సముద్రతీరంలో సామాన్యుడు సణుక్కుంటూ
నడుస్తున్నాడు. మొహంలో నిర్వేదం. ఆ నిర్వేదంలోంచి కోపం తన్నుకొచ్చేసరికి కాలితో
కసిగా ఇసుకను తన్నాడు. ఆ ఇసుకలో కప్పబడి ఉన్న బరువైన వస్తువేదో గాలిలోచి లేచి
ముందర పడింది. అది ఎప్పటిదో పాత కాలం నాటి
దీపం. సామాన్యుడు ఆసక్తిగా దాన్ని తీసుకుని భుజం మీది పాత తువ్వాలుతో రుద్దుతూ తుడిచాడు.
అంతే... ఆశ్చర్యం!
ఆ దీపం మూతిలోంచి దట్టమైన పొగ
పైకి లేచింది. సామాన్యుడు కళ్లు పెద్దవి చేసుకుని చూస్తుండగానే ఆ పొగ ఓ పెద్ద భూతంగా
మారిపోయింది.
“హ...హ్హ...హ్హ...హ్హా...” అంటూ ఒళ్లు విరుచుకుని
నవ్వింది భూతం.
సామాన్యుడు దానికేసి ఓసారి విసుగ్గా
చూసి పక్క నుంచి వెళ్లిపోసాగాడు.
భూతం కంగుతింది. గిర్రుమని తిరిగి
సామాన్యుడి ముందుకు వచ్చి, “వార్నీ! భయమేయలే? ఈమధ్య మనుషుల్లో ధైర్యం బాగా పెరిగిపోయిందన్నమాట...” అంది.
“ఏడిశావ్. నువ్వేదో పాతకాలం
నాటి పురాతన వెర్రిబాగుల భూతంలా ఉన్నావు. మా పాలకులు పెడుతున్న బాధలతో వేశారిపోతున్న
మమ్మల్ని నువ్వేం భయపెట్టగలవ్?” అన్నాడు సామాన్యుడు.
“ఏం? వాళ్లు మాకన్నా పెద్ద దీపాన్ని
రుద్దితే వచ్చారా?”
“దీపాలు లేవు, ఉంగరాలూ లేవు కానీ నన్నొదిలేయ్.
సమస్యలతో సతమతమవుతూ ఏదో కాస్త చల్లగాలికి ఇలా వచ్చా...” అంటూ సామాన్యుడు భూతాన్ని
పట్టించుకోకుండా ముందుకు సాగిపోయాడు.
భూతం రెండోసారి కంగుతింది.
చటుక్కున ముందుకు వచ్చి, “చూడు బాబూ! చాలా కాలంగా దీపంలో
నిద్రపోతున్న నన్ను లేపావు. చిన్నప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ చదువుకోలేదా? ఆ బాపతే నేను. నీకు తెలుసో తెలియదో
కానీ నేను ఏ పనయినా ఇట్టే చేసేయగలను తెలుసా?” అంది భూతం.
“మళ్లీ ఏడిశావ్. నీ
కాలం నాటి మాయలు వేరు. ఇప్పటి మా పాలకులు చేసే మాయాజాలం వేరు. ఇవేమీ నీ వల్ల కావులే
కానీ దయచేయ్…”
భూతానికి కోపం నషాళానికి అంటింది.
కోరలు సాచి, “ఓరీ సామాన్య మానవా? నీ అపహాస్యం మానవా? నువ్వన్నది నిరూపించకపోతే నిన్ను నమిలి మింగేస్తా...” అంది.
“హ...హ్హ... హ్హ...
హ్హా!” అంటూ సామాన్యుడు భూతం
కన్న గట్టిగా పగలబడి నవ్వాడు. పొట్ట పట్టుకుని ఇసుక మీద దొర్లాడు. ఆ తర్వాత
తాపీగా ఇసుక తిన్నె మీద చతికిలబడి కూర్చుని, “ఓసి నా వెర్రిబాగుల భూతమా. ఎప్పుడో అరేబియన్ కథల కాలం నుంచి దీపంలో పడి ఉన్నట్టున్నావు.
నీకిప్పటి సంగతులేమీ తెలిసినట్టు లేదు. నీకు లోకజ్ఞానం కలిగించాలి కానీ, నీ కోరలు మూసుకుని నా ముందుకొచ్చి
కూర్చో. చాలా చెప్పాలి...” అన్నాడు.
భూతం మూడోసారి కూడా కంగుతింది.
ఇక లాభం లేదనుకుని, సంగతేంటో తేల్చుకోవాలని సామాన్యుడి ముందు చేతులు కట్టుకుని కూర్చుని “ఇప్పుడు చెప్పు నాయనా...నేను చేయలేనివేంటో, నీ పాలకులు చేసేవేంటో” అంది వినయంగా.
సామాన్యుడు గొంతు సవరించుకున్నాడు.
వరసపెట్టి ప్రశ్నలు సంధించాడు.
“ఇదిగో... ఈ ఇసుక లోంచి
వేలాది కోట్ల రూపాయలను అక్రమంగా పిండి, అయిన వారి జేబులతో పాటు నీ సొంత ఆస్తులను కూడా పెంచుకోగలవా? నీ అనుచరులు, సహచరుల చేత ఎక్కడికక్కడ
ఇసుకను అక్రమ రవాణా చేయిస్తూ ఖజానాకు చేరాల్సిన సొమ్ముకు గండి కొట్టించగలవా?”
భూతం బుర్రగోక్కుంది.
“నీకు నిధులు సమర్పించుకున్న
అస్మదీయులకు అప్పనంగా సెజ్‌లు, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ
భూములను కట్టబెట్టి అధికార పీఠాన్ని అపహాస్యం
చేయగలవా?”
భూతం కంగారు పడింది.
“రైతన్నల స్వేదంతో బంగారం
పండే వేలాది ఎకరాల పచ్చని పంట భూముల్ని అభివృద్ధి పేరు చెప్పి...పరిశ్రమలు వస్తాయని
ఊరించి... పిల్లలకు ఉద్యోగాలు కలుగుతాయని నమ్మించి... మాయ మాటలు చెప్పి నామ మాత్రమైన
పరిహారంతో వశం చేసుకుని, చెప్పినవన్నీ చేయకపోగా ఆ భూముల్ని
అయినవారి సంస్థలకు ధారాదత్తం చేయగలవా?”
అప్పటికే భూతానికి చెమటలు
పట్టాయి. సామాన్యుడి భుజం మీద పాత తువ్వాలు తీసుకుని మొహం తుడుచుకుంది. సామాన్యుడిలో
ఆవేశం పెల్లుబికింది.
“పోనీ... సాధ్యంకాని అనేక
హామీల్ని ఎడాపెడా గుప్పించి లక్షలాది సామాన్యులను భ్రమల్లో ముంచి వాళ్ల సాయంతోనే
అధికార పీఠం అధిరోహించి, ఆపై ఆ హామీలకే మంగళం పాడుతూ కూడా... సిగ్గులేకుండా, బెరుకు లేకుండా, నీ పాలనా విధానమే అత్యుత్తమంటూ బోర విరుచుకుని దొంగ ప్రచారం చేసుకోగలవా?”
“ఇంకా... రకరకాల పన్నులు
విధించి ప్రజల జేబులకు చిల్లు పెట్టగలవా?”
“తరాల క్రితం పేదలకు
ఇచ్చిన ప్రభుత్వ భూముల్ని ఇప్పుడు మళ్లీ రిజిస్టర్ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేస్తూ...
చెమటోడ్చి అరకొర సంపాదనతో బతుకులీడ్చే బడుగు జీవుల నుంచి సైతం వందల కోట్ల రూపాయలు
అన్యాయంగా పిండుకోగలవా?”
“సామాన్యులను వ్యసనాల
పాలు చేసి... నాసిరకం మద్యం, నాటు సారాలను ఎక్కడపడితే అక్కడ ఏరుల్లాగా పారేలా చేయగలవా? ఆ సారా, మద్యం వ్యాపారాలను కూడా నీ అనుచరులకే అప్పగించగలవా?”
“నీ అనుచరులు భూతగణాల్లా
రెచ్చిపోతూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అకృత్యాలు సాగిస్తుంటే రక్షణ వ్యవస్థను
నీ గుప్పిట్లో పెట్టుకుని ఎవరి మీద ఎలాటి కేసులూ లేకుండా చేయగలవా?”
“రైతన్నలు గిట్టుబాటు
ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే అదేమీ పట్టించుకోకుండా... నీకు నువ్వు రైతు
బాంధవుడినంటూ ప్రచారం చేసుకుంటూ సభల్లో మాట్లాడగలవా?”
“ఎక్కడ పడితే అక్కడ
అప్పులు చేసి, భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి వేలాది కోట్ల రుణాలు పుట్టించి, ఆ ఆదాయమంతా ఏమవుతోందో తెలియనంతగా
రాజ్యాన్ని భ్రష్టుపట్టించగలవా?”
“సమస్యలు తీర్చమని
అడిగినవారిపై కక్ష కట్టగలవా? తప్పుడు కేసులు బనాయించగలవా? ప్రజలను కులం పేరుతో మతం పేరుతో విడదీసే కుయత్నాలు చేయగలవా? పాలనా వ్యవస్థలన్నింటినీ
గుప్పెట్టో పెట్టుకుని ఆడించగలవా? అక్రమ విధానాలతో విలువైన గనులను కొల్లగొట్టగలవా?”….
ఇలా సామాన్యుడు గుప్పించిన ప్రశ్నలు
వినేసరికి భూతం కడుపులో వికారం బయల్దేరింది. కళ్లు బైర్లు కమ్మాయి. తల వాచిపోయింది.
దాంతో అది ఇసుక మీద పడుకుని దొర్లుతూ మూలగసాగింది.
సామాన్యుడికి భూతం పరిస్థితి
చూస్తే జాలేసి, “పోనీ ఇవన్నీ కాదులే కానీ, ఆఖరుగా ఓ చిన్న పని చెబుతా. అదైనా చేయగలవా?” అన్నాడు.
భూతానికి హుషారొచ్చింది. ఇదైనా
చేసి అవమాన భారం నుంచి తప్పించుకోవాలనుకుని ఆశ పుట్టి, “అయితే చెప్పు. ప్రయత్నిస్తా...” అంది.
“ఇన్ని అవకతవకలు, అక్రమాలు, అన్యాయాలు, అకృత్యాలు, అడ్డగోలు పనులు చేస్తూ కూడా...
ఏమాత్రం జంకూగొంకూ లేకుండా మెత్తగా నవ్వుతూ, పెడసరంగా ప్రవర్తిస్తూ, నీ పుట్టుకే ప్రజల కోసమన్నట్టు, నువ్వొక అవతార పురుషుడివన్నంత స్థాయిలో పోజు కొడుతూ, నువ్వు తప్ప ఇక జనానికి దిక్కే లేనట్టు దర్జాగా, ధీమాగా, దిలాసాగా, కులాసాగా మైకుల ముందు, టీవీ కెమేరాల ముందు పళ్లికిలించగలవా?”
భూతం తెల్లమొహం వేసి సామాన్యుడి
కాళ్ల ముందు కూలబడింది. వణుకుతున్న చేతులెత్తి నమస్కరించి, “ఓరి నాయనా! నా గర్వమంతా తుస్సుమంది.
నీ అధినేత ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార, మాయా మశ్చీంద్ర, మహా విన్యాసాల ముందు నేనెంత? నా మాయెంత? నీ నేత మా భూతాలకే రారాజు. భూత భవిష్యత్
వర్తమాన కాలాల్లో ఎక్కడా కనిపించని భూతేశ్వరుడు. భూత సామ్రాట్. భూత చక్రవర్తి.
అతడి మాయాజాలం చూశాక నేనింక ఈ లోకంలో ఉండలేను...” అంటూ భూతం మళ్లీ పొగగా మారి
పురాతన దీపంలోకి దూరిపోయింది. సామాన్యుడు ఆ దీపాన్ని తీసుకుని గిరగిరా తిప్పి సముద్రంలోకి
విసిరేశాడు.
-సృజన
PUBLISHED ON 15.9.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి