గురువారం, ఫిబ్రవరి 29, 2024

ఇక అంతా సిద్దం!


అధినేత అద్దంలో రకరకాలుగా నవ్వుకుని చూసుకుంటున్నాడు. చేతులు పైకి మడత పెట్టుకుంటూ అటూ ఇటూ నుంచుని చూశాడు. నెత్తి మీద కంటా చేతులు జోడించి పైకి కిందకి ఊపి చూసుకున్నాడు.  ఈలోగా సెక్రటరీ వచ్చి అధినేత ఎలా సిద్ధం అవుతున్నాడో గమనించి చిన్నగా దగ్గాడు.

''రావయ్యా సెకట్రీ! బాగా సిద్ధం అయ్యానంటావా?'' అనడిగాడు, అద్దంలో అన్ని కోణాల్లోనూ మొహాన్ని చూసుకుంటూ.

''తమరెప్పుడూ సిద్ధంగానే ఉంటారు కదండీ?'' అన్నాడు వినయంగా నవ్వుతూ.

''మరైతే మనం వెళ్లబోయే ప్రచార సభకి అంతా సిద్ధం చేశావా?''

''... అన్నీ సిద్దమండి. పాదయాత్రల నాటి నుంచి, అధికారం అందుకున్న ఈ ఐదేళ్లుగా తమరు అనేక  సందర్భాల్లో వాడే రకరకాల నవ్వులన్నింటినీ ఉతికి ఆరేయించానండి. వాటన్నింటినీ మీ జేబురుమాలు మడతల్లో పెట్టానండి. ఇక మీరు ఆ రుమాలుతో మొహం తుడుచుకుంటూ ఒకోసారి ఒకోలా నవ్వు పులుముకోవచ్చండి. ప్రతిపక్షం వాళ్ల గురించి మాట్లాడేప్పుడు వెటకారం నవ్వూ, వాళ్ల ఆరోపణలు తిప్పికొట్టేప్పుడు వెకిలి నవ్వూ, మీ పథకాల గురించి చెప్పేటప్పుడు ముసిముసి నవ్వూ, సభకి పెద్దగా జనం రాకపోయినా జావగారి పోకుండా గంభీరపు నవ్వూ, ఉపన్యాసం మధ్యలో జనాలు లేచి వెళ్లిపోతుంటే సహనపు నవ్వూ, మీరు చెప్పినదే చెబుతున్నప్పుడు ప్రజలు ఆవులిస్తే దాన్ని గమనించకుండా వెర్రినవ్వూ, అమ్మా అక్కా అవ్వా తాతా అంటూ పలకరించేప్పుడు మురిపించడానికి ప్రయత్నించే నవ్వూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేశానని చెప్పేటప్పుడు ఆత్మవిశ్వాసాన్ని ఎరువుతెచ్చుకునే నవ్వూ, ఇంకా ఏ భావమో ఎవరూ చెప్పలేని అయోమయపు నవ్వూ, అదోరకం నవ్వూ, చెప్పలేని నవ్వూ... ఇలా అన్నీ ఉన్నాయండి''

అధినేత ముసిముసిగా నవ్వి, ''బాగుందయ్యా... నేనిన్ని నవ్వులు నవ్వుతానని నాకే తెలీదూ. నువ్వు చెబుతుంటే నిజంగానే నవ్వొస్తోంది. మరింకా ఎలాంటి ఏర్పాట్టు సిద్ధం చేశావూ?'' అనడిగాడు.

సెక్రటరీ వినయంగా నవ్వి, ''మీరు ప్రతి సభలోనూ పదే పదే చెబుతూ వాడి పారేసిన విమర్శలన్నింటినీ దులిపి ఇస్త్రీ చేయించి పెట్టానండి. ఎలాగూ వాటినే ఈ సభలోనూ ఏకరువు పెడతారు కాబట్టి వాడేసుకోవచ్చండి. ఇక హామీల విషయానికి వస్తే కొత్తవేమీ లేవు కాబట్టి, ఇన్నవాటినే డ్రైక్లీనింగ్కి ఇచ్చి తెప్పించానండి. పాతవైనా కొత్తగానే కనిపించడానికండి. ఇక మీ ఉపన్యాసాలన్నింటినీ ఊకలో పోసి దంపించానండి. ఆ ఊకదంపుడు ఉపన్యాసాలనే మీరు మళ్లీ ఉపయోగించేసి ఊదరగొట్టేయచ్చండి. ఏ సభలో ఎక్కడ మొదలెట్టి, ఎక్కడ  ఆపినా పెద్దగా బెంగలేదండి...''

అధినేత అన్నీ వింటూ చేతుల్ని ఊపి చూసుకున్నాడు. మణికట్లను పైకి కిందకీ మాంసాన్ని కైమా చేస్తున్నట్టు కదిలించి చూశాడు. సెక్రట్రీ చటుక్కున జేబులోంచి ఏదో ట్యూబు తీసి దాంట్లోంచి ఆయింటుమెంటు తీసి చేతులకు రాసి మర్దనా చేశాడు.

''కొత్తగా వచ్చిన ఈ ఆయింటుమెంటు వల్ల అరచేతుల్ని అటూ ఇటూ ఇష్టం వచ్చినట్టు ఊపొచ్చండి. సభలో నాలుగు వైపులా ఉన్న వారికి కనిపించేలా చేతికి ఎముకే లేనంతగా తిప్పేయచ్చండి. నెప్పేమీ ఉండదండి...''

''బాగుందయ్యా సెక్రట్రీ! సభన్నాక వచ్చిన జనాన్ని చూసి చేతులు ఊపక తప్పదు. ప్రసంగం మధ్యలో రకరకాలుగా తిప్పకా తప్పదు. ఎలా ఊపినా నెప్పి లేకుండా బాగానే సిద్ధం చేశావు...''

సెక్రట్రీ గొంతు సవరించుకుని, ''ఇక మీ ప్యాంటు కుడి జేబులో అబద్ధాలను మూట కట్టి పెట్టానండి. మీరు ఇంతవరకు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు అలా అలవోకగా జేబులో చెయ్యి పెట్టి అందిన అబద్ధాలను తీసి విసిరేయచ్చండి. ప్యాంటు ఎడమ జేబులో బోలెడన్ని అంకెలు, పెద్ద పెద్ద సంఖ్యలు పోగేసి పోశానండి. పథకాల గురించో, ప్రాజెక్టుల గురించో చెప్పేటప్పుడు జేబులోంచి మీ ఇష్టం వచ్చిన సంఖ్యల్ని తీసి చూసుకుని వాటికి కోట్లు జత చేసి చెప్పి పారేయవచ్చండి. జనాలెలాగూ అప్పటికప్పుడు లెక్కలేసుకోలేరు కాబట్టి  చెల్లిపోతుందండి''

అధినేత జేబులు తడుముకుని అన్నీ సిద్దంగా ఉన్నయో లేదో చూసుకున్నాడు.

''అంకెలూ, అబద్ధాలూ బాగా సిద్ధం చేశావయ్యా. ఇంకేం సిద్ధం చేశావో గబుక్కున చెప్పు మరి అవతల సభకి టైమవుతోంది...''

''ఇక తమరు వెళ్లబోయే సభా వేదిక మీద ఒక డబ్బా నిండా బురద సిద్ధం చేశానండి...''

''బురదా? అదెందుకయ్యా?''

''ఎగస్పార్టీ వాళ్ల మీద జల్లడానికండి. మీ ఉపన్యాసాల్లో అభివృద్ధి గురించి కన్నా ఎదుటి వాళ్ల మీద బురద జల్లడమే ఎక్కవ కదండి మరి. అలాగే ఓ సంచి నిండా దుమ్ము పోసి ఉంచానండి...''

''అదెందుకయ్యా?''

''ప్రత్యర్థుల మీద దుమ్మెత్తి పోస్తారు కదండీ, అందుకండి. సమయానికి తమరు వెతుక్కోకుండా సిద్దం చేశానన్నమాటండి. ఇక వేదిక వెనకాల కుంపట్లు పెట్టించి, బొగ్గులు సిద్ధంగా ఉంచానండి. చేటలు కూడా ఉన్నాయండి. మీరు ఉపన్యాసం మధ్యలో ఉండగా మన వాలంటీర్లు కుంపట్లో బొగ్గులు రాజేసి, చేటల్లో పోసి అందిస్తారండి...''

''వార్నీ... అవి దేనికయ్యా?''

''ప్రతిపక్షాల గురించి ప్రస్తావించినప్పుడు, తమరు నిప్పులు చెరుగుతారు కదండీ, అందుకండి. ఆ నిప్పుల వేడికి జనం ఇక చేసేది లేక చప్పట్లు కొట్టక తప్పదండి...''

''...హ్హ...హ్హా! అన్నీ బాగా సిద్ధం చేశావయ్యా. మరింతకీ మన ఉపన్యాసాలెలా ఉన్నాయంటావు?''

''వాటి గురించి చెప్పేదేముందండీ? అన్నీ ఒకేలా ఉన్నాయండి. అయినా చెప్పినవన్నీ చేసేశామనీ, చెసేవన్నీ చెప్పేశామనీ, చెప్పనివి కూడా చేశామనీ, చేసినవన్నీ చెప్పలేమనీ, చెప్పలేనివి కూడా చేశామనీ చెప్పక తప్పక చెబుతున్నాక... ఇక చెప్పేది మాత్రం ఏముంటుందండీ?''

అధినేత పకపకా నవ్వేసి, ''మొత్తానికి నువ్వు ఉండాల్సిన వాడివేనయ్యా! మరి సభలకి జనం దండిగా వస్తారంటావా?''

''రాక చస్తారటండీ? ముందుగానే మన అనుచరులు వాడవాడలకీ వెళ్లి సభలకు తరలి రావాలని అదరగొడుతున్నారండి. మన వాలంటీర్లయితే సభలకు రాకపోతే లబ్దిదారుల జాబితాలు సవరిస్తామని బెదరగొడుతున్నారండి. ఇక ఆరోజు బడులకి, కాలేజీలకి సెలవు ఇప్పించేలా మనోళ్లు రుబాబు చేయిస్తున్నారండి. కాలేజీలకీ బడులకీ పిల్లల్ని తీసుకెళ్లే బస్సులన్నింటినీ తీసుకొచ్చి తమరి సభలకు జనాన్ని తరలించడానికి ఎక్కడికక్కడ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారండి. కొట్లు, దుకాణాలు కూడా మూయించేస్తున్నారండి. తమరి వాహనాలకు ఎక్కడా అడ్డంకులు ఎదురవకుండా రోడ్లకు ఇరు పక్కలా ఉన్న చెట్లను కూడా కొట్టించేస్తున్నారండి. బోర్డింగులు, హోర్డింగులు తీయించేస్తున్నారండి. ఊర్లలో ఉండేవాళ్లకి ఇక మీ సభకి రావడం తప్ప వేరే గతి లేనట్టు చేసేసి, గొర్రెల్ని తోలుకొచ్చినట్టు తీసుకొచ్చేస్తున్నారండి. వచ్చిన జనం మీ ఉపన్యాసాలు వింటూ నిద్ర పోకుండా చూడ్డానికి మన వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారండి. జనం చేతికి పార్టీ జెండాలిచ్చి వాటిని ఎప్పుడెలా ఊపాలో చెప్పి జనాన్ని సిద్ధం చేశారండి. ఎక్కడెక్కడ చప్పట్లు కొట్టాలో కూడా సూచించడానికి మనోళ్లు సిద్ధమయ్యారండి. ఇక మనం పెట్టిన ఫొటోగ్రాఫర్లు జనం పెద్దగా రాకపోయినా, బాగా వచ్చినట్టు ఫొటోలు తీయడానికి సిద్ధంగా ఉన్నారండి. వాటిని పెద్ద పెద్దగా అచ్చేయడానికి మన పేపర్లో పేజీలకు పేజీలు సిద్ధం చేయించామండి. ఇక తమరి ఉపన్యాసాన్ని ఉన్నదున్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా పుంఖాను పుంఖాలుగా రాయించి మన పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగులు పెట్టి రాయించే ఏర్పాట్లు కూడా సిద్ధమండి...''

''సెహభాషయ్యా సెక్రట్రీ! ఇంతకీ మరి సర్వేలు చేయించావా?''

''... భేషుగ్గానండి. అయ్యగారు చేయించమన్నారని డబ్బులు గుప్పించేసరికి, మనకి వంత పాడే సర్వే సంస్థలన్నీ రెచ్చిపోయాయండి. ఉన్న సీట్లన్నీ తమకే రానున్నట్టు సర్వేలో తేలినట్టు ప్రకటించి జనాన్ని గందరగోళంలో పెట్టడానికి అంతా సిద్ధమండి. కొన్నయితే 175 కన్నా ఎక్కువ స్థానాలు గెలవబోతున్నట్టు ఫలితాలు ఇద్దామని ముచ్చట పడితే... నేనే మరీ బాగోదని చెప్పి సముదాయించానండి. మనం చేయించే ఈ సర్వేల హడావుడికి జనం కాబోసనుకుని అయోమయంలో పడితే, ఎగస్పార్టీ వాళ్లు నోరెళ్లబెడతారండి...''

''మొత్తానికి మన సిద్ధం సభలకి అంతా బాగానే సిద్ధం చేశావయ్యా. మరి జనం ఏమనుకుంటున్నారో ఏమైనా పసిగట్టావా?''

''జనం ఇప్పటికే సిద్ధం అయిపోయినట్టు అనిపిస్తోందండి. ఇక ఎన్నికలు రావడమే తరువాయండి. మీటలు నొక్కేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇక తమరు, నేను కూడా సిద్ధంగా ఉండాల్సిందేనండి...''

సెక్రటరీ మాటల్లో ఉన్న మర్మమేంటో గ్రహించేందుకు అధినేత సిద్ధంగా లేనంత భ్రమల్లో ఉన్నాడు. దాంతో తెగ ఆనందపడిపోతూ ప్రచార సభకి బయల్దేరడానికి సిద్ధం అయిపోయాడు!

-సృజన

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి