శనివారం, అక్టోబర్ 09, 2021

అష్ట‌క‌ష్టాల దండ‌క‌మ్!


 

అమ్మ‌ల‌గ‌న్న‌య‌మ్మ‌... ముగురమ్మ‌ల మూట‌పుట‌మ్మ‌...

క‌రుణించు కాపాడు క‌న‌క‌దుర్గ‌మ్మ‌!

ఆంధ్ర రాష్ట్రాన అల్లాడుచున్న‌ట్టి సామాన్య జ‌నుల‌ను కాన‌వ‌మ్మ‌!

అష్ట‌క‌ష్టాల కార్చిచ్చులో చిక్కి అణగారుతున్న‌ట్టి ప్ర‌జ‌ల‌మ‌మ్మ‌!

న‌మ్ముకున్న‌ట్టి మా పాల‌కులు మ‌మ్ముల‌ను న‌ట్టేట‌లో ముంచి న‌వ్వుతున్నార‌మ్మ‌!

ఓటేసి గెలిపించి అంద‌లాలెక్కించి ఆశ‌పడిన మ‌మ్ము వెక్కిరించార‌మ్మ‌!

పాద‌యాత్ర‌లు చేసి పాకులాడార‌మ్మ‌...

ఊరూరు తిరుగుతూ ఊరించినార‌మ్మ‌...

ఏడ‌వ‌క‌పోయినా ఓదార్చినార‌మ్మ‌...

త‌లలు నిమిరి మ‌మ్ము ముద్దాడినారమ్మ‌...

బుగ్గ‌ల‌ను త‌డుముతూ బులిపించినార‌మ్మ‌...

మెత్త‌గా న‌వ్వుతూ మోసగించార‌మ్మ‌...

ఒక్క ఛాన్స్ ఇమ్మంటు వేడుకున్నార‌మ్మ‌...

గెలిపించితే చాలు స్వ‌ర్ణ‌యుగ‌మును తెచ్చి న‌ట్టింట‌ నిలుపుదుమ‌ని న‌మ్మించినారమ్మ‌!

ఆ మాట‌ల‌ను న‌మ్మి అధికార‌మందించి నిలువునా న‌ట్టేట మునిగిపోయితిమమ్మ‌!

ఎక్క‌డికి పోదుము, ఏమి చేయుద‌మ‌మ్మ‌... ఇక్క‌ట్ల ఊబిలో చిక్కుకున్నామ‌మ్మ‌!

ఎటు చూసినా బ‌తుకు బ‌స్టాండుగా మారి... బితుకు బితుకుమంటు మిగిలినామ‌మ్మ‌!

పింఛ‌న్ల‌లో కోత‌... జీతాల‌కే వాత‌... ఎవ్వ‌రిని చూసినా న‌వ్వు లేద‌మ్మ‌!

చెప్పుకుందామంటె దిక్కులేద‌మ్మ‌...నోరెత్తితే చాలు దాడి చేస్తార‌మ్మ‌!

గూండాలు, రౌడీలు పెచ్చరిల్లార‌మ్మ‌!

కండ‌బ‌ల‌మును చూపి క‌సురుతున్నార‌మ్మ‌!

స‌ర్కారు కొలువుల‌ని బిడ్డ‌ల‌ను ఊరించి... ఉత్త చేతులు చూపి ఊరుకున్నార‌మ్మ‌!

ఫ్యాక్ట‌రీల‌ను తెచ్చి ప్ర‌గ‌తి తెచ్చెద‌మంటు కోత‌లెన్నో కోసి ఆశ‌పెట్టార‌మ్మ‌!

వాస్త‌వానికి చూడ ఉట్టి మాట‌ల‌మ్మ‌... ఉన్న‌వన్నీ కూడ ఊడిపోయాయమ్మ‌!

అభివృద్ధి బాట‌ల‌ను అడుగునా ప‌రిచి అద‌ర‌గొడ‌తామంటు ఊరించినార‌మ్మ‌...

క‌ళ్లు తెరిచి చూడ ఉన్న దారులు కూడ గోతుల‌మ‌య‌మై గొల్లుమ‌న్నాయ‌మ్మ‌!

అడుగుపెడితే చాలు క‌స్సుమ‌ని గాయాలు... వాహ‌నాల‌ను న‌డ‌ప వీలులేద‌మ్మ‌!

రోడ్ల దుస్థితి చూసి బాగుచేయాలంటు అడిగినా చాల‌మ్మ‌... అగ‌చాట్లు మొద‌ల‌మ్మ‌!

రౌడీల‌తో కొట్టి, గూండాల‌తో బాది... అక్ర‌మంగా కేసులు అంట‌గ‌డ‌తార‌మ్మ‌!!

ఏవేవొ ప‌థ‌కాలు ర‌చియించి వంచించి... అడ్డదారిన దుడ్లు దుళ్ల‌గొట్టార‌మ్మ‌...

ఇచ్చినట్టే ఇచ్చి ప‌న్నులెన్నో పెంచి... జేబులో డ‌బ్బుల‌ను గుంజుతున్నార‌మ్మ‌!!

అప్పులెన్నో చేసి ప‌ద్దుల‌ను మ‌ళ్ళించి... రాష్ట్రాన్ని దివాళా తీయించినార‌మ్మ‌!

అగ‌చాట్ల సాగులో అన్న‌దాతలు చూడ‌... అణ‌గారి దిగ‌జారి జావ‌గారార‌మ్మ‌...

కోట్లాది సొమ్ముల‌ను బ‌కాయి పడిపోయి... రైత‌న్న‌ల‌కు మొండి చెయ్యి చూపార‌మ్మ‌!

ప్ర‌త్యేక హోదాను ప‌ట్టి తెచ్చెద‌మంటు... ప్ర‌గల్భాల‌నెన్నొ ప‌లికినార‌మ్మ‌...

చీటికిని మాటికిని దిల్లీకి వెళ్లొచ్చి... వ‌ట్టి చేతులు చూపి వెక్కిరించార‌మ్మ‌!

రాజ‌ధానిని మార్చి రాజిల్లుతామంటు... మూడు ముక్క‌ల ఆట‌ ఆడుతున్నార‌మ్మ‌...

భూములిచ్చిన రైతు సోద‌రుల‌ను వంచించి... మొండిచెయ్యిని చూపి ముంచినారమ్మ‌!

పాల‌కుల‌ను చూడ ఆడింది ఆట‌గా పాడింది పాట‌గా గ‌డుపుతున్నార‌మ్మ‌...

అయిన‌వారికి ఆస్తిపాస్తుల‌ను అందించి... అవినీతి మ‌డుగులో ఈదుతున్నార‌మ్మ‌!

భూముల‌ను సెజ్‌ల‌ను బ‌డాబాబుల‌కు పంచుతూ... వ్యాపార వాటాలు మ‌రిగినార‌మ్మ‌!

మాఫియా గ్యాంగుతో మాటు చాటున చేరి... మ‌త్తులో యువ‌త‌ను ముంచుతున్నార‌మ్మ‌!

ఓ త‌ల్లి మా త‌ల్లి మా క‌ల్ప‌వ‌ల్లి... మా అగ‌చాట్ల జాబితా అంతుప‌ట్ట‌నిద‌మ్మ‌...

మా కష్టాల లిస్టంత మొర‌పెట్ట‌లేమ‌మ్మ‌... మ‌ముగాచి మా బాధ తీర్చు పెద్ద‌మ్మ‌!

మన‌సున్న‌ నేత‌ల‌ను గుర్తించి ఎన్నుకొను ఇంగిత‌ము మాకిచ్చి ఈడేర్చుమ‌మ్మ‌!

ఒక్కొక్క ఓట‌రూ జ‌న‌సైనికుల రీతిలో చెల‌రేగు జాగృతిని అందీయ‌వ‌మ్మ‌!

అవినీతి పాల‌కుల మ‌హిషారులను త‌రుము... ధైర్యమ్ము మాకిచ్చి కావుమ‌మ్మ‌!

అప్పుడే నిజ‌మైన విజ‌య‌ద‌శ‌మి క‌ద‌మ్మ‌... ఆనాడు ద‌స‌రాను జ‌రుపుకుంటామ‌మ్మ‌!!

 

-సృజ‌న‌

PUBLISHED ON 09.10.2021 ON JANASENA WEBSITE


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి