సోమవారం, డిసెంబర్ 04, 2023

సకల రోగాల సర్కారు!



ప్రజా వైద్యశాల. అత్యవసర విభాగం. ఆదరాబాదరా ఓ రోగిని తీసుకొచ్చారు. ఊబకాయంతో బాధపడుతున్న ఆ రోగి ఆపపోపాలు పడుతున్నాడు. కళ్లు ఎర్రగా ఉన్నాయి. ఉండుండి వెక్కుతున్నాడు. నర్సులు పరుగులు పెడుతూ స్ట్రెచర్మీద తీసుకొచ్చారు. డాక్టర్లు హడావుడి పడుతున్నారు.

ఇదంతా చూస్తున్న ఓ సామాన్య రోగి పక్కాయన్ని అడిగాడు.

''ఎవరండీ పాపం... ఎవరో పెద్దాయనలా ఉన్నాడే?''

పక్కాయన నిదానంగా చెప్పాడు.

''ప్రభుత్వం!''

''ఏంటీ? ప్రభుత్వమే! అయ్యో పాపం... ఏమైంది?''

''బ్రెయిన్ డెడ్‌''

''అరెరె... అంటే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్టేనా?''

''దాదాపుగా అంతే. ప్రస్తుతానికి మెదడు పనిచేయడం లేదని అర్థం...''

''అయ్యో పాపం... బతుకడం కష్టమా?''

''అలాగే కనిపిస్తోంది. మహా అయితే మూడు నెలలంతే...''

''అరెరె... ఇంతలా ఎలా ముంచుకొచ్చిందో?''

''ఎలాగంటే ఏం చెబుతాం? అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవద్దూ? చేజేతులా చేసుకుని ఇప్పుడేడిస్తే ఏం లాభం?''

''ఇంతకీ సమస్యేంటో?''

''ఒకటంటే చెప్పవచ్చు. అన్నీ ఒకేసారి చుట్టుముట్టాయిట. ఇందాకా డాక్టర్లు రిపోర్టులు చూస్తూ మాట్లాడుకుంటుంటే విన్నా...''

''ఏంటవి?''

''కడుపులో అవినీతి గ్యాస్ పెరిగిపోయింది. ద్రవ్యోల్బణంతో గుండె దడదడలాడిపోతోంది. కుంభకోణాల కొవ్వు పెరిగిపోయి. ప్రజా నాడి బలహీనంగా కొట్టుకుంటోంది. ధరవరల రక్తపోటు పెరిగిపోయింది. తిండెక్కువై ఊబకాయం పెరిగిపోయింది. పాలన అడుగు తీసి అడుగు వేయలేక పోతోంది. నియంత్రణ చేయాల్సిన కాలేయం పనిచేయడం మానేసింది. అక్రమాల పొగ ఎక్కువై ఊపిరితిత్తులు మొండికేయడంతో ఊపిరాడ్డం లేదు. కీలక నిర్ణయాలు తీసుకోలేక కిడ్నీలు పాడయ్యాయి. ఆశ్రిత పక్షపాతం మధుమేహమై దేశాన్ని కమ్మేసింది. ముందుచూపు మసకేసింది. ప్రజల్లో వ్యతిరేకత సూచనలు పెరిగిపోయి నోరు కూడా పడిపోయింది. చేతుల మధ్య సమన్వయం కుదరక చేతలకు పక్షవాతం వచ్చింది...''

''ఇంతలా ఆరోగ్యం పాడవడానికి కారణమేంటిట?''

''ఏది పడితే అది అందినంత మేరకు మితి మీరిపోయి అక్రమంగా భోంచేయడమే...''

''ఎంత తింటే మాత్రం మరీ ఇలాంటి పరిస్థితా?''

''కాదు మరీ. అది మామూలు తిండా? అందక అందక అధికారం అదిందేమో కుర్చీలో కూర్చుంటూనే తీరాల్లో ఇసుకంతా బొక్కేశాడు. కొండలు కొల్లగొట్టి కూరొండుకుని తినేశాడు. భూములు భోంచేశాడు. గనులు గుటుక్కుమనిపించాడు. ఇవన్నీ చాలవన్నట్టు సారా కాంట్రాక్టులు కుదుర్చుకుని గటగటా తాగేశాడు. మద్యం అక్రమ వ్యాపారంతో పీపాలకు పీపాలు పీల్చేశాడు...''

''అమ్మో... అయిన వాళ్లెవరూ వద్దనలేదా?''

''అసలీ తిండిని అలవాటు చేసింది వాళ్ల నాన్నే. మొదట్లో ఆయనే అధికారంలో ఉండేవాడు. కొడుకంటే మహా గారాబం. దాంతో ఏది పెడితే అది కొనిపెట్టాడు. ఎవరే పని మీద వచ్చి తనను కలిసినా కొడుక్కి ఏదో ఒకటి పట్టుకు రమ్మనేవాడు. అలా చిన్నప్పుడే స్థలాల చాక్లెట్లు, భవనాల బిస్కెట్లు, లంచాల లడ్డూలు, బినామీ జిలేబీలు, షేర్ల జహంగీర్లు, కంపెనీల కరకజ్జాలు, వాటాల చిరుతిళ్లు అలవాటైపోయాయి. ఇక  అలాంటిది అధికార భోజనం లేకపోతే ఆగగలడా? అందుకోసమే జనాన్ని నమ్మించాడు. తనకు మద్దతిస్తే తాయిలాలు పెడతానని బుట్టలో వేశాడు. అందరికీ ఆకలి తీరుస్తానని ఆకట్టుకున్నాడు. జనం పాపం కాబోసనుకుని రమ్మన్నారు. అలా వచ్చినోడి ప్రభుత్వం ఇలా కాక ఎలా తయారవుతుంది?''

''మరి జనానికి ఇస్తానన్న తాయిలాలు ఇచ్చాడా?''

''ఇచ్చినట్టు భ్రమ కల్పించాడు. చేతిలో చాక్లెట్టు పెట్టి జేబు కొల్లగొట్టాడు. జనం కోసమే వంటలు వండిస్తున్నానని హంగామా చేసి వాళ్ల దగ్గరున్నది కూడా లాక్కుని చప్పరించాడు...''

''మరిలా చేయకూడదని ఎవరూ చెప్పలేదా?''

''నొల్లుకోడం అలవాటైన వాడు, నీతులు చెబితే వింటాడేంటి? అలా చెప్పిన వాళ్ల మీద కక్ష కట్టాడు. తన తిండి చూసి దిష్టి పెడుతున్నారని ఆడిపోసుకున్నాడు. వాళ్లని వెంటాడి వేధించి తరిమి కొట్టాడు. అడిగిన వాడిని ఆయాసపెట్టాడు. కాదన్నవాడిపై కస్సుమన్నాడు. అలా అధికార భోజనానికి ఎక్కడా ఆటంకాలు లేకుండా చేసుకుని మరీ అడ్డంగా ఆరగించాడు. మొత్తానికి రాక్షస ప్రభుత్వమన్నమాట. అలనాడెప్పుడో భారతంలో బకాసురడనే రాక్షసుడికి రోజూ బండెడు భోజనం సమర్పించుకుంటామని జనం ఒప్పందం చేసుకున్నట్టే అయిందన్నమాట ఆఖరికి జనం పరిస్థితి...''

''మరింతకీ జనానికి అర్థమైందా?''

''బాగా అర్థమైంది. అందుకే ప్రజా వైద్యశాలలో ప్రభుత్వం అత్యవసర విభాగానికి చేరింది. ఇక డాక్టర్లు ఎంత వైద్యం చేసినా ప్రజలు పెదవి విరిచేస్తున్నారు. అవినీతి కేన్సర్ఆఖరి దశకొచ్చింది. అక్రమాల అల్సరు పెరిగిపోయింది. వైషమ్యాల విషం నరనరాల్లోకి పాకిపోయింది...''

''పరిస్థితి ఇంతలా విషమిస్తే ఇక కష్టేమలే. చేజేతులా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎవరం మాత్రం ఏం చేస్తాం? ఏమంటావ్‌?''

''అంతేలే. అంతేలే!''

-సృజన

PUBLISHED ON 2.12.2023 on JANASENA WEBSITE

 

 

 

 

 

 

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి