మంగళవారం, జనవరి 10, 2023

నెంబర్ వన్‌ ఛీటర్‌!


 

''ఎస్‌... నేనే నెంబర్‌ వన్‌...

కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్‌ వన్‌...

రౌడీలను పనిపెట్టే కేడీ నెంబర్‌ వన్‌...

నెంబర్‌ వన్‌ నెంబర్‌ వన్‌ నెంబర్‌ వన్‌...

ఎస్‌... నేనే నెంబర్‌ వన్‌...''

అధినేత అంతరంగం పిచ్చెత్తినట్టు గెంతుతోంది. అద్దం ముందు అధినేత మాత్రం మెత్తగా నవ్వుతూ నిలబడ్డాడు.

''ష్‌... మరీ అంత రెచ్చిపోకు. ఇది ప్రజాస్వామ్యం...'' అన్నాడు అధినేత స్వగతంగా.

''హ...హ్హ...హ్హ... హ్హ! ఎందుకు గురూ... నా దగ్గర కూడా ప్రజల ముందు మాట్లాడినట్టు నయవంచక కబుర్లు చెబుతావ్‌. నేను నీ అంతరంగాన్నే కదా? నువ్వు అధికార పీఠం మీద కూర్చున్నాక ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది చెప్పు? అహ... మనలో మన మాటలే...'' అంది అంతరంగం వికటంగా నవ్వుతూ.

''అవుననుకో. కానీ ప్రజలు గెలిపిస్తేనే గెలిచాను కదా? అది ప్రజాస్వామ్యం కాదంటావా?''

''అబ్బ...అబ్బ... ఎంత జాగ్రత్త! ఎంత అప్రమత్తత! అంతరంగం ముందు అంత నాటకాలెందుకమ్మా? ప్రజలు  పట్టం కడితేనే గెలిచావులే. కానీ ఆ ప్రజల్ని ఎంతలా నమ్మించావని? ఎంతలా వంచించావని? ఒక్కటంటే ఒక్కటైనా సాధ్యమైన హామీ ఇచ్చావా అని? అరచేతిలో స్వర్గం చూపించావు. అధికారం అందాక నరకం చూపిస్తున్నావు. నువ్విచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చావా అని?''

''అదే కదా రాజకీయం? నీకు తెలియనిదేముంది. కానీ నాకర్థం కాక అడుగుతానూ... ఆ పాంటేంటి? ఆ గెంతులేంటి? అవతల ఎన్నికలు వస్తున్నాయనే ఆలోచనేమైనా ఉందా?''

''ఏంటో గురూ... ఎందుకో ఆ పాట నీకు బాగా నప్పిందనిపిస్తోంది. కేడీలను కనిపెట్టి చూసుకుంటున్నావు. రౌడీలను పనిపట్టి చేరదీస్తున్నావు. నీ అనుచరులను సొంత గూండాలుగా ఉపయోగించుకుంటున్నావు. ఈ విషయంలో నిన్ను మించిన నెంబర్‌ వన్‌ ఎవరుంటారు చెప్పు?''

అధినేత ముసిముసిగా నవ్వుకున్నాడు. అద్దంలో చూసుకుంటూ చొక్కా చేతులు మడతపెట్టుకుని, ''అయితే నిజంగా నేనే నెంబర్‌ వన్‌ అంటావా?'' అన్నాడు అంతరంగం చేత మరింత వాగిద్దామని.

అంతరంగం ఇంకా రెచ్చిపోయింది.

''ఇది జనతా బస్సు... జాగ్రత జాగ్రత మనీపర్సు...

ఎవ్వరు ఎక్కడ దిగుతారో... ఎంత లగెత్తుకు పోతారో...

ఎవడికి తెలుసు?'' అంటూ చూపుడు వేలు పైకెత్తి చూపిస్తూ స్టెప్పులేయసాగింది.

అధినేత అటూ ఇటూ చూసి ''ఊరుకుంటుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావ్‌...'' అన్నాడు ముద్దుగా మందలిస్తున్నట్టు.

అంతరంగం ఊరుకోలేదు.

''నువ్వూరుకో గురూ... ఆ పాటలో చెప్పినట్టు ఇది జనతా బస్సేకదూ? అందుకేగా నీ మనీ పర్సును అంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు. అవునుగానీ... కుర్చీ ఎక్కాక ఎంతకి లగెత్తావు గురూ?'' అంది లోపాయికారీగా.

''చాల్లే సతాయిస్తున్నావ్‌... ఇంకా లెక్కలు తేలందే? అన్ని వ్యవస్థల్నీ ప్రజల పేరు చెప్పి గాడి తప్పించడానికే ఇంకా సమయం సరిపోలేదు. అయినా నా లెక్కలే అడుగుతావెందుకు? ప్రజలకు కూడా పంచిపెడుతున్ననుగా?''

''భలే చెప్పావు గురూ..'' అంటూ అంతరంగం అధినేత చుట్టూ స్టెప్పులేస్తూ పాట పాడసాగింది.

''ముద్రలు వేసే నోట్ల కట్టలు, ముడుపుగ వేసే పెద్ద మనుషులు...

ముసుగులు తీస్తే రాస్కెల్సు...

మూట విప్పితే బాటిల్సు!

ఎస్‌...నేనే నెంబర్‌ వన్‌''

అధినేత చిరుకోపం ప్రదర్శించాడు.

''అంటే ఏంటి నీ ఉద్దేశం?'' అన్నాడు.

''ఇంకా విడమర్చి చెప్పాలా గురూ? ప్రజల పేరు చెప్పి నువ్వు దోచుకుంటున్నదెంత? అందులోంచి పథకాల పేరు చెప్పి వాళ్లకిస్తున్నదెంత? నీకు తెలియదా? నాకు తెలియదా చెప్పు? అసలు నాకు తెలియక అడుగుతానూ... కనీసం ఓ అరశాతమైనా ఉంటుందా బాసూ?  నీ ముసుగు తీస్తే నువ్వు ఎవరివో ప్రజలు పోల్చుకోలేనంత వరకు నీకి ఢోకా ఎక్కడుంటుంది? మరి నువ్వు కాక ఇంకెవరు నెంబర్‌ వన్‌?''

అద్దంలో అధినేత మొహం వెలిగిపోయింది.

''ఈ లోకం గాంబ్లింగ్‌ హౌస్‌... ఆడేవాళ్లు బ్లడీఫూల్స్‌...

ముక్కలు మార్చే వాడెవడో, లెక్కగ కొట్టే వాడెవడో...

ఎవడికి తెలుసు?

రాజూ రాణీ జోకర్లు... కలిసొస్తేనే లాకియర్లు...

రంగురంగుల టోపీలు... రకరకాలుగా దోపిళ్లు...''

అంతరంగం వెర్రెత్తిపోతూ డ్యాన్స్‌ చేయసాగింది.

ఆసరికి అధినేతకి కూడా హుషారొచ్చింది. ఎవరూ లేని ఆ ఏకాంత సమయంలో అధినేత కూడా అంతరంగంతో గొంతు కలిపి గెంతసాగాడు.

''ఎస్‌... నేనే నెంబర్‌ వన్‌...

కేడీలను తలదన్నే రౌడీ నెంబర్‌ వన్‌...

రౌడీలను మరిపించే కేడీ నెంబర్‌ వన్‌...

ప్రజలందరినీ ఏమార్చే నేతా నెంబర్‌ వన్‌...

ప్రకృతి వనరులు కొల్లగొట్టే నీచా నెంబర్‌ వన్‌...

రాష్ట్రాన్ని దోచుకునే త్రాష్ట నెంబర్‌ వన్‌...

జనం జెల్లకొట్టి జోకొట్టే జగజ్జేతా నెంబర్‌ వన్‌...

వోటర్లకు ఎరలేసే లోఫర్‌ నెంబర్‌ వన్‌...

అధికారంతో ఆడుకునే తొండీ నెంబర్‌ వన్‌...

ఎస్‌... నేనే నెంబర్‌ వన్‌!''

అధినేత, అతడి అంతరంగం కలిసి ఉప్పులకుప్ప, చెమ్మచెక్క, కోలాటం లాంటి నాట్యవిన్యాసాలతో గోలగోలగా పాడుతూ స్టెప్పులు వేయసాగారు.

ఇంతలో... ''స్టాపిట్‌! నాన్సెస్‌!!'' అనే కేకలు గట్టిగా వినబడ్డాయి. అంతరంగం గబుక్కున అధినేతలోకి దూరిపోయింది. అధినేత అటూ ఇటూ చూసేసరికి, అద్దం వెనక నుంచి తనలాంటిదే మరో రూపం బయటకి వచ్చింది.

''ఎవరు నువ్వు? సీబీఐ ఆఫీసర్‌ వా? నిఘా సంస్థ ప్రతినిధివా? దర్యాప్తు సంస్థ అధికారివా? సుప్రీం కోర్టు అబ్సర్వర్‌ వా? ప్రతిపక్ష నాయకుడివా?'' అంటూ అధినేత ప్రశ్నల వర్షం కురిపించాడు.

''ఆఖరికి నన్నే గుర్తు పట్టలేకపోయావన్నమాట. నేను నీ అంతరాత్మను'' అందా రూపం.

''అంతరాత్మా? అది ఉన్నట్టే నాకు తెలియదే?'' అన్నాడు అధినేత.

''అవునులే.  నా నోరునొక్కి, అడ్డమైన పనులు చెప్పే అంతరంగంతో చేతులు కలిపి అడ్డగోలుగా ఎదిగిన వాడివి. నీకు నేనెందుకు గుర్తుంటాను?'' అంది అంతరాత్మ.

''అడ్డగోలుగా ఎదిగానా? అడ్డమైన పనులు చేశానా? ఏంటి ఇష్టమొచ్చినట్టు వాగుతున్నావ్‌? నేనెవరో తెలుసా? రాజకీయంలో నెంబర్‌ వన్‌. అరాచకీయంలో నెంబర్‌ వన్‌. ప్రజలు ఏరికోరి ఎన్నుకున్న అధినేతా నెంబర్‌ వన్‌...'' అంటూ అధినేత జేగురించిన మొహంతో అరిచాడు.

అంతరాత్మ పగలబడి నవ్వింది. అధినేత చూస్తుండగానే ఎత్తుకు ఎదిగింది.

''మూర్ఖుడా! ఆఖరికి ఇంతలా దిగజారావన్నమాట. నీలో ఉండే నన్నే గుర్తించలేక పోతున్నావ్‌. పైగా నన్నే బెదిరించాలని చూస్తున్నావ్‌. నీకు నువ్వే నెంబర్‌ వన్‌ అనుకుంటున్నావ్‌. అందుకే ఎవరు ప్రశ్నించినా సహించలేకపోతున్నావ్‌. ఎవరు నీ లోపాలను చెప్పినా, వాటిని సరిదిద్దుకోకపోగా, వారి గొంతునే నులిమేయాలని చూస్తున్నావ్‌. అందుకే ప్రతిపక్షం అనేదే లేకుండా చేసుకోవాలని చూస్తున్నావ్‌. అందుకోసం జీవో నెంబర్‌ వన్‌ రూపొందించావ్‌. ఇది ప్రజాస్వామ్యమనే సంగతినే విస్మరించావ్‌. అంతా నీ ఇష్టారాజ్యమనుకుంటున్నావ్‌. ఇప్పుడు ఎవరైనా నీ అసలు స్వరూపాన్ని బయటపెడతారేమోనని బెదిరిపోతున్నావ్‌. అందుకనే అడ్డమైన ఆంక్షలు పెడుతున్నావ్‌. లేనిపోని నిబంధనలు విధిస్తున్నావ్‌. కానీ ఒక్క సంగతి విస్మరిస్తున్నావ్‌. ప్రజలు నిన్ను, నీ అంతరంగాన్ని కనిపెడుతూనే ఉన్నారనే సంగతిని గుర్తించలేకపోతున్నావ్‌. ఒకప్పుడు సొంత ఇల్లయినా లేని నువ్వు కొన్నేళ్లలోనే ఇతర రాష్ట్రాల్లో సైతం పెద్ద పెద్ద భవంతులు ఎలా నిర్మించగలిగేవో ప్రజలు గ్రహించలేరనుకుంటున్నావా? ఒకప్పుడు కేవలం చిన్న కంపెనీతో కాలక్షేపం చేసే నువ్వు కొన్నేళ్లలోనే కోట్లకు కోట్లు ఎలా సంపాదించావో జనం కానుకోలేరనుకుంటున్నావా? ఒకనాడు కేవలం మూడు లక్షల లోపు ఆదాయపు పన్ను కట్టిన నువ్వు అనతి కాలంలోనే కోట్లకు కోట్లు పన్ను కట్టగలిగే స్థాయికి ఎలా ఎగబాకావో సామాన్యులు గమనించలేరనుకుంటున్నావా? కళ్ల ముందు నువ్వు, నీ అనుచరులు  కలిసి సాగించే ఇసుక మాఫియా ఎంతలా వేళ్లూనుకుని పోయిందో బడుగులు అంచనా వేయలేరనుకుంటున్నావా? రేషన్‌ బియ్యాన్ని సైతం అడ్డగోలుగా సేకరించి మరపట్టించి విదేశాలకు సైతం తరలిస్తున్న బియ్యం మాఫియా జాడల్ని పేదలు పసిగట్టలేరనుకుంటున్నావా? మద్యం వ్యాపారాన్ని అయినవాళ్లకి అప్పజెప్పి ముడుపులెలా పుచ్చుకుంటున్నావో ప్రజలు ఆకళింపు చేసుకోలేరనుకుంటున్నావా? ప్రజల పేరు చెప్పి, అభివృద్ధి ఆశలు చూపించి ప్రజల ఆస్థి అయిన భూముల్ని, గనుల్ని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేసి వాళ్ల నుంచి ఎలా వాటాలు అందుకుంటున్నావో నువ్వు అమాయకులనుకుంటున్న జనం ఊహించలేరనుకుంటున్నావా? కళ్ల ముందు కోటానుకోట్లు దోపిడీ చేస్తూ కాసిన్ని డబ్బులు కాతాల్లో వేసేసినంత మాత్రాన వోటర్లు నిజాలేంటో నిగ్గుతేల్చుకోలేరనుకుంటున్నావా? అడిగినా, ప్రశ్నించినా, నిరసన వ్యక్తం చేసినా, అసమ్మతి చూపించినా లేనిపోని కేసుల్లో ఇరికించి ఎలా వేధిస్తున్నావో ప్రజలు తెలుసుకోలేరనుకుంటున్నావా? నీ హయాంలో ఏ రంగం అభివృద్ధి చెందిందని ఇలా విర్రవీగుతున్నావ్‌?  విద్యా వ్యవస్థ ఎలా గతి తప్పిందో తల్లిదండ్రులకు తెలియదా? వ్యవసాయం ఎలా కునారిల్లిందో రైతులకు తెలియదా? అధికార రంగం ఎలా చతికిల పడిందో ఉద్యోగులకు తెలియదా? రాష్ట్రం ఎంతలా అప్పుల పాలైందో ఆర్థికవేత్తలకు తెలియదా? పరిశ్రమలు ఎందుకు రావడం లేదో నిరుద్యోగులకు తెలియదా? నీ పాలనలో ఇన్ని లోపాలు పెట్టుకుని నువ్వు, నీ అంతరంగం కలిసి నేనే నెంబర్‌ వన్‌ అనుకుని గెంతులు వేస్తే సరిపోతుందనుకుంటున్నావా? నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేని నువ్వొక నెంబర్‌ వన్‌ నీచుడివి. నెంబర్‌ వన్‌ నికృష్టుడివి. నెంబర్‌ వన్‌ ఛీటర్‌ వి. నెంబర్‌ వన్‌ ఫూల్‌ వి. నెంబర్‌ వన్‌ భ్రష్టుడివి. ఇక ఇప్పుడు పాడుకో ఎలా పాడుకుంటావో''.

అంతరాత్మ ఒకో ప్రశ్న వేస్తూ ఆకాశమంత ఎదిగిపోయేసరికి అధినేత అంతకంతకు చిన్నవాడై బిక్క మొహం వేశాడు.

-సృజన

PUBLISHED ON 10.01.2023 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి