శిష్యుడు రాగానే గురువుగారు తన చెయ్యిని ముందుకు చాచారు. శిష్యుడు అయోమయంగా చూశాడు.
"ఏరా... అర్థం కాలేదా?" అన్నారు గురువుగారు.
"లేదండీ..." అన్నాడు శిష్యుడు బుర్రగోక్కుంటూ.
"నా చెయ్యి పట్టుకుని సుతారంగా ముద్దు పెట్టుకోరా..." అన్నారు గురువుగారు నవ్వుతూ.
శిష్యుడు సిగ్గు పడిపోయాడు.
"ఊరుకోండి సార్... ఇదేం కొత్త పోకడ? నేనలాంటి వాడిని కానండి..." అన్నాడు మెలికలు తిరిగిపోతూ.
"ఓరెర్రోడా... నేనూ అలాంటి వాడిని కాదురా. ముందు నేను చెప్పినట్టు చెయ్యి..." అన్నారు గురువుగారు.
"అదీ లెక్క..." అంటూ గురువుగారు ఈసారి కాళ్లు ముందుకు చాచారు.
శిష్యుడు కాసేపు ఆలోంచించి, చటుక్కున ఏదో అర్థమైనవాడిలా ఒంగుని ఆయన కాళ్లకు దండం పెట్టాడు.
"సెభాష్..." అంటూ గురువుగారు పక్కనున్న టేబుల్ మీద నుంచి తన ఫొటో తీసి ఇచ్చారు.
శిష్యుడు మళ్లీ బుర్రగోక్కున్నాడు.
"ఆ ఫొటో ఇంటికి పట్టుకెళ్లి రోజూ పూజ చేసుకోరా..." అన్నారు గురువుగారు.
"ఏంటో గురూగారూ! ఇవాళ మీరు వింతగా కనిపిస్తున్నారు. గౌరవమనేది మనసులో ఉండాలి కానీ, ఇలాంటి పన్లేంటండీ ఎబ్బెట్టుగా..." అన్నాడు.
గురువుగారు తాపీగా పడక్కుర్చీలో వాలి, "ఒరే... నువ్వు నా దగ్గరకి ఎందుకు వస్తున్నావురా?" అనడిగారు.
"రాజకీయాలు నేర్చుకోడానికండి..."
"మరి అందుకే కదరా... ఇవన్నీ నీ చేత చేయిస్తున్నది? ఎప్పుడూ థియరీలే అయిపోతున్నాయని ఇవాళ ఇదిగో ఇలా నీచేత ప్రాక్టికల్స్ చేయించానన్నమాట... అర్థమైందా?"
"అంత తొందరగా అర్థమైపోతే ఇంకా మీ దగ్గరకి ఎందుకు వస్తాను సార్... నేరుగా రంగంలోకి దిగిపోనూ! కాబట్టి ఈ పాఠమేంటో, దీని ప్రయోజనమేంటో కాస్త చెప్పండి గురూగారూ..."
"ఇది నయా రాజకీయ ప్రహసనంలో నంగనాచి అధ్యాయంరా. దీని పేరు పాదాక్రాంత విన్యాస విచిత్రం. స్వామిభక్తి పరాయణ శాస్త్రంలో పరమార్థ యోగ విభాగంలో పరమ ప్రయోజన అభ్యాసం. ఇందులోగానీ నువ్వు ఆరితేరావంటే ఎలాంటి పదవులైనా నీ సొంతం. అధినేత కనుసన్నల్లో నిత్యం తరించిపోతావు. నీ నేత మనసులో బాసింపట్టు వేసుకుని కూర్చోగలుగుతావు. నాయకుని దయాపూరిత దృక్కుల్లో తడిసి ముద్దయిపోతావు. అధినాయకుడి అండతో అందలాలు అందుకోగలుగుతావు. ఆయన గుండెల్లో దీపమై కొడిగట్టకుండా వెలిగిపోతావు. తెలిసిందా?"
"అయ్యబాబోయ్... ఇన్ని ప్రయోజనాలా? మరి దీన్ని ఎలా చదవాలో, ఎలా పాటించాలో కూడా కాస్త చెబుదురూ..."
"అన్నీ నేను చెప్పడం కాదురా... నవ్వు కూడా నీ సమకాలీన రాజకీయ పరిణామాలను గమనిస్తూ దూసుకుపోగలగాలి... ఇందాకా నేను చెయ్యి చాచినప్పుడు తెల్లమొహం వేసినప్పుడే అర్థమైంది, నీకు పరిశీలనా శక్తి శూన్యమని. నిన్నటికి నిన్న నీ పరగణాలో మంత్రి వర్గ విస్తరణ జరిగిందా? వాళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం చూశావు కదా? ఆపై పదవీ బాధ్యతలు చేపట్టిన తంతు కూడా గమనించావుగా? మరేం గ్రహించావు?"
"అవునండోయ్... మీరు చెబుతుంటే గుర్తొస్తోంది. కొత్తగా మంత్రి పదవులు వచ్చిన వారు రకరకాలుగా తమ అధినేత పట్ల విధేయత చూపించారండి. ఒక మంత్రి ఆయన చెయ్యి పుచ్చుకుని ముద్దు పెట్టుకున్నారండి. మరో మంత్రి వయసులో పెద్దవాడయినా కూడా ఆయన కాళ్లకు మొక్కాడండి. ఇంకొకాయన అయితే ఏకంగా అధినేత చిత్రపటం చేత్తో పట్టుకుని మరీ బాధ్యతలు స్వీకరించారండి. పైగా నా దేవుడు ఈయనేనన్నాడండి... ఆహా... నేను రాగానే మీరు చేసిన విచిత్ర విన్యాసాలకు అర్థమేంటో నాకిప్పుడు బోధపడిందండి. మొత్తానికి భలే పాఠమండి. కానీ గురూగారూ, నాదో సందేహమండి. అతి వినయం ధూర్త లక్షణం అంటారు కదండీ? అదిక్కడ వర్తించదాండీ?"
"ఎందుకు వర్తించదురా... నువ్వు అలాంటివాడివయ్యాకనే కదరా, నీచ రాజకీయాల్లో నెగ్గుకొచ్చేది? కాబట్టి నువ్వు సిగ్గు పడాల్సిన పనేమీ లేదు. చుట్టూ కెమేరాలు ఉన్నా, ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్నా, మీడియా చూస్తున్నా, ప్రజలు గమనిస్తున్నా, కొందరు బుగ్గలు నొక్కుకున్నా, మరి కొందరు నవ్వుకున్నా, ఎందరో ఆశ్చర్యపోయినా...నీకు అనవసరం. నీ పద్ధతిలో నువ్వు దూసుకుపోవడమే. అధినేత అంతరంగాన్ని మురిపించమే నీ లక్ష్యం. ఆయన మనసు రంజింపజేయడమే నీ ధ్యేయం..."
"ఏమిటో గురూగారూ! రాజకీయాలు మరీ వ్యక్తి పూజకి దాసోహమైపోతున్నాయండి... నేత మీద ఎంత ప్రేమ ఉన్నా, ఎంత అభిమానం ఉన్నా, ఎంత గౌరవం ఉన్నా అవన్నీ మనసులో దాచుకోవాలి కానీ, మరీ ఇంతలా... నీ బాంఛన్ కాల్మొక్తా... అన్నంత స్థాయిలో దిగజారిపోవాలా చెప్పండి..."
"నీ మొహం... ఇలాంటి సున్నితమైన భావాలు నీలో ఉంటే వాటిని వెంటనే తుడిచెయ్యి. లేకపోతే నవ రాజకీయ రంగంలో రంగువెలిసిపోతావు. తెలిసిందా?"
"తెలిసింది సార్... ఏదో గబుక్కున ఉన్నమాటగా అన్నానండి. మరైతే గురూగారూ, ఇలాంటి వేషాలు వేస్తే ఎలాంటి నేతయినా బోల్తా పడిపోయినట్టేనాండీ? ఏ నాయకుడైనా సరే ఐసైపోతాడంటారా?"
"కాదురోయ్... అదే ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం. నీ అధినేత నెత్తి మీద అహంకారం స్వారీ చేస్తున్నప్పుడు, నీ నాయకుడి మనసు నిండా గర్వం నిండిపోయినప్పుడు, నీ నేత నీ పని కన్నా నీ విధేయతనే కోరుకుంటున్నప్పుడు, నువ్వు ప్రజల కన్నా ఆయన ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని భావించినప్పుడు, ఆయన తనకు తాను దేవుడినని అనుకుంటున్నప్పుడు, తానే గొప్ప తెలివైనవాడిననని మిడిసిపడుతున్నప్పుడు, తానొక్కడే అధికారాన్ని నడిపిస్తున్న భ్రమలో తేలిపోతున్నప్పుడు... అదను చూసి, అవకాశం గ్రహించి మరీ దూసుకుపోవాలిరా. లేకపోతే దెబ్బ తింటావు. అది గుర్తు పెట్టుకో..."
"బాగుంది సార్... మరి ఇంకా ఈ అధ్యాయంలో ఎలాంటి వింత విధానాలు ఉన్నాయండీ?"
"చాలా ఉన్నాయిరా... అధినేత అలాంటి వాడని ఓసారి తేలిపోయాక, ఇక నువ్వు ప్రజల కోసం ప్రత్యేకంగా ఏమీ చేయక్కరలేదు. ఆయన భావాలు గ్రహించి రెచ్చిపోతే చాలు. ఆయనకి ఇష్టం లేని వాళ్లని నువ్వు బూతులు నేర్చుకుని మరీ తిట్టాలి. ఆయన పాలనలో ఎవరు నోరెత్తినా వాళ్లని వేధించాలి. నీ అధినేత తీరు మీద ఎలాంటి వ్యతిరేక వార్తలు వచ్చినా ఆ మీడియా ప్రతినిధులను విలేకరుల సమావేశంలో అందరి ముందూ అవమానించడానికి కూడా వెనుకాడకూడదు. ఎక్కడ ఎలాంటి నిరసన ప్రదర్శనలు జరిగినా... అధినేత అహంకార పూరిత, విద్వేష విధానాలను బట్టి ఉక్కు పాదంతో అణచివేయడానికి ముందుకురకాలి. జనం గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి. ఇక నీ నాయకుడి నాయకత్వంలో ఎలాంటి ప్రగతి జరగకపోయినా... బోలెడు అభివృద్ధి జరిగిపోతున్నట్టు తరచు ప్రకటనలు చేస్తుండాలి. జనం నీ నేత పాలనకు ఉబ్బితబ్బిబ్బైపోతున్నట్టు వాగుతుండాలి. ఇక మీ అధినాయకుడు తప్ప ప్రజానీకానికి వేరే దిక్కు, దివాణం లేనంతగా మాట్లాడుతుండాలి. నీ కళ్ళ ముందు రాష్ట్రం అప్పుల పాలవుతున్నా, భ్రష్టు పడుతున్నా పట్టనట్టు వ్యవహరించాలి. ఇక అప్పుడు నీ వృద్ధికి ఢోకా ఉండదు. నీ పదవులకు గండం ఉండదు. అర్థమైందా?"
"అద్భుతం సార్... ఇవన్నీ గబగబా నేర్చేసుకుని, వంట బట్టించుకుని, ఔపోసన పట్టేసి, మననం చేసుకుని రాణిస్తాను సర్... సరేనా?"
"అబ్బే కాదురా... నువ్వు నీ నేతను మెప్పించే స్థాయిలో ఉండాలనుకోవడం లేదురా. నువ్వే ఆ నేతంతటి వాడివి కావాలని కోరుకుంటున్నాను... కానీ..."
"కానీ ఎందుకుసార్... అందుకు ఏం చేయాలో కూడా చెప్పండి, చేసేస్తాను..."
"అదంత సులువు కాదురా... నీ పరగణాలో వెలిగిపోతున్న నీచ నికృష్ట నయవంచక నంగనాచి నాయకుడిలా ఎదగాలంటే నీ జన్మ సరిపోదు. ఎందుకంటే... ప్రభుత్వవిధానాలను పాదాక్రాంతం చేసుకున్న ఆ మహాధినేత విలక్షణ పరిపాలనా దురంధరుడు! విచిత్ర విన్యాసాల దురంహంకారుడు!!"
-సృజన
PUBLISHED ON 29.4.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి