బుధవారం, డిసెంబర్ 28, 2022

దేవుడా? దెయ్యమా?


 

''ఏరా... పది రోజులుగా అయిపూ అజా లేవు. ఎక్కడికి పోయావ్‌?''

''అదేంటి గురూగారూ! మీరే కదా అసైన్‌మెంట్‌ఇచ్చారు? ఆ పని మీదే తిరిగానండి...''

''ఒరే... నా దగ్గర రాజకీయాలు నేర్చుకుంటున్న శతకోటి శిష్యుల్లో నువ్వో బోడి శిష్యుడివి. కాబట్టి నీకిచ్చిన అసైన్‌మెంటేంటో కూడా చెప్పి ఏడు. అప్పుడుగానీ గుర్తు రాదు నాకు...''

''అదేనండి. మన పరగణా పాలకుడు చేసే పనులేంటో, ఆయన మాటలేంటో, వాటిని బట్టి ఆయన మీద నా అభిప్రాయమేంటో క్షేత్ర పరిశీలన చేసి మరీ రాసుకుని రమ్మన్నారు కదండీ. తీసుకొచ్చానండి...''

''ఓ... అదా... మరయితే చెప్పు. ఆయన ఎలాంటి వాడని నీ అభిప్రాయం?''

''అబ్బబ్బ... ఏం చెప్పను గురూగారూ! ఆయన దేవుడండీ బాబూ దేవుడు. ఆయన మనసంతా పేదలేనండి. ఆయన బతుకంతా బడుగుల కోసమేనండి. ఇక ఆయన గుండెకాయ లబ్‌డబ్‌మని కాదండీ బాబూ... సామాన్యుల కోసం లబోదిబో అని కొట్టుకుంటుందండి. ఇహ ఆయన తపనంతా తాడిత పీడిత ప్రజల కోసమేనండి. ఎంత వినయం? ఏం ఒద్దిక? అసలా నవ్వుంది చూశారూ... అబ్బో... మహా ముసిముసిగా ఉంటుదండి...ఆయ్‌!''

''సరే... నీ దృష్టిలో ఆయన దేవుడంటున్నావు కదా? మరి నీకు అలా ఎందుకనిపించిందో చెప్పు చూద్దాం...''

''ఎందుకేంటండి బాబూ... నిన్నటికి నిన్న ఏమన్నాడండాయన? అవినీతి అనేది ఎక్కడా కనిపించకూడదన్నాడండి. మంత్రులందరూ అవినీతికి దూరంగా ఉండాలని వార్నింగ్‌ఇచ్చేశారండి. ఎంత మంచి పిలుపండి అది?''

''ఒరే ఆయన కొలువుదీర్చి మూడున్నరేళ్లు అయింది కదా? ఇప్పుడు అవినీతికి దూరంగా ఉండమన్నాడంటే... మరి ఇంత వరకు వాళ్లు  దగ్గరగా ఉన్నట్టేనని నీకు అనిపించలేదా?''

''ఊరుకోండి సార్‌... మీరన్నీ తిరకాసుగా చెబుతారు. మీరు చెప్పేది పాఠమో, పరాచికమో ఓ పట్టాన బోధపడదండి. నిజానిజాలేంటో సరిగ్గా చెబుదురూ...''

''చెప్పడానికేముందిరా కళ్ల ముందు కనిపిస్తుంటేనూ? ఓ మంత్రి మీద ఫోర్జరీ పత్రాల కేసుంది. ఈయనగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎగస్పార్టీ మంత్రి మీద తప్పుడు ఆరోపణలతో తప్పుడు పత్రాలు దాఖలు చేసిన ఘనుడు. ఈ వ్యవహారం కోర్టుదాకా వెళితే, చిత్రాతిచిత్రంగా ఏం జరిగిందో తెలుసా? రాత్రికి రాత్రి ఓ దొంగ కోర్టులో ప్రవేశించి ఈయన ఫోర్జరీ పత్రాలు పట్టుకుపోయాడు. దీనిపై ఏకంగా హైకోర్టు స్పందించి కేసును సీబీఐకి అప్పగించింది. మరలాంటి ఫోర్జరీ ఫోర్ట్వంటీ అమాత్యులుంగారు హాయిగా అధికారంతో అష్టాచెమ్మా ఆడుకుంటున్నారని నువ్వు గమనించలేదా?''

''లేదు గురూగారూ! మీరు చెబుతుంటే సిగ్గేస్తందండి. ఛీ... ఇలాంటాయన ఇంకా పదవి పట్టుకుని వేలాడ్డం ఏంటండీ కంపరం కాపోతేనీ?''

''అంతేకాదురా... భూముల్ని రక్షించే మరో మంత్రివర్యులు కోట్ల రూపాయల విలువ చేసే భూమికి నిరభ్యంతర పత్రాలు ఇప్పించుకుని బంధువులు, కుటుంబ సభ్యుల పేరిట రాయించుకుని భోంచేశారన్న సంగతి నీ క్షేత్ర పరిశీలనకు తగల్లేదేంట్రా? పేరులొనే ధర్మం ఉన్న ఆయనగారు అలా అధర్మంగా భూముల్ని ప్రసాదంగా అరచేతిలో వేసుకుని నాకేసిన సంగతి తెలీలేదంట్రా నీకు? ఆయన మీద విచారణ సైతం జరిగి తప్పు వెలికి వచ్చినా, బర్తరఫ్‌చేయకపోగా నివేదికను కూడా పైకి రాకుండా కాపాడుతున్న అధినేత మాటల్లో లొసుగుల లోతెంతో తెలుసుకోవద్దురా నువ్వు?''

''అవునండోయ్‌... మీరు చెబుతుంటే ఇట్టాంటోళ్లా మన ఏలికలని అసహ్యమేస్తోందండి...''

''కంత్రీ మంత్రుల కహానీలు ఇక్కడితో అయిపోలేదొరేయ్‌. పురపాలనలో రెపరెపలాడుతున్న మరో సచివుడు, ఆయన సతీమణి కలిసి ఆదిలో చేసిన ఉద్యోగంలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసు సంగతి మర్చిపోగలమంట్రా? పరిశోధన చేసిన సీబీఐ మీదనే ఎదురు కేసు పెట్టి కాలయాపన చేశాక, విషయం సుప్రీం కోర్టు దాకా డేకి కేసు సరైనదేనని తేలినా... మరి ఆ మంత్రివర్యులపై చర్యలు లేవు సరికదా, ఆయనకు మరింత మంచి శాఖ కట్టబెట్టిన నీ పాలకుడి నాలిక పెట్టే మెలికలెలాంటివో గ్రహించొద్దురా నువ్వు?''

''నాకంత తెలివేడిస్తే ఇంకేమండీ? ఇన్ని కథలున్నాయన్నమాట మన నెత్తిన కూర్చున్న నేతల గురించి?''

''కథలు కాదురా పురాణాలు. అవినీతి  ఇతిహాసాలు. ఇంకా చెప్పాలంటే పౌరులకు సరఫరాల సంగతి చూసుకునే మరో మంత్రిగారు కారెక్కి కోట్ల విలువైన భూములను చుట్టబెట్టి బుసలు కొట్టి కాటేసి కాజేశారని బయటకు పొక్కినా మరి, నువ్వంటున్న దేవుడిలాంటి నీ నాయకుడు కిమ్మనలేదేమని నీకు అనిపించకపోతే ఎలారా? ఇహ కార్మికుల బాగోగులు చేసే శాఖలో గుమ్మటంగా కూర్చున్న మరో అమాత్యుడి భార్య అక్రమ ఆదాయం పైనా, ఆమె ఆధ్వర్యంలో జరిగిన భూ కొనుగోళ్ల అవకతవకలపైనా నోటీసులు జారీ అయినా ఆ మంత్రివర్యులు నైతిక బాధ్యత మాటే మరిచి పదవిలో ఊరేగుతున్నారంటే దానర్థం ఏంటో తెలుసుకోవద్దురా నువ్వు?''

''ఛీ... నా మీద నాకే కంపరమెత్తుతోందండి. నేను నా ఎదవ పరిశీలనాను...''

''ఒరెర్రోడా... నిన్ను నువ్వు తిట్టుకుందువుగాని కానీ, కాస్తాగు. ఇప్పుడు జల వనరుల్లో జలకాలాడుతున్న మరో మంత్రిగారి లేకి బుద్ధులెలాంటివో చెబితే నీ తల తిరిగిపోతుంది. ఓ యువకుడు చనిపోయినందుకు ప్రభుత్వం నుంచి అందిన అయిదు లక్షల సాయంలో సగానికి సగం తనకివ్వాలని ఆ పేదోళ్లను దేబిరించిన బాబు ఆయన. ఆ బాధితులు ఏకంగా  మీడియాతోనే మొరపెట్టుకున్న విషయం  బాహాటంగానే బయటకి వచ్చినా ఏమాత్రం తొణక్కుండా అంబరమెక్కి సంబరపడుతున్న ఘనుడాయన. మంత్రులే కాదురోయ్‌మీ పరగణా పాలకుడి బాబాయి హత్య కేసులో తీవ్రమైన నేరారోపణలు ఉన్న మరో ఎంపీ సంగతి కూడా కాలరెగరేసుకుని దర్జాగా ఊరేగుతున్నాడన్న సంగతి నువ్వు గుర్తించలేదట్రా? ఇంకా మాట్టాడితే నిన్ను, నీ రాష్ట్రాన్ని ఏలుతున్న నేతల కతలు కంపరం పుట్టిస్తాయి. ఇసుక ర్యాంపుల్లో కులాసాగా కుర్చీ వేసుకుని కూర్చుని అనధికార లావాదేవీలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకి చేరాల్సిన సొమ్ము దండుకునే వాళ్లు... ఏ సున్నపురాయికో అనుమతి తీసుకుని దాన్నడ్డం పెట్టుకుని గనుల్లో విలువైన ఖనిజాలు కొల్లగొడుతున్న కరోడాగాళ్లు... మద్యం సారా కాంట్రాక్టులు దక్కించుకుని నకిలీలు అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఘరానాగాళ్లు... అమాయకులైన గిరిజనుల చేత నయానా భయానా గంజాయి పంటలు వేయించి ఆ సరుకుని లోపాయికారీగా సరిహద్దులు దాటించి కోట్లకు పడగలెత్తుతున్న కలేజాగాళ్లు... పేదలకిచ్చే బియ్యాన్ని అదిలించి విదిలించి సేకరించి ఓడలకెత్తించి విదేశాలకు రవాణా చేస్తూ కాసులు పోగేసుకుంటున్న కక్కుర్తిగాళ్లు... ఇలా నిన్నేలుతున్న ఏలికల అవినీతి అక్రమ అన్యాయ దౌర్జన్య దురంతాల గురించి చెప్పుకుంటూ పోతే ఏళ్లకేళ్లు పడుతుందొరేయ్‌. నేతలే కాదురా... ఆళ్ల అధినేత అయిన నీ పరగణా పరిపాలకుడి మీదనే ఏకంగా ఉన్న 38 కేసుల నిగ్గు తేల్చడానికి కోర్టులు కిందా మీదా పడుతున్నాయని తెలుసా నీకు?''

''వార్నాయనో బుర్రలో భూకంపం వచ్చినట్టుందండి మీరు చెబుతున్న నిజాలు వింటుంటే. మరి ఇలాంటి మంత్రుల్ని, నేతల్ని చుట్టూతా ఉంచుకుని మా పాలకుడు అవినీతికి దూరంగా ఉండాలంటూ సిగ్గూ ఎగ్గూలేని చిలుక పలుకులు పలుకుతున్నాడని ఇప్పటికి అర్థమైంది గురూగారూ...''

''మరి ఇందాకా ఏమన్నావ్‌?''

''మా పాలకుడు దేవుడన్నానండి...''

''మరి ఇప్పుడేమంటావ్‌?''

''ఛీ... ఛీ... ఆడు దేవుడేంటండీ దరిద్రం. ప్రజల్ని పట్టి పీడిస్తున్న దెయ్యమండి. పరగణాను పీల్చి పిప్పి చేస్తున్న రాక్షసగణ నాయకుడండి. జనాన్నినమ్మించి నట్టేట ముంచుతున్న ఈయన మనసంతా అక్రమాల సంతేనండి. ఆయన గుండె లబ్ డబ్‌మని కాకుండా డబ్ డబ్ డబ్బుమనే కొట్టుకుంటోందండి. ఆడి తపనంతా తాడిత పీడిత ప్రజల్ని మరింతగా పీడించడమేనండి. పైకి కనిపించే వినయం నిజానికి పరిణతి చెందిన అరాచకానికి అద్దమండి. ఇహ... ఆ నవ్వుంది చూశారూ... ముసిముసిగా కాదండి, తేనె పూసిన కత్తిలాగా కసికసిగా ఉంటుందండి. ఇలా నా అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నానండి. ఆయ్‌!''

''సంతోషంరా. నీకొచ్చిన ఇంగితం నీ పరగణా ప్రజలకి కూడా వస్తే అదే చాలు. స్వర్ణయుగం వచ్చినట్టే. ఇక పోయిరా''

-సృజన

PUBLISHED ON 26.12.2022 JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి