మంగళవారం, ఏప్రిల్ 05, 2022

రాజ‌కీయ క‌బంధుడి కథ‌!

 



"త్రేతాయుగంలో కబంధుడు అనే రాక్ష‌సుడు ఉండేవాడ్రా..."

అంటూ మొద‌లు పెట్టారు గురువుగారు.

"అబ్బ‌... రాక్ష‌సుల క‌థ‌లంటే నాకు భ‌లే ఇష్టం గురూగారూ! చిన్న‌ప్పుడు మా నాయ‌న‌మ్మ చెబుతుండేది..."

అంటూ సంబ‌ర‌ప‌డ్డాడు శిష్యుడు.

గురువుగారు కొన‌సాగించారు... "ఆ క‌బంధుడికి క‌ళ్లు లేవు.  కాళ్లు లేవు. పొట్ట‌లోనే నోరుండేది..."

"అయ్యో పాపం... క‌ద‌ల‌లేని క‌బోది రాక్ష‌సుడ‌న్న‌మాట‌. మ‌రి పాపం తిండి ఎలా దొరికేదండీ వాడికి..."

"దానికి ఢోకా ఏమీ లేదురా... ఆ క‌బంధుడికి చాలా పొడ‌వైన, బ‌ల‌మైన చేతులుండేవి... వాడు ఓ చేతిని ఆ మూల‌కి, మ‌రో చేతిని ఈ మూల‌కి చాపి, వాటితో తడిమే వాడు. చేతుల‌కు ఏది దొరికినా దాన్ని తీసుకొచ్చి నోట్లో ప‌డేసుకునేవాడు. వాడి గుప్పెట్లో  ప‌డిన జంతువేదైనా స‌రే, అదెంత బ‌ల‌మైనదైనా స‌రే... త‌ప్పించుకోలేద‌న్న‌మాటే. అందుకే వాడి చేతుల్ని క‌బంధ హ‌స్తాలు అనేవారు..."

"ఆ... ఈ మాట విన్నాను గురూగారూ! చేతికి చిక్కిన‌దాన్ని వ‌ద‌ల‌కుండా సొంతం చేసుకునే వాడిని ఈ రాక్ష‌సుడితోనే పోలుస్తారు క‌దండీ..."

"అవును... ఆ రాక్ష‌సుడి నుంచి నువ్వు నేర్చుకోవ‌ల‌సింది చాలా ఉందిరా... అందుకే వాడి క‌థ చెప్పాను..."

"ఊరుకోండి గురూగారూ! ఏదో మీ ద‌గ్గ‌ర కొన్ని స‌మ‌కాలీన రాజ‌కీయ పాఠాలు నేర్చుకుందామ‌ని నేను వ‌స్తుంటే, ఎప్పుడో యుగాల నాటి రాక్ష‌సుడి క‌థ చెప్పి నేర్చుకోమంటారూ... వీడి నుంచి నేర్చుకోవ‌ల‌సింది ఏముంటుంది చెప్పండి..."

"భ‌లేవాడివిరా... ఆ నాటి ఆ రాక్షసుడు ఈనాటికీ నీలాంటి వాళ్ల‌కి రోల్‌మోడ‌లేరా బ‌డుద్ధాయ్‌! ఆ కబంధ హ‌స్తాల లాఘ‌వం నేర్చుకున్నావంటే ఇక నీకు రాజ‌కీయాల్లో ఢోకా ఉండ‌దు. నిన్నెదిరించే వాడు కానీ, నీకెదురు చెప్పేవాడు కానీ ఉండ‌రు..."

"ఎక్క‌డి త్రేతాయుగం? ఎక్క‌డి మ‌న న‌వీన ఆధునిక కాలం గురూగారూ! ఎంత ఆలోచించినా వాడి నుంచి నేర్చుకోవ‌ల‌సిందేంటో అర్థం కావ‌డం లేదండి... "

"స‌రే చెప్తాను రాసుకో. చేతికి చిక్కిందాన్ని వ‌ద‌ల‌క‌పోవ‌డం. పట్టిన ప‌ట్టు విడ‌వ‌క పోవ‌డం. ఎవ‌రెంత గింజుకున్నా నీ ప‌ద్ధ‌తే నీది కానీ, ఎవ‌రి మాటా విన‌క‌పోవ‌డం. గుడ్డిగా నీ పంథాలో నువ్వు దూసుకుపోవ‌డం... మొండి బ‌లంతో, రాక్ష‌స సంక‌ల్పంతో వ్య‌వ‌హ‌రించ‌డం... ఇవ‌న్నీ న‌యా రాజ‌కీయ నంగ‌నాచి వ్య‌వ‌హారాల్లో అనుస‌రించాల్సిన పాఠాలేరా... ఇవ‌న్నీ ఒంట‌బ‌ట్టించుకున్నావ‌నుకో... నిన్నిక ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. నువ్వొక నికార్సయిన నీచ రాజ‌కీయ నేత‌గా రాటుదేలుతావు..."

"అబ్బ‌... అదే క‌దండీ నా క‌ల‌?  కానీ గురూగారూ, నాదో చిన్న సందేహమండి.  మ‌న స‌మ‌కాలీన రాజ‌కీయ రంగంలో ఇలా వీరంగం ఆడే నేత‌లెవ‌రైనా ఉన్నారంటారా?"

"ఎందుకుండ‌రురా... క‌ళ్లెట్టుకు ప‌రిశీలించాలే కానీ, క‌ట్టెదుటే క‌నిపిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు నీ ప‌ర‌గ‌ణాలో అన్ని వ్య‌వ‌స్థ‌ల్నీ గుప్పెట్లో పెట్టుకుని న‌లిపేస్తున్న న‌యా క‌బంధుడు లేడూ? ఆ బ‌లీయ హ‌స్తాల్లో చిక్కుకుని ఐఏఎస్‌, పోలీస్ అధికారులే  గిల‌గిల‌లాడిపోవ‌డం లేదూ?"

"ఆ...అవునండోయ్‌! మొన్న‌టికి మొన్న ఏకంగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించిందండి. వాళ్లంద‌రూ చేతులు క‌ట్టుకుని క్ష‌మాప‌ణ‌లు వేడుకుంటే, ఆ శిక్ష‌ను సామాజిక సేవ‌గా మార్చిందండి... పాపం, ఎంత సిగ్గుచేటండీ? ఎంత నామ‌ర్దా అండీ? ఎంత త‌ల‌వంపులండీ?  చూస్తే జాలేసిందండి... అయినా గురూగారూ! అంతంత గొప్ప చ‌దువులు చ‌దివి, అంతంత మంచి హోదాల్లో ఉండీ, ఇలాంటి ప‌రిస్థితి ఎందుకండీ తెచ్చుకున్నారు?"

"ఎందుకంటే వాళ్లంతా అధికార‌, దురంహంకార‌, రాజ‌కీయ క‌బంధ హ‌స్తాల్లో చిక్కుకున్నార్రా మ‌రి. ఆ హ‌స్తాలు అడ్డ‌గోలుగా ఎలా ఆడిస్తే అలా ఆడే తోలు బొమ్మ‌ల్లా మారిపోయార్రా మ‌రి. నిజానికి వాళ్లంతా ఇప్పుడు వాళ్లంతా 'ఐఏఎస్‌'లు కార్రా... 'అయ్యా... ఎస్‌'లు. అధినేత ఏం చెబితా దానికి 'ఎస్‌' అంటూ తైత‌క్క‌లాడిన వాళ్లు. ఒక వేళ వాళ్లు అధినేత ఆదేశాలు పాటించ‌లేద‌నుకో. అప్పుడు పాపం వాళ్లు 'అయ్యో...ఎస్‌'లు అయిపోతారు. అదీ వాళ్ల భ‌యం..."

"ఎందుకండీ అంత భ‌య‌ప‌డ్డం?  రాజ‌కీయ నేత‌లు వ‌స్తారు, పోతారు. మ‌హా అయితే ముఖ్య‌మంత్రులు ఐదేళ్లో, ప‌దేళ్లో ఉంటారు కానీ, వీళ్లు మాత్రం క‌నీసం మూడు ద‌శాబ్దాల పాటు ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌గ‌లిగే కీల‌కమైన అత్యున్న‌త హోదాల్లో ఉంటారు క‌దండీ? అయినా ఇలాటి సిగ్గు మాలిన ప‌రిస్థితిని ఎందుకండీ  తెచ్చుకోవ‌డం?"

"ఒరే వాళ్లు ఎలా ఉండ‌కూడ‌దో కాదురా నువ్వు నేర్చుకోవ‌ల‌సింది, వాళ్ల‌ని గుప్పెట్టో పెట్టుకుని గిజ‌గిజ‌లాడేలా చేస్తూ నువ్వు ఎలా చెబితే అలా తైత‌క్క‌లాడేలా చేసుకోగ‌లిగే నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. ఐఏఎస్‌లైనా, ఐపీఎస్‌లైనా నీ మాట‌కి 'ఎస్' అని త‌ప్ప మ‌రో మాట చెప్ప‌డానికి వీలులేనంత‌గా లొంగ‌దీసుకునే నీచ దురంహంకార విధానాల‌ని ఒంట ప‌ట్టించుకోవాలి. రాజ్యాంగ ర‌క్ష‌ణ‌లో ఉన్న అఖిల భార‌త స‌ర్వీసుల శ్రేణిలో ఉన్నా... నిర్వ‌హ‌ణ నియంత్ర‌ణ నిబంధ‌న‌లు, ప‌రిమితులు, సాధ్యాసాధ్యాలు, విధివిధానాలు, ఆలోచ‌న‌ల అమ‌లు తీరుతెన్నులు కూలంక‌షంగా తెలిసిన అధికారులైనా... వాళ్ల‌ని న‌యానో, భ‌యానో నీ దారికి తెచ్చుకుని నీ నోటిమాటే జీవోగా, నీ కంటి సైగే ఆదేశంగా, నువ్వు చెప్పిందే వేదంగా, నీ ఆలోచ‌నే శాస‌నంగా భావించి 'జీ హుజూర్' అంటూ పాటించేంత‌గా అధికార యంత్రాంగం మొత్తాన్ని క‌బంధ హ‌స్తాల్లో పెట్టుకుని శాసించే రాజ‌కీయ వ్య‌వ‌హార శైలిని అల‌వ‌ర‌చుకోవాలి.  ఆఖ‌రికి వాళ్ల‌ని న్యాయ‌స్థానాలు ఇచ్చే ఆదేశాల‌ను సైతం పాటించ‌న‌క్క‌ర‌లేద‌నేంత బాధ్య‌తా ర‌హితంగా త‌యారు చేసి, నీకు అనుకూలంగా, అనుగుణంగా మార్చుకునేంత‌గా ఎలా ఏమార్చాలో ఔపోస‌న ప‌ట్టాలి. అర్థ‌మైందా?"

"అర్థ‌మైందికానీ గురూగారూ, ఒక‌వేళ న్యాయ‌స్థానం అధికారుల‌కు కాకుండా ఏకంగా ప్ర‌భుత్వానికే ఆదేశాలిచ్చింద‌నుకోండి, అప్పుడేం చేయాలండీ?"

"ఇది కూడా నీ ప‌ర‌గ‌ణాలో కొత్త కాదు క‌ద‌రా... రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ ఛిన్నాభిన్న‌మైనా, ప్ర‌జ‌లు నానా పాట్లూ ప‌డుతున్నా, ఓటు రాజ‌కీయాలే ప‌ర‌మావ‌ధిగా, అధికార‌మే అంతిమ ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ ముందుకు సాగుతున్న న‌యా క‌బంధుడి ప‌రిపాల‌న‌లో అస్త‌వ్య‌స్త, అవ్య‌వ‌స్థ‌ తీరుతెన్నుల‌ను న్యాయ‌స్థానాలు ఇప్ప‌టికి వెయ్యికి పైగా సంద‌ర్భాల్లో త‌ప్పుప‌ట్టాయి. మంద‌లించాయి. మొట్టికాయ‌లు వేశాయి. ఏమైంది?  మొండివాడు రాజుక‌న్నాబ‌ల‌వంతుడంటారు కానీ రాజే మొండివాడైతే ఇక చెప్పేదేముంది?  నిన్న‌గాక మొన్న రాజ‌ధానిని అభివృద్ధి ప‌ర‌చ‌మ‌ని న్యాయ‌స్థానం చాలా స్పష్టంగా ఆదేశించిందా?  విస్ప‌ష్ట‌మైన కాల‌ప‌రిమితి కూడా విధించిందా?  కానీ ఒక్క అడుగైనా ముందుకు ప‌డిందా?  లేదు స‌రిక‌దా, ఆ ఆదేశాల‌ను త‌ల ఒగ్గిన‌ట్టు న‌టిస్తూనే, అవి ఆచ‌ర‌ణ‌కు సాధ్యం కావన్న‌ట్టుగా న‌క్క విన‌యంతో అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌లేదూ? ఆ అఫిడవిట్‌లో ఒక్క విష‌య‌మైనా స‌హేతుకంగా ఉందా?  టీచ‌ర్ రేప‌టి లోగా హోంవ‌ర్క్ చేయ‌రా అని చెబితే... పెన్ను క్యాప్ తీయ‌డానికే రెండు రోజులు ప‌డుతుంద‌నీ... పెన్నులో ఇంకు పోయ‌డానికి మూడు రోజులు ప‌డుతుంద‌నీ... పుస్త‌కంలో పేజీ తిప్ప‌డానికి ఆరు రోజులు ప‌డుతుంద‌నీ... ఇక రాయ‌డానికి ప‌దిరోజులైనా స‌రిపోద‌నీ త‌ల‌తిక్క జ‌వాబు చెప్పే మొద్ద‌బ్బాయి వ్య‌వ‌హారంలాగా లేదూ?  రాజ‌ధానిని అభివృద్ధి చేయ‌డానికి ఐదేళ్లు కావాల‌ని అఫిడ‌విట్‌లో చెప్పారంటే అంత‌కు మించిన నిర్ల‌క్ష్యం కానీ, మొండిత‌నం కానీ వేరే ఉంటాయా చెప్పు?"

"అవునండోయ్‌... ఈ కబంధుడి విధానాలు క‌నీ వినీ ఎర‌గనివంటే ఇట్టే న‌మ్మొచ్చండి. ఈ జ‌గ‌మొండి అధినేత క‌బంధ హ‌స్తాల్లో వ్య‌వ‌స్థ‌లే కాదండి... రాష్ట్రం మొత్తం విల‌విల‌లాడిపోతోందండి. కానీ గురూగారూ! ఆనాటి త్రేతాయుగం నాటి క‌బంధుడి క‌థ స‌గ‌మే చెప్పారండి. అప్పుడు వాడెలా అంత‌మ‌య్యాడండీ?"

 "వాడు ఏకంగా రామ‌ల‌క్ష్మ‌ణుల‌నే ప‌ట్టుకుని అమాంతం మింగ‌బోయాడు. అప్పుడు వాళ్లిద్ద‌రూ క‌లిసి వాడి చేతులు న‌రికేసి అంతం చేశారు..."

"బాగుందండీ క‌థ‌. కానీ మ‌రి ఈ క‌బంధుడి మాటేంటండీ?"

"ఏముందిరా? ఈ క‌బంధుడికి ఇంత‌లేసి పొడ‌వైన హ‌స్తాల్ని ఇచ్చిందెవ‌రు? ఓట‌ర్లే క‌దా? ఆ ఓట‌ర్లే బాగా ఆలోచించుకుని... త‌మ బ‌తుకుల్ని గుప్పెట్లో పెట్టుకుని న‌లిపేస్తున్న ఆ కబంధ హ‌స్తాల‌ను ఓటే ఆయుధంగా న‌రికేయాలి. అంతే!"

-సృజ‌న‌

PUBLISHED ON  5.4.2022 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి