశారు. ఇప్పుడది దొరకడమూ గగనమే, ధరా గగనమే.
ఇలా ఒకటా రెండా... అన్నీ మన జేబులకి సిల్లులే గదే? మరా తారుజువ్వ
కూడా అదే సేసింది సూడు..." "అబ్బ... ఎంత పెద్ద చిచ్చుబుడ్డో చూడు
నాన్నా..." అంటూ పిల్లలు తెచ్చి నేల మీద పెట్టి వెలిగించారు.
అది మొదట బుస్సుమంటూ వెలిగి ఆనక వెనక నుండి
చీదేసింది.
"ఇదేంటి మావా? బజార్లోంచి తెస్తే ఎంత చిన్న
చిచ్చుబుడ్డయినా అంతెత్తున వెలుగులు సిమ్ముతాది. మరిందింత పెద్దగా ఉన్నా సీదేసిందేటి?" అంది భార్య.
"మరేదేనే... సూడ్డానికి మన సర్కారోళ్ల
ప్రచారంలాగా పెద్దగా, మెరుపు కాగితంతో సుట్టబెట్టి ఉందా? తీరా చేసి ముట్టించాక ఏమైందో సూశావుగా?
ఈ రెండేళ్లలో ఏం జరిగిందో, అదే మరి! సభల్లో,
సొంత పత్రికల్లో సెప్పేదీ, రాసేదీ బాగానే ఉంటది.
కానీ సుట్టూ సూత్తే అంతా గందరగోళం. ఇంటి నుంచి బయటకెళితే రోడ్లు కూడా బాగోవు.
సెప్పేది కొడంత...సేసేది గోరంత. ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు పడతాయో తెల్దు. పెద్దోళ్లకి
పింఛన్లు ఎప్పుడొస్తాయో తెల్దు. ఇక రైతన్నల సంగతి మరీ దారుణం. గిట్టుబాటు ధరల్లేవ్.
ధాన్యం కొన్న డబ్బుల బకాయిలు రావు. దేశం మొత్తం మీద ఆత్మహత్యలు సేసుకుంటున్న రైతన్నల
ఇసయంలో మన రాట్రం మూడో స్థానంలో ఉందంట. ఇలా ఎవుళ్ల జీవితాలు బాగుపడ్డాయి సెప్పు?
ఆఖరికి ఓ రాజధాని కూడా లేకుండా బతుకులు ఈడుస్తున్నాం. అమరావతి కోసం
భూములిచ్చిన రైతు బాబాయ్‌లంతా అలో లచ్చనా అంటా ఏడత్తన్నారు. పిలగాళ్లకి ఉద్యోగాలు
లేవు. కొలువులిచ్చే పరిశ్రమలు లేవు. రావు. ఆఖరికి సాయం మీద సదూకునే పిలగాళ్లకి
కూడా జెల్లకొడుతోందీ సర్కారు. మరలాంటోళ్లు పంచిపెట్టి సిచ్చుబుడ్లు సీదేయకేంజేస్తాయే?"
"నాన్నా... బాణసంచా అయిపోయింది. కానీ సీమటపాకాయలు, బాంబులు ఇవ్వలేదేంటి నాన్నా?" అంటూ వచ్చారు
పిల్లలు.
"అవన్నీ పేలేవి కదరా అందుకని ఇచ్చుండరు
పొండి" అంటూ పిల్లల్ని పంపేసిన సామాన్యడు భార్య కేసి
తిరిగి, "ఈ సర్కారోళ్ల
బాణసంచాలో వేరే పేలేవెందుకులే. ఎగస్పార్టీవోళ్ల మీద ఎమ్మెల్యేలు, మంత్రులు విరుచుకుపడుతూ తిట్టే
తిట్లే సీమటపాకాయలు. సమస్యల మీద నోరెత్తిన వాళ్ల మీద అన్నాయంగా బనాయించే కేసులే
బాంబులు. ప్రశ్నించే వాళ్ల మీద అనుచరులతోను, పోలీసులతోను
చేయించే దాడులే థౌజండువాలాలు... ఏమంటావే?" అన్నాడు.
"బాగానే ఉంది సంబడం... ఇక మన బతుకుల్లో
దీపావళి ఎప్పుడు మావా?" అంది భార్య.
"వస్తుందే... అసలైన దీపావళి వస్తుంది.
మనలాంటి సామాన్యులంతా సుట్టూ ఏం జరుగుతోందో గమనించి, బాగా ఆలోసించుకుని ఓటేసే రోజులొత్తాయి
సూడు అప్పుడొస్తాది నిజమైన దీపావళి..."
****
"ఏటి మావా? నిజమైన దీపావళి అంటూ కలవరిత్తన్నావు? వెళ్లి పిల్లలకి కూసిన్ని కాకరపువ్వొత్తులు
తే" అంటూ భార్య లేపుతుంటే మెలకువ వచ్చింది సామాన్యుడికి.
"ఓస్దీనెవ్వ... ఇదంతా కలన్నమాట" అనుకుని
నిట్టూరుస్తూ బజారు కేసి నడిచాడు సామాన్యడు!
-సృజన
PUBLISHED ON 31.10.2021 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి