బుధవారం, మార్చి 02, 2022

దండాలు మ‌హాప్ర‌భో...దండాలు!


 

ధిక్కార‌మును సైతునా...

అధికార ధిక్కార‌మును సైతునా...

ఎవ‌ర‌నుకుంటివి... ఏమ‌నుకుంటివి...

ఎంత‌టి వాడ‌ను నేన‌నుకుంటివి...

ఊరుకుందునా... ఊర‌క‌నుందునా...

ఊపిరి ఆపి ఊప‌కుందునా?

ఉక్కిరిబిక్కిరి సేయ‌కుందునా?

ధిక్కార‌మును సేతువా?

నా అధికార ధిక్కార‌మ‌నును సేతువా?

హ‌...హ్హ‌...హ్హ‌...హ్హా!

-అంటూ రాజుగారు అంతఃపురంలో గెంతులు వేస్తున్నారు. అధికారులు, అమాత్యులు, సేవ‌కులు, ప‌రిచారిక‌లు బిక్క‌చ‌చ్చిపోయి నోరెళ్ల‌బెట్టి చూస్తున్నారు.

ఇంత‌లో వార్తాహ‌రుడు విన‌యంగా వంగి వంగి వ‌చ్చాడు.

జ‌య‌ము జ‌య‌ము మ‌హారాజా... అన్నాడు, వంచిన త‌లెత్త‌కుండా.

రాజుగారు పిచ్చి గెంతులు ఆపి, “ఆ... ఏమిటి విశేషాలు వార్తాహ‌రా? మ‌న పాల‌న గురించి ప్ర‌జలు ఏమ‌నుకుంటున్నారు?”

కిక్కురుమ‌న‌డం లేదు మ‌హారాజా! కుక్కిన పేనుల మ‌ల్లే ప‌డి ఉన్నారు...

హ‌...హ్హ‌...హ్హ‌... బాగు బాగు... జ‌నుల జీవ‌నమెట్లు సాగుతున్న‌ది?”

బెరుకుగా... బెంగ‌గా... భేషుగ్గా ఉంది ప్ర‌భూ...

బ‌హు బాగు... అట్లే ఉండ‌వ‌లె... ఎవ‌రూ త‌ల‌లెగ‌రేయ‌డం లేదు క‌ద‌?”

ఎంత‌మాట ప్ర‌భూ! జ‌నం ఆకాశంలో మేఘాల‌ను, ప‌క్షుల‌ను కూడా చూడ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. కిమ్మ‌న‌కుండా వంచిన త‌ల ఎత్త‌కుండా త‌మ ప‌నులు తాము చేసుకుంటున్నారు... త‌ల ఎత్తిన‌చో ఎక్క‌డ శ్రీవారు ధిక్కార‌మ‌ని భావింతురోన‌ని వారి భ‌య‌ము... న‌డుము నెప్పి లేకున్న‌నూ వంగి వంగి న‌డుచుచున్నారు. లేనిచో త‌మ‌రు అవిధేయుల‌ని త‌ల‌చెద‌ర‌ని బెదురుచున్నారు...

ఆహా... ఆనంద‌మానంద‌ము... ప్ర‌జ‌ల‌ట్టే భ‌య‌భ‌క్తుల‌తో ఉండ‌వ‌లె... ఏమందువు?”

ఏమందును ప్ర‌భూ... త‌మ‌రంటే భ‌య‌మున్న‌ది కాని భ‌క్తి సంగ‌తి సందేహ‌మే ప్ర‌భూ...

ఆ... ప‌నికి మాలిన భక్తి మ‌న‌కెందుల‌కు? ఇంత‌కూ నీవొచ్చిన కార‌ణంబేమి? ఏకాంత ఆనంద నృత్య విన్యాస‌మున‌కు అంత‌రాయ‌ము క‌లిగించిన‌దెందుల‌కు?”

కార‌ణ‌మున్న‌ది ప్ర‌భూ... రాజ్య‌మున ఒక క‌ళాకారుడు క‌ల‌డు. ఆతండ‌న్న జ‌న సామాన్య‌ములో ఎన‌లేని అభిమాన‌ములున్న‌వి... ఆత‌డి క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌ములున్న ఎడ‌ల జ‌నం ఒడ‌లు మ‌రిచి పోటెత్తుదురు ప్రభూ...

అటుల‌నా? ఆ క‌ళాకారుడెటువంటి వాడు?”

ఝంఝూమారుత‌ములాంటి వాడు ప్ర‌భూ... ఆత‌డి మాట‌ల‌న్న జ‌నం చెవి కోసుకుందురు... ఆత‌డి ఆవేశ‌ము చూసి ఉప్పొంగిపోదురు...

అట్ల‌యిన ఆత‌డి ధ్యేయంబేమి?”

జ‌న‌చైత‌న్య‌మే ప్ర‌భూ... రాజ్య‌మున జ‌రుగు అవ‌క‌త‌వ‌క‌ల‌ను అత‌డు ప్ర‌శ్నించును... స‌మ‌స్య‌ల‌ను ఎలుగెత్తి చాటును... అరాచ‌క‌ముల ప‌ట్ల అప్ర‌మ‌త్తుల‌ను చేయును... పిడికిలి బిగించి పోరాడ‌మ‌ని పిలుపునిచ్చును... స్వ‌య‌ముగా స‌భ‌ల‌ను నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌ను ఉత్తేజితుల‌ను చేయును... వారి వెంట ఉండెద‌నంటూ తాను ముందుండి వారిని నడిపించును...

అంత‌టి ఘ‌నుడా? అట్ల‌యిన ప్ర‌మాద‌కారివ‌లె క‌నిపించుచున్నాడే? ఆత‌డి మాట‌లు ఆల‌కించి జ‌నం చైత‌న్య‌పూరితులైన‌చో మ‌న ఉనికికే భంగ‌ము వాటిల్లు అవ‌కాశ‌ము లేదందువా?”

త‌ప్ప‌క ఉన్న‌ట్లే ప్ర‌భూ... మ‌న రాజ్య‌మున ప‌లు స‌మ‌స్య‌ల‌ను అత‌డు ఇప్ప‌టికే ఎత్తి చూపినాడు... ప్ర‌జ‌ల‌కు కార్యాచ‌ర‌ణ‌మును కూడా సూచించినాడు...

ఏమా స‌మ‌స్య‌లు? ఏమా కార్యాచ‌ర‌ణ‌ములు?”

మ‌న రాజ్య‌మున గుర్ర‌ములు ప‌రెగెత్తుట‌కు సైత‌ము భ‌య‌ప‌డున‌టుల త‌యార‌యిన ర‌హదారుల గురించి జ‌న‌మును జాగృతుల‌ను చేసినాడు... ఆత‌డి సూచ‌న‌ల‌ను అనుస‌రించి జ‌నం ఎక్క‌డిక‌క్క‌డ ర‌హ‌దారుల చిత్ర‌ముల‌ను ల‌క్ష‌ల కొల‌ది సేక‌రించి, వాటి దుస్థితి గురించి అనిత‌ర సాధ్య‌మైన ప్ర‌చార‌మును చేసినారు... వ‌లలు ప‌ట్టుకుని చేప‌ల వేట‌కు పోవుట‌యే కానీ తామే స‌మ‌స్య‌ల వ‌ల‌లో విల‌విల‌లాడుతున్నామ‌నే సంగ‌తి ప‌ట్ట‌ని మ‌త్స్య‌కారులను ఏకం చేసి వారిని సంఘ‌టిత‌ము చేసినాడు... వారి ఉపాధికి గండి కొట్టు త‌మ‌రి శాస‌న‌ము ప‌ట్ల విముఖ‌త‌ను ప్రోది చేసినాడు... వారిని పోరాట బాట ప‌ట్టించినాడు. శ్రీవారి నిష్క్రియాప‌రత్వ‌మును అడుగడుగునా ఎండ‌గ‌డుతున్నాడు... త‌మ‌రి పాల‌నా విధాన‌ముల‌లో లోప‌ముల‌ను వెలుగులోకి ఈడ్చుచున్నాడు... ప్ర‌భువుల అనిత‌ర సాధ్య‌మైన ప‌రిపాల‌న‌లో క‌ర్ష‌కులు, కార్మికులు, బ‌డుగులు, సామాన్యులు ఆఖ‌రికి ఉద్యోగులు సైతం ఎలా కునారిల్లుతున్నారో, ఎలా అణ‌గారిపోతున్నారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపిస్తున్నాడు మ‌హ‌ప్ర‌భో! త‌మ‌రి హ‌యాములో దొంగ‌లు, దోపిడీదారులు, దుండ‌గులు, దౌర్జ‌న్య‌కారులు ఎలా ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను భంగ ప‌రుస్తున్నారో ఎప్ప‌టిక‌ప్పుడు తేట‌తెల్ల‌ము చేయుచున్నాడు ప్ర‌భూ. మీ చ‌ల్ల‌ని నీడ‌న‌, మీ అండ‌న ప్ర‌జావ్య‌తిరేక శ‌క్తులు ఎలా ఏక‌మై, అనేక‌మై పెచ్చ‌రిల్లుచున్న‌వో విశ‌దీక‌రించుచున్నాడు. ఇటుల చెప్పుకుంటూ పోయిన ఆ క‌ళాకారుడి చేత‌ల జాబితా చేంతాడు క‌ట్టంతగా మారుతుంది మ‌హారాజా!

ఔరా... ఎంతటి ధిక్కార‌మెంత‌టి కండ‌కావ‌ర‌మెంత‌టి తెంప‌రితన‌మెంత‌టి తెగువ‌? అయిన అత‌డి మూల‌ముల‌ను దెబ్బ‌తీయ‌వ‌లె. ఆత‌డి క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను అడ్డుకొన‌వ‌లె. ఎవ‌రెక్క‌డ‌? ఆ కళాకారుడి చిత్ర‌విచిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగు ప్ర‌దేశ‌ముల‌నెల్ల ఆక్ర‌మించుకొనుడు. ఆయా ప్ర‌దేశాల‌లో అప‌రిమిత ఆంక్ష‌ల‌ను విధించుడు. అందుకొర‌కు మ‌న యంత్రాంగ‌మంత‌టినీ మోహ‌రించుడు. ఆత‌డి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు జ‌నం రాకుండ చేయుడు. అవ‌స‌ర‌మైతే మొత్తం క‌ళా ప‌రిశ్ర‌మ‌నే చిత్ర‌హింస‌ల‌కు గురిచేయుడు. క‌ళాకారుల సంఘ‌మునే క‌కావిక‌లు చేయుడు. హ‌...హ్హ‌...హ్హ‌... విజృంభించుడు!

మ‌న్నించండి ప్ర‌భూ! నాదొక విన్న‌పం. అట్లు చేసిన ఎడ‌ల ప్ర‌జ‌ల‌వినోద‌మున‌కు విఘ్న‌ము క‌లిగించిన‌వార‌గుదురేమో ఒక‌ప‌రి ఆలోచించ‌మ‌ని మ‌న‌వి...

ఆ మాట‌కి మ‌హారాజులో ఆవేశ‌ము పెల్లుబికింది. ఒక్కసారి విక‌టాట్ట‌హాస‌ము చేసి విరుచుకుప‌డ్డారు.

ఏమిటి ఆలోచించేది? నా పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు వినోద‌ము లేక‌పోయిన‌నూ ప‌ర‌వాలేదు. నా పాల‌నే ఆ వినోద‌మును అందించును. వినోద‌మున‌కు దూర‌మై ప్ర‌జ‌లు విషాద‌భ‌రితులైన‌ను నాకు స‌మ్మ‌త‌మే. నేనేంటో, నా అప్ర‌తిహ‌త అప‌రిమిత అరాచ‌క పాల‌నా తీరుతెన్నులు ఎలాంటివో ఇంకా తెలియ‌లేదా? నా ప‌రిపాల‌న తీరుతెన్నుల‌లో ఎన్ని అవ‌క‌త‌వ‌కలున్న‌నూ స‌రే... వాటిని ప్ర‌శ్నించే సాహ‌స‌ము ఎవ‌రూ చేయ‌రాదని క‌దా, నా అభిమ‌త‌ము. అట్లు చేసిన సొంత ప్ర‌జాప్ర‌తినిధినే బంధించి, చీక‌టి కొట్లో ప‌డేసి మక్కెలిర‌గ‌ద‌న్నిన వైన‌ము మ‌రచితిరా? నా ముందు రాజ్య‌మును వెల‌గ‌బెట్టిన వాడు నిర్మించిన ఖ‌రీదైన భ‌వ‌న స‌ముదాయ‌ముల‌ను సైత‌ము ప‌డ‌గొట్టి ధ్వంస‌ము చేసిన దురాగ‌త‌ముల‌ను విస్మ‌రించితిరా? ఆనాటి రాజ‌ధానినే నాశ‌న‌ము చేసిన సంగ‌తి గుర్తులేదా? ఆ రాజ‌ధానికి భూములిచ్చిన క‌ర్ష‌కుల త్యాగాన్నే కాల‌రాచిన నా అధికార క‌రాళ నృత్య విన్యాస‌మును తిల‌కించ‌లేదా? అదేమిట‌ని అడిగినంత‌మాత్రాన అమాయ‌కులపైన‌నూ చ‌ట్ట‌ములో ఏమూల‌నో దాగిన ఎక్కడెక్క‌డి కేసుల‌నో బ‌నాయించలేదా? ప‌్ర‌శ్నించిన వారిని త‌రిమిత‌రిమి కొట్టుటలేదా? వెంట‌ప‌డి వేటాడి వేధించుట లేదా? ఇదియే క‌దా నా పాల‌న తీరు? ఇదియే క‌దా నా అధికార వైచిత్రి? ఇంకా అర్థం కాలేదా? నా ముందు స‌ర్వులూ వంగి ఉండ‌వ‌లె. అణిగి ప్ర‌వ‌ర్తించ‌వ‌లె. అర్థ‌మైన‌దా? ఎనీ డౌట్స్‌?”

రాజుగారి అరివీర విజృంభ‌ణ‌కు అధికార గ‌ణం, ప‌రివార గ‌ణం గ‌డ‌గ‌డ వ‌ణికారు. అంద‌రూ క‌లిసి రాజుగారిని శాంతింపజేయ‌డానికి స్తోత్ర‌పాఠాలు అందుకున్నారు...

మ‌హాప్ర‌భో! శాంతించండి. మీ ఆగ్ర‌హావేశ కోప‌తాప విన్యాసాన్ని త‌ట్టుకోలేం.

క‌క్ష‌, కార్ప‌ణ్యాలు మీ ఉచ్చ్వాస‌నిశ్వాసాలు!

ప‌గ, ప్ర‌తీకారాలు మీ గుండె ల‌య విన్యాసాలు!

మీ సిర‌ల్లో అధికారం, మీ ధ‌మ‌నుల్లో అహంకారం ప్ర‌వ‌హిస్తున్నాయి!

మీ న‌ర‌న‌రాల్లో న‌య‌వంచ‌న‌బుస‌లుకొడుతోంది!

మీ క‌ణ‌క‌ణంలో కార్ప‌ణ్యం క‌ణ‌క‌ణ‌లాడుతోంది!

మీ వ్య‌వ‌హారాల్లో ద‌ర్పం దారుణంగా ప్ర‌స్ఫుట‌మ‌వుతోంది!

మీ తీరు అనిత‌ర సాధ్యం! మీ శైలి అన‌నుస‌ర‌ణీయం!

దండాలు మ‌హ‌ప్ర‌భో... దండాలు!

అంటూ అంద‌రూ సాగిల‌ప‌డ్డారు.

-సృజ‌న‌

PUBLISHED ON 26.2.2022 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి