అధినేత కుర్చీలో కులాసాగా కూర్చుని అధికారులు సిద్ధం చేసిన రిపబ్లిక్ దినోత్సవం ప్రసంగాన్నిచదువుకుంటున్నాడు. ఈలోగా సెక్రటరీ వచ్చాడు.
''ఆఫీసర్లు కిందా మీదా పడి స్పీచేదో రాసుకొచ్చారు
కానీ, నాకెందుకో కాస్త
వెలితిగా ఉందయ్యా...'' అన్నాడు అధినేత జనాంతికంగా.
సెక్రటరీ ఆ ప్రసంగం కాగితాన్ని తీసుకుని చూసి, ''సర్... మీ అసంతృప్తి ఏంటో చెబితే
తిరగరాయిస్తానండి...'' అన్నాడు వినయంగా.
''మనం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏమేం
చేశామో ఏకరువు పెట్టారు కానీ, ఇది చాలదయ్యా...'' అన్నాడు అధినేత ఏదో ఆలోచిస్తూ.
''చిత్తం... అక్కడికీ నేను చెప్పానండి. తమరు
పవర్ లోకి వచ్చింతర్వాత జనానికి జరిగిందంతా
పోగు చేసి, కూసింతైనా దాన్నే మైక్రోస్కోపులో చూసి, జీళ్ల పాకం పట్టి, దిమ్మిశా చేసి, సాగదీసి, విశాలం
చేసి భూతద్దంలో పెద్దగా చూపించాలని, ఆ పైన టెలిస్కోపులో చూపించినట్టు
హంగామా గట్రా చేయాలని సూచించానండి. పాపం... ఇంతకన్నా కుదరలేదనుకుంటానండి...''
అన్నాడు సెక్రటరీ ఉన్నదున్నట్టుగా.
''అవుననుకో. కానీ అవతల ఎన్నికలొచ్చేస్తున్నాయా, మరీ సమయంలో స్పీచ్ ఇంత చప్పగా
ఉంటే ఎలాగా అని ఆలోచిస్తున్నానయ్యా. నువ్వే ఏదైనా ఉపాయం చెప్పు...'' అన్నాడు అధినేత.
ఆ మాటకి సెక్రటరీ ఉబ్బితబ్బిబ్బయిపోయి, ''దాందేముంది సార్... ఉన్నదంతగా
లేనప్పుడు, లేనిది ఉన్నట్టుగా, మీ పాలనలో
లేనిదేదీ లేనట్టుగా, జనానికసలు సమస్యలనేవే లేనట్టుగా,
తమరి హయాంలో ఎక్కడా లేని సంతోషమంతా ఉన్నట్టుగా, మీ పరిపాలన తీరు ప్రపంచంలో మరెక్కడా
లేనట్టుగా, సామాన్యుల
జీవితాలు స్వర్గంలో ఉన్నట్టుగా, ఇక్కడ ఉన్న అభివృద్ధి మరెక్కడా
లేనట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా కాకుండా, చెప్పేదేదేనా చెప్పిన చోట చెప్పకుండా
చెప్పుకురావడం మీకలవాటేగా? అలా చెప్పేయండి సార్...''
అన్నాడు హుషారుగా.
''హ్హ...హ్హ...హ్హ హ్హా! బలే చెప్పావయ్యా...
సర్లే, అలాగే కానిచ్చేస్తాను.
ఇంతకీ ఏంటివాళ విషయాలు?''
''మరేం లేదు సార్... మీరు కాదనరనే ధైర్యంతో, మీ దగ్గర ఇన్నాళ్లుగా పని చేసిన
చనువుతో, మీకు ముందుగా చెప్పకుండా, మీ అపాయింటుమెంటు
కొందరికి ఇచ్చేశాను సార్... వాళ్లు బయట కూర్చుని ఉన్నారు. తమరు కాదనకూడదు...''
''వార్నీ... అప్పాయింటుమెంటంటే ఆయింటుమెంటనుకున్నావేంటయ్యా, ఎవరికి పడితే వారికి ఇచ్చేయడానికి? వచ్చేదెవరో తెలియకపోతే అప్పటికప్పుడు
ఏం మాట్లాడతాం? తెలిస్తే వాళ్లనెలా బుట్టలో వేయొచ్చో ఆలోచించుకుని
రమ్మనచ్చు... ఇంతకీ ఎవరు వాళ్లు?''
''భలేవార్సార్. మీకిబ్బంది కలిగిస్తానా? వాళ్లు మీ అభిమానులండి. ఇంకా చెప్పాలంటే
తమ భక్తులండి. బాగా ఆరా తీసే ఈ రహస్య సమావేశం ఏర్పాటు చేశానండి...''
''సర్లె... మరయితే వాళ్లని మన సీక్రెట్
ఛాంబర్ లోకి తీసుకురా...''
అధినేత అనుమతి ఇవ్వడంతో సెక్రటరీ ఉత్సాహంగా బయటకి
వెళ్లి ఓ గుంపుని వెంట తీసుకుని వచ్చాడు. వాళ్ల చేతిలో పూలదండలు, పుష్ఫగుచ్ఛాలు ఉన్నాయి.
వాళ్లలో చూడ్డానికి మొరటుగా ఉన్న ఒకతను ఓ పెద్ద
దండ పట్టుకుని చకచకా ముందుకొచ్చి అధినేత మెడలో వేశాడు.
''జగజ్జేతకీ జై... జగజ్జెట్టీకీ జై...'' అన్నాడు బొంగురుగొంతుతో. అతడితో
పాటు వచ్చిన వాళ్లంతా పళ్లికిలిస్తూ చప్పట్లు కొట్టారు.
''ఎవరయ్యా మీరు... ఈ జేజేలు దేనికి? నేనేం సాధించాననీ?'' అన్నాడు అధినేత, లోపల ఆనందపడుతూనే, పైకి లేని వినయం చూపిస్తూ.
''అమ్మమ్మ... ఎంత మాట! తమరు అలవోకగా చేసే
పనులన్నీ మాలాంటి వాళ్లకు పెదబాల శిక్షలు కదండీ... అందుకే ఓ విన్నపంతో వచ్చామండి...''
''ఏంటో మీ అభిమానం. వద్దంటే వినరు కదా. సరే...
ముందు మీరెవరో, ఏంటో
చెప్పండి మరి...''
''మా గురించి ఉన్నదున్నట్టు చెబుతానండి.
ప్రజల భాషలో చెప్పాలంటే నేనొక దగుల్బాజీనండి. ఇదిగో వీడొట్టి వెధవండి. వీడికంటే వాడొక
అరెక్కువండి. అంటే వెధవన్నర వెధవన్నమాటండి. ఇక ఆడొక పుండాకోరండి. ఆపక్కన నుంచున్నోడు
తేనె పూసిన కత్తండి. ఇహ ఈయన తడి గుడ్డల్తో గొంతులు కోసే రకమండి... మొత్తానికి మేమంతా
అఖిలాంధ్ర దొంగ, దుండగ,
దగాకోరు, దౌర్జన్యకారుల సంఘం సభ్యులమండి. నేనే
అధ్యక్షుడినండి...''
అధినేత పగలబడి నవ్వాడు. ''వహార్నీ... బాగుందయ్యా మీ ఇంట్రడక్సను.
అయితే ప్రజల సొమ్ము దోచుకుంటున్నారన్నమాట. ఏ మాత్రం వెనకేశారేంటి?''
''శ్రీవారితో పోలిస్తే మేమెంతండి? గడ్డి మేసే గాడిదలం. తమరిలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని
ఖజానాని పిండే తెలివెక్కడిదండీ?''
''సర్లె... పొగడ్తలు ఆపి, విషయంలోకి రండి. నాకవతల చాలా పనులున్నాయి...''
''అదేనండి. రిపబ్లిక్ దినం వస్తోంది కదండి.
ప్రజలతో మీ పబ్లిక్ సమావేశం పూర్తయ్యాక,
మేం ఏర్పాటు చేసే మరో ప్రత్యేకమైన రీపబ్లిక్ రాత్రోత్సవ సభకు రావాలండి...''
''ప్రత్యేకమైన రీపబ్లక్ రాత్రోత్సవమేంటయ్యా...?''
''మరేంలేదు సార్. రాజ్యాంగాన్ని ఏర్పాటు
చేసుకున్నాక, దాన్ని
అమలు చేసుకునే రోజునే దేశమంతా రిపబ్లిక్ దినోత్సవం జరుపుకుంటుంది కదండీ? అదంతా పబ్లిక్ వ్యవహారమండి. కానీ తమరు అధికారంలోకి వచ్చాక ఆ రాజ్యాంగాన్ని
తిరగరాస్తున్నారు కదండీ? రాజ్యాంగానికే వక్రభాష్యాలు చెబుతూ, రాజ్యాంగ వ్యతిరేక
కార్యక్రమాలను నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అమలు చేస్తున్నారు కదండీ?
అంచేత మేం ప్రత్యేకంగా ఈ రీపబ్లిక్ రాత్రోత్సవాన్ని ఏర్పాటు చేశామండి.
అంటే ఇది రాజ్యాంగ వ్యతిరేక రాత్రోత్సవమన్నమాటండి. అర్థరాత్రి మొదలవుతుందండి. తమరొచ్చి
మేం ప్రత్యేకంగా తయారు చేసిన జెండాను ఆవిష్కరించి, మాలోంటోళ్లని
ఉద్దేశించి ప్రసంగించాలండి. మాకదో తృప్తండి.
కాదనకూడదు....''
అధినేత ముసిముసిగా నవ్వుకుని సరేనన్నాడు.
++++++++++
రాజ్యాంగ వ్యతిరేక రాత్రోత్సవం మొదలైంది. అధినేత
వస్తుంటే మైకులో పాట మొదలైంది.
''వేలెత్తి ఎదురెట్టు మొరటోడా... గతమెంతో
అపకీర్తి కలవోడా!''
అక్కడ హాజరైన సంఘ సభ్యులందరూ పూలు జల్లుతుంటే అధినేత, హుందాగా జెండా కొయ్య దగ్గరకి వచ్చి
అక్కడ తాడు పట్టుకుని లాగాడు. వెంటనే జెండా ఆవిష్కృతమైంది. ఎర్ర మరకులున్న జెండాపై
కత్తులు, కటార్లు, కళ్లగంతలు, బేడీలు లాంటి గుర్తులు ముద్రించి ఉన్నాయి. వెంటనే సభ మొదలైంది.
అధినేతను ఆహ్వనించిన అధ్యక్షుడు తన ఉపన్యాసం మొదలు
పెట్టాడు.
''సంఘ వ్యతిరేక శక్తులారా! చట్ట విరుద్ధ
మిత్రులారా! నేడు మనకు సుదినం. అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని విస్మరించి, దాన్ని తిరగరాసి, చరిత్రను వక్రంగా లిఖిస్తున్న మన అధినేత ఈ సభకు విచ్చేయడం మనందరికీ ఆనందదాయకం.
మనమందరం నీచమైన పనులు చేసి, దొంగతనాలు దోపిడీలు, దురాగతాలకు తలబడి చెడ్డవాళ్లమనే ముద్ర వేసుకుని తిరుగుతున్న వాళ్లమే. కానీ
ఈయన? పైకి మంచిగా కనిపిస్తూ,
అందరికీ మంచి చేయడానికే అవతారమెత్తినట్టు నమ్మిస్తూ మనందరి కన్నా ఎక్కువగా
దోచుకుంటున్న ఘన నేత. మనం చేసే పనులను మనం దొంగతనంగా, భయపడుతూ
చేస్తున్నాం. మరి ఈయన? ప్రజల పేరు చెప్పి, అభివృద్ధి చేస్తున్నట్టు పైకి చెబుతూ, ఏ పని చేపట్టినా,
లోపాయికారీగా కమీషన్ల రూపంలో కోట్లకు కోట్లు చేతులు మారే వ్యవస్థను నెలకొల్పారు.
ఇసుకని కాదు, మద్యమని కాదు, నీటి ప్రాజెక్టులని
కాదు, కొండలని కాదు, గనులని కాదు,
భూములని కాదు, పొలాలని కాదు... అన్నింటినీ ప్రగతి
పేరిట బాహాటంగా, ఎక్కడా చట్టానికి దొరక్కుండా భోంచేస్తున్నమహా
రాజకీయ నేత. ఒకప్పుడు ఇల్లు తాకట్టు పెట్టే స్థితి నుంచి ఈనాడు ఇతర రాష్ట్రాల్లో సైతం
విలాసవంతమైన భవంతులు నిర్మించుకునే స్థితికి వెళ్లిన నాయకుడు. అధికారం లేకుండానే ఈయన
నడిపిన అవినీతి కార్యకలాపాల లోగుట్టుమట్టులు తేల్చడానికి మహా మహా కోర్టులు సైతం కిందమీదులవుతున్నాయి.
రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా తన అధికారానికి అనుగుణంగా సొంత రాజ్యాంగాన్ని రచించుకున్న
ఈయనకు నేను ఈ సందర్భంగా 'రాజ్యాంగ భ్రష్ట' అనే బిరుదును సభా ముఖంగా సవినయంగా సమర్పించుకుంటున్నాను...'' అనగానే చప్పట్లు మార్మోగాయి.
''ఇప్పుడు ఈయన మనందరి మేలు కోరి ప్రసంగించాలని, నీచ నికృష్ట పనులను చేయడంలో నైపుణ్యాలను
వివరించాలని కోరుతున్నాను. ఈయన మాటలు విని మీరంతా మరింత చెడిపోవాలని కోరుతున్నాను...''
అంటూ అధ్యక్షుడు, అధినేతను సాదరంగా మైకు ముందుకు
ఆహ్వానించాడు.
అధినేత ముసిముసిగా నవ్వుతూ, ''అసలిలాంటి వినూత్నమైన రీపబ్లిక్
ఉత్సవాన్ని జరపాలనే ఆలోచన వచ్చినందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీ అభిమానం
చూస్తుంటే ఆనందంగా ఉంది. కాబట్టి నాకు తెలిసిన కొన్ని చెడ్డ మాటలు చెబుతాను. మీరంతా
ముందు చూపులేని సాదా సీదా అమాయక నేరగాళ్లు. నేనలా కాదు. రానున్న కొన్నేళ్లపాటు నిరాటంకంగా,
నిరంతరాయంగా, నిర్భయంగా, నిశ్చింతగా, నిబ్బరంగా కోట్లకు కోట్లు దోచుకోడానికి పథక
రచన చేసిన రాజకీయ వేత్తను. అన్నింటికన్న పెద్ద సంపద ప్రజా ధనం. దాన్ని దోచుకోవాలంటే
అధికారం రావాలి. అది రావాలంటే ప్రజలను నమ్మించాలి. నిజానికి అదొక కళ. ఒకసారి అధికారం
అందాక అమాత్యుల నుంచి అధికారుల వరకు, అస్మదీయుల నుంచి అనుచరుల
వరకు అందరికీ అవినీతిని రుచి చూపించాలి. ఒక విధంగా అవినీతిని కేంద్రీకరించాలి. వ్యవస్థీకృతం
చేయాలి. అందుకుగాను రాజ్యంగ, చట్ట, న్యాయ,
ప్రజాస్వామ్య వ్యవస్థలను, విధానాలను ఒకటొకటిగా
భ్రష్టు పట్టించాలి. ఈ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలెదురైనా జంక కూడదు. ప్రశ్నించే వాళ్లను,
మన చర్యలను నిరసించే వాళ్లను కర్కశంగా అణచివేయాలి. ఇందుకు చట్టంలో లొసుగులను
వాడుకోవాలి. రాజ్యాంగంలోని లోపాలను ఉపయోగించుకోవాలి. నేను చేసిందదే. ఇన్ని పనులు చేస్తున్నా
మనం అధికారంలోకి రావడానికి దోహద పడే ఓటు బ్యాంకును మాత్రం విస్మరించకూడదు. వాళ్లకి
కూడా డబ్బు రుచి చూపించాలి. ప్రజలు అమాయకులు. వాళ్లకు పది రూపాయలు పడేసి, వాళ్ల కళ్ల ముందే కోట్లకు కోట్లు దోచేసుకుంటున్నా పట్టించుకోరు. నిజానికి వాళ్లకి
మనం పథకాల రూపంలో పంచేది కూడా వాళ్ల డబ్బేనని తెలుసుకోలేరు. ఇప్పటికే మీలాంటి వాళ్లను
నా అనుచర వర్గంగా పెట్టుకున్నాను. మిమ్మల్ని కూడా ముందు ముందు ఉపయోగించుకుంటానని మాట
ఇస్తున్నాను'' అంటూ ముగించాడు.
ఆ అర్థరాత్రి అక్కడ చేరిన సభ్యులందరూ ఆనందంతో చప్పట్లు
మోగించారు. ఆ తర్వాత 'భారత భ్రష్ట', 'చెడ్డశ్రీ', 'నీచ
విభూషణ్', 'నికృష్ట రత్న' లాంటి పతకాలను
అధినేత ప్రదానం చేశాడు. శకటాలుగా ప్రదర్శించిన దోపిడీ ధనం, తుపాకులు,
బందూకులు, బాంబులు, గ్రెనేడ్లులాంటి పరికరాలతో కూడిన వాహనాలను ఆనందంగా తిలకించాడు. దౌర్జన్యకారుల
గౌరవవందనం స్వీకరించాడు. ఈలోగా తెల్లారిపోయేసరికి ఎక్కడివారక్కడ జారుకున్నారు.
-సృజన
PUBLISHED ON 24.1.2023 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి