"అనగనగా ఒక రాజుగారు..." అంటూ మొదలు
పెట్టారు గురువుగారు.
"ఓహో... ఇవాళ పాఠం కథతో మొదలు పెట్టారన్నమాట...
చెప్పండి గురూగారూ!" అన్నాడు శిష్యుడు ఉత్సాహంగా.
"ఒరే ఇది కథే కాదురా...ఇందులో ఓ పజిల్
కూడా ఉంది. దానికి నువ్వు సమాధానం చెప్పాలి..."
"ఏదో తిరకాసు పెట్టారన్నమాటే. సరే చెప్పండి
సార్..."
"ఆ అనగనగా
రాజుగారు సభ తీర్చి కూర్చునే వారు. ఆయన దగ్గరకు వచ్చే ప్రజలంతా సభకున్న ఎత్తయిన
ప్రధాన ద్వారం నుంచి లోపలికి ప్రవేశించి సమస్యలు విన్నవించుకునేవారు. ఏ సమస్య
విన్నా రాజుగారు వినేవారు కానీ ఆయన మొహంలో అసంతృప్తి కనిపిస్తూ ఉండేది. వినే సమస్య
గురించి కాకుండా రాజుగారు దేని గురించో ఆలోచిస్తున్నారని ఆయన ఆంతరంగిన ప్రధాన సలహాదారుడికి
అర్థం అయింది. రాజుగారి మనస్తత్వం బాగా తెలిసిన ఆ సలహాదారుడు ఓసారి రాజుగారు ఏకాంతంగా
ఉండగా చూసి... 'అయ్యా... సభలో తమరి మనసు మనసులో ఉండడం లేదని గమనించానండి.
తమరి చింతేమిటో చెబితే దాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తానండి...' అని అడిగాడు.
అప్పుడు రాజుగారు, 'సభలోకి వచ్చే ఆ ప్రధాన ద్వారాన్ని
ఎవరు నిర్మించారయ్యా? అది సరిగ్గా లేదు...' అన్నారు.
అర్థం పర్థం, సందర్భం లేని ఆ మాటకు సలహాదారుడు ముందు తెల్లబోయినా,
ఆ తర్వాత ఆలోచించి అసలు కిటుకు గ్రహించాడు.
'చిత్తం మహారాజా... ఆ సంగతి నాకు వదిలిపెట్టండి' అంటూ వంగి వంగి
దండం పెట్టి వెళ్లిపోయాడు.
అంతే. మర్నాడు రాజుగారు సభ తీర్చేసమయానికి
ప్రధాన ద్వారం కొత్తది ఉంది. అయితే ఈ ద్వారం అంతకు ముందు దాని కంటే సగానికి మాత్రమే
ఉంది. కొత్త ద్వారంలోంచి ప్రజలు రావడం మొదలైంది.
ఈ సారి రాజుగారి మొహంలో చిరునవ్వు వెలిగింది.
ఏంతో సంబర పడుతూ, నవ్వుకుంటూ సమస్యలు వినడం మొదలైంది... అదిరా కథ!
ప్రజల సమస్యల గురించి కంటే ద్వార బంధం గురించి
ఎందుకు రాజుగారు ఆలోచించారు? కొత్త ద్వారం పెట్టగానే ఎందుకు సంబరపడ్డారు? చెప్పు చూద్దాం..." అంటూ ముగించారు
గురువుగారు!
శిష్యుడు తలగొక్కున్నాడు. ఏమీ అర్థం కాలేదు. అయినా
ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు.
"ఆ... బహుళా ఆ ద్వారబంధం పాతదైపోయి ఉంటుంది.
అది ఎప్పుడైనా కూలిపోతే ప్రజల మీద పడుతుండేమోనని రాజుగారు కలవరపడిపోయి ఉంటారు.
అంతేనా గురూగారూ?"
"ఏడిశావ్! ఇన్నాళ్లూ నా దగ్గర రాజకీయ
పాఠాలు నేర్చుకుంటూ కూడా ఈ చిన్న విషయాన్ని గ్రహించకపోతే ఎలారా?"
"సార్... తిట్టకండి. ఆ రాజుగారి వ్యవహారం
నాకేమీ అర్థం కాలేదు. మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి..."
"ఓరెర్రోడా... ఆ రాజుగారి దృష్టి ఎప్పుడూ
ప్రజల మీద కానీ, వాళ్లు చెప్పే సమస్యల మీద కానీ లేదురా. ఎత్తుగా ఉన్న ద్వారం నుంచి నేరుగా
వచ్చి మాట్లాడుతుంటే ఆయనకి నచ్చేది కాదు. ఎందుకంటే ఆయనకి ఎక్కడలేని అహంకారం.
దానికి సాయం సింహాసనం మీద కూర్చునే సరికి అది మరింత పేట్రేగి పోయేది. ఈ పనికి మాలిన
ప్రజలంతా దర్జాగా నడుచుకుంటూ నా దగ్గరకి వస్తారా అని ఆలోచించేవాడు. అందుకే
ఆయనకా ద్వారబంధం నచ్చలేదు. ఆ సంగతే చెప్పేసరికి సలహాదారుడు ఇట్టే కిటుకు పట్టేశాడు.
ద్వారబంధం ఎత్తుని సగానికి తగ్గించాడు. దాంతో ఏమయింది? వచ్చేదెవరైనా
తల దించి, నడుము వంచి రావలసి వచ్చేది. దాంతో ఆ రాజుగారికి
అమందానంద మదానందం కలిగేది...అర్థమైందా?"
"వీడెక్కడి రాజండీ బాబూ... అందరూ తన
ముందు అణిగిమణిగి ఉండాలనే వింత,
విచిత్ర, అహంకార పూరిత మనస్తత్వమన్నమాట...
అసలిలాంటి దిక్కుమాలిన, దగుల్బాజీ రాజులెక్కడైనా ఉంటారాండీ?"
"ఎందుకుండర్రా... అలనాటి రాజులైనా, ఈనాటి పాలకులైనా అహంకారం తలకెక్కిన
వాళ్లు, అధికార దర్పంతో కళ్లు నెత్తికెక్కిన వాళ్లు ఇలాగే ప్రవర్తిస్తారు..."
"అయితే గురూగారూ! ఇంతకీ ఈ కథ నాకెందుకు
చెప్పినట్టు సార్... ఇందులో నేర్చుకోవలసిన పాఠం ఏంటండీ?"
"ఏరా... అన్నీ అరటి పండు వలిచి పెట్టినట్టు
నేనే చెప్పాలా? పాఠం సంగతి పక్కనబెట్టు. నువ్వే
గనక ఓ పరగణానికి రాజయ్యేవనుకో, ప్రజా సమస్యల్ని ఎలా
పరిష్కరిస్తావో అది చెప్పు ముందు..."
"ఆహా... ఆ ఊహే భలేగా ఉంది గురూగారూ! ఏముందండీ...
సమస్య గురించి వినగానే దాన్ని మూలాలేంటో ఆరా తీసి వెంటనే దాన్ని పరిష్కరించేస్తానండి.
అలా కొన్నాళ్లలో అసలు సమస్యలే లేకుండా చేసేస్తానండి..."
గురువుగారికి చిర్రెత్తుకొచ్చింది. కోపంతో కళ్లు
ఎర్రబడ్డాయి.
"ఓరి దరిద్రుడా! ఇదా ఇన్నాళ్లూ నా దగ్గర
పాఠాలు నేర్చుకున్న ఫలితం? ఇక నువ్వు రాజకీయాలకు పనికిరావని తేలిపోయింది కానీ, ఇంటికి పోయి దుప్పటి ముసుగెట్టుకుని నీ ఊహా రాజ్యంలో సమస్యల్ని పరిష్కరించుకో...
పోయిరా..."
దాంతో శిష్యుడు డంగైపోయాడు.
"బాబ్బాబు గురూగారూ! కోప్పడకండి. ఇంతకీ
ఏం చేయాలో కాస్త చెప్పండి..."
గురువుగారు తమాయించుకుని చెప్పారు... "ఓరమాయకుడా! సమస్యలన్నీ ఇట్టే తీర్చేస్తే మళ్లీ ఎలక్షన్ల నాటికి హామీలెక్కడుంటాయిరా సన్నాసీ...
ఆ సంగతి ఆలోచించవేం?"
"మరేం చేయాలి సార్?"
"నువ్వే పనిగట్టుకుని కొత్త సమస్యల్ని
సృష్టించాలి..."
"అయ్యబాబోయ్... ఇదేం పద్ధతి సార్...
మనమే సమస్యల్ని సృష్టించాలా?"
"అవున్రా పిచ్చి సన్నాసీ! నీకు ఆ తలతిక్క రాజుగారి కథ ఎందుకు చెప్పాననుకున్నావ్.
అందరూ నీ దగ్గర అణిగిమణిగి ఉండాలన్నా,
నీకు వంగి వంగి నమస్కారాలు పెట్టాలన్నా, అభం
శుభం తెలియని ప్రజల్లో నీ ప్రభ వెలిగిపోవాలన్నా, నువ్వేదో
తెగ కష్టపడిపోయి పని చేస్తున్నావన్న భ్రమ జనాల్లో కలిగించాలన్నా ఇలాగే చేయాలి.
ఉన్న సమస్యల్ని కూడా తెగ నానబెట్టాలి. చెప్పుకింద తేలుని తొక్కిపెట్టినట్టు ఉంచాలి.
కానీ వాటిని పరిష్కరించేస్తున్నట్టు నానా హడావుడీ, హంగామా
చేయాలి. అలా పబ్లిసిటీ చేసుకోవాలి. ఇదే ఇప్పటి ప్రజాస్వామ్య పాలనా పర్వంలో నయా
నయవంచక సూత్రం. అర్థమైందా?"
"ఆహా... అద్భతం సార్! పని చేయకపోయినా, చేసినట్టు కనిపించాలన్నమాట...
కానీ గురూగారూ, ఇలా చేసే
నంగనాచి నేతలు ఎక్కడైనా ఉన్నారంటారా?"
"నీ కళ్ల ముందే ఉన్నరు కదరా. సమకాలీన
పరిశీలన లేకపోతే ఎలా? నీ పరగణాలో జరుగుతున్న తంతునోసారి
కళ్లెట్టుకు చూడు. కొత్త సినిమా ఆడ్డంలేదూ? ఈ సినిమా కథ,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, చిత్రానువాదం, సంగీతం, ఎడిటింగ్,
కటింగ్... ఎవరు? పెద్ద పెద్ద హీరోలందరూ వరస కట్టి వచ్చి మొరపెట్టుకునే పరిస్థితిని కల్పించినదెవరు?
ఇది పనిగట్టుకుని సృష్టించిన సమస్యే కదా? మరి ఈ సమస్య పరిష్కారం వల్ల ఎంత ప్రచారం జరిగింది? ఎంత హంగామా నడించింది? పోనీ విషయం ఓ కొలిక్కి వచ్చిందా అంటే అదీ లేదు. ఎప్పుడొస్తుందో, ఎలా తేల్తుందో తెలీదు. ముందు సినిమా
హిట్టయిందా లేదా? అదీ నువ్వు నేర్చుకోవలసిన నంగనాచి తనం.
ఇక ఉద్యోగుల సంగతి చూడు. లక్షలాది మంది ఉద్యమించారు. రోడ్ల మీద పడి ధర్నాలు చేశారు.
వాళ్ల మీద ఆంక్షలు పెట్టారు. నిర్బంధం చేశారు. ఉద్యమాన్ని అణగదొక్కడానికి నానా మార్గాలూ వెతికారు. ఇంతకీ
వాళ్లని ఆ స్థాయికి తెచ్చిందెవరు? వాళ్ల డిమాండ్ల మీద నెలల తరబడి
సాగిన చర్చలు సరగా జరగలేదనేగా అర్థం? తీరా చేసి జీవోలో మరో లెక్కలు ఉండేలా చేసి గగ్గోలు పెట్టించిందెవరు? తిరిగి వాళ్లని తన దగ్గరకి రప్పించుకుని
ఉదారంగా వరాలిచ్చినట్టు పోజుకొట్టిందెవరు? పోనీ ఆ సమస్యయినా పూర్తిగా తీరిందా
అంటే అదీ అనుమానమే. కానీ ఎంత ప్రచారం? ఎంత హడావుడి?
ఇది కదరా నువ్వు నడవాల్సిన నక్కజిత్తుల మార్గం? పోనీ ప్రజల్ని వేధిస్తున్న సమస్యలేమైనా
పరిష్కారమయ్యాయా అంటే ఏవీ చూపించు? రహదారుల సమస్య అలాగే
ఉంది. నిరుద్యోగ సమస్యకి అతీగతీ లేదు. చదువుకుని కొలువులు వచ్చే దారిలేక రోడ్ల
మీదకి వస్తున్న వారిని కూడా పిలిపించుకుని చర్చలు జరపచ్చు కదా? రాజధానికి భూములిచ్చిన రైతులను
కూడా రప్పించుకుని వరాలివ్వ వచ్చు కదా? ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకి
కూడా సినీ హీరోలకి ఇచ్చినట్టు సమయం కేటాయించి పరిష్కరించవచ్చు కదా? కానీ అలా చేస్తే ప్రచారం,
హంగూ, ఆర్భాటం ఎలా కలుగుతాయి. తల్చుకుంటే ప్రతి
సమస్యనీ ఓ కొలిక్కి తీసుకురావచ్చు కదా? మరి అలా జరుగుతోందా?
లేదే? కాబట్టి నువ్వు ఇవన్నీ ఆకళింపు చేసుకుని, అర్థం చేసుకుని, వంటపట్టించుకుని, నేర్చుకుని... ఇలాంటి కపట, కనాకష్ట, కకావికల, కంగాళీ పాలనా విధానాలను నరనరానా ఎక్కించుకోవాలి.
అప్పుడే నువ్వొక నికార్సయిన నేతగా ఎదుగుతావు. తెలిసిందా? ఇక
పోయిరా!"
-సృజన
PUBLISHED ON 13.2.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి