(పిల్లల కోసం రాముడి కథ-3)
రాముడి కథను నారదుడు, వాల్మీకి మహర్షికి క్లుప్తంగా చెబితే, బ్రహ్మదేవుడు అందులోని సన్నివేశాలన్నీ అతడి కళ్ల ముందు కనిపించేలా చేశాడు. అలా వాల్మీకి 24 వేల శ్లోకాలతో రామాయణాన్ని రచిస్తే, రాముడి తనయులైన లవకుశలు దాన్ని రమ్యంగా గానం చేశారు. ఆ రామాయణంలోకి వెళ్లాలంటే ముందుగా మనం అయోధ్యలోకి ప్రవేశించాలి. అంతకన్నా ముందు రాముడి వంశం గురించి కూడా తెలుసుకోవాలి.
పూర్వం ఈ భూమండలాన్నంతా వైవశ్వతుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన సూర్యుడి కొడుకు. ఈయన 7వ మనువుగా శాశ్వత కీర్తి సంపాదించాడు. ఇతడి కొడుకు ఇక్ష్వాకుడు. ఇతడి అనంతరం ఇక్ష్వాకు సంతతి వారంతా ఇక్ష్వాకులనీ, సూర్యవంశం వారనీ పేరు పొందారు. వీరిలో సగరుడు కూడా ఒకడు. సగరుడి కొడుకులు 60 వేల మంది ఒకానొక కారణం వల్ల సముద్రాన్ని తవ్వారు. అందుకనే దానికి సాగరమని పేరు వచ్చింది. గంగను స్వర్గం నుంచి భూమికి తెచ్చిన భగీరథుడు, ఈ సగరుడి మనవడే. సూర్యవంశపు రాజులంతా అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని సరయూ నదీ తీరాన ఉండే కోసల రాజ్యాన్ని పాలించారు. అయోధ్య నగరాన్ని వైవశ్వత మనువు స్వయంగా నిర్మించాడు. ఈ వంశానికే చెందిన దశరథుడు, సకల సంపదలతో తులతూగే అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు. ఈయన ఐశ్వర్యంలో ఇంద్రుడు, కుబేరుడంతటి వాడు. అవసరమైతే దేవతలకు సైతం సహాయపడగలిగే మహా పరాక్రమవంతుడు. అయోధ్యా నగరం దుర్భేధ్యమైన కోటలతో, నలువైపులా కందకాలతో, నాలుగు వైపులా రాజవీధులతో, విశాలమైన రహదారులతో, దారికి ఇరుపక్కలా వృక్షాలతో, సొగసైన భవంతులతో, అంగళ్లతో అలరారుతూ ఉండేది. రత్నఖచితమైన అక్కడి భవనాలన్నింటినీ మహా శిల్పులు అద్భుతంగా నిర్మించారు. అందమైన ఉద్యానవనాలు, రకరకాల పండ్ల తోటలతో, పూల మొక్కలతో నగరం కళకళలాడుతూ ఉండేది. అయోధ్యలో నివసించేవారందరూ మహా వీరులే కాకుండా ధర్మపరులు కూడా. దశరథ మహారాజుకి ఎనిమిది మంది మంత్రులు ఉండేవారు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనే ఈ మంత్రుల సాయంతో దశరథుడు ప్రజా రంజకంగా పరిపాలన చేసేవాడు. ఈయనకు వశిష్ఠుడు కుల గురువు. వామదేవుడు, జాబాలి మొదలైనవారు ప్రధాన పురోహితులు.
ఎంత వైభవం ఉన్నా దశరథుడికి సంతానం లేని లోటు వేధిస్తూ ఉండేది. ఒకనాడు ఆయనకు అశ్వమేధ యాగం చేసి దేవతలను మెప్పించి సంతానాన్ని పొందాలనే ఆలోచన కలిగింది. వెంటనే తన మంత్రులలో ముఖ్యడైన సుమంత్రుడి ద్వారా వశిష్ఠ వామదేవులను, జాబాలి, సుయజ్ఞుడు మొదలైన గురువులనూ, పండితులను పిలిపించి తన ఆలోచనను చెప్పి వారి సలహా అడిగాడు. అందుకు వారంతా మెచ్చుకుని అశ్వమేధ యాగానికి ఏఏ ఏర్పాట్లు చేయాలో, ఎలాంటి వస్తు సామగ్రిని సమకూర్చుకోవాలో సూచించారు. దశరథుడు అప్పటికప్పుడే అందుకు తగిన ఆదేశాలను అందరికీ జారీ చేశాడు.
వారందరూ వెళ్లిపోయాక దశరథుడిని సుమంత్రుడు ఏకాంతంగా కలిశాడు. ఇక్కడ సుమంత్రుడి గురించి ఒక విషయం చెప్పుకోవాలి. అదేమంటే, ఒకానొక తరుణంలో సనత్కుమారుడనే మహర్షి భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి రుషులతో చెబుతుండగా, అక్కడే ఉన్న సుమంత్రుడు కూడా విన్నాడు. అలా ఆయనకు రామాయణంలోని ప్రధాన అంశాలు అవగతమయ్యాయి. సందర్భాలను బట్టి సుమంత్రుడు ఆయా విషయాలను ప్రస్తావించడం రామాయణంలో కనిపిస్తుంది.
దశరథుడిని ఏకాంతంగా కలిసిన సుమంత్రుడు, ''మహారాజా! నేను సనత్కుమారుడి ద్వారా విన్న విషయాలను బట్టి, అశ్వమేధ యాగాన్ని నిర్వహించడానికి రుష్యశృంగుడిని మించిన వాడు లేడు. అతడి వృత్తాంతం చెబుతాను వినండి'' అంటూ ఈ కథ చెప్పాడు.
కశ్యప మహర్షి కుమారుడు విభాండకుడు. ఇతడి కొడుకే రుష్యశృంగుడు. ఇతడికి తలపై ఒక కొమ్ము మొలిచి ఉంటుంది. అందుకనే అతడిని అందరూ రుష్యశృంగుడని పిలిచేవారు. అడవిలో తండ్రి దగ్గరే పెరిగిన రుష్యశృంగుడికి అక్కడి జంతువులు, రుషులు తప్ప వేరే ప్రపంచం తెలియదు. మనుషులలో ఆడవారు, మగవారు అని విడివిడిగా ఉంటారని కూడా తెలియదు. బాల్యం నుంచి వేదాధ్యయనము, యజ్ఞయాగాదులు తప్ప ఇంకేమీ తెలియని రుష్యశృంగుడు, మహా యోగ సంపన్నుడిగా పెరిగాడు. అతడు ఉన్న చోట కరువు కాటకాలు ఉండవు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.
ఆ కాలంలోనే అంగ రాజ్యాన్ని రోమపాదుడు పాలిస్తూ ఉండేవాడు. ఒకసారి అతడి రాజ్యంలో తీవ్రమైన కరవు ఏర్పడింది. వర్షాలు లేక, పంటలు పండక ప్రజలు తిండి గింజల కోసం అలమటించసాగారు. ఆ పరిస్థితికి దిగులు పడిన రోమపాదుడు వేద పండితులను పిలిచి కరవు పోయే మార్గం సూచించమని కోరాడు. అప్పుడు వాళ్లు రుష్యశృంగుడి గురించి తెలిపి, ''రాజా! మీరు ఎలాగైనా అతడిని అంగరాజ్యానికి రప్పించండి. అప్పుడు కరవు కాటకాలు పోయి దేశం సుభిక్షంగా ఉంటుంది'' అని సూచించారు. వెంటనే రోమపాదుడు మంత్రులను, పురోహితులను పిలిపించి ''మీరు వెంటనే వెళ్లి రుష్యశృంగుడిని తీసుకురండి'' అని ఆజ్ఞాపించాడు. ఆ మాట విని వారందరూ భయపడ్డారు. ఎందుకంటే రుష్యశృంగుడు అడవిలో తపస్సు మాని, ఎవరో పిలిస్తే వచ్చే మనిషి కాడు. కోపం వస్తే శపించగలడు కూడా. అందుకని రుష్యశృంగుడిని రప్పించడానికి వాళ్లొక ఉపాయం ఆలోచించి రాజు రోమపాదుడికి చెప్పారు.
''రాజా! రుష్యశృంగుడికి ఆడవాళ్లు ఎలా ఉంటారో కూడా తెలియదు. కాబట్టి మీరు సుందరాంగులైన కొందరు నాట్యకత్తెలను అడవులకు పంపండి. వాళ్లు రుష్యశృంగుడిని ఆకర్షించి తీసుకు వస్తారు. అప్పుడు అతడికి మీ కుమార్తె శాంతనిచ్చి వివాహం జరిపించి దేశంలోనే ఉంచుకుంటే ఇక ఎన్నటికీ కరువనేదే ఏర్పడదు'' అని చెప్పారు. రోమపాదుడు అందుకు అంగీకరించాడు. ఆయన ఆదేశాల ప్రకారం అందగత్తెలైన కొందరు యువతులు చక్కగా అలంకరించుకుని, రుష్యశృంగుడి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. ఒకనాడు రుష్యశృంగుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. వెంటనే ఆ యువతులు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ అతడిని సమీపించారు. వాళ్ల అందమైన రూపాలను, అలంకారాలను, ఆటపాటలను చూసి రుష్యశృంగుడు ఆశ్చర్యపోయి ఆకర్షితుడయ్యాడు. ఆ యువతులు అతడిని పలకరించి, ''నువ్వెవరు? ఎందుకీ అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావు?''అని వయ్యారంగా ప్రశ్నించారు.
దానికి రుష్యశృంగుడు ''నా తండ్రి విభాండక మహర్షి. మీరంతా మా ఆశ్రమానికి రండి'' అంటూ వాళ్లను తీసుకు వెళ్లాడు. ఆ సమయంలో విభాండకుడు ఆశ్రమంలో లేడు. రుష్యశృంగుడు వాళ్లకి కందమూలాలు ఇచ్చి ఆతిథ్యమిచ్చాడు. బదులుగా ఆ సుందరాంగులు అతడికి తాము తీసుకు వచ్చిన తీపి భక్ష్యాలను ఇచ్చి'' ఇవి మా పండ్లు. రేపు నువ్వు కూడా మా దగ్గరకు రా'' అంటూ ఆప్యాయంగా కౌగలించుకుని ఆహ్వానించారు. వాళ్లిచ్చిన తీపి భక్ష్యాలు తిన్న రుష్యశృంగుడు అవి కొత్త రకం పండ్లనే భావించాడు. వాళ్లను మరవలేని అతడు, మర్నాడు ఆ యువతులు ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. వాళ్లు అతడిని చూస్తూనే ప్రేమగా మర్యాదలు చేసి, ''నువ్వు మాతో మా ఆశ్రమానికి వస్తే ఇంతకంటే చక్కని ఆతిథ్యమిస్తాము'' అంటూ ఆకర్షించి అతడిని అంగరాజ్యానికి తీసుకెళ్లారు. రుష్యశృంగుడు అడుగు పెట్టగానే అంగరాజ్యంలో వర్షాలు కురవసాగాయి. రుష్యశృంగుడిని చూస్తూనే మహారాజు రోమపాదుడు అతడికి ఎదురు వచ్చి, సాష్టాంగపడి మొక్కి, ''మహాత్మా! మిమ్మల్ని ఈ విధంగా ఇక్కడికి రప్పించినందుకు క్షమించండి'' అంటూ వేడుకున్నాడు. తర్వాత తన కూతురు శాంతనిచ్చి అతడికి వివాహం జరిపించాడు. నిజానికి శాంత, దశరథుడి ఔరస పుత్రిక. దశరథుడు, రోమపాదుడు కూడా మిత్రులే. రోమపాదుడికి సంతానం లేకపోవడంతో దశరథుడు తన కుమార్తె శాంతని అతడికి దత్తత ఇచ్చాడు.
సుమంత్రుడు వివరాలన్నీ దశరథుడికి చెప్పి, ''మహారాజా! ఆ రుష్యశృంగుడు మీకు కూడా అల్లుడే. కాబట్టి అతడిని అయోధ్యకు తీసుకువస్తే అంతా మంచే జరుగుతుంది'' అంటూ ముగించాడు. దశరథుడు ఎంతో సంతోషించి వెంటనే తన భార్యలు, మంత్రులతో అంగరాజ్యానికి వెళ్లాడు. వాళ్లకి రోమపాదుడు చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. దశరథుడు వచ్చిన కారణాన్ని తెలుసుకున్న రోమపాదుడు, ఎంతో సంతోషంగా రుష్యశృంగుడిని, శాంతను అయోధ్యకు పంపించాడు.
అలా అయోధ్యకు వచ్చిన రుష్యశృంగుడు, దశరథుడికి పుత్రసంతానం కలగడం కోసం అశ్వమేధ, పుత్రకామేష్టి యాగాలను నిర్వహించాడు. అంటే మామగారికి పుత్రులు కలగడం కోసం, అల్లుడు యాగం జరిపించాడన్నమాట. ఆ యాగాలు ఎంత వైభవంగా జరిగాయో మరో భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి