సోమవారం, ఫిబ్రవరి 13, 2023

అరాచక గీతాలు!

 


శిష్యుడు వచ్చేసరికి గురువుగారు ఇయర్‌ఫోన్స్‌పెట్టుకుని పాటలు వింటున్నారు. తన్మయత్నంతో తలూపుతూ ఆయన ఆనందిస్తుంటే, శిష్యుడు చాలా సేపు ఎదురు చూశాడు.

ఆఖరికి విసుగొచ్చి, ''అదేంటి గురూగారూ! నేనేదో  మీ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుందామని వస్తే, మీరేమో పాటలతో కాలక్షేపం చేస్తున్నారూ?'' అంటూ నిష్ఠూరమాడాడు.

గురువుగారు ఫోన్‌పక్కన పెట్టి, ''సినిమా పాటలంటే అంత చులకనొద్దురోయ్‌. అవి కూడా రాజకీయాలు నేర్పుతాయి తెలుసా?'' అన్నారు.

''ఊరుకోండి సార్‌... మీరు మోకాలికీ బోడిగుండుకీ  ముడి పెడతారు. పాటలు పాఠాలు చెప్పడమేంటండీ?''

''మరదే తెలివితక్కువతనమంటే. నేర్చుకోవాలనే తపనుండాలే కానీ ఎందులోనుంచైనా మనక్కావలసినదాన్ని పిండుకోవచ్చు. కావాలంటే నేనొక  పాట పెడతాను. దాని పరమార్థం ఏమిటో చెప్పు చూద్దాం...''

''సరే పెట్టండి. వద్దంటే మాత్రం మీరు వింటారా?''

''అప్పు చేసి పప్పుకూడు తినరా ఓ నరుడా...

గొప్ప నీతి వాక్యమిదే వినరా పామరుడా...

ఉన్నవాడు లేనివాడు రెండే రెండు జాతులురా...

ఉన్నచోట తెచ్చుకొనుట లేనివాడి హక్కురా!

వేలి ముద్ర వేయరా సంతకాలు చేయరా...

అంతగాను కోర్టుకెళితె ఐపీ బాంబుందిరా!

రూపాయే దైవమురా రూపాయే లోకమురా...

రూక లేనివాడు భువిని కాసుకు కొరగాడురా!''

''అయ్యబాబోయ్‌... భలే పాటండీ బాబూ ఇది. ఘంటశాల పాడాడండి. మరింత చక్కని పాటలో రాజకీయం ఏముందండీ, చోద్యం కాకపోతేనూ?''

''భలేవాడివిరా... రాజకీయం ఎక్కడో ఉండదురా. నీ చుట్టూనే వైఫైలాగా అల్లుకుని ఉంటుంది. నువ్వు దాన్ని ఆన్‌చేసుకుని ఆలోచించాలంతే. మరిప్పుడు నీ పరగణాని ఏలుతున్న అధినేత ఈ పాటని ఔపోసన పట్టేశాడని కానుకో వద్దురా? రేప్పొద్దున నీ అదృష్టం బాగుండో, ప్రజల ఖర్మకాలో నువ్వు పాలకుడివైపోయావనుకో, అప్పుడు ఈ పాటే కదరా నీకు కర్తవ్యం బోధించేది?''

''అదెలాగండీ? కాస్త వివరించి చెబుదురూ...''

''ఏముందిరా... మొన్నటికి మొన్న పార్లమెంటులో నీ పరగణా ఎంత అప్పుల ఊబిలో కూరుకుని పోయిందో బయటపడింది కదరా. ఒకటా, రెండా... నీ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 4 లక్షల 42 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని స్వయంగా కేంద్ర మంత్రి ప్రకటించలేదూ? ఇక్కడితో ఆగిందా? కార్పొరేషన్లు, ఇంకా ఇతర మార్గాల్లో చేస్తున్న అప్పులు దీనికి అదనం అని కూడా చెప్పారా లేదా? అన్నీ కలిపితే మొత్తం అప్పులు పది లక్షల కోట్ల పైమాటేనని ఆర్థిక నిపుణులు, ప్రతిపక్షాలు కోళ్లై కూయడం లేదూ? వీటన్నింటి భారం పడేది ప్రజల మీదే కదా? అప్పుడిక ప్రజలంతా కలిసి 'అప్పుల కుప్ప వయ్యారి భామా...' అని పాడుకోక వేరే దారేముంది చెప్పు?''

''అవునండోయ్‌... కానీ నాకు తెలియక అడుగుతాను, ఇలా ఎడా పెడా అప్పులు చేయడం చాలా దారుణమంట కదండీ? దీని ప్రభావం భావి తరాలపై పడుతుందటగా? ఆఖరికి శ్రీలంక, పాకిస్థాన్‌లాంటి కొన్ని దేశాల్లోలాగా పరిస్థితి ఘోరంగా తయారైపోయి, జనం భోజనానికి కూడా అల్లాడిపోతారని చెబుతున్నారు కదండీ?''

''ఒరే... నీ కుటుంబం తరతరాల గురించి ఆలోచించాలి కానీ, రాష్ట్ర ప్రజల భావి తరాల గురించి నీకెందుకురా? ఆళ్లు అడుక్కుతింటే నీకేల? నీక్కావలసిందల్లా ప్రస్తుతం నీ అధికారం బాగుంటే చాలదూ? అలవి కాని ఉచిత పథకాలు ప్రకటించేసి, సాధ్యం కాని హామీలు గుప్పించేసి జనానికి ఆశలు పెట్టి, ఆళ్ల ఖాతాల్లో సొమ్ములు మీట నొక్కి పంపించేసి నీ ఓట్లు నీకు పడేలా చూసుకుంటే చాలదూ? పావలా పాసుబుక్కులో పడేసి, ఆళ్ల జేబులోంచి రూపాయి లాక్కుంటే మాత్రం నిన్నడిగేదెవర్రా?అందుకోసం అందిన చోటల్లా అప్పులు చేయడం తప్ప మార్గమేముందీ? వడ్డీలు ఎంతయినా తెచ్చేయొచ్చు. ఇంకా కావాలంటే రాష్ట్రానికి రాబోయే ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి రుణాలు దండుకోవచ్చు. అర్థమైందా?''

''అర్థమవడమేంటండీ బాబూ, తల గిర్రున తిరిగిపోతుంటేను? అప్పు చేసి పప్పు కూడు పాట సరిగా వింటే ఇంత రాజకీయం వంటబడుతుందని తెలిసిందండి... ఇప్పుడే పాట వినిపిస్తారండీ?''

''దోపిడీ దోపిడీ అంతా దొంగల దోపిడీ...

చిన్న చేపలను పెద్ద చేపలు చెప్పకుండ భోంచేయురా...

ఉన్నవాణ్ణి పైనున్నవాడు చేజిక్కితె స్వాహా చేయురా...

పేదల నెత్తురు పిండి పిండి జేబులు నింపిరి బాబులూ...

ఆ జేబులు బొత్తిగ ఖాళీ అయితే ఇంకేమున్నవి డాబులూ...''

''ఆ... గుర్తొచ్చింది గురూగారూ! ఇది 'మంచి మనిషి' సినిమాలోదండి. ఎన్టీఆర్‌ హీరో అండి. భలే సరదాగా ఉంటుందండి... కానీ ఇందులో పాఠమేముందండీ?''

''ఏడిశావ్‌... ఆ సినిమాలో హీరోగారు మంచిగా మారతాడు కానీ, నీ నిజ జీవితంలో నిన్ను పాలిస్తున్న నేత మాత్రం అలా కాదు కదరా? మారనుగాక మారడు. ఆయన పాటిస్తున్న విధానాలన్నీ ఈ  పాటలోవే కదరా మరి?''

''అదెలాగండీ...?''

''ఏముందిరా... అధికార పీఠం మీద నువ్వు కూర్చోవాలే కానీ రాష్ట్ర ప్రజల ఆస్తులన్నీ నీవే కదరా? రోడ్లు వేయిస్తామని పెట్రోలు మీద సెస్సు వేశావనుకో, ఆ వెర్రి జనం నుంచే కోట్లకు కోట్లు వచ్చిపడతాయి.  ఆటికేమన్నా లెక్కా? జమా? హోల్సేలు వ్యాపారులతో మాటాడుకుని ధరలు పెంచనిచ్చావనుకో, నీ సొంత ఖాతాలో కోట్లు జమైపోతాయి. ఇక చెత్త బాగు చేయాలనో, మరోటనో వంకెట్టి పన్నులు వేశావనుకో. పిచ్చి జనం కష్టపడి సంపాదించిన సొమ్ము మూకుమ్మడిగా పోగుపడదూ? అయ్యన్నీ ఎక్కడికి పోయాయో నువ్వేమన్నా లెక్క చెప్పాలా, ఏమన్నానా? మరిది దోపిడీ కాదూ? ఒరే... నీ అధినేత అడుగుజాడల్లో నడిచే తెలివితేటలు నీకు అబ్బాలే కానీ, పేదోళ్లకి పాత ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాలు, ఇళ్ల మీద కూడా డబ్బులు గుంజుకోవచ్చు, పైగా ఆళ్ల మేలుకేనని చెప్పి మరీనీ! మరిది పేదల నెత్తురు పిండడం కాదూ? ఇక నువ్వేలుతున్న రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, సర్కారు వారి గనులు, కొండలు, గుట్టలు, ఆఖరికి ఇసుక పర్రలు కూడా నీ సొంత ఖజానానికి కామధేనువులే కదరా? వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండుకోవచ్చు. ఫలానా కంపెనీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టేస్తుందంటూ ఓ ప్రెస్మీటెట్టి, ప్రభుత్వ భూములు రాసిచ్చేయొచ్చు. అలా ఇచ్చినందుకు ఆ కంపెనీ నీకు వాటా సమర్పించుకుంటుందని వేరే చెప్పాలా? ఆ తర్వాత ఆ కంపెనీ ఆ ఫ్యాక్టరీలు కట్టిందో లేదో ఎవడు చూడొచ్చాడు? కొన్నాళ్లు పోయాక ఆ భూముల్ని రియల్‌ఎస్టేటు వ్యాపారం చేసి అమ్ముకున్నా అడిగేవాడుండడు. అలాగే గనులు కూడాను. పైకి అనుమతి తీసుకునేది ఏ సున్నపు రాయి కోసమో అయినా, లోపాయికారీగా తవ్వుకుని తరలించేది వాటిలోని విలువైన ఖనిజాలనే కదా? ఈ నిజాలేమైనా బయటపడేవా ఏమన్నానా? ఏమంటావ్‌?''

''ఇంకేమంటానండీ, పాటల్లో ఇన్నేసి పాఠాలున్నాయని తెల్లబోవడం తప్ప. సార్‌... ఈసారి ఏదైనా మాలాంటి కుర్రాళ్లకు ఊపిచ్చే పాటేదైనా పెట్టండి సార్‌...''

''కోకా కోకా కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు...

పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టీపట్టీ చూస్తారు...

కోకా కాదు, గౌను కాదు... కట్టులోన ఏముంది?

మీ కళ్లల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి...

ఊ... అంటావా? మావా, ఊహూ అంటావా?''

''అబ్బ... అదరగొట్టారు సార్‌'పుష్ప'లో పాటేసి.  కానీ గురూగారూ, ఈ ఐటెమ్‌సాంగులో పాఠం ఏముంటుందండీ?''

'''పుష్ప' సినిమా హిట్టే కావచ్చురా. కానీ ప్రజల చెవుల్లో పుష్పాలు పెట్టే నీ నేతల సినిమా అంతకంటే సూపర్‌హిట్టు కాదురా? అధికారం చేతిలో ఉంటే ఎలాంటి తైతక్కలైనా చెల్లుతాయని చెప్పడానికీ పాటొక ఎగ్జాంపులొరే. మరి నీ రాష్ట్రంలో ఆమధ్య ఓ అమాత్యులుంగారు పండగ పేరు చెప్పి ఏకంగా కాసినో గాంబ్లింగు సెట్టింగెట్టేసి అమ్మాయిలతో కలిసి స్టెప్పులేసిన సంగతి ఎలా మర్చిపోతాంరా? బాధ్యతాయుతమైన పదవిలో ఉండే ఓ ప్రజాప్రతినిధి చేయాల్సిన పనేరా ఇది? కానీ ఎవరైనా నోరెత్తారా అని? ఇలాంటోళ్లా మనం ఓటేసి ఎన్నుకున్నోళ్లని జనం బిత్తరపోయారు కానీ, ఆ నేతలకి ఓ సిగ్గా? ఎగ్గా? ఏకంగా పేపర్లలో ఫొటోలు, వార్తలు వచ్చినా చలించారా అని? నీ అధినేత కూడా కిమ్మన్నాడా అని? మరెంత తెంపరితనమో తెలిసిందా? ఈల్లవన్నీ వంకర బుద్ధులే అయినా గెలిపించిన పాపానికి అమాయక ప్రజలు భరిస్తున్నారు చూశావా? మరి నీ నేతల అనుచరులు, అనుయాయులు, ఆళ్ల తోకలు కలిసి రాష్ట్రంలో ఆడవాళ్ల మీద అత్యాచారాలని దేశం మొత్తం మీద ఘనతకెక్కేలా చేస్తున్నారు కదరా? ఆఫీసుల్లో పని చేసుకునే ఆడాళ్లకు కూడా అధికార పార్టీ వాళ్ల వేధింపులు తప్పడం లేదన్నా, అలాంటి నీచలపై ఎలాంటి కేసులు కూడా నమోదవడం లేదన్నా, అంతకు మించిన ఘోరం ఉందా అని? మరి ఇంతకు మించిన అధికార రాజకీయ అధమాధమ పాఠం ఇంకేముంటుందిరా?''

''అవునండి బాబూ... దిమ్మ తిరిగిపోతోంది. ఎంత అధికారం ఉంటే మటుకు మరీ ఇంత అధ్వానమా, అనిపించేస్తోందండి... ఇప్పుడింకో పాటేయండి గురూగారూ...''

''ఫిఫ్టీ... ఫిఫ్టీ....

నీవో సగం... నేనో సగం...

సగాలు రెండూ ఒకటైతే

జగానికే ఒక నిండుదనం...

ఫిఫ్టీ...ఫిఫ్టీ...''

''గురూగారూ... ఇది అక్కనేని, కాంచన నటించిన డ్యూయెట్టండి. 'పవిత్రబంధం' సినిమాలోదండి. ఆఖరికి యుగళగీతాలు కూడా రాజకీయాలు నేర్పుతాయాండీ?''

''ఒరే... రాజకీయాల్లో ఉండేవన్నీ యుగళగీతాలేరా. ఈ పాట పవిత్రబంధంలోదే కావచ్చుకానీ, నీ పాలకుల హయాం చూపించే సినిమా మాత్రం 'అపవిత్ర బంధం'రా. ఆ పాటలోలాగే అధినేత నుంచి అమాత్యులు, స్థానిక అధికార పార్టీ నేతల వరకు పాడుతున్న డ్యూయట్టు ఇదే కదరా? అంతా 'ఫిఫ్టీ... ఫిఫ్టీ...' వ్యవహారమే నడుస్తోంది మరి. ఓసారలా ఇసుక కేసి చూడు. మరోసారలా మద్యం కేసి తల తిప్పు. ఇటు పేదల బియ్యం మాఫియాకేసి చూసినా, అటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాల కేసి చూసినా అంతా కనిపించేదీ, వినిపించేదీ ఈ యుగళగీతమే కదా? ఏ వ్యవహారం తీసుకున్నా ఎక్కడికక్కడ 'నీకో సగం... నాకో సగం...' అన్నట్టు పంచుకోవడం లేదూ? ఆఖరికి ఓ అభాగ్యుడు మరణించినందుకు ఆ కుటుంబానికి వచ్చే సాయంలో కూడా సగం ఇమ్మని ఓ అమాత్యుడు అడిగాడంటే దానికి మించిన నికృష్ట పాఠం ఏముంటుందిరా? అధికారం, అవినీతి కలిసి డ్యూయట్టు పాడుతున్నట్టు లేదూ? ఇప్పటికైనా అర్థమైందా పసందైన పాటలు చెప్పే అసహ్యమైన పాఠాలేంటో?''

''అర్థమైంది గురూగారూ! ఇప్పుడు మీరు కాదండి. నేనే ఓ పాట పెడతాను. అది వినండి...''

''అంతా నా ఇష్టం...

ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం...

చెడామడా చెలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం...

మీ ఇళ్లలో గబ్బిలాలనే పెంచండి అంటా నా ఇష్టం...

కుకూ అని గుడ్లగూబనే కూయించమంటా నా ఇష్టం...

హిస్టరీ కొత్తగా రాయమంటా...

హిట్లర్‌ని దేవుడిగ చేయమంటా...

టైగర్‌ని పచ్చగడ్డి మేయమంటా...

పావురానికి బాంబులిచ్చి వేయమంటా...

అంతా నా ఇష్టం... అంతా నా ఇష్టం..''

''విన్నారా గురూగారూ? కౌరవుడు సినిమాలోదండి ఈ పాట. మన అధినేత పరిపాలన తీరు ఇలాగే ఉందండి. ఏం చేసినా ఎవరేం చేస్తారనేంత ఇష్టారాజ్యంగా సాగుతోందండి వ్యవహారం. హిస్టరీని ఇప్పటికే కొత్తగా, చెత్తగా రాసేశాడండీ రాజకీయ కౌరవుడు. స్వయంగా ఆయనే హిట్లర్‌గా మారాడండి.  టైగర్‌లాంటి పోలీసు వ్యవస్థని గులాములు చేసి సర్కస్‌లో పులుల్ని ఆడించినట్టు ఆడిస్తున్నాడండి. మరది ఆళ్ల చేత పచ్చగడ్డి మేయించినట్టే కదండీ? శాంతి భద్రతలని గాలికొదిలేశాడండి. ఇప్పుడు శాంతి అంటే అధినేత మనశ్శాంతి మాత్రమేనండి. ఇక భద్రత అంటే ఆయనకి, ఆయన పార్టీ అనుచరులకే భద్రత కల్పించమండి. పావురానికి బాంబులిచ్చి వేయమనడం అంటే ఇదే కదండీ మరి? ఎవడైనా నోరెత్తి అదేమని ప్రశ్నిస్తే చట్టంలో కాలం చెల్లిన కేసుల్ని సైతం తిరగదోడి బుక్‌చేస్తున్నారండి. ఏ ప్రతిపక్ష నాయకుడైనా నిరసన ప్రదర్శన చేయబోతే ఎక్కడ లేని ఆంక్షలు, నిబంధనలు పెడుతున్నారండి. అంతా ఆళ్లిష్టమన్నట్టు సాగుతోంది కదండి... ఎలా ఉందండి ఈ పాటలో పాఠం?''

''సెభాష్‌రా... శిష్యా! పాటల్లో అరాచకీయాన్ని ఇట్టే గ్రహించావ్‌... మరి నీ పాలకుల అకృత్యాలన్నీ చూసి విసుగెత్తి పోయిన జనం ఒక్కొక్కడూ ఒక్కో జనసైనికుడైతే ఎలా ఉంటుందో, ఏమవుతుందో కూడా ఓ పాటలో చెప్పు చూద్దాం...''

''తెలుగు వీర లేవరా... దీక్ష బూని సాగరా

ఆంధ్ర మాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

దారుణ మారణకాండకు తల్లడిల్ల వద్దురా

నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా

ఎవడు వాడు? ఎచటి వాడు?

ఇటు వచ్చిన కంత్రీగాడు?

తగిన శాస్తి చేయరా

తరిమి తరిమి కొట్టరా

ప్రతి మనిషి తొడలు కొట్టి

తుది సమరం మొదలు పెట్టి

సింహాలై గర్జించాలీ

సంహారం సాగించాలీ!''

-సృజన

PUBLISHED ON 14.02.2023 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి