“అనగనగా ఒక రాక్షసుడురా... “ అంటూ మొదలు పెట్టారు గురూగారు, శిష్యుడు వచ్చి
కూర్చోగానే. శిష్యుడు శ్రద్ధగా వినసాగాడు.
“ఏం? ఆ రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు.
అదలాంటిలాంటి తపస్సు కాదురోయ్. భయంకరమైనది. శివుడిని పొగిడాడు. స్తోత్రాలు చేశాడు.
కాళ్లావేళ్లా పడ్డాడు. బలిమాలాడు. ఒంటి కాలి మీద నుంచున్నాడు. బక్కచిక్కిపోయాడు.
ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికినా
చలించలేదు. ఆఖరికి శివుడు జాలి పడ్డాడు. చటుక్కున ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను. ఏం కావాలో కోరుకో... అన్నాడు. దానికా రాక్షసుడు ఏం
కోరుకున్నాడో తెలుసా? నేనెవరి నెత్తి మీద చెయ్యి పెడితే వాళ్లు
భస్మమైపోవాలి... అని! వరమిస్తానన్నాక తప్పదుగా? శివుడు
సరేనన్నాడు. అప్పుడా రాక్షసుడేం చేశాడో తెలుసా? నువ్విచ్చిన వరం ఎలా ఫలిస్తుందో
చూస్తానంటూ శివుడి నెత్తి మీదనే చెయ్యి పెట్టబోయాడు...”
“గురూగారూ! ఈ కథ నాకు తెలుసండి. భస్మాసురుడి
కథండి. చిన్నప్పుడు మా బామ్మ చెప్పిందండి. వరం పొందిన ఆ భస్మాసురుడు ఎక్కడ తన
నెత్తి మీద చెయ్యి పెట్టేస్తాడోనని భయపడిపోయి శివుడు పరుగందుకుంటాడండి. ఆ రాక్షసుడు
వదలడండి బాబూ... వెంటబడతాడండి. ఆ కథే కదండీ మీరు చెబుతుంట?”
“అవున్రా... నీకు పురాణ పరిజ్ఞానం బాగానే ఉందిరోయ్...
ఎప్పటికో అప్పటికి పనికొస్తావులే...” అంటూ పొగిడారు గురువుగారు.
శిష్యడు పొంగిపోయి తమాయించుకుని, “అవును కానీ గురూగారూ! నేనేదో
కాసిన్ని రాజకీయ పాఠాలు నేర్చుకుని ఎప్పటికైనా నికార్సయిన పొలిటీషియన్‌గా ఎదగాలని
మీ దగ్గరకొస్తుంటే... మీరేంటండీ, ఇలా పురాణ కథలు చెబుతున్నారు?
కొంపదీసి ప్రవచనాలు నేర్పిస్తారా ఏంటి సర్...” అన్నాడు అయోమయంగా చూస్తూ.
“ఒరే... పురాణాలను తక్కువగా అంచనా వేయకురోయ్...
రాజకీయాల్లో ఎదగాలనుకునేవాడు వాటి నుంచి కూడా స్ఫూర్తి పొందాలి, తెలుసా?”
“అవునండోయ్... నిజమే. రాముడెంత చక్కగా పరిపాలన
చేశాడు, ధర్మరాజు ప్రజల్ని ఎలా కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు...
అలాంటి విషయాలే కదండీ?”
“ఏడిశావ్... వాళ్లు ప్రజల కోసం తమ కుటుంబ సభ్యులు
కష్టపడినా లెక్కచెయ్యలేదురా. కానీ నేటి పొలిటీషియన్లు అలా కాదుగా? తమ కుటుంబ సభ్యుల కోసం ప్రజలు ఎన్ని కష్టాలు పడినా పట్టించుకోరు. కాబట్టి
నిగ్గుతేలిన నీచ రాజకీయ నేతలాగా ఎదగాలనుకుంటే నువ్వు వాళ్ల నుంచి కాదురా స్ఫూర్తి
పొందాల్పింది...”
“మరింకెందుకండీ ఇప్పుడు నాకీ పురాణ కథా శ్రవణం?”
“ఓరి వెర్రి నా శిష్యా! భస్మాసురుడి కథ నీకు సరదాగా
చెప్పాననుకుంటున్నావా? నయా రాజకీయ నీచ ప్రహసనంలో ఇదో నూతన
ప్రవచనం. ఈ రాజకీయ పురాణంలో నీకా భస్మాసురుడే స్ఫూర్తి. అర్థమైందా?”
“అదెలాగో కాస్త మీరే చెప్పి పుణ్యం కట్టుకుందురూ...”
“ఏముందిరా...
ఆ భస్మారుడేం చేశాడు? వరమిచ్చిన వాడి నెత్తి మీదే చెయ్యిపెట్టబోయాడవునా?
అదే నేర్చుకోవాలి నువ్వు. ఇప్పుడు ప్రజలే దేవుళ్లు. వాళ్లిచ్చే వరమే
ఓట్లు. కానీ ఆ వరం పొందాలంటే నువ్వు వాళ్లని మెప్పించాలి. అందుకోసం ఊరూ వాడా తిరగాలి.
ఎండయినా, వానయినా, చలయినా తిరుగుతూ
బతిమాలాలి. బామాలాలి. కాళ్లావేళ్లా పడాలి. ఏడవాలి. ఓదార్చాలి. మొత్తానికి ఏమార్చాలి.
అప్పుడా ఆ దేవుళ్లు వరం ఇస్తారు. ఆ వరం వల్ల అధికారం అందుకోగానే, నీ అసలు నైజం బయటపెట్టాలి. ఆఖరికి వాళ్ల నెత్తినే చెయ్యి పెట్టాలి. అదీ,
భస్మాసురుడి కథ నుంచి నువ్వు వంటబట్టించుకోవలసిన రాజకీయ సూత్రం.
ఇప్పటికైనా తెలిసిందా?”
“భలే సూత్రమండి బాబూ. కానీ గురూగారూ, ఈ సూత్రాన్నిపాటిస్తున్నవాళ్లు ఇప్పుడెవరైనా ఉన్నారాండీ?”
“నీతో ఇదేరా చిక్కు. సమకాలీన రాజకీయాలని చూసి నేర్చుకోవు.
పరిశీలన శక్తి తక్కువ. సాక్షాత్తూ నీ పరగణాలో అధికార కుర్చీ ఎక్కి తైతక్కలాడుతున్న
వాళ్లని చూసి కూడా గ్రహించుకోవు. ఓ సారి తల తిప్పి చుట్టూ చూడు. జరుగుతున్నదేంటో
తెలుస్తుంది. మరిక్కడి ప్రజల పరిస్థితి, అప్పుడు వరమిచ్చి
పరుగందుకున్న పరమశివుడి పరిస్థితిలా లేదూ? అన్నపూర్ణ అనిపించుకున్నరాష్ట్రం
ఇప్పుడు అయ్యయ్యో... అనిపించుకోవడం లేదూ? ఇక్కడ ఏ వ్యవస్థ,
అవస్థలు లేకుండా ఉంది చెప్పు? అన్నింటి మీద భస్మాసుర
హస్తం మోపినట్టు అయిపోలేదూ? యాష్ తప్ప మరింకేం మిగలనంతగా
మటాష్ అయిపోలేదూ? రాష్ట్రం
పేరు చెబితే దేశం మొత్తం మీద ఎక్కడా అప్పు పుట్టని దుస్థితి ఇంతకు ముందెప్పుడైనా
చూశామా, విన్నామా చెప్పు? బ్యాంకులు, పరిశ్రమలు కూడా మొహం చాటేసే విపత్కర
పరిస్థితి విచిత్రంగా లేదూ? ఆఖరికి జీతాలు, పింఛన్లకి కూడా నెలనెలా కటకటలాడాల్సిన హీనస్థితిలో ప్రభుత్వం ఉందంటే...
ఆర్థిక రంగం మీద భస్మాసుర హస్తం పడినట్టు అనిపించడంలేదూ? మొన్నటికి మొన్న స్థానిక ఎన్నికల్లో
ప్రచారానికి కూడా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధించారంటే ఏమనుకోవాలి? వేరే పార్టీ వాళ్లు నామినేషన్ వేయకుండా
నానా అడ్డంకులూ కల్పించారంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆఖరికి
ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చేనే స్వేచ్ఛ, హక్కులు నాశనం
అయినట్టా కాదా? అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి మీద కూడా భస్మాసుర
హస్తం మోపినట్టా కాదా? రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన రైతులు
దాదాపు ఏణ్ణార్థం నుంచి ఉద్యమిస్తున్నా పట్టించుకోకపోగా, వాళ్లపై
దాడులకు కూడా తెగబడుతున్నారంటే ఏమనుకోవాలి? ప‌్రజాభిప్రాయాన్ని
గౌరవించాలనే కనీస బాధ్యత కూడా కనుమరుగైనట్టేగా? అంటే ప్రాధమిక
హక్కులపై కూడా భస్మాసుర హస్తం పెట్టేసినట్టేగా? ఇక పోలీసులు
సొంత విచక్షణ విస్మరించి, అధికార పార్టీ నేతలకు అనుచరులుగా
ప్రవర్తిస్తూ అడ్డగోలు కేసులు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదంటే సామాజిక, రక్షణ వ్యవస్థలు
ఏమయినట్టు? భస్మాసుర హస్తం కింద భగభగలాడుతున్నట్టు కనిపించడం
లేదూ? మరి ప‌్రజల పక్షాన నిలిచి సమస్యలను ఎలుగెత్తి చాటే
పత్రికా రంగాన్ని కూడా బెదిరిస్తున్న దాఖలాలు గమనించలేదా? వ‌్యతిరేక వార్తలు రాస్తే సహించలేక ఆయా పత్రికలు, మీడియా రంగాలపై కేసులు పెట్టడం చూడలేదా? ఆఖరికి ప్రజా
ఉద్యమాల కవరేజికి వెళ్లిన విలేకరులపై కూడా విరుచుకుపడుతున్నారంటే ఏమనుకోవాలి?
అలాంటి వార్తలు రాయక్కర్లేదని చెప్పిస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి?
పత్రికా రంగం వైపు కూడా ఆ భస్మాసుర హస్తం దూసుకువస్తున్నట్టే కదా?
ప‌్రభుత్వం అసంబద్ధ నిర్ణయాలపై పిటీషన్లు పడితే, ఆ నిర్ణయాలను తప్పు పట్టిన న్యాయమూర్తుల తీర్పులపై అసంతృప్తిని వ్యక్తం
చేస్తూ దిల్లీకెళ్లి ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడడం లేదంటే ఏంటర్థం?
న్యాయ వ్యవస్థపై కూడా భస్మాసుర హస్తం చాస్తున్నట్టేగా?
ఇలా ఒకటా, రెండా... ఎన్నని చెప్పుకోగలం?
రాష్ట్రంలో ఒకో రంగం, ఒకో వ్యవస్థ అణగారిపోవడం
లేదూ? ఇప్పటికైనా నీ మట్టి బుర్రకి ఎక్కిందా లేదా?”
“ఛీ... ఛీ... వింటుంటేనే ఒళ్లు మండిపోతోందండి... ఇది
నిజంగా భస్మాసుర పాలనేనండి బాబూ... వింటుంటే నేనే భస్మాసుర హస్తం కింద ఉన్నట్టు
ఒళ్లంతా భగభగా మండిపోతోందండి...”
“కాబట్టి అదేరా నువ్వు నేర్చుకోవలసిన నీచ రాజకీయ
పురాణం. అధికారం అందేవరకు ఎలా దేవుళ్లాడాలో, అధికారం అందాక
ఎలా బరితెగించాలో నేర్చుకున్నావంటే నువ్వు మనిషిగా పూర్తిగా దిగజారినట్టు. అంటే
రాజకీయంగా అంత బాగా ఎదిగినట్టు. తెలిసిందా?”
“తెలిసింది కానీ గురూగారూ! నాదో సందేహమండి. ఆ భస్మాసురుడి
కథలో శివుడిని విష్ణుమూర్తి రక్షించాడు కదండీ? మరి ఇప్పుడు
ఇలాంటి నేతల నుంచి ప్రజల్ని ఎవరు రక్షిస్తారండీ?”
“విష్ణుముర్తి అంటే విచక్షణరా. ప్రజల్లో ఆ విచక్షణ
మేలుకోవాలి. అందుకు నీతి, నిజాయితీలే ఆలంబనగా, నిస్వార్థంగా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న జననాయకులు
ఎవరో ప్రజలే గుర్తించాలి. చటుక్కున వరమిచ్చేసినట్టు కాకుండా వాస్తవాలు గ్రహించి
ఓటేసే చైతన్యాన్ని అలవరుచు కోవాలి. అప్పుడే ఇలాంటి భస్మాసుర నేతలు తమ నెత్తి
మీద తామే చెయ్యి పెట్టుకున్నట్టు నాశనమవుతారు. ఇదే నేను నీకు చెప్పాలనుకున్న రాజకీయ
భస్మాసుర పురాణం. ఇక పోయిరా!”
-సృజన
PUBLISHED ON 22.11.21 ON JANASENA WEB SITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి