అధినాయకుడికి జ్వరం వచ్చింది. సెక్రటరీ హడావుడి పడిపోయాడు. కంగారుగా వెళ్లి పొలిటికల్ డాక్టర్ ని తీసుకొచ్చాడు. డాక్టర్ థర్మామీటర్ నోట్లో పెట్టాడు. అది ఫెఠేలుమని పేలిపోయింది. ఆయన తెల్లబోయి బీపీ చూశాడు. రక్తపోటు 175\175 చూపించింది. డాక్టర్ స్టెతస్కోపు పెట్టి గుండె చప్పుడు విన్నాడు. అది ఎప్పటిలా ''లబ్బు... డబ్బు...'' అని ఆరోగ్యంగా కొట్టుకోలేదు. ''లబో... దిబో...'' అని దూకుడుగా కొట్టుకోసాగింది. ఇదంతా చూసి సెక్రటరీ కాళ్లూ చేతులూ తన్నేసుకున్నాడు.
''ఏం జరిగింది డాక్టర్...'' అన్నాడు ఆందోళనగా.
డాక్టర్ ఓసారి కళ్లు మూసుకుని రాజకీయంగా ఆలోచించాడు.
తర్వాత తేలికగా ఊపిరిపీల్చుకుని చెప్పాడు.
''మరేం లేదు. ఎన్నికల జ్వరం వచ్చిందంతే.
బీపీ నియోజక వర్గాల సంఖ్య చూపిస్తోంది. గుండె గెలుపు భయంతో వేగంగా కొట్టుకుంటోంది...'' అన్నాడు.
''మరైతే త్వరగా మందులు రాయండి డాక్టర్...'' అన్నాడు సెక్రటరీ.
''ఈ జబ్బుకు రాయడానికేం ఉండదు. చేయడానికే
ఉంటుంది...''
''ఏం చేయాలి డాక్టర్...''
''ప్రచారం''
''ఎంత మోతాదులో డాక్టర్...''
''అంతా ఇంతా అని కాదు. ఊరూవాడా మోతెక్కించాలి.
లేనిది ఉన్నట్టుగా ఊదరగొట్టాలి. అబద్దాలను నిజాలుగా నమ్మించాలి...''
''ఎలా డాక్టర్?''
''ఎలాగేంటయ్యా... ఇంటింటికీ పోస్టర్లు అతికించండి.
ఊర్లలో ఏ గోడనీ ఖాళీగా ఉంచొద్దు. 'నువ్వే మా నమ్మకం... నీదే మా అమ్మకం... నువ్వు లేక మేము లేము... మేము లేక నువ్వు
లేవు... నువ్వే మా ఘనత... లేకుంటే లేదు మా భవిత... మా దేవుడు నువ్వే... నీ భక్తుల మేమే...'
లాంటి ఏవేవో నినాదాలతో ప్రజలే రాసుకున్నట్టు నింపేయండి. పేపర్లలో ఫుల్
పేజీ యాడ్లు గుప్పించండి. ఆ యాడ్ల నిండా పెద్ద పెద్ద సంఖ్యలను తాటికాయంత పెద్దగా రాయండి.
వాటి పక్కన కోట్లు అని రాయించి అన్నేసి నిధులు ఖర్చు చేసినట్లు నమ్మక తప్పని పరిస్థితి
కల్పించండి. అధినేత అదోలా నవ్వుతున్న ఫుటోలను వాటి పక్కన అచ్చేయండి. ఇంకా చాలకపోతే
ప్రతి మనిషినీ పట్టుకుని పచ్చబొట్టు పొడిపించేయండి. లేకపోతే జనం నుదిటి మీద మీ నేత
బొమ్మ బొట్టుగా గుర్తు వేసేయండి. ఆఫీసులకే కాదు, ఇంటింటికీ మీ
పార్టీ రంగులు పులిమేయండి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు,
పబ్లిక్ ప్రదేశాలు ఏది చూసినా పార్టీ రంగులు రెపరెపలాడిపోవాలి. ఇవన్నీ ఫొటోలు తీయించి మీ నేతకి చూపించండి. కాస్తయినా
బీపీ తగ్గవచ్చు. బడుల్లో 'వందేమాతరం...' గీతాలు తీసేసి 'మందేమాతరం...' లాంటి
పాటలు పాడించండి. 'జనగణమన...' తీసేసి
'జగనన మన అధినాయక జయహే...' అని బెదిరించైనా పాడించండి. ఇవన్నీ వీడియోలు తీయించి మీ నేతకి చూపించండి. కాస్తయినా
జ్వరం తగ్గవచ్చు. పోలీసుల చేత కేసులు పెడతామని
బెదిరించో, ఇరగదీస్తామని చెప్పించో జనాల చేత 'జేజేలు' కొట్టించండి. అవన్నీ రికార్డు చేయించి మీ నేత
గదిలో స్పీకర్ పెట్టించి నిత్యం వినిపిస్తూ ఉండండి. గుండెపోటు నెమ్మదించవచ్చు''
''సరే డాక్టర్. కానీ ఈయన పరిస్థితి ఇంత
ఆందోళన కరంగా ఉంది కదా, నిద్ర పట్టడానికేమైనా మత్తు మందు రాస్తారా...''
''ఏం సెక్రటరీవయ్యా నువ్వు? మత్తు మందు ఇవ్వాల్సింది ప్రజలకయ్యా.
ప్రస్తుతం నిద్ర పట్టంది వాళ్లకే కదా?''
''దానికేం చేయాలో చెప్పండి సార్...''
''ఏముందయ్యా... మీరు ప్రవేశపెట్టిన నవరత్నాలో...బెడ్డలో...
ఆ పథకాలన్నింటినీ జనం చెవిలో ఇల్లు కట్టుకుని ఊదరగొట్టండి. మీ మంత్రులను, ఎమ్మెల్యేలను, కార్యకర్తలను, అకార్యకర్తలను, అకృత్య
కర్తలను, అగమ్య కర్తలను, అనుచరులను,
అనుయాయులను, వాళ్ల తోకలను, ఆ తోకల ఈకలను పోగు చేసి ఇంటింటికీ వెళ్లమనండి. గడప గడపకీ తిరిగి గగ్గోలు పెట్టమనండి.
అవతలి వాళ్లు వినకపోయినా మీరు చెప్పవలసిందేదో చెప్పి చక్కా జారుకోండి. ప్రశ్నిస్తే ప్రత్యర్థి పార్టీ వాడని ముద్రేసి ముందుకు
సాగండి. నిలదీస్తే నవ్వుకుంటూ భరించండి. సామాన్యులు
సమస్యలు ఏకరవు పెడితే మీరు వినిపించనట్టుగా పారిపోండి. ఆ తర్వాత అలా అడిగిన వాళ్ల పేర్లు
రేషన్ కార్డుల్లోను, లబ్దిదారుల జాబితాల్లోను లేకుండా తొలగించండి.
దెబ్బకి దార్లోకి వస్తారు. అసలు మీ వాళ్లు ఏఏ గడపలకు వెళుతున్నారో కనుక్కుని ముందుగానే
అక్కడి వాళ్లని బెంబేలెత్తించి ఏం మాట్లాడాలో, ఎలా జై కొట్టాలో
మాక్ డ్రిల్లు చేయించండి. ఆయా దృశ్యాలు తీసుకొచ్చి మీ నేత గదిలో టీవీ పెట్టించి చూపించండి.
పరిస్థితి కుదుట పడొచ్చు...''
''ఓకే సార్. మరి మా నేతకి సెలైన్ ఏమైనా
ఎక్కించాలా అండీ?''
''అది కూడా జనానికే ఎక్కించాలయ్యా. ఇప్పటి
పరిపాలన తీరుతో డీలా పడిపోయిన వారికి జవసత్వాలు రావాలంటే ప్రతి ప్రజా వైద్యశాలలోనూ
సామాన్యులను చేర్పించండి. బలవంతంగానైనా సెలైన్ ఎక్కించేసి అందులో పార్టీ సిద్ధాంతాలను ఇంజెక్ట్ చేయండి. నవరత్నాల
మాత్రలు మింగించండి. పథకాల అరకు తాగించండి. అంకెలు నూరి ఆ లేపనాన్ని నుదిటికి పట్టించండి.
అబద్దాల సూది మందు పొడిపించండి. ఎలాగోలా వాళ్లని భ్రమలకు లోను చేసి ఆలోచించలేని అపస్మారక
స్థితిలోకి తీసుకురండి. ఇవన్నీ చకచకా చేస్తే
మీ అధినాయకుడి పరిస్థితిలో ఏమైనా మార్పు కనిపిస్తుందేమో చూద్దాం...''
''అలాగే డాక్టర్... మరి తీసుకోవల్సిన జాగ్రత్తలు
ఏమైనా ఉన్నాయాండీ?''
''చాలా ఉన్నాయయ్యా. నిజాలు రాసే పత్రికలు
ఈయన కంట పడకుండా జాగ్రత్త పడండి. ఆ పత్రికలు నిజం రాసిన ప్రతి సారీ, మీ సొంత పత్రికలో అబద్దాలు రాసి
అచ్చెత్తించండి. వాటినే ఈయనకు చూపించండి. ఎక్కడా ఏ ప్రతిపక్ష నాయకుడూ సభలు పెట్టకుండా
చూసుకోండి. ఎవరైనా బయల్దేరినా సవాలక్ష ఆంక్షలు పెట్టండి. శాంతి భద్రతల పేరుతో ఎక్కడ
లేని వెర్రిమొర్రి నిబంధనలు జారీ చేయండి. జనానికి నిజాలు చెప్పి మేలుకొలిపే జననాయకుడెవరైనా
బయటకు వస్తే చాలు... ఫలానా సెక్షన్ ప్రకారం ప్రజలకు చెయ్యి ఊపకూడదనీ, ఇంకేదో చట్టం
ప్రకారం నవ్వ కూడదనీ, మరేదో సబ్ సెక్షన్ ప్రకారం నిలబడి మాట్లాడకూడదనీ...
అప్పటికప్పుడు జీవీలు గట్రా జారీ చేసి, ఇప్పటికే మీకు తొత్తులుగా
మారిపోయిన పోలీసు అధికారుల చేతికిచ్చి పంపించమనండి. అలాంటి నాయకుడు ఇచ్చిన పిలుపుకు
స్పందించి నిరసన తెలిపేందుకు ప్రజలు సిద్దమయితే... మీ గూండాలు, దుండగుల బృందంతో చితగ్గొట్టించండి. ఈ చావగొట్టుడు కార్యక్రమాన్ని దగ్గరుండి
విజయవంతం చేయడానికి పోలీసులను ప్రేక్షక పాత్ర వహించమని చెప్పండి. జనం ఎవరైనా తమని కొట్టిన
వాళ్లపై కేసులు పెట్టడానికి పోలీసు స్టేషన్లకు వెళితే అక్కడ సిబ్బంది ఎవరూ లేకుండా
చూసుకోండి. ఒకవేళ ఉన్నా కేసు నమోదు చేయకండి. ఇంకా వీలుంటే మీ గూండాల చేతే ఎదురు కేసు
పెట్టించి, న్యాయం కోసం వచ్చిన వారిపైనే చట్టంలో కాలం చెల్లిన
పాత, పురాతన, ప్రాచీన సెక్షన్లన్నీ వెతికి...
అవి బ్రిటిష్ కాలం నాటివైనా, సుల్తానుల కాలం నాటివైనా... కొత్తగా
తీసుకొచ్చి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టులు చేయించండి. అప్పుడే మీ పాలనకు వ్యతిరేక
వార్తలేవీ బయటకు రాకుండా ఉంటాయి. ఏమాత్రం ఆయా వార్తల గురించి విన్నా మీ అధినేత ఆరోగ్యం
మందగిస్తుంది''
''అయ్యబాబోయ్... అంత మాటనకండి. ఆయన ఆరోగ్యమే
మా మహాభాగ్యం. మరి పథ్యం ఏమైనా ఉందాండీ?''
''పథ్యం ఏమీ లేదు. ఎప్పటిలాగే వాటాలు భోంచేయొచ్చు.
అవినీతిని ఆరగించవచ్చు. కానీ సమయం తక్కువగా ఉంది కాబట్టి, మరింత బలవర్థకమైన ఆహారం మాత్రం
ఇవ్వండి. పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ కింద కొన్ని భూములు వేయించి పెట్టండి. లంచ్ కి
గనులు ఉడికించి పెట్టండి. మద్యం, ఇసుక వ్యాపారాల్లోంచి వచ్చిన
లాభాలను పిండి ఆరారా జ్యూస్ పట్టించండి. పెంచిన ధరలు స్నాక్స్‌గా ఇవ్వండి. పెట్రో సెస్సులు, విద్యుత్,
రవాణా ఛార్జీలు కుక్కర్లో పెట్టి రాత్రికి డిన్నర్ గా పెట్టండి. వీలయినన్ని
రుణాలు తీసుకొచ్చి న్యూట్రిషన్లుగా ఇస్తూ ఉండండి. జనం మీద వేసిన చెత్త పన్నుల లాంటివి
విటమిన్లుగా ఇవ్వండి సరిపోతుంది''
''ఓకే డాక్టర్. మీరు చెప్పినవన్నీ చేస్తాం.
కానీ చిన్న సందేహమండి. ఒకవేళ ప్రజలకు మత్తు
ఎక్కకపోతే? వాళ్లు
చైతన్యవంతులై భ్రమల్లోంచి బయటకు వస్తే? నిజాలు, నిజస్వరూపాలు గ్రహిస్తే? అప్పుడేం చేయాలండీ?''
''అప్పుడిక చేసేదేం లేదు. ఐసీయూలో చేర్పించాల్సిందే''
''అంటే...?''
''ఇన్‌క్యూరబుల్ కేస్ యూనిట్''!
-సృజన
PUBLISHED ON 22.02.2023 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి