కాశీ మజిలీ యాత్రలు చేస్తున్న గురువుగారు శిష్యుడితో
సహా ఆంధ్ర రాజ్యంలోకి ప్రవేశించారు. గురువుగారు గుడి అరుగు మీద సేద తీరుతుంటే శిష్యుడు
ఊళ్లోకి బయల్దేరాడు. ఎన్నోవిచిత్రాలు కనిపించాయి. మరెన్నో వింతలు వినిపించాయి. తిరిగి
వచ్చి అవన్నీ గురువుగారికి నివేదించాడు.
******
పనిమనిషి రాగానే ఇంటామె నెమ్మదిగా చెప్పింది.
"నీ పని అస్సలు బాగుండడం లేదమ్మా...
అంట్లు చూస్తే ఒక్కటి వదలదు. గిన్నెలన్నీ జిడ్డు ముద్దలే. మళ్లీ నేను తోముకోవలసి
వస్తోంది. గదులు ఊడిస్తే ఎక్కడి దుమ్ము అక్కడే. ఎక్కడా చీపురు కలవదు. ఇదేం పని?"
పనిమనిషి ఊరుకోలేదు.
"ఎంత చేసినా మీరిలాగే అంటారు. నేను చేసిన
పని మీకు కనిపించడం లేదు. దౌర్భాగ్యపు గిన్నెలు. దౌర్భాగ్యపు గదులు. మీకిక్కడ
మరో పనిమనిషి దొరకదు. చచ్చినట్టు నన్ను భరించాల్సిందే. ఇదిగో...మీకిదే చెబుతున్నా.
మీరు నా వెంట్రుకను కూడా పీకలేరు..."
పనిమనిషి జవాబుకి ఇంటామె బిక్కచచ్చిపోయింది.
ఏం చేయాలో తోచక అవాక్కయి అలా నుంచుండి పోయింది!
****
హోంవర్క్ చేసిన స్టూడెంట్‌ను దగ్గరకు పిలిచారు
టీచర్. పుస్తకం చూపిస్తూ చెప్పారు.
"ఏంట్రా ఈ లెక్కలు చేయడం? అన్నీ తప్పులు తడకలే. కూడమంటే
తీసేశావు. తీసేయమంటే కలిపేశావు. గుణించమంటే భాగించావు. భాగించమంటే గుణించావు. ఎందుకిలా
చేశావు?"
ఆ విద్యార్థి తలెగరేశాడు. ఆపై నెత్తి మీద చెయ్యి
పెట్టుకుని తలలోంచి ఓ వెంట్రుకను తీసి చూపించాడు.
టీచర్ తెల్లబోయి, "ఇదేంటి?" అన్నాడు.
"నా వెంట్రుక. మీరు నా వెంట్రుకను కూడా
పీకలేరు. నాకిలాగే లెక్కలు వచ్చు. కూడితేనేం? తీసేస్తేనేం? గుణిస్తేనేం? భాగిస్తేనేం? అన్నీ అంకెలే కదా, ఏమైంది? స‌్కూలుకి ఫీజు కట్టేశాక ఇక నన్ను మీరేం చేయలేరు.
కావాలంటే మీరు ఆ గుర్తులేవో మార్చుకోండి. మార్కులేసుకోండి. దౌర్భాగ్యపు తరగతులు.
దౌర్భాగ్యపు చదువులు..." అంటూ ఆ విద్యార్థి వెళ్లిపోయాడు.
టీచర్ నోట మాట లేదు!
******
భోజనమయ్యాక భర్త భార్యను దగ్గరకు పిలిచాడు.
"ఇదిగో చూడు. నీ వంటేమీ బాగుండడం లేదోయ్! కూర మాడిపోయింది.
చారులో ఉప్పులేదు. పప్పు ఉడకలేదు. అన్నం చిమిడిపోయింది. మజ్జిగ పులిసిపోయింది. ఇలా
ఉంటే ఎలా తినగలం చెప్పు? వంట ఎప్పుడు నేర్చుకుంటావ్?"
అంటూ చెప్పుకొచ్చాడు.
భార్య ఏమాత్రం పశ్చాత్తాపపడలేదు సరికదా, భర్త మీద విరుచుకుపడింది.
"ఎప్పుడు చూడండి. నాకు వంకలు పెట్టడమే
మీకు సరిపోతుంది. రోజూ ఎంత కష్టపడుతున్నానో మీకేం పట్టదు. దౌర్భాగ్యపు కూరలు.
దౌర్భాగ్యపు సరుకులు. నేనేం చేసేది?
ఒక్క రోజైనా వంట బాగుందని చెప్పారా? మీరెన్ని అనండి, నాకేం బాధ లేదు. నేనేం పట్టించుకోను. మీరు నా జడలో ఒక్క వెంట్రుకను కూడా
పీకలేరు..." అంటూ జడ విప్పి ఓ వెంట్రుకను ఊడబెరికి భర్త
చేతిలో పెట్టి విసవిసా వెళ్లిపోయింది.
భర్త అవాక్కైపోయాడు.
****
ఆఫీసర్ వస్తూనే గుమాస్తాను పిలిపించాడు.
"ఏంటయ్యా... ఈ ఫైల్ ఇలా టైప్ చేశావు? అన్నీ స్పెల్లింగ్ మిస్టేకులే.
పైవాళ్లు చూస్తే ఏమనుకుంటారు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను.
నీ పని తీరు ఏమీ బాగోలేదు. ఓ డిక్టేషన్ సరిగా తీసుకోలేవు. ఓ నోట్ సరిగా రాయలేవు.
ఓ ఫైలింగ్ సరిగా చేయలేవు. కాస్త జాగ్రత్తగా చేయాలయ్యా..." అన్నాడు.
గుమాస్తా అదోలా మొహం పెట్టి నిర్లక్ష్యంగా చెప్పాడు.
"ఏంటండీ మీరు నాకు చెప్పేది? అన్ని అక్షరాలు టైప్ చేసేప్పుడు
కొన్ని అక్షరాలు తప్పు పడవచ్చు. దానికే ఇంత గోలా? వైట్నర్‌తో అద్దేస్తే సరి. దానికి
ఓ ఆయాస పడతారెందుకు? దౌర్భాగ్యపు ఆఫీసు. దౌర్భాగ్యపు పని. మీరు నన్నేం చేయలేరని గుర్తు పెట్టుకోండి. ఆఖరికి నా వెంట్రుకను కూడా పీకలేరని
తెలుసుకోండి..." అంటూ తలలోంచి ఓ వెంట్రుకను తీసి బాస్
టేబుల్ మీద పెట్టి విసురుగా వెళ్లిపోయాడు.
****
ఊర్లోని వింతలన్నీ చూసి వచ్చిన శిష్యుడు గురువుగారు
లేచాక తాను చూసిన సంగతులన్నీ చెప్పి, "ఇదేం వింత గురువుగారూ! నేనే రాజ్యంలోను
ఇలాంటి వింత సన్నివేశాలు చూడలేదు. చేసిన తప్పులు ఒప్పుకోకపోగా ఈ దబాయింపులేంటండీ? సిగ్గుపడి తలొంచుకోకపోగా ఎదురెట్టి బుకాయింపులేంటండీ?" అని అడిగాడు.
గురువుగారు ఓసారి కళ్లు మూసుకున్నారు. దివ్యదృష్టితో
అంతా గ్రహించారు. ఆపై గాల్లోకి చెయ్యి చాచి గుప్పెట మూశారు. ఏదో మంత్రం చదివి గుప్పెట
విప్పారు.
శిష్యుడు ఆత్రంగా తొంగి చూశాడు.
వెంట్రుక!
"ఈ వెంట్రుకేంటి గురూగారూ?"
గురవుగారు చిరునవ్వు నవ్వి చెప్పారు.
"ఈ వెంట్రుక అలాంటిలాంటిది కాదు నాయనా!
చాలా బిరుసైనది. ఇది మొలిచిన తల ఉంది చూశావూ? అది అంతకన్నా రాటు దేలినది. ఈ వెంట్రుక ఈ రాజ్యాన్ని
పాలించే అధినేతది నాయనా! ఆయన మొన్నకసారి ఒక సభలో దీన్ని అందరి ముందూ పీకి
చూపించాడు. అదే ఇది. అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్లు, పాలనాధికారంలో
ఉన్నవాళ్లు ఎలా ఉండకూడదో అలా ఆ అధినేత ఉంటాడు నాయనా! తనకు తాను తన పరిపాలన
చాలా గొప్పదనుకుంటాడు. తనకు తాను దిగివచ్చిన
నేతననుకుంటాడు. ఎవరైనా విమర్శ చేస్తే తట్టుకోలేడు. ప్రశ్నిస్తే భరించలేడు.
ఆరోపిస్తే సహించలేడు. ఆఖరికి ఓ చిన్న పొరపాటును చూపించినా నిగ్రహించుకోలేడు. అంతటి
అహంకారం తలకెక్కిన ఆ అధినేత బుర్రపై అధికార తైల మర్దనలో నిగ్గుదేలి నిగనిగలాడుతున్న
వెంట్రుక నాయనా ఇది! ఎదుటి వారిని వెంట్రుక ముక్కలా తీసిపారేయగలిగే ఆ వింత విచిత్ర
పాలకుడు తలెగరేసినప్పుడల్లా ఎగిరిపడిన వెంట్రుక నాయనా ఇది! యథా రాజా,
తథా ప్రజా అన్నట్టు ఆ అధినేత మాటలు విని, ఆ
పాలకుని ప్రసంగాలు చూసిన ప్రజలు ఆయన్నే అనుకరిస్తే ఏం జరుగుతుందో చవి చూపించే
సన్నివేశాలే నీ కళ్ల పడ్డాయి శిష్యా!
పని సరిగా చేయకపోగా ఆ సంగతి చెబితే కస్సుమనే
పనిమనిషని భరించగలమా చెప్పు? లెక్కలు తప్పు చేసి ఆ సంగతి టీచర్
చెబితే ధిక్కరించే విద్యార్థినిని ఏం చేయగలం? పెళ్లయిన దగ్గర్నుంచి వంట తగలేస్తూ
ఆ విషయం చెప్పిన భర్తనే తీసి పారేసే భార్యతో ఎలా వేగగలం? చేసే పని సరిగ్గా చేయకపోగా బాస్‌నే
ఎదిరించే గుమాస్తాలతో పనులెలా జరుగాతాయో ఆలోచించు? అచ్చం వీరిలాగే
ఉంటుంది నాయనా, ఈ రాజ్యాన్ని
పాలించే అధినేత తీరు. ఇతడు సింహాసనం ఎక్కినది మొదలు ఒక్క పని సరిగా చేసింది లేదు.
అన్నీ అవకతవక పనులే. అన్నీ అరకొర విధానాలే. ఇతడి పనుల ముందు నువ్వు ఇందాకా
చూసిన పనిమనిషే నయమనుకోవాలి నాయనా! ఇతడి పాలనలో నిధులన్నీ అణగారి పోగా అన్నీ
అప్పులే మిగిలాయి! ఈ అధినేత చూపించే అంకెలు, ఇందాకా నువ్వు చూసిన విద్యార్థి చేసిన
లెక్కల కన్నా అధ్వానం నాయనా! ఏవేవో పథకాలంటాడు. వాటి ద్వారా డబ్బులు ప్రజలకు
పంచుతున్నానంటాడు. కానీ పన్నుల రూపేణా అంతకు మించి వారి నుంచి లాక్కుంటాడు. ఏది కూడికో,
ఏది తీసివేతో తెలియక ప్రజలంతా తికమక పడుతున్నారు. అధినేత మాటల్లో
గుణకారాలు కనిపిస్తుంటే, ప్రజల జీవితాల్లో అన్నీ భాగహారాలే
ఉంటున్నాయి. ఇహ ఇతడి పరిపాలన ముందు నువ్వు ఇందాకా చూసిన భార్య వంటే నయం నాయనా!
వండి వార్చేశాం రండని పిలుస్తాడు. తీరా వచ్చి కూర్చుంటే వడ్డించేది ఏదీ ఉండదు.
ఏ పథకాన్ని నమ్ముకున్నా ఇదే తీరు. ఏది మొదలెట్టినా ఇదే తంతు. ఇక ఇతడి వ్యవహార
శైలి కన్నా, ఇందాకా నువ్వు చూసిన గుమాస్తా తీరే నయమనిపిస్తుంది నాయనా! ఈ అధినేత ఏం మాట్లాడినా అన్నీ స్పెల్లింగ్ మిస్టేకులే. అన్నీ
అతిశయోక్తులే. ఎవరైనా తన పాలనలో లోటుపాట్లు చెబితే
సమీక్షించుకుని, సరిదిద్దుకోవలసిందిపోయి అలా
చెప్పిన వారి పైనే పగబట్టే నేత నాయనా ఇతగాడు. వాస్తవాలు రాసే పత్రికలన్నీ దౌర్భాగ్యపువంటాడు.
ప్రశ్నించేవారందరూ దౌర్భాగ్యులంటాడు. అడిగే వాళ్లందరూ అడ్డమైనవాళ్లంటాడు. విమర్శించేవారిని
వెంటాడుతాడు. అది నాయనా ఈ రాజ్యం అసలైన దౌర్భాగ్యం!"
అంతా విని శిష్యుడు నోరెళ్ల బెట్టాడు.
"మరి గురూగారూ! పాపం... ఈ రాజ్య ప్రజల
జీవితాల్లో మార్పు ఎప్పుడు వస్తుందండీ?"
"అది వాళ్ల చేతుల్లోనే ఉంది నాయనా! జన
చైతన్యమే వారికి రక్ష. వెంట్రుకలు చూపించే వాడి అధికారాన్ని ఊడబీకే వివేచన ఇక్కడి
ప్రజల్లో వస్తుంది నాయనా! అప్పుడు ఆ అధినేత అతడి జుట్టు అతడే పీక్కుంటాడు! ఇక
మనం ఇక్కడ ఉంటే ప్రమాదం నాయనా. పద మజిలీ ఎత్తేద్దాం" అంటూ గురువుగారు
బయల్దేరారు. శిష్యుడు అనుసరించాడు.
-సృజన
PUBLISHED ON 17.4.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి