శుక్రవారం, డిసెంబర్ 15, 2023

సెక్రట్రీ ముందు చూపు!

 


''నమస్కారం సార్‌! ఊరి నుంచి ఇవాళే వచ్చానండి. మీరెలా ఉన్నారు?''

''రావయ్యా, సెక్రట్రీ! డ్యూటీలో చేరావన్నమాట. నాకేం బాగానే ఉన్నానయ్యా...''
''రాత్రిళ్లు నిద్ర పడుతోందాండీ?''
''ఆ... పడుతోందయ్యా''
''పీడకలలేమైనా వస్తున్నాయాండీ?''
''అబ్బే లేదే...''
''తిండి సయిస్తోందాండీ? సరిగ్గా తింటున్నారా?''
''ఓ... భేషుగ్గా...''
''మరి తిన్నది అరుగుతోందాండీ?''
''సుబ్బరంగానయ్యా...''
''మనసులో బెంగగా ఏమైనా ఉందాండీ?''
''లేదయ్యా బాబూ... అసలేంటి ఇన్ని ప్రశ్నలు?''
''అమ్మయ్య... పోనీలెండి. నేను ఊరెళ్లానన్నమాటే కానీ మీ మీదే గుబులండి...''
''వార్నీ... నీ స్వామి భక్తి తెలుసులే కానీ, ఎందుకంత గుబులు?''
''అదేనండి... పొరుగు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు చూశారు కదండీ? అవి విన్న దగ్గర్నుంచీ మీమీదే ఆలోచనండి...''
''ఎందుకయ్యా? వాటి వల్ల మనకేంటి సమస్య?''
''కాదండి మరీ? అక్కడా ఇక్కడా ఉన్నది తెలుగోళ్లే కదండీ? ఇంచుమించు ఒకేలా ఆలోచిస్తారు కదండీ? అందుకనండి...''
''అయితే?''
''అదేంటండీ బాబూ! నెక్స్ట్‌ మనమే కదండీ?''
''ఓ.. అదా? ఇంకా టైముంది కదయ్యా?''
''ఎక్కడుందండి బాబూ! మహా అయితే వంద రోజులంతే కదండీ? మామూలుగా అయితే ఒక సినిమా వంద రోజులు ఆడితే గొప్పండి. కానీ వంద రోజుల తర్వాత మన సినిమా ఆడుతుందో లేదోనని సందేహమండి...''
''ఎందుకాడదయ్యా... మన సినిమా సూపర్‌ హిట్టు కదా?''
''అని మీరనుకుంటే సరిపోద్దేంటండి? జనం అనుకోవద్దూ?''
''ఎందుకనుకోరయ్యా... తాయిలాలు పడేస్తున్నాంగా?''
''అయ్యా... పొరుగు ప్రభుత్వం కూడా తాయిలాలిచ్చిందండి. కానీ ఏమైందండీ? జనం తాపీగా తప్పించలేదండీ?''
''ఊరుకోవయ్యా... నీవన్నీ పిచ్చి భయాలు. మనం మీట నొక్కి మరీ నే....ఏ...ఏ...రుగా డబ్బులేస్తుంటే అలా ఎందుకు చేస్తారు?''
''మీరు మీటలు నొక్కుతున్నారు సరేనండి. కానీ ఇప్పుడు మీటలు జనం దగ్గరకి వస్తున్నాయండి. మరి వాళ్లేం మీటలు నొక్కుతారోనని గుండెల్లో ఒకటే దిగులండి...''
''నేను నమ్ముకున్న నా వెర్రి జనం అలా చేయరు లేవయ్యా...''
''మీరు నమ్ముకున్నారు కానీండీ, జనం మిమ్మల్ని నమ్ముకున్నారో లేదోనండి...''
''ఏందయ్యో సెక్రట్రీ? వేళాకోళంగా ఉందా? వెర్రిమొర్రి ప్రశ్నలు వేస్తున్నావ్‌?''
''అయ్యా... మీరు కోప్పడినా సరేనండి. సెక్రటరీ అన్నాక అన్నీ చెప్పాలండి, అడగాలండి. ఆనక ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదని నన్నడిగారునుకోండి, నేనేం చెప్పగలనండీ? అందుకే అడుగుతున్నానండి...''
''అందుకనేనయ్యా... నేను కూడా ఇంత వరకు నువ్వేమడిగినా ఊరుకున్నాను. అసలు ప్రశ్నించే వాళ్లంటే నాకు ఒళ్లుమంటని తెలుసు కదా? వేరొకళ్లయితే ఈ పాటికి ఏ రాజద్రోహం కేసో, అక్రమ సందేహాల కేసో బనాయించి రాత్రికి రాత్రి రిమాండుకి పంపించేసే వాడిని. అర్థమైందా?''
''అర్థం కాకపోవడానికేముందండీ? మీ వ్యవహారం అంతా మొదట్నుంచీ చూస్తున్నవాడినేగా? ఎన్ని కేసులు? ఎన్ని రిమాండులు? ఎన్ని సెక్షన్లు? ఎన్ని దౌర్జన్యాలు? మీరు తల్చుకుంటే కేసుల మీద కేసులు తిరగదోడి ఊపిరి సలపకుండా చేయగలరని తెలుసండి. మీ పార్టీ ఎంపీనే చీకట్లో కుళ్లబొడిపించి పంపించారండి. ఇక ఎగస్పార్టీ వాళ్ల పాట్లు చూస్తున్నా కదండీ? ఎన్ని ఆంక్షలు? ఎన్ని అవరోధాలు? ఎన్ని ఆటంకాలు? ఎన్ని దాష్టీకాలు? మీగ్గానీ తిక్క రేగిందంటే ఇతర పార్టీల వారి యాత్రలు సాగకుండా వంతెనలు మూసేయగల్రండి. రోడ్లు తవ్వేయగలరండి. రూట్లు మార్చేయగల్రండి. ఇనుప కంచెలడ్డేసి నిరసనల్నిఉక్కు పాదాలతో తొక్కేయగలరండి. ఆడోళ్లనయినా చూడకుండా ఈడ్చి అవతల పారేయించగల్రండి. అంత దాకా ఎందుకండీ? మీకు ఇష్టం కాకపోతే సొంత బాబాయినైనా సరే... సర్లెండి, గోడలకు చెవులుంటాయి. మీ లోపాయి కారీ లొసుగులన్నీ నాకు తెలిసినవే కదండీ?''
''మరింకేమయ్యా... మనకి ఎదురు లేదని అర్థమైందిగా? అయినా మీ బెంగలన్నీ అర్థం లేనివేనయ్యా. మనం అమలు పరుస్తున్న పథకాలేంటో తెలిసి కూడా కంగారెందుకయ్యా? అవన్నీ మన ఓటు బ్యాంకును కాపాడుకునేవేగా? అందుకనేగా, రాష్ట్రం అప్పుల పాలైపోతున్నా, జీతాలివ్వడానికి కూడా కటకటలాడిపోతున్నా... ఎక్కడా ఆగకుండా పథకాలకి డబ్బులు పారిస్తుంట? నవ రత్నాల్లాంటి పథకాల సంగతి తెలిసి కూడా నసపెడతావేంటయ్యా?''
''అయ్యా... మీ ధీమా చూస్తుంటే ఓ పక్క ముచ్చటేస్తున్నా, మరో పక్క భయమేస్తోందండి. మరి పొరుగు రాష్ట్రం నాయకుడు కూడా మీలాగే తెగ ధీమా ప్రదర్శించాడండి. వేరే వాళ్లకి ఓటేస్తే 'ఆగమాగం' అని భయపెట్టాడండి. కానీ జనం 'ఆగం ఆగం' అన్నారండి. అనుకున్నది చేసేశారండి. మరి అక్కడ కూడా పథకాలు లేవేటండి? ఆయన దళిత బంధు అన్నా, రైతు బంధు అన్నా... జనం మాత్రం ఆయన్ని రాబందు అనుకున్నారండి మరి. మీరు నే...ఏ...ఏ...రుగా డబ్బులేసేస్తున్నామంటూ మురిసిపోతున్నారండి. కానీ మీరు వేసే దాని కంటే వాళ్ల దగ్గర నుంచి మీరు లాక్కునేది అంతకు పదింతలని జనం పసిగట్టిన దాఖలాలు కనిపిస్తున్నాయండి. ఆనక అనలేదంటారని ముందుగానే చెబుతున్నానండి మరి...''
''అబ్బబ్బబ్బ... సెక్రట్రీ, చంపుతున్నావయ్యా. చూస్తుంటే నీ మనసులో చాలా బెంగలే ఉన్నాయని అర్థమైంది కానీ, ముందు అవ్వేంటో ఏకరువు పెట్టు. ఆనక చెబుతాను నీకు జవాబు...''
''అలా అన్నారు కాబట్టి చెబుతున్నాను వినండి. మీరు వెనకా ముందూ చూసుకోకుండా దూకుడుగా దూసుకుపోయారని నా అభిప్రాయమండి. అందకందక అధికారం అందిందని అయినవాళ్లందరికీ అడ్డూ ఆపూ లేకుండా గేట్లెత్తేశారండి. వాళ్లేమో రాష్ట్రం మీద పడి ఎక్కడికక్కడ దోచేశారండి. మీకు రావలసింది మీకిచ్చాకే మేస్తున్నారు కదాని మీరు గమ్మునున్నారండి. ఆళ్ల మీద ఎవరైనా ఫిర్యాదు చేసినా, అలా చేసిన వాడి మీదే కేసులెట్టించి హడలుగొట్టించేస్తున్నారండి పోలీసులు. మీరు పోలీసు అధికారుల సలాములే చూస్తున్నారండి, కానీ వాళ్ల సివాళ్లేంటో జనం చూస్తున్నారండి. మీరు ప్రతి వ్యవస్థని ప్రక్షాళన చేసేశానని చెప్పేసుకుంటూ పొంగిపోతున్నారండి. కానీ జనం మాత్రం మీ వల్ల ప్రతి వ్యవస్థ నాశనమైందనుకుంటున్నారండి. జనం వైపు నుంచి చూస్తే, ఆళ్ల పిల్లల చదువులు చతికిలబడ్డాయండి. ఎలాగోలా చదువుకున్నా, తగిన ఉద్యోగాలు లేవండి. ఏదో ఒకటి చేద్దామనుకున్నా రాష్ట్రంలో కంపెనీలు లేవండి. ఇక ఉపాధి మార్గాలు కూడా మూసుకుపోయాయండి. మీకు మాత్రం కళ్లు మూసుకుపోయాయండి. విద్యా వ్యవస్థ ఇలా నాశనమైందాండీ, ఇక ఆర్థికంగా చూస్తే ఉద్యోగులకు ఎప్పుడు జీతాలొస్తాయో చెప్పలేని పరిస్థితండి. పాత బిల్లులు పాసవక కాంట్రాక్టర్లు పనులకు రావడం లేదండి. ఎక్కడి పనులక్కడ పడకేశాయండి. మీరు మాత్రం కునుకుతున్నారండి. ఊర్లలో పరిస్థితి మరీ ఘోరమండి. పంచాయితీల కాతాల్లో సొమ్ముల్ని మీరు కొబ్బరిబొండాన్ని స్ట్రాతో పీల్చుకున్నంత సులువుగా లాగేసుకుంటున్నారండి. దాంతో పాపం సర్పంచులు పారిశుధ్యం పనులు కూడా చేయించలేక పోతున్నారండి. ఆళ్ల అవస్థ చూస్తున్న ప్రతి గ్రామంలోని జనానికి మన పాలన తీరు అర్థం కాదని ఎలా అనుకుంటామండీ? ఇక రోడ్లండి. పెట్రోలు వాడుతున్న ప్రతి వాడి నుంచి లీటరుకింతని రోడ్దు సెస్సు కింద వేల కోట్లు ఖజానాకి జమవుతున్నాయి కదండీ? మరి ఒక్క రోడ్డు బాగుందేమో చూపించగలరాండీ? అబ్బే మీరు మాత్రం హెలీకాప్టర్‌లో ఊరేగుతున్నారండి. ఒకేల కారులో వెళ్లినా అంత వరకు ఆదరాబాదరా రోడ్డేసేస్తుంటే మీరు కుదుపులు లేకుండా సాగిపోతున్నారండి. కానీ జనం ఒళ్లు హూనమైపోతోందని మీకు మాత్రం తెలియడం లేదండి. ప్రజల కళ్ల ముందు మీ పార్టీ వాళ్లంతా కోట్లకి పడగలెత్తుతున్నారండి. ఇసుక నుంచి కాసులు పిండుకుంటున్నారండి. మద్యంతో మోతుబరులవుతున్నారండి. కొండలు తొలిచి కాతాలు పెంచుకుంటున్నారండి. గనులు తవ్వి గోతాలు నింపుకుంటున్నారండి. మీ వాటా మీకొస్తోంది కదాని మీరు మాటాడట్లేదండి. కానీ పాపం జనం మాత్రం అంతకంతకు అణగారుతున్నారండి. రైతులకు కిట్టుబాటు లేదండి. కూలీలకు పనుల్లేవండి. వృత్తులు పడకేశాయండి. ఇవన్నీ పక్కనబెట్టి శాంతి భద్రతల కేసి చూస్తే... మీరు శాంతిగానే ఉన్నారండి. కానీ జనానికి భద్రత లేదండి. ఆడాళ్లకి రక్షణ లేదండి. అట్టడుగు జనులపై అఘాయిత్యాలు పేట్రేగిపోతున్నాయండి. మరి ఇన్ని వర్గాల ప్రజలంతా పరిస్థితిని గమనించడం లేదంటారా చెప్పండి. మరి ఇంకా వంద రోజుల తర్వాత మన సినిమా ఆడుతుందనుకుంటే ఎలాగండీ?''
''స్టాపిట్‌... యూ... రాస్కెల్! ఎంత ధైర్యం నీకు? నా ముందు ఇంత వాగుతావా? నిన్నేం చేస్తానో చూడు...''
''హ...హ్హ...హ్హా! ఇక నువ్వేం చేస్తావయ్యా! వంద రోజుల తర్వాత నీ సంగతేంటో నేను ముందే పసిగట్టా. అందుకే నీ సినిమా ఏంటో నీకు చూపించా. ఇదిగో నా రాజీనామా. నీ సెక్రట్రీ కొలువుకి గుడ్‌బై!''
                                                                                                                               -సృజన

PUBLISHED ON 15.12.2023

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి