"సార్... సార్... కొంప మునిగింది..."
"ఎవరిదీ?"
"మనదే సార్..."
"ఛస్... ఊరుకో... కొంపలు ముంచే వాళ్లమే
మనమైనప్పుడు మనది మునగడమేంటయ్యా?"
"మీరింత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారండీ
బాబూ... అవతల మీ అక్రమ లావాదేవీలన్నీ బట్టబయలైపోతుంటేను?"
"హ...హ్హ...హ్హా! మనవంత సులువుగా బయటపడిపోయే
యవ్వారాలు కాదు కదయ్యా... ఊరికే ఎందుకు కంగారు పడతావు కానీ, ముందు జరిగిందేంటో చెప్పు..."
"అదేనండీ... నిన్న హైకోర్టులో ఆ సీబీఐ వాదనలన్నీ
పత్రికల్లో పతాక వార్తలుగా వచ్చేశాయండీ బాబూ... మీరింకా చూడలేదా?"
"చూడు సెక్రట్రీ! మనం చేసినవిన్నీ అన్నీనా చెప్పు? ఎన్నని గుర్తు పెట్టుకుంటాను? వాటిలో కొన్ని అడపా దడపా పత్రికల్లో
వస్తుంటాయి. మరికొన్ని కోర్టుల్లో మార్మోగిపోతుంటాయి... ఇదంతా మామూలేనయ్యా. కాబట్టి
నువ్వూరికే బెంబేలు పడిపోకు..."
"అది కాదండి బాబూ... పొద్దున్న పేపరు చూసినప్పటి
నుంచి గుండె బేజారైపోయిందండి. మీరు కూడా చూసి కంగారు పడిపోయి, ఏ గుండె నొప్పయినా తెచ్చుకుని
ఉంటారని భయపడిపోయానండి. అందుకే ఉరుకూ పరుగు మీద వచ్చేశానండి... మీరు చూస్తే తాపీగా
ఉన్నారు... ఇప్పటికి నా మనసు కుదుటపడిందండి..."
"ఇంకా నయం సెక్రట్రీ... ఆ గుండెనొప్పేదో
నీకే వచ్చేసింది కాదు... మొత్తానికి భలేవాడివయ్యా... ఒట్టి కంగారు గొడ్డులా ఉన్నావ్... ఇంతకీ ఏమంటుంది
ఆ సీబీఐ?"
"ఏమండమేంటండి బాబూ... చాలా పగడ్బందీగా
వాదించిందండి. మీదంటూ ఒక్క రూపాయి కూడా లేకుండా ఏకంగా 1200 కోట్ల రూపాయలకు
పైగా మీ కంపెనీల్లోకి ఎలా రాబట్టుకున్నారో
అదంతా ఏకరవు పెట్టిందండి... పైగా ఈ మొత్తం అక్రమార్జనకు సంబంధించి అన్ని రుజువులూ
ఉన్నాయంటోందండి... అవన్నీ రేపో మాపో బయటకొచ్చేశాయనుకోండి...
తమరి పరిస్థితి ఏంటన్నది నా బెంగండి..."
"అవున్లే పాపం... ఇవన్నీ నీకు కొత్త కాబట్టి
అలాగే ఉంటుందిలే. మరి నాకలా కాదు కదా... నాకివన్నీ అలవాటే. అంచేత,
నువ్వు ముందు స్థిమితపడి, కాసిన్ని మంచినీళ్లు
తాగి అప్పుడు చెప్పు... ఆ సీబీఐ చేసిన వాదనేంటో..."
"పోన్లెండి... మీరు స్థిమితంగా ఉన్నారంతే
చాలు... మీరంటే ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నారు కానీ, ఈ కేసు జరిగినప్పుడు మీ తండ్రిగారు సీఎంటండి...
అప్పట్లో ఆయన తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరెవరికి భూములు కేటాయించారో,
అలా భూములు పొందిన వాళ్లు మీరు పెట్టిన కంపెనీల్లోకి ఎన్నేసి కోట్లు
బదలాయించారో అవన్నీ పేర్లతో సహా సీబీఐ కోర్టులో చెప్పేసిందండి. ఇదంతా ముడుపుల వ్యవహారమే
తప్ప మరేమీ కాదని గట్టి వాదించిందంటండి... పైగా ఇదంతా క్విడ్‌ప్రోకో కిందకే వస్తుందని
చెప్పిందంటండి..."
"అంతేనా? ఇంకేమన్నా ఉందా?"
"అదేనండి... అసలు ముందుగా మీ కంపెనీల్లోకి
కోట్లు వచ్చిపడ్డాయని కన్‌ఫర్మ్ అయ్యాకే, ఆయా సంస్థలకి మీ తండ్రిగారు రాష్ట్రంలో భూములు కేటాయించార్టండి...
ఆపై మరిన్ని కోట్లు ఎకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యాకనే వాళ్లకి ఇంకొన్ని ఎకరాలు
కట్టబెట్టార్టండి... ఈ కేటాయింపులు, కోట్లు రావడాలు ఎప్పుడెప్పుడు
జరిగాయో తేదీలతో సహా దాఖలాలు ఉన్నాయంటండి..."
"సర్లేవయ్యా... వాళ్ల వాదన వాళ్లది.
వాళ్ల పని వాళ్లు చేయాలి కదా..."
"అయ్యా... మీ నిబ్బరం, నిశ్చింత చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందండి...
ఎంతో రాటుదేలిన ఘటనాఘటన సమర్థులైతే తప్ప ఇంత థిలాసా ఉండదండి... కానీ మీ సెక్రట్రీగా
నా కంగారు నాదండి. మరి ఈ కేసులు రుజువైపోతే కోర్టు గబుక్కున అరెస్టు వారెంటు ఇస్తే
ఎలాగా అని ఆలోచిస్తున్నానండి..."
"ఓరోరి వెర్రి సెక్రట్రీ! నీ స్వామి భక్తి, విశ్వాసం చూస్తుంటే ముచ్చటగా
ఉందయ్యా... కానీ నీకో సంగతి చెబుతా విను. నాకు మన చట్టాల మీద, న్యాయవ్యవస్థ మీద, మన ప్రజాస్వామ్యం మీద మాచెడ్డ
నమ్మకమయ్యా... ఇవన్నీ అంత తొందరగా తేలవు. వాయిదాల మీద వాయిదాలు పడతాయి. పైగా
మనోళ్లు చూస్తా ఊరుకుంటారా చెప్పు? మధ్యలో ఏదో సెక్షన్ అడ్డమెట్టుకుని
పిటీషను తగిలిస్తారు. దాన్ని శ్రీకోర్టువారు స్వీకరించక తప్పదు. తిరిగి దాని
మీద వాదోపవాదాలు... వాయిదాలు... ఆ... అంచేత నాకెప్పుడూ నిబ్బరమే... అర్థమైందా?"
"అర్థమైంది సార్... కాస్త చనువు తీసుకుని
అడుగుతున్నాను, ఏమీ
అనుకోకండి... ఇంతకీ అప్పట్లో జరిగిన క్విడ్‌ప్రోకోలు, ముడుపులు,
భూమి బదలాయింపులు ఇవన్నీ నిజమేనాండీ?"
"చూడు సెక్రట్రీ... అధికారం అనేది కరెంటులాంటిదయ్యా...
ఒక స్విచ్ నొక్కితే ఫ్యాన్ తిరిగి గాలొస్తుంది. మరో స్విచ్ నొక్కితే బల్బు వెలిగి
కాంతి పరుచుకుంటుంది. ఓ స్విచ్ ఏసీ ఆన్ చేస్తే, మరో స్విచ్ వంటింట్లో పచ్చడి చేసి పెడుతుంది. మనకి
తెలియాల్సిందల్లా ఎప్పుడు ఏ స్విచ్ నొక్కలనేదే. అంచాత అప్పట్లో మనకి డైరెక్ట్‌గా
అధికారం లేకపోయినా, స్విచ్‌లు మాత్రం బాగా తెలిసుండేవి... అదన్నమాట..."
"ఆహా... మీ తెలివితేటలు అవీ చూస్తే అబ్బురంగా
ఉందండి... తండ్రిగారిది అధికారం అయితే,
తైతక్కలు తమవన్నమాట. కానీ ఓ చిన్న సందేహం సార్... ఇప్పుడీ కేసులో
మీ క్విడ్‌ప్రోకోలు నిజమని తేలిపోయిందనుకోండి, అప్పుడిక మీ
చాప కిందకి నీళ్లొచ్చినట్టే కదండీ?"
"హ...హ్హ... హ్హా! సెక్రట్రీ తెగ నవ్వించేస్తున్నావయ్యా...
చాప కిందకి కొత్తగా నీళ్లు రావడమేంటయ్యా? అసలు మన
చాపే సముద్రం మీద తేలుతుంటేనూ? అదే అవినీతి సముద్రం. దాని మీద
తేలిపోతూ సాగిపోయే నాలాంటి వాడికి ఇలాంటి చిన్న చిన్న కేసులు పెద్ద లెక్కలోకి రావయ్యా...
అప్పట్లో అధికారం నాది కాదు కాబట్టి కొంత వరకే సాధ్యమైంది. మరిప్పుడో?
మనమే స్వయంగా అధికార పీఠం మీద బాసింపట్టు వేసుకుని కూర్చున్నాం కదా.
మరి ఇప్పుడు జరుగుతున్నవి ఎప్పటికి తేలుతాయి చెప్పు? ఇప్పటికే
వందలాది, వేలాది ఎకరాలు మనకి బాగా అయినవాళ్లకి కేటాయింపులు
చేస్తున్నామా? రాష్ట్రంలో
ఉన్న గనులని, సెజ్‌లని కట్టబెట్టేస్తున్నామా? ఇసుక ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు, సారా గుత్తాధిపత్యాలు, భూముల అమ్మకాలు, పోర్టులు ఫ్యాక్టరీల ప్రైవేటీకరణలు...
ఇలా ఎన్నింటికని లెక్కలు తేల్చగలరు చెప్పు? ప్రజా సంక్షేమం పేరు చెప్పి అధికారికంగా
ఇచ్చే అనుమతులు, ఆ అనుమతుల వెనకాల అనధికారికంగా జరిగే లావాదేవీలు,
బదలాయింపులు, కేటాయింపులు... వీటన్నింటి విలువ
ఎవడు చెప్పగలడు? ఎవడు తేల్చగలడు? నువ్వు కేవలం ఓ 1200 కోట్లకే బెంబేలు
పడిపోతున్నావ్. వీటన్నింటి ముందు అదెంత?
సముద్రంలో కాకిరెట్ట! ఏమంటావ్?"
"ఇంకేమంటాను సార్... కళ్లు బైర్లు కమ్ముతున్నాయి...
ఒళ్లు గగుర్పొడుస్తోంది... నా భయాలన్నీ తీరిపోయాయి సార్... మీ బరితెగింపు అనితర
సాధ్యం! మీ అధికార లీలలు అమోఘం! మీరు... మీరు... జగన్నాటక సూత్రధారులు!"
-సృజన
PUBLISHED ON 9.11.2021 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి