శనివారం, జనవరి 14, 2023

జన చైతన్య సంక్రాంతి!

 


 ప్రజాకర్షక, జన వంచక విధానాల గురించి ఆలోచిస్తూ అలసిపోయి ఆదమరిచిన అధినేతకి కుర్చీలోనే కాస్తంత కునుకు పట్టిందో లేదో, సన్నాయి నాదంతో పాటు పాట వినిపించి మెలకువ వచ్చింది.

''అయ్యవారికి దణ్ణం పెట్టు...

అమ్మవారికి దండం పెట్టు...

డూ డూ డూ డూ బసవన్నా...

చూడూ చూడూ బసవన్నా...''

అంటూ గంగిరెద్దుల వాళ్లు పాట పాడుతూ రావడం కనిపించింది.

''ఏంటి బాబూ ఇదీ... ఈ పాటలేంటీ... ఇలా వచ్చారేంటీ...'' అంటూ సాగదీశాడు అధినేత.

''దండాలు బాబయ్యా... రాజ్యమేలే రాజులు తమరు... పండగ కదాని వచ్చాం బాబయ్యా... ఆపై తమ దయ...'' అన్నాడు గంగిరెద్దు మేళం పెద్ద.

''మంచిది బాబూ... మీ గురించి కూడా గంగిరెద్దు భరోసా పథకం పెడతానూ... గంగడోలు దువ్వుతానూ...'' అన్నాడు అధినేత.

''మమ్మల్ని కూడా నమ్మిస్తున్నారా బాబయ్యా... ముందు మా పాట వినండి అయ్యా....'' అన్నాడా పెద్ద నర్మగర్భంగా. ఆ తర్వాత పాట అందుకున్నాడు.

''డూ డూ డూ డూ బసవన్నా...

బంగరు గిట్టల బసవన్నా...

పైడి కొమ్ముల బసవన్నా...

నిజాలు చెప్పు బసవన్నా...

ప్రజలను వీడు బసవన్నా...

పశువుల చేసెను బసవన్నా...

అబద్దాలతో బసవన్నా...

ఆకర్షించెను బసవన్నా...

కుర్చీ ఎక్కి బసవన్నా...

అన్నీ మరిచెను బసవన్నా...

మత్తులో ముంచి బసవన్నా...

మాయ చేసెను బసవన్నా...''

అధినేత తుళ్లి పడ్డాడు. ''ఏయ్... ఏంటా పాట?'' అన్నాడు కోపంగా.

''శాంతించండి బాబయ్యా... మేం గంగిరెద్దునే ఆడిస్తాం. మీరు ప్రజల్నే గంగిరెద్దుల్ని చేసి ఆడిస్తున్నారు. అమాయక జనం మీరు చెప్పినదానికల్లా మొదట గంగిరెద్దుల్లాగే తలలూపారు. ఇప్పుడు పూర్తిగా అర్థమైపోతోంది బాబయ్యా... అందుకే మా పాట కూడా కొత్తగా సాగుతోంది...ఇక వెళ్లొస్తాం'' అన్నాడు. గంగిరెద్దు పెద్దగా రంకె వేసి కొమ్ములు విసిరి సాగిపోయింది.

అధినేతకి ఏమనాలో తోచలేదు. వీళ్లపై ఏదైనా అడ్డగోలు కేసు బనాయించాలనుకున్నాడు. లేదా గంగిరెద్దుల వాళ్లు ఇంటింటికీ తిరగకుండా ఆంక్షలు విధిస్తూ ఏదైనా కొత్త జీవో జారీ చేయాలనుకున్నాడు. ఆ ఆలోచనలో ఉండగానే మరో పాట వినిపించింది.

''హరిలో రంగ హరీ... నిజం తెలుసుకో మరి...'' అంటూ హరిదాసు వచ్చాడు.

''నువ్వెవరు నాయనా? ఎందుకిలా వచ్చావూ? నీక్కూడా ఏదైనా పథకం కావాలా?'' అన్నాడు అధినేత.

''ధర్మప్రభువులు... అక్కర్లేదయ్యా... మమ్మల్నిలా బతకనిస్తే చాలు...'' అంటూ హరిదాసు చిడతలు వాయిస్తూ పాటందుకున్నాడు.

''హరిలో రంగ హరీ...

భ్రమలు వదులుకో మరి...

ఎన్నికలొస్తే ఈసారి...

ఆలోచించుకో ఓసారి...

వచ్చాడమ్మా కిందటి సారి...

వంచన నేర్చిన మాయలమారి...

ఆ ఉచ్చులో పడితే మరోసారి...

నీ భవితకు అదే అవుతుంది ఘోరీ...

హరిలో రంగ హరీ!''

చిడతలు వేస్తూ హరిదాసు పాడేసరికి అధినేత ఉలిక్కిపడ్డాడు.

''ఏంటయ్యా... ఏం పాడుతున్నావు?'' అంటూ గద్దించాడు.

''ఊరుకోండి బాబయ్యా... మూడున్నరేళ్ల క్రితం ఇలాగే మీరు ఊరువాడా, ఇల్లూ వాకిలీ తిరుగుతూ హరికథలెన్నో చెప్పారు. జనం అవన్నీ నిజమనుకుని నమ్మారు. అప్పట్లో జనం ఏడవకున్నా మీరు ఓదార్చారు. అదే జనం ఇప్పుడు బోరుమని ఏడుస్తున్నారు. అందుకే నా వంతుగా వాళ్లని చైతన్య పరచాలని ప్రయత్నిస్తున్నా. ఇక వస్తా...'' అంటూ వెళ్లిపోయాడు.

అధినేతకి ఏమీ అర్థం కాలేదు. ''ఏం జరుగుతోంది?'' అనుకున్నాడు.

'కొంపదీసి జనం నిద్రలోంచి మేలుకోలేదు కదా?' అని భయపడ్డాడు. తర్వాత ఆ ఊహకే బెంబేలెత్తి పోయాడు. ఇంతలో కొందరు మహిళలు  చకచకా వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేయసాగారు. మరి కొందరు ఆడవాళ్లు ఆ ముగ్గుల్లో గొబ్బిళ్లు పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటందుకున్నారు.

''గొబ్బీయలో... గొబ్బీయలో...

సంక్రాంతి పండగొచ్చె గొబ్బీయలో...

అందరినీ మేలుకొలిపె గొబ్బీయలో...

ఊరువాడ ఏకమై గొబ్బీయలో...

ఊదరగొట్టేయాల గొబ్బీయలో...

ఓటు రాజకీయాలను గొబ్బీయలో...

ఓడించి తరమాల గొబ్బీయలో...

గూడుపుఠానీగాళ్లకు గొబ్బీయలో...

గూబగుయ్యిమనాల గొబ్బీయలో...

ఆడవాళ్ల శక్తి చూపి గొబ్బీయలో...

ఆటకట్టు చేయాల గొబ్బీయలో...''

అధినేతకు ఏమనాలో తోచలేదు. ''ఏంటింది? ఏమంటున్నారు? ఓ అక్క, ఓ అమ్మ, ఓ చెల్లి, ఓ అవ్వ... మీ కోసమే కదా ఎన్నో పథకాలు పెట్టాను? అవన్నీ మరిచారా?'' అన్నాడు.

''ఊరుకోవయ్యా... పెట్టావులే పథకాలు. ఇంటా బయటా ఆడవాళ్లకి రక్షణ లేకుండా చేశావు. మద్యాన్ని సారాని ఏరులై పారించేసరికి మా మగాళ్లంతా పూటుగా తాగి ఇల్లూ ఒళ్లూ గుల్ల చేసుకుంటున్నారు. నాటు మద్యం మరిగి అనారోగాల పాలవుతున్నారు. ఇక బయట మా మహిళలకు భద్రతే లేదు నీ హయాంలో. ఆడాళ్లపై అత్యాచారాల్లో మన రాష్ట్రం దేశంలోనే ఘనతకెక్కిందంటే నువ్వేంటో, నీ పాలనేంటో తెలుసుకోలేమనుకుంటున్నావా? అందుకే ఈ పండగ పేరు చెప్పి అందరినీ మేలుకొలుపుతున్నాం... తెలిసిందా?'' అంటూ గయ్యిమన్నారు. అధినేత నోరెళ్లబెట్టాడు. ఇంతలో గంగిరెద్దుల వాళ్లు, హరిదాసులు, ఆడవాళ్లు అందరూ కలసి కోలాటం ఆడసాగారు.

''హే... భగ భగ భగ భగ భోగి మంటలే...

 గణ గణ గణ గణ గంగిరెద్దులే...

కణ కణ కణ కణ కిరణ కాంతులే...

హే ధగ ధగ ధగ ధగ ధనుస్సూర్యుడే...

చక చక చక చక మకర రాశిలో...

మెరిసే మురిసే సంక్రాతే...'' అంటూ కలిసికట్టుగా నాట్యం చేయసాగారు.

అధినేతకు ముచ్చెమటలు పట్టాయి. కళ్లు బైర్లు కమ్మాయి. జనం చైతన్యవంతులైపోతే ఎలా ఉంటుందో అర్థమైంది.

గొంతు తడారిపోయింది. గుండె పట్టేసింది. ఆ సరికి పీడకల నుంచి మెలకువ వచ్చింది!

-సృజన

 PUBLISHED ON 15.01.2023 ON JANASENA WE BSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి