మంగళవారం, సెప్టెంబర్ 20, 2022

ఏడ‌వలేక‌...న‌వ్వాలిక‌!

 


అదేంటే... డ‌బ్బులు అయిపోయాయంటావేంటీ?  మొన్న‌నేగా జీతం తెచ్చిచ్చానూ?” అన్నాడు అప్పారావు అయోమ‌యంగా.

భార్య పంకజం క‌ళ్లెగ‌రేసి, “అయితే ఏంట‌ట‌? అయిపోయాయంతే. ఇంకా కిరాణా స‌రుకులు వేయించుకోవాలి. బియ్యం కొనాలి.  అద్దె ఇవ్వ‌నే లేదు. ప‌నిమ‌నిషి కూడా జీతం అడుగుతోంది. మీరేం చేస్తారో తెలియ‌దు. డ‌బ్బులు తెచ్చివ్వండి... అంది విసుగ్గా.

అప్పారావు బుర్ర‌గోక్కున్నాడు. ఆ త‌ర్వాత నెల‌వారీ ఖ‌ర్చులు రాసే పుస్త‌కం తీసుకొచ్చి చూశాడు.

ఏమేవ్ ఇలా రా ఓసారి... అంటూ కేకేశాడు. 

అట్ల‌కాడ చేత్తో పట్టుకుని ఆద‌రాబాద‌రా వ‌చ్చింది పంక‌జం.

అవ‌త‌ల కూర మాడిపోతుంటే ఏంటా గావుకేక‌లు?”  అంటూ రుస‌రుస‌లాడింది.

ఏంటా? ఇలా చూడు ప‌ద్దు. అద్దె ఇచ్చేశాం. కిరాణా స‌రుకులు కూడా వేయించేసుకున్నాం. మ‌రి ఇంకా ఇవ్వాలంటావేంటి?”

పంకజం ఓ సారి పుస్త‌కం తీసుకుని చూసి, “ఏంటో వెధ‌వ లెక్క‌లు. నాకు ఈ అంకెలు, ప‌ద్దులు అంటే మ‌హా బోరు. ఏదో మీకు లెక్క చెప్పాలి క‌దాని ఏదేదో రాసుంటాను. అయితే ఏంట‌ట‌?” అంది.

నీ త‌లకాయ్‌! ఖ‌ర్చులు త‌ప్పు రాస్తే ఎలా?  నీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఏదేదో చెప్పేసి, ఇంకా తే... ఇంకా తే అంటే ఎలా కుదురుతుంది?  ఖ‌ర్చులు అదుపు త‌ప్పుతాయి. బ‌డ్జెట్ త‌ల‌కిందుల‌వుతుంది. సంసారం గుల్ల‌వుతుంది...  పైగా అబ‌ద్దాలోటా?” అంటూ కేక‌లేశాడు అప్పారావు.

పంక‌జం ఊరుకోలేదు. పైగా గ‌య్యిమంది.

అస‌లేమిటి మీ ఉద్దేశం?  తెల్లారి లేస్తే వెయ్యి ప‌నులు నాకు. ఆ హ‌డావుడిలో ఏదో రాసేసి ఉంటాను. మ‌హా మ‌హా ముఖ్య‌మంత్రే అసెంబ్లీలో అబ‌ద్దాలు చెబుతుంటే మీరు న‌న్ను నిల‌దీస్తారేంటి?”

అప్పారావు తెల్లమొహం వేశాడు.

మ‌ధ్య‌లో ముఖ్య‌మంత్రి సంగ‌తేంటే? అసెంబ్లీ గొడ‌వ మ‌న‌కెందుకు?”

ఎందుకా?  పేప‌ర్లు చ‌ద‌వ‌లేదా?  టీవీలో చ‌ర్చ‌లు చూడ‌లేదా?  రాష్ట్రం ఆర్థిక ప‌రిస్థితి గురించి చెబుతూ ఆయ‌న‌గారు అంతా భేషుగ్గా ఉంద‌ని చెప్పార్ట‌. ఏకంగా అసెంబ్లీలో ఆయ‌న చెప్పిన లెక్క‌ల‌న్నీత‌ప్పులేనంటూ ఎక్క‌డ చూసినా అవే వార్త‌లు. ఆయ‌నే అలా చెప్ప‌గాలేంది?  మీరేంటి న‌న్ను నిల‌దీసేది?”

అప్పారావు ఇక మాట్లాడ‌లేక‌పోయాడు. అయినా త‌మాయించుకుని, “ఏడిసిన‌ట్టుంది... ఆయ‌న‌కీ నీకూ పోలికేంటి?” అన్నాడు.

ఎందుకు లేదు? ఆయ‌న రాష్ట్రానికెంతో, నేను ఈ ఇంటికంత‌. అర్థ‌మైందా?”

ఆ పాటికి అప్పారావు పూర్తిగా చ‌ల్లారిపోయాడు.

స‌ర్లె... స‌ర్లె... అయినా పంక‌జం... ఇవ‌న్నీ నీకెలా తెలుసు?  నువ్వీ మ‌ధ్య టీవీ సీరియ‌ల్స్ మానేసి న్యూస్ ఛానెళ్లు చూస్తున్నావా?” అంటూ ఆరా తీశాడు.

ఎందుకంటే పంకజానికి ఇంత‌కు ముందు ఇంత లోక‌జ్ఞానం లేనేలేదు. భోజనం పెడుతూ కూడా పాపం...ఇవాళ ఎపిసోడ్ లోనైనా ల‌క్ష్మిని వాళ్లాయ‌న అర్థం చేసుకుంటాడో లేదో? ఆ నాగ‌దేవ‌త ఈసారైనా త‌న భ‌క్తురాలిని కాపాడుతుందో లేదో? అంటూ వాపోతూ ఉండేది. టీవీ సీరియ‌ళ్ల‌లోని పాత్ర‌ల బాధ‌ల‌న్నీ త‌న‌వే అయిన‌ట్టు బాధ‌ప‌డుతూ ఉండేది.

ఏముందా టీవీ సీరియ‌ల్స్‌లో. వాటిక‌న్నా న్యూస్ ఛాన‌ల్సే బాగున్నాయి. వీటిలో ఉన్న థ్రిల్లు వాటిలో ఏదీ? ఇందులో ఉన్న డ్రామా అక్క‌డేదీ? ఎన్ని హావ‌భావాలూ... ఎన్ని అబ‌ద్దాలూ... ఎన్ని తిట్లు...ఎన్ని విమ‌ర్శ‌లూ... ఎన్ని మ‌లుపులూ... ఎంత స‌స్సెన్సూ... అంటూ పంక‌జం త‌న్మ‌యంలో మునిగిపోయింది.

అంతేకానీ... లెక్క‌లు త‌ప్పాయ‌ని మాత్రం ఒప్పుకోవ‌న్న‌మాట... అన్నాడు అప్పారావు ఇంకేమ‌నాలో తెలియ‌క‌.

ఎందుకొప్పుకోవాలిట‌? ఇంత పెద్ద సంసారం ఈడ్చుకురావ‌డంలో ఏవో అక్క‌డా ఇక్క‌డా పొర‌పాట్లు జ‌రుగుతాయి. అంత మాత్రం దానికే ఇలా నిల‌దీసేస్తే ఎలా?  రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టుల విష‌యంలోనే అంకెలు మారుతున్నాయి. రాత్రికి రాత్రి అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. మంత్రులే విలేక‌రుల స‌మావేశాల్లో ఓసారి ఓలా, మ‌రోసారి ఇంకోలా చెబుతున్నారు. మీరేదో పెద్ద మ‌న ఇంటి ప‌ద్దు చూసి న‌న్న‌డుగుతున్నారు... అంటూ అట్ల‌కాడ ఊపుకుంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది పంకజం.

అప్పారావు త‌ల‌ప‌ట్టుకున్నాడు. నోరెత్త‌కుండా పంకజం పెట్టింది తిని ఆఫీసుకెళ్లిపోయాడు.

****

ఏం ఎక్కౌంటెంటువ‌య్యా నువ్వు? ఏంటీ ఈ ఫైల్ ప్రిపేర్ చేయ‌డం? అన్నీ త‌ప్పులే. గ‌బుక్కున సంత‌కం పెట్టేసి ఉంటే ఏమ‌య్యేది?” అంటూ అరిచాడు అప్పారావు.

ఏమైంది సార్?” అంటూ వచ్చాడు అకౌంటెంట్‌.

ఏమైందా?  చూడు. నువ్వు పుట‌ప్ చేసిన లెక్క‌ల‌న్నీ త‌ప్పులే. డెబిట్ తీసుకెళ్లి క్రెడిట్‌లో వేశావు.  క్రెడిట్‌లో వేయాల్సింది డెబిట్లో ఎంట‌ర్ చేశావ్‌.  దాంతో టోట‌ల్ మొత్తం త‌ప్ప‌యింది...} అంటూ అప్పారావు విరుచుకుప‌డ్డాడు.

అకౌంటెంట్ ఏమీ చ‌లించ‌లేదు. దాందేముంది సార్‌... ఏదో పొర‌పాటు జ‌రిగి ఉంటుంది. స‌రిచేస్తా లెండి అన్నాడు తాపీగా. అతడి నిదానం చూసి అప్పారావుకి మండిపోయింది.

త‌ప్పుల త‌డ‌క‌ల‌తో ఫైలు నా టేబుల్ మీద పెట్టిందే కాకుండా, దాందేముందంటావా?  నీకెంత ధైర్యం?  నువ్వు చేసిన ప‌నికి ఎంత న‌ష్టం వ‌చ్చేదో తెలుసా?” అంటూ హుంక‌రించాడు.

అకౌంటెంట్ బిత్త‌ర‌పోలేదు స‌రిక‌దా, “ఊరుకోండి సార్‌... మీరు మ‌రీనూ. సీఎంగారు రాష్ట్రం గురించి చెప్పిన లెక్క‌ల్లోనే ఎన్నో త‌ప్పులు ఉన్నాయి. అస‌లు బ‌డ్జెట్ పుస్త‌కంలోని లెక్క‌ల్నే ఆయ‌న ప‌రిగ‌నణించ‌లేదుట‌. కొన్ని లెక్క‌ల్ని దాచేశారుట కూడానూ. రాష్ట్రం అప్పుల కుప్ప‌లా ఉంటే అంతా బాగానే ఉంద‌ని చెప్పేశారాయ‌న‌. అలాంటిది ఈ చిన్న కంపెనీలో ఓ పొర‌పాటుకి అంత కంగారు ప‌డిపోతున్నారు మీరు. అంత అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం గురించే ఆయ‌న‌గారు భేషుగ్గా ఉంద‌ని తేల్చేస్తే... మీ కంపెనీ గురించి ఎందుకండీ అంత హైరానా? త‌ప్పులుంటే స‌రి చేసుకుందాం లెండి. ఇప్పుడేం కొంప‌లు మునిగిపోయాయ‌ని?” అంటూ ఫైలు పుచ్చుకుని నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వెళ్లి పోయాడు అకౌంటెంటు.

అప్పారావు జుట్టు పీక్కున్నాడు.

****

హ‌లో... అప్పారావు గారాండీ?”

అవును...

నేను మీ అబ్బాయి చ‌దివే స్కూళ్లో లెక్క‌ల టీచ‌ర్నండీ. మీ వాడికి క్వార్ట‌ర్లీలో నూటికి 9 మార్కులు వ‌చ్చాయి. అది చెబుదామ‌నే చేశాను...

అబ్బే... మీరు పొర‌బ‌డుతున్నారు. మా వాడికి నూటికి 90 మార్కులు వ‌చ్చాయండీ. నిన్న‌నేగా ప్రోగెస్ రిపోర్టు మీద సంత‌కం పెట్టాను?”

లేదండీ... మీరే పొర‌బ‌డుతున్నారు. మీరు సంత‌కం పెట్టిన ప్రోగ్రెస్ రిపోర్టు మీవాడు తెచ్చిస్తే అనుమానం వ‌చ్చి ఆన్స‌ర్ పేప‌ర్లు తెప్పించి వెరిఫై చేశాను. మీ వాడు 9 ప‌క్క‌న సున్నా వేశాడు. మీరు భేషుగ్గా చ‌దువుతున్నాడ‌నుకుని పొంగిపోయి సంతకం పెట్టేసుంటారు...

అప్పారావుకి కోపం న‌షాళానికెక్కింది.

ఇంటికి వ‌చ్చాక కొడుకుని పిలిచి నిల‌దీశాడు. వాడు బెదిరిపోలేదు స‌రికదా, “అవును డాడీ! నేనే అంకెలు మార్చాను. మిమ్మ‌ల్నెందుకు కంగారు పెట్ట‌డం అని. అస‌లు నాక‌న్నా త‌క్కువ మార్కులు వ‌చ్చిన వాళ్లు కూడా ఉన్నారు తెలుసా?  వాళ్ల క‌న్నా నేను చాలా న‌యం. అస‌లు లెక్క‌ల‌న్నా, అంకెల‌న్నా నాకు చాలా బోరు.  కానీ మీరు స్కూల్లో వేశారు కాబ‌ట్టి చ‌దువుతున్నానంతే. వ‌చ్చే ప‌రీక్ష‌ల‌కి బాగా చ‌దువుతాలే డాడీ...

అప్పారావు మొహం కంద‌గ‌డ్డ‌లా మారిపోయింది.

ఈలోగా పంక‌జం వ‌చ్చి స‌ర్లె...నువ్వెళ్లి ఆడుకోరా.  మీ నాన్న‌కి నేను అర్థ‌మ‌య్యేలా చెబుతాలే... అంటూ పంపేసింది.

ఏమిటే నువ్వు చెప్పేది?  వాడిన‌లా వెన‌కేసుకు వ‌స్తావేంటి?” అన్నాడు అప్పారావు కోపంగా.

ఊరుకోండి మీరు మ‌రీనూ... ఏదో పిచ్చి స‌న్నాసి. ఆ వెధ‌వ లెక్క‌ల‌తో వేగ‌లేక ఏదో రాసేసి ఉంటాడు. దానికే ఇంత ఆవేశ ప‌డతారేంటి? అవ‌త‌ల రాష్ట్రంలో ఆదాయ వ్య‌యాల లెక్క‌లు ఘోరంగా ఉన్నా మ‌న ముఖ్య‌మంత్రి ఏమైనా కంగారు ప‌డుతున్నారా?  నిదానంగా త‌ప్పుడు అంకెలు చూపించ‌డం లేదూ?”

అప్పారావుకి ఏం జ‌రుగుతోందో అర్థం కాలేదు. ఏమిటిదంతా? ఏమైంది వీళ్లంద‌రికీ? జ‌రిగిన త‌ప్పుల‌కి చింతించ‌డం మాని అంద‌రూ ఇంత నిబ్బ‌రంగా  ఎలా ఉండ‌గలుగుతున్నారు?

ఆలోచించ‌గా... ఆలోచించ‌గా... అప్పారావుకి అస‌లు విష‌యం అర్థ‌మైంది.

అంతే... ప‌గ‌ల‌బ‌డి న‌వ్వ‌సాగాడు. ప‌క‌ప‌కా న‌వ్వాడు. పొట్ట ప‌ట్టుకుని కింద ప‌డి దొర్లుతూ మ‌రీ న‌వ్వ‌సాగాడు. పంకజం కంగారు ప‌డి ఏమైందండీ? ఎందుక‌లా ఉన్న‌ట్టుండి న‌వ్వుతున్నారు?” అంది.

అప్పారావు న‌వ్వుతూనే చెప్ప‌సాగాడు... ఎ...హేం...లె..హే..దే! హ‌...హ్హ‌... అర్థ‌మైంది. అంతా అర్థ‌మైంది. త‌ప్పులు ఒప్పుల‌ని తె... హె...లిసింది. త‌ప్పులు దొర్లినా త‌ప్పేది లేద‌ని బొ...హో...ద పడింది. ఒ...హో...టేసి గె...హెలిపించుకున్నాక‌.... భ‌రించ‌క త‌ప్ప‌ద‌ని తె...హెలిసిలి... పొ... హోయింది. ఎ... హేడ‌వ‌డం క‌న్నా... న‌...హ‌వ్వుకోవ‌డం న‌య‌మ‌ని జ్ఞానోద‌య‌మైంది... హ‌... హ్హ‌...హా! అంటూ న‌వ్వ‌సాగాడు. పంక‌జం కూడా ప‌డీ ప‌డీ న‌వ్వ‌సాగింది.

-సృజ‌న‌

PUBLISHED ON 18.9.2022 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి