ఉగాది మాట వినేసరికి సామాన్యుడికి సంబరమొచ్చింది.
బజార్లో దొరికిన రకరకాల గంటల పంచాంగాలన్నీ కొనుక్కుని ఇంటికొచ్చి చాపేసుకుని
కూర్చుని హుషారుగా భార్యను పిలిచాడు.
"ఇయ్యాల పండగే. రాశుల గురించి రాసే పుస్తకాలన్నీ
కొనుక్కొచ్చినాను. బేగిరా. మన జాతకాలెలా ఉన్నాయో సూద్దారి..." అన్నాడు.
లోపలి నుంచి భార్య వచ్చి, "నీ పిచ్చిగానీ మావా! మన జాతకాలేమన్నా
మారేవా, సచ్చేవా? మూడేళ్ల నుంచీ ఉగాదొచ్చిందంటే చాలు,
ఆ పుస్తకాలన్నీముందేసుకుని కూసుంటావు. నీదని, నాదని, సుట్టాలదని, పక్కాలదని
రాశులన్నీ ఈ మూల్నుంచి ఆ మూలదాకా సదివేత్తావ్. రేపట్నుంచి అన్నీ మంచి రోజులేనంటావ్.
ఏదీ? మన బతుకులేవైనా బాగుపడ్డాయా అని! ఏర్రని ఏగాణీకి దిక్కులేదు.
పైగా ఏ ఏటికాయేడు ఉన్నది ఊడుతోంది... ఏంటో నీ చాదస్తం..." అంటూ చతికిలబడింది
నీరసంగా.
"ఓలొల్లకోయే... ఎప్పుడు సూసినా ఈసురోమంటూ
వాగుతావు... కొత్తేడాది ఎలాగుంటదో సూసుకోవద్దూ. నిన్నటి కట్టాలియ్యాలుంటాయా, ఇయ్యాల్టి బాధలు రేపుంటాయా?
అసలీటిలో ఏం రాశారో సూడనీ, ఊరికే నస పెట్టక..."
"సర్లె సదువు... నేనొద్దంటే మాత్రం నువ్వింటావుగనకనా?"
"ఈ ఏడాది పేరేంటో తెలుసా? శుభకృతంట. పేర్లోనే శుభముంది కదే..."
"దాని పేరేదైనా ఒకటే మావా. మనకొరిగేదేదీ
ఉండదు. మనలాంటి సామాన్యులకు శుభక్రుతైనా అశుభక్రుతే అవుతది..."
"నోర్ముయ్యహె... తెర్ర వాగుడూ నువ్వూను.
అట్లా ఎందుకవుద్దే? శుభం పలకవే అంటే అభాసు మాటలాడతావు...
పండగ పూటనైనా సూడవు..."
"మరిట్టా కాకపోతే మరెట్టా అనాలి మావా...
మనమున్నది ఆంధ్రాలోనన్న మాట మరవమాక. ఇక్కడేం
జరుగుతోందో నీకేమైనా ఎరికుందా అని? రోజూ పేపరు సదవ్వుకానీ,
ఏడాదికోసారి పంచాంగం సదువుతానంటావు. అందులో ఏం రాసినా, మన తలరాత మారదు..."
"ఏడిశావ్... ఎందుకు మారదే?"
"ఎందుకు మారదా? మన తలరాత మనమే రాసుకున్నాం
కాబట్టి. మాయ మాటలిని భ్రమల్లో పడి మనకి మనమే మనల్నేలే వాళ్లని నెత్తి
మీదకి తెచ్చి కూకోబెట్టుకున్నాం కాబట్టి... అది సేత్తాం, ఇది
సేత్తామంటూ ఊరూవాడా తిరిగి సేతులూపి, ముద్దులెట్టి, తలలు రాసి, బుగ్గలు పిసికి కుర్సీ ఎక్కినోల్లు అన్నవన్నీ
మర్చిపోయి అయినకాడికి దోచుకుంటున్నారు కాబట్టి..."
"వాసినీ... మొదలెట్టావా, రాజకీయ పంచాంగం? ఎప్పుడు సూడు, ఆడిపోసుకోడమే... నిన్నగాక మొన్నే గదే,
నీలాంటి ఆడోళ్ల కోసం అదేంటమ్మా... ఆ... దిశ అని సెప్పేసేసి కొత్త వాహనాలకు
జెండా ఊపారు? మరది మంచి పని కాదేటి?"
"ఓరి నా వెర్రి మావా... నట్టింట్లో అగ్గెట్టి, ఇంటి ముందు ముగ్గేస్తే సంబరపడతావు
నువ్వు. ఆడాళ్లకి ఎక్కడా భద్రత లేని పరిస్థితులు తీసుకొచ్చిన సంగతి మరిచిపోయి,
పైపై మెరుగులకు మురిసిపోతావు... పైగా నేనేమైనా అంటే రాజకీయ పంచాంగమంటూ
ఎకసెక్కాలోటి... సిగ్గులేకపోతే సరి... మంచి పనంట మంచి పని!"
"ఏంటే... ఊరికే రెచ్చిపోతన్నావు? ఏమైందే మీ ఆడాళ్లకి? ఇవరంగా సెప్పు సూద్దారి..."
"సర్లే... సెప్పక సెప్పక నీకే సెప్పాలా? ఒల్లకో... సీకటి పడితే సాలు,
పగలంతా ఒళ్లు హూనం సేసుకుని సంపాదించిందంతా పెట్టి సుక్కేసుకుని ఇంటికొత్తావ్.
మారు మాటాడనిత్తావా అని! ఏదేదో వాగుతావ్... అడిగితే సావగొడతావ్... ఇంటింటా ఇట్టాంటి
పరిస్థితి తెచ్చిందెవరు మరి? అంతక్రితం ఇంతగా తాగేవాడివా?
ఇంతలేసి తగలేసేవాడివా? అప్పటి మందు ఖరీదెంత?
ఇప్పుడెంత? నీకేమైనా అజా పజా ఉందా అని! తగలేసేవాడికి నీకేం తెలుస్తుందిలే, తట్టుకునే ఆడోళ్లకి తెలుస్తుందికానీ. నిన్నగాక మొన్న ఎప్పుడూ ఎరగని కిక్కొస్తోందే
అంటూ నాటు సారా ఏసుకొచ్చావ్. అది తాగొద్దురా మావా, అందులో ఏవేవో
రసాయినాలూ గట్రా కలుపుతున్నారంటా... అని సెబితే ఇన్నావుగావు. ఏమైంది? నీ ప్రాణం మీదకొచ్చింది. పుస్తెలు
అమ్మి నిన్ను దక్కించుకున్నాను. మడిసివి దక్కావంతే సాలనుకున్నా. అసలు నీకో సంగతి
తెల్సునా అంట? ఊరూ వాడా నాటు సారా బట్టీలేనంట. అది కాసేవోల్లంతా
కలిసి మామూళ్లిత్తారంట... మన పక్కనున్న టేసన్లో పోలీసోళ్ల నుంచి, మన ముందు నుంచి తిరిగే నేతల కాన్నుంచి, కుర్సీలెక్కి
కులాసాగా కూసున్న పెద్దోళ్లదాకా వాటాలుంటాయంట. ఒక్క నాటు సారాతో పోయిందా అంట! ఏవేవో
కొత్త కొత్త పేర్లతో బ్రాండులెట్టి సీసాలు పెట్టారని నువ్వే సెబుతావు కదా? వాటిలో కొన్నయితే దేశంలో మరెక్కడా
దొరకవంట... అంత స్పెషలు మరి మన ఆంధ్రా అంటేని. నీ తాగుడుతో పడలేక... మద్యపానం
ఆపేత్తానని నంగనాచి కబుర్లు సెబితే నిజమేగామోసనుకుని
ఓటేసేశాం మా ఆడోళ్లంతాని. ఏమైంది? కొరివితో తలగోక్కున్నట్టయింది మాపని. మూడేళ్ల నుంచి ఒకటే మద్యం మోత.
ఏడాదికి ఇరవై వేల కోట్ల రూపాయలంట, నీలాంటోల్లంతా తాగి తగలేత్తంది
తెలుసా? మీ కట్టార్జితం
పోసి తాగి మత్తెక్కిపోతంటే, ఆ కాసులెట్టి సంబరాలు సేసుకుంటున్నారాళ్లంతా. నీకింకో సంగతి తెలుసా? మీరంతా తాగి కురిపించే సొమ్ముల్ని
ముందే తాకట్టు పెట్టి కోట్లకు కోట్లు అప్పులు సేత్తన్నారంట. ఇక మద్య నిషేధం ఏం
సేత్తారీల్లు? మాయదారి
మాటలు కాబోతేని! అంటే అన్నానంటావు కానీ, రాష్ట్రం మొత్తానికిలా
మత్తు అలవాటు సేయడం బట్టే... నేరాలు పెరిగిపోతన్నాయని ఎరికేనా నీకు? అసలు జరిగే నేరాల్లో సగానికి సగం
తాగిన మత్తులో సేత్తన్నవేనంట. ఆడాళ్ల మీద అత్యాచారాలు అందుకే జరుగుతున్నాయి మరి.
ఆడ పోలీసులకే దిక్కులేని దిక్కుమాలిన పాలన జరుగుతోందిక్కడ... నీ సుట్టూతా ఇంత
జరగుతాంటే, ఇంకా నీకు ఇవరంగా సెప్పాలా?"
తాగుడు మాటెత్తేసరికి సామాన్యుడు మారు మాటాడలేదు.
కానీ ఎలాగోలా భార్యను దారికి తెచ్చుకుందామని నెమ్మదిగా నసిగాడు...
"అదికాదే... మావంతా ఏదో తాగేమే అనుకో. మా
సొమ్మంతా సర్కారోళ్లకే దారపోశామే అనుకో. కానీ అలా వచ్చిన డబ్బుల్తో మనకే మంచి
సేత్తన్నారంట కదా? అయ్యేవో పథకాలకే ఇస్తన్నారంట కదా? టీవీలో సమావేశాల్లో సెబుతాంటే సూశాన్లే..."
"ఛీ... ఆడు సెప్పడం, నువ్వు వినడం, పైగా నమ్మడం! ఇల్లు, ఒళ్లు గుల్ల సేసి పేదల్ని పిండుకుని ఆ సొమ్ములతోనే ఆడపడుచులకు మంచి సేత్తాడంట,
మంచి! థూ...! వింటుంటేనే కంపరమెత్తుకొత్తాంది. ఎన్నికల్లో ఓట్ల కోసం
నాలుగు డబ్బులు పడేస్తే కుక్కల్లాగా పడుంటామనుకుంటున్నాడు కామోసు. బడుగులంటే
అంత సులకనగా ఉంది ఆడికి. ఎక్కడికక్కడ ధరలు పెరిగిపోయాయి, ఎరికలేదా నీకు? పప్పులు, ఉప్పులు,
నూన్లు, కూరగాయలు ఇలా ఏది కొందామన్నా సుక్కలు
కనిబడుతున్నాయని తెలుసా? కారణం ఏంటనుకుంటున్నావ్? ప‌్రతి దాని మీద పన్నులు
వేయడమే మరి. ఆఖరికి చెత్త మీద కూడా పన్నులేసి మరీ వసూలు సేత్తన్నారు కద మావా?
ఈ గుడిసె తీసేసి సిమెంటు గోడలేసుకుందామని మూడేళ్లుగా అనుకుంటున్నాం.
కుదురుతోందా? మనం ఓటేసి నెత్తినెట్టుకున్న మారాజు కంపెనీ సిమెంటు
ధర కూడా మనకాడ ఎక్కువేనంట తెలుసా నీకు? ఇసుక ధర ఎంతుండేది,
ఎంతకు ఎగబాకింది? మనమసలు కొనగలమా అని!
ఎక్కడికక్కడ బంగారం లాంటి ఇసుకను తవ్వేసి అక్రమంగా యాపారాలు సేత్తా, దాన్ని బంగారంతో సమానం సూసేత్తన్నారు. ఎలాగో తెలుసా? ఇసుక మీద పెత్తనమంతా పైవోల్లకి ముడుపులిచ్చిన వాళ్లకి కట్టబెట్టారంట
మరి. ఇలా ఒక ఇసుకేంటి మావా... గనులు, భూములు, కొండలు అన్నీ తవ్వేసుకుంటున్నారు, తరలించేసుకుంటున్నారు,
దోచేసుకుంటున్నారు, దాచేసుకుంటున్నారు... ఇయ్యన్నీ
పట్టవు నీకు. మెరమెచ్చు మాటలు సెప్పేటోల్ల మోసాలు తెలుసుకోలేకపోతున్నావు..."
ఆ సరికి సామాన్యుడి కళ్లు బైర్లు కమ్మాయి. తల
తిరిగిపోయింది. నిజమేంటో కళ్ల ముందు కనబడింది. భార్య కోపానికి కారణమేంటో అర్థమైంది.
"సరేలేవే... బాగా సెప్పావులే. నువ్వు సెప్పినవన్నీ
నిజమేలే కానీ... ఇయ్యాల ఉగాది కదా,
ఏం రాశారో చూద్దారని..." అంటూ సామాన్యుడు గొణిగాడు.
భార్య పకపకా నవ్వింది. "ఆ పుస్తకాల్లో
రాసింది కాదు మావా, నేను చెబుతా ఇనుకో అసలు పంచాంగం. ఆంధ్రాలో మనలాంటి సామాన్యులకు ఆదాయం సున్నా, వ్యయం మన సంపాదన. రాజపూజ్యం
సున్నా, అవమానం అడుగడుగునా. రాజ్యాధిపతి శని. భోజ్యం అయ్యేది
మనమే. రసాధిపతి రాహువు. నీరసాధిపతులం నవ్వూ, నేనే. బుధుడు
నట్టింట వక్రించాడు. అందుకే ఇట్టాంటోళ్లకు ఓటేశాం. కేతువు కుర్సీలో కేరింతలు కొడుతున్నాడు.
కాబట్టే మనం కునారిల్లుతున్నాం. మనలాంటి వాళ్లలో ఎవరే రాశివారమయినా,
ఏదీ కలిసిరాదు. ఆదాయానికి అంతరాయాలు ఏర్పడుతాయి. దాచుకున్నది కాస్తా
దారి మళ్లి, దోచుకునే వారి జేబుల్లోకి పోతుంది. భ్రమలు,
భ్రాంతులు తప్ప బతుకులు బాగుపడవు. అణగారిపోవడం తప్ప ఆశలు నెరవేరవు...
అర్థమైందా?"
సామాన్యుడు బుర్ర గోక్కున్నాడు.
"ఒసే...నువ్వు సెప్పేదంతా సరేలేగానీ, మరి ఈ పంచాంగాల్లో మన జాతకాలు
మారేదెప్పుడే?"
"అది మన సేతుల్లోనే ఉంది మావా. ఈ సారి
ఓట్ల పండగ వచ్చినప్పుడు నువ్వు నీ సేతిలో సారా పేకట్టు పెట్టే వాడిని సాచిపెట్టి
కొట్టు. జేబులో ఎర్ర నోటు పెట్టేవాడిని ఎగిరితన్ను.
మెత్తగా నవ్వుతా మెరమెచ్చు మాటలాడేవాళ్లని మెడపట్టుకుని గెంటెయ్యి. నువ్వు ఓటేయకపోయినా, మొహం సాటేయకుండా నీ సమస్యల్ని
తన సమస్యలుగా భావించి వాటి కోసం పోరాడుతున్న నిజమైన జన నాయకుడెవరో తెలుసుకో.
అదిగో అప్పుడొస్తుంది నిజమైన ఉగాది. అదే అసలైన పండగ!"
-సృజన
PUBLISHED ON 29.3.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి