మంగళవారం, సెప్టెంబర్ 27, 2022

దగుల్బాజీ ప్రదేశ్!

 


''నమస్కారం గురూగారూ... ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు...''

''ఏం లేదురా... నిన్నెలా ముఖ్యమంత్రిని చేద్దామా అని!''

''ఆహా.. గురూగారూ... మీకు నామీద ఎంత అభిమానమండీ...''

''అభిమానం సంగతలా ఉంచరా... నువ్వు అర్జంటుగా సీఎం అయితే నాదొక ఆశరా...''

''అదేంటో చెప్పండి సార్‌... తప్పకుండా చేసేస్తాను...''

''ఓసోస్‌... అప్పుడే కుర్చీ ఎక్కేసినట్టు ఊహించేసుకుంటున్నావేంట్రా?''

''అబ్బే... అదికాదండి... మీ దగ్గర రాజకీయాలు నేర్చుకుంటున్నాను కదండీ? ఆ పాఠాల వల్ల రాటు దేలిపోయి ఎప్పటికోప్పటికి సీఎం కాకపోతానా, అప్పుడు కుర్చీ మీద బాసింపట్టు వేసుకుని కూర్చోలేకపోతానా, ఆ రోజంటూ వస్తే మీ ఆశ తీర్చలేకపోతానా అని మనసులో ఏ మూలనో మిణుకుమిణుకుమంటూ ఓ చిన్న ఆశండి...''

''అంటే... నీ ఆశ తీరితే నా ఆశ తీరినట్టేనంటావ్‌?''

''కాదుటండీ మరి? అణాకానీకి కొరగాని నాలాంటి వాడిని అధినేతను చేసెయ్యాలని మీరంతగా ఆలోచిస్తుంటే... నేనంటూ ఆ లెవెల్‌కి ఎదిగితే గిదిగితే ఆ మాత్రం చెయ్యడం  నా బాధ్యత కాదుటండీ మరి... ఇంతకీ మీ ఆశేమిటో చెప్పండి గురూగారూ...''

''అబ్బే... ఏం లేదురా... నువ్వు ఈ పరగణాకి ముఖ్యనేతవైతే... ఇదిగో మన గురుకులం ఉన్న ఈ వీధికి నా పేరు పెడతావేమోననిరా. అప్పుడు రేప్పొద్దున్న నేనున్నా లేకపోయినా భావి తరాల వాళ్లు నన్ను గుర్తుంచుకుంటారనిరా...''

''ఓస్... ఇంతేనా గురూగారూ! ఇప్పుడే చెబుతున్నాను వినండి... నేనుగానీ సీఎంగానీ అయితే ఒక్క రోడ్డుకేంటండి గురూగారూ! ఊరూ వాడా మీ పేర్లతో మర్మోగిపోయేలా చేసేస్తానండి. రోడ్లతో పాటు పెద్ద పెద్ద భవనాలకి మీ పేరేనండి. సమావేశ మందిరాలకి మీ పేరేనండి. కూరగాయల మార్కెట్లకి మీ పేరేనండి. ఆఖరికి మున్సిపాల్టీలను కూడా వదలననుకోండి. పురపాలక సంఘాలకి, పార్కులకి, కళాశాలలకి, విశ్వవిద్యాలయాలకి, రైతు బజార్లకి, కాలనీలకి... ఆఖరికి సచివాలయాలకి కూడా మీ పేరు పెట్టేస్తానండి. ఆ విధంగా మీ రుణం తీర్చుకుంటానండి...''

''మరి శౌచాలయాలు, పబ్లిక్‌ పాయఖానాలు, మురుగు కాల్వలు, శ్మశానాలు... వీటిని వదిలేశావేంట్రా?''

''సారీసార్‌... మర్చిపోయానండి... కావాలంటే వాటికి కూడా పెట్టేస్తానండి... నన్నంతటి వాడిని చేసినందుకు మీ మీద గౌరవాన్ని అలా చూపించేస్తానన్నమాటండి...''

''ఏడిశావ్‌ ఎదవన్నర ఎదవా... ఆఖరికి నాపేరుని బజారుకీడ్చి, రోడ్డున పడేలా చేస్తావన్నమాట...''

''అయ్యబాబోయ్‌ అదేంటండీ అలాగనేశారు? ఇప్పుడే కదండీ... ఆశగా ఉందన్నారూ? మరింతలోనే తిడతారేంటండీ...''

''తిట్టాలా... తొడపాశం పెట్టాలా దరిద్రుడా... నా దగ్గర ఇన్నాళ్ల నుంచీ రాజకీయాలు నేర్చుకుని అఘోరిస్తున్నావు కదా... నీక్కుంచెమైనా బుర్ర ఎదిగిందో లేదోనని చిన్న టెస్టింగు చేశానంతే... అడ్డంగా ఫెయిలయ్యావ్‌. నీ బుర్ర ఇసక పర్రని తేలిపోయింది...''

''ఊరుకోండి గురూగారూ! మీరు నన్ను మరీ చిన్నపిల్లాడిని చేసి ఆడిస్తున్నారు. ఓ పక్క మీరే సమకాలీన పరిస్థితులను చూసి నేర్చుకోవాలంటారు... మరో పక్క అలా ఉండకూడదంటారు... మీతో పెద్ద చిక్కొచ్చిపడిందండి... మరి మన పరగణలో జరుగుతున్నదదే కదండీ... మనం వేసి గెలిపించిన ఓట్లతో కుర్చీ ఎక్కి అధికారం చెలాయిస్తూ ఎక్కడ చూసినా వాళ్ల నాన్న పేరే  వినిపించేటట్టు, కనిపించేటట్టు పాత పేర్లు మార్చేసి కొత్త పేర్లు తగిలిస్తున్న మన అధినేత ఏం చేస్తున్నాడో గమనించలేదా? ఇందాకా నేను అన్నట్టు ఒక్క శౌచాలయాలు, పబ్లిక్‌ టాయ్‌లెట్లు, చెత్త డంపింగ్‌ యార్డులు, మురుగు కాల్వలు, శ్మశానాల్లాంటివి తప్ప మిగతా అన్నింటికీ తన తండ్రి పేరు తగిలించలేదండీ? అలా పేర్లు మార్చినందుకు విమర్శలు, ఆరోపణలు, ఆందోళనలు, ప్రదర్శనలు ఎన్ని జరుగుతున్నా ఆయన చలిస్తున్నాడా చెప్పండి? మరి అధికారంలో ఉన్న అలాంటి అసమాన, అసాధారణ, అద్వితీయ నేతల నేర్చుకోకుండా  రాజకీయాల్లో రాణించడం ఎలా చెప్పండి?''

''ఓరెర్రోడా... కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి. కొందర్ని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. అది కూడా నీ లక్ష్యాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు నువ్వొక నీచ రాజకీయ నేతగా మారాలనుకుంటున్నావనుకో... అప్పుడు నీ అధినేత అడుగుజాడల్నే  వెనకా ముందూ చూడకుండా అనుసరించాలి. అలా కాక నువ్వొక ఆదర్శవంతమైన, నికార్సయిన, నిజాయితీ పరుడైన నేతగా ఎదగాలనుకుంటున్నావనుకో అప్పుడు ఆయన్ని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ముందు నీ లక్ష్యమేంటో నిర్ణయించుకో... తెలిసిందా?''

''తెలిసింది గురూగారూ! కానీ నాదో చిన్న సందేహమండి.  అనేకమంది విమర్శిస్తున్నా, చీదరించుకుంటున్నా, ఆందోళనలు చేస్తున్నా, జనమంతా బాహాటంగానే నవ్వుకుంటున్నా.... ఇవేమీ పట్టించుకోకుండా తన తండ్రి పేరు ఊరూవాడా తగిలించేసి ఆయనలా దూసుకుపోడానికి కారణం ఏమిటంటారు?''

''ఏముందిరా... ఇందాకా నువ్వు అన్నావే... నువ్వంటూ సీఎం అయితే నిన్నింతవాడిని చేసిన నా రుణం తీర్చుకుంటానని. అలాంటిదేరా మరి.  దారుణమైన రుణమొరేయ్‌. రాజకీయ పునాదులు వేసిన రుణం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఎలా రెచ్చిపోవచ్చో ఓనమాలు దిద్దించినట్టు నేర్పించిన రుణం. ఒక నాడు సొంత ఇల్లు కూడా లేని స్థితి నుంచి పొరుగు రాష్ట్రాల్లో సైతం కోటల్లాంటి విలాస భవనాలు నిర్మించుకునేలా చేసిన రుణం. తనకున్న చిన్న కంపెనీల షేర్లను రాత్రికి రాత్రి లక్షల రూపాయల్లోకి మార్చేలా చేసిన రుణం. కోరిన వారికి రాష్ట్రంలోని సెజ్‌లు, భూములు, గనులు, వనరులు సొంత జాగీరులా అప్పచెప్పేసి, అందుకు ప్రతిఫలంగా వారి నుంచి తన కంపెనీల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు ప్రవహించేలా చేసిన రుణం. ప్రజలను ఆశపెట్టి, మభ్యపెట్టి, భ్రమపెట్టి ఎలా పీఠం ఎక్కవచ్చో చూపించిన రుణం. అధికారం అందాక ప్రజాధనాన్ని, వనరుల్ని ఎలా పిండుకోవచ్చో బోధపడేలా చేసిన రుణం. మరిలాంటలాంటి రుణమేంట్రా అది? దానితో పోల్చుకుంటే మీ అధినేత చేస్తున్నది చాలా తక్కువేరా. రాష్ట్రంలో ఉన్న నదులు, కొండలు, చెట్లు, చేమలు, ఇసుక రేణువులకు సైతం ఆ తండ్రి పేరు పెట్టేసినా తీరదనుకో...''

''అబ్బో...మీరు చెబుతుంటే నిజమేననిపిస్తోందండి. కానీ గురూగారూ... నాదో సందేహమండి. ఉదాహరణకి నేనే సీఎం అయిపోయాననుకోండి. ఏదో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లు పెట్టుకుంటే తప్పేంటండీ? దానికింత గొడవెందుకండీ?''

''బాగా అడిగావురా. నీ తల్లిదండ్రుల పేర్లు పెట్టడంకాదురా, రుణం తీర్చుకోవడమంటే. ఉదాహరణకి రోడ్లనే తీసుకో. కనీస మరమ్మతులైనా చేయించకుండా గోతులు, గొప్పులతో, వానొస్తే బురదమైపోయి జారిపడే స్థితిలో ఉంచుతూ వాటికి తండ్రి పేరు పెడితే ఏమవుతుంది? ఆ రోడ్డు మీద ప్రయాణించి ఒళ్లు హూనమయ్యే ప్రతి వాడూ నీ తండ్రి పేరు తల్చుకుని మరీ ఆ రోడ్డును బండబూతులు తిడతాడా? అప్పుడేమవుతుంది? కూరగాయలు, నిత్యావసరాల సరుకుల ధరలు అదుపులో ఉంచే ప్రయత్నం చేయకుండా... కేవలం మార్కెట్‌ యార్డులకి మీ నాన్న పేరు పెడితే ప్రయోజనం ఉంటుందా? పథకాల అమలు వల్ల నిజమైన పేదలు, అర్హులకు ప్రయోజనం జరుగుతోందో లేదో చూసుకోకుండా... కేవలం వాటికి నీ పేరో, నీ వాళ్ల పేరో తోకలా జోడిస్తే ప్రజలను మెప్పించగలవా? స్థానిక సంస్థలకు సరైన నిధులు అందించి, వాటి ద్వారా సామాన్యులకు మేలు జరిగేలా చూసుకోకుండా... కేవలం పేర్లు మార్చి జనాలను ఏమార్చగలవా? కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు మరింత బాగా  రాణించేలా చేయూతనివ్వకుండా వాటి పేర్లు మార్చినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా? ఇవన్నీ సరిగా చేస్తే ప్రజలు నిన్ను, నీ తల్లిదండ్రులను తరతరాలకు మర్చిపోగలరా? ఆ ఇంగితం లేకుండా అధికారం ఉంది కదాని పేర్లు మార్చావనుకో... నువ్వు నీ తల్లిదండ్రుల పేర్ల విలువను పెంచుతున్నట్టా? దిగజారుస్తున్నట్టా?''

''నిజమేనండి... కానీ గురూగారూ! నేను రాగానే నన్ను సీఎం చేయాలని ఆలోచిస్తున్నట్టు మీరు చెప్పారు కదండీ... నేనింకా ఆ మత్తులోంచి దిగలేదండి. మీరెన్ని చెప్పినా... నేనుగానీ ముఖ్యమంత్రినైతే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పేర్లు పెట్టుకోవాలని మహా సరదాగా ఉందండి... ఆయ్‌...''

''వారి బడుద్దాయ్‌! నీ తండ్రి పేరేంటో చెప్పు?''

''దప్పళం గుర్నాథం అండి...'

''మరి తల్లి పేరు?''

''అంబాజీ అండి...''

''మరింకేంరా... ఈ ఇద్దరి పేర్లు కలిపేసి, కలగాపులగం చేసి, నువ్వుగానీ ముఖ్యమంత్రివైతే... వాటికీ వీటికీ ఎందుకురా... ఏకంగా రాష్ట్రానికే పేరు మర్చేయరా...''

''ఏమనండీ?''

''దగుల్బాజీ ప్రదేశ్‌ అని!''

-సృజన

PUBLISHED ON 27.9.2022 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి