మంగళవారం, ఫిబ్రవరి 13, 2024

వినరా ఓటరు వీర కుమారా...!

''దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి...

ఇక ఊరేల? సొంత ఇల్లేల?  చెల్లెలా...''

శిష్యుడు వచ్చేసరికి గురువుగారి ఇంట్లో పాట మార్మోగుతోంది. గురువుగారు పడక్కుర్చీలో కూర్చుని తన్మయత్వంతో వింటున్నారు. శిష్యుడు వచ్చి కూర్చుని ''నమస్కారం సార్‌...'' అన్నాడు.

గురువుగారు పాట వింటూనే, ''దారా... నువ్వింకా రాలేదని పాటలు వింటున్నాను...'' అన్నారు.

''శ్రోతలకు ఇష్టమైన పాటల కార్యక్రమమా సార్‌?''

''కాదురా... నాకిష్టమైన పాటల కార్యక్రమం...''

''అయితే ఇవాళ పాఠం లేదాండీ?''

''ఒరేయ్‌! ఏదైనా ఆపొచ్చు కానీ రాజకీయ పాఠం మాత్రం ఆపకూడదురా. అదే కదా మన లక్ష్యం?''

''మరయితే ఇక  పిచ్చి పాటలతో పనేముందండి? ఆపేయండి...''

''పాటల్నంత చులకనగా చూడకురోయ్‌! ఏం? అవి మాత్రం పాఠం చెప్పలేవనుకుంటున్నావా?''

''ఊరుకోండి గురూగారూ! సినిమా పాటలెక్కడ? సమకాలీన రాజకీయాలెక్కడ? పొంతన ఎక్కడ కుదురుతుంది?''

''ఏడిశావ్‌! రాజకీయమంటే అదేదో ఆకాశం నుంచి ఊడిపడే బ్రహ్మపదార్థం అనుకుంటున్నావేంట్రా? నేర్చుకోవాలనే ఉద్దేశం ఉండాలే కానీ, పాటలోంచి కూడా పాఠం పిండుకోవచ్చు. అర్థం, అంతరార్థం తెలియాలంతే...''

''మీరు మరీ చెబుతారు సార్‌. అయితే  పాట చెప్పే పాఠమేంటో చెప్పండి చూద్దాం...''

''ఓరి బడుద్దాయ్‌! జాగ్రత్తగా వింటే  పాటలో మీ అధినేత మనోగతం లౌడ్స్పీకర్లో వినిపిస్తుందిరా సన్నాసీ...''

''ఎలాగండీ?''

''ఎలాగేంట్రా? ఆయన వీధి వీధిలో తిరగబట్టే కదరా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది? తండ్రి చనిపోయిన పరిస్థితుల నుంచి ప్రజల సానుభూతి పొందడానికి వీధిన పడ్డాడా లేదా? ' నాన్నా... నీ మనసే వెన్న... అమృతము కన్నా... అది ఎంతో మిన్న...' అంటూ  పాడుకున్నట్టు, నాన్న పేరు చెప్పుకుంటూ జనం ఏడవక పోయినా ఓదార్చాడా లేదా? అలా ఓదారుస్తూ నానా అడ్డగోలు వాగ్దానాలూ చేసి నమ్మించాడా లేదా? ఆఖరికి జనాన్ని నమ్మించి కుర్చీ ఎక్కడా లేదా?  తర్వాత 'ఇక ఊరేల? సొంత ఇల్లేల?' అన్నట్టు ఇక్కడే పాతుకుపోలేదూ? మసిబూసి మారేడు కాయ చేసినట్టు ఐదేళ్లుగా అఘాయిత్యాలు సాగించలేదూ? ఇన్నళ్ల తర్వాత సొంత చెల్లెలు వచ్చింది. అన్నగారని చూడకుండా ఎక్కడబడితే అక్కడ కడిగి పారేస్తోంది. అన్నగారి అసలు స్వరూపమేంటో అరటి పండు ఒలిచినంత తేలిగ్గా చెబుతోంది. కుటుంబంలో నిజాలు బయట పడిపోతుంటే ఈయనేమైనా తొణుకుతున్నాడా? బెణుకుతున్నాడా? ఆయన ధ్యైర్యం అంతా వీధులున్నాయనేగా? మళ్లీ వీధిన పడి నానా కూతలూ కూస్తే వెర్రి జనం నమ్మి వెంట నడుస్తారనే కదా ఆయన నమ్మకం? ఇహ ఇప్పుడు విను  పాట. నీకే అర్థమవుతుంది అంతరార్థం... ''

''అవునండోయ్‌! అందుకనే ఆయన ధైర్యంగా 'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి... ఇక ఊరేల? సొంత ఇల్లేల  చెల్లెలా...?' అంటున్నట్టే ఉందడోయ్‌. ఆయన స్వార్థమేంటో,  పరమార్థమేంటో కూడా అర్థమవుతోందండి. ఇన్నేళ్లుగా ఈయన చేసిందంతా చేసేసి, దోచిందంతా దోచేసి 'పాపం పుణ్యం నాది కాదు పోవే పిచ్చామ్మా...' అన్నట్టుందండి. 'నారు పోసి నీరు పోసే నాథుడు వాడమ్మా...'' అంటూ ఓటరు మీద భరోసా వేసుకున్నట్టు కూడా బోధపడుతోందండి. అంతేనాండీ?''

''సెభాష్రా. బాగానే గ్రహించావ్‌. కానీ అసలు ఆయన పాడాల్సిన పాటేంటో తెలుసా? అది తెలుసుకోవాలంటే ఇది విను...'' అంటూ గురువుగారు సెల్ఫోన్లో మరో పాట పెట్టారు.

''మల్లెతీగకు పందిరివోలె...

మసక చీకటిలో వెన్నెలవోలె...

నీ పాదం మీద పుట్టుమచ్చనై  చెల్లెమ్మా...

తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా...''

పాట వింటూనే శిష్యుడు పగలబడి నవ్వాడు. తర్వాత కష్టం మీద నవ్వాపుకుని, ''ఊరుకోండి సార్‌. ఓపక్క చెల్లెలు చెడామడా చెలరేగుతుంటే పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టు ఆయనుంటే...  పాట పాడాలంటారూ?''

''మరి కాదట్రా?  రోజు కుర్చీ మీదకి నువ్వు, నీ నెత్తి మీదకి కళ్లు ఎక్కినంత మాత్రాన చరిత్ర మర్చిపోతే ఎలా?  చెల్లెమ్మ బాధ కూడా అదేగా? అన్న అధికారం కోసం కాళ్లకు బలపాలు కట్టుకుని ఏకంగా మూడు వేల కిలోమీటర్లకు పైగా నడిచిందా లేదా? ఊరూవాడా ప్రచారాలు చేసిందా లేదా? అన్నగారి హామీలని పార్టీ జెండాతో కలిపి మోసిందా లేదా?''

''అవునండోయ్‌! అప్పట్లో  ఆడబిడ్డ అన్న గెలవాలని తహతహలాడిపోయిందండి...''

''అయితే ఇప్పుడు  పాట విను...'' అంటూ గురువుగారు ఇంకో పాట పెట్టారు.

''అన్నయ్య సన్నిధి...

అదే నాకు పెన్నిధి...

కనిపించని దైవమే  కనులలోన ఉన్నదీ''...

''విన్నావా? మరి  పాట వింటే నీకమనిపిస్తోందో చెప్పు?''

''అర్థమైందండి.  చెల్లెలు భావాలు ఇలాగే ఉండేవనుకోవచ్చండి. అంతేకాదండి,  పాటలో లాగా, 'ఒకే తీగ పువ్వులమై... ఒకే గూటి దివ్వెలపై... చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో, కన్నకడుపు చల్లగా కలిసి మెలిసి ఉన్నాము...' అన్నట్టు పాడుకునే ఉంటుందండి  చెల్లెమ్మ. మరప్పుడు అన్నగారికి అధికారం లేదండి. ఉన్న పార్టీ నుంచి ఊపిరి అందలేదండి. అందుకనే కదండీ,  అన్నయ్య కొత్త పార్టీతో వీధిన పడ్డది? అందుకు తగినట్టుగానే  పాట కూడా ఉందండి బాబూ! 'కలిమి మనకు కరవైనా... కాలమెంత ఎదురైనా...  బంధం విడిపోదన్నా, ఎన్నెన్ని యుగాలైనా... ఆపదలో ఆనందంలో నీ నీడగ ఉంటానన్నా...'' అని పాడి భరోసా ఇచ్చినంతగా శ్రమ పడిపోయిందండి  చెల్లెమ్మ... అంతేనాండీ?''

''బాగా చెప్పావురా. మరంతలా తిరిగిన చెల్లాయి గురించి ఎలా పాడుకోవాలిరా? 'అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా... ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా...'' అనుకోవద్దురా. ఇంకా మాటాడితే, 'సిన్నబోయి నువు కూర్చున్నవంటే చెల్లెమ్మా... వెన్నుపూస నాదిరిగేనమ్మా చెల్లెమ్మా! ఒక్క ఘడియ నువు మాటాడకుంటే చెల్లెమ్మా... దిక్కులేని పక్షినౌతానమ్మా చెల్లెమ్మా! బువ్వ తినక నువు అలిగినావంటే చెల్లెమ్మా... నా భుజం విరగినంత పనైతదమ్మా చెల్లెమ్మా!' అంటూ పాడుకోవద్దూ. కానీ  జగమెరిగిన అన్న అలా చేస్తున్నాడా? చెల్లాయి నోరిప్పితే ఇప్పుడు సహించలేకపోతున్నాడు. తన కోసం వీధివీధినా తిరిగిన  చెల్లెమ్మ మీద కనీస ఆదరణ అయినా చూపించాడా చెప్పు? పైగా పొమ్మనలేక పొగబెట్టినట్టు వ్యవహరించాడు. ఆఖరికి అమ్మను కూడా పార్టీ పదవి నుంచి తప్పించాడు. దాంతో  చెల్లెమ్మ పొరుగు రాష్ట్రంలో పార్టీ పెట్టి కొత్త దారులు తొక్కిందా లేదా?  అమ్మ కూడా కూతురికి వత్తాసుగా మసలిందా లేదా?  తర్వాత రాజకీయ పరిస్థితులు మారి  చెల్లెమ్మ కొత్త పార్టీ జెండా ముడిచేసి, మరో జాతీయ పార్టీ జెండా నీడన చేరింది కదా? ఇలా తన కుటుంబంలో తనే స్వయంగా చీలికలు తెచ్చుకుని కూడా, ఏమీ ఎరగనట్టు... 'ఎవరో జ్వాలను రగిలించారు... వేరెవరో దానికి బలి అయినారు...' అని పాడుకున్నట్టు, జనం నుంచి జాలి పిండుకోడానికి చూడ్డం లేదూ? ఇక ఇప్పుడు చెల్లెలు రోడ్డెక్కి తన నీచ నైజాన్ని బయట పెడెతుంటే భరించలేక తన అనుచరుల చేత అవాకులు, చెవాకులు సోషల్మీడియాలో పేలిస్తున్నాడు. తన పాలనకు వ్యతిరేకంగా ట్వీట్చేస్తేనే సహించలేక కేసులు పెట్టించిన చరిత్ర ఉన్నవాడు, సొంత అమ్మ మీద, చెల్లెలు మీద అనుచిత వ్యాఖ్యానాలు చూస్తూ కూడా నిమ్మకు నోరెత్తినట్టు ఉన్నాడు. కిమ్మనకుండా కూర్చున్నాడు. అవునా?''

''అవునండోయ్‌! మొత్తానికి మీకు నచ్చిన పాటల కార్యక్రమం బలే రంజుగా ఉందండి. మరో పాట వినిపించండి...''

''పది నెలలు నను మోసి... పాలిచ్చి పెంచి...

మది రోయక నాకెన్నో ఊడిగాలు చేసిన...

 తల్లీ! నిను నలుగురిలో నగుబాటు చేసితీ...

తలపకమ్మ తనయుని తప్పులు క్షమియించవమ్మా...

అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా...

ఆవేదన తీరు రోజు  జన్మకు లేదా?''

గురువుగారు పెట్టిన పాట విని శిష్యుడు ఆశ్చర్యపోయాడు.

''ఇదేం పాట గురూగారూ!  పక్క తానే అమ్మని పదవి నుంచి తప్పించిన  అపర రాజకీయ నక్కజిత్తుల కొడుకు,  పాట ఎలా పాడతాండండీ?''

''మరదేరా... రాజకీయాలను నిశితంగా పరిశీలించడమంటే.  పక్క చెల్లాయి రెచ్చిపోతోంది. మరో పక్క ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. రహస్యాలు బట్టబయలవుతున్నాయి. సొంత చెల్లెలే అన్న మీద అన్నేసి నిజాలు చెబుతుంటే, ఇక ప్రజలేమనుకుంటారు?  భయం చేతనే ఇప్పుడు  కుతంత్రాల తనయుడు, కుటుంబ రాజకీయాలను తెర తీస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయిరా. రాబోయే ఎన్నికల సభల్లో పాల్గొన్నాలని అమ్మకు రాయబారాలు పంపుతున్నట్టు భోగట్టాలున్నాయి మరి. అంటే  కొత్త పాట పాడుతన్నట్టు లేదూ?''

''అచ్చంగా అలాగే ఉందండీ. మరి  అమ్మ ఒప్పుకుంటుందంటారా?''

'' అమ్మ ఒప్పుకుంటుందో,  చెల్లెలు ఊరుకుంటుందో,  అన్న ఏం చేస్తాడో రాజకీయ వెండితెరపై చూడాలిరా...''

''మరి గురూగారూ!  అన్నాచెల్లెళ్ల బాగోతంలో ఎవరిది పైచేయి అవుతుందండీ...''

''ఒరేయ్పిచ్చి సన్నాసీ! ఒకే తాను గుడ్డల గురించి అనుకునేదేముందిరా.  నాన్న గురించి జనానికి తెలీదా?  నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షలాది కోట్ల అక్రమ లావాదేవీలు నడిపిన  కొడుకు గురించి తెలీదా?  కొడుకు అరెస్టయినప్పుడు అంగలారుస్తూ రోడ్డు షోలు చేసి  అమ్మ గురించి తెలీదా? అప్పుడు అన్నకు అండగా, అన్న వదిలిన బాణంగా రాష్ట్రాన్ని చుట్టబెట్టి, ఇప్పుడు అనుకున్న రాజకీయ ప్రయోజనాలు అందలేదనే అక్కసుతో, అన్న పక్కలో బల్లెంలా మారిన చెల్లెలి గురించి తెలీదా?  కుటుంబ రాజకీయాలను కళ్లారా చూస్తున్న జనం మాత్రం ప్రస్తుతానికి, 'అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం... ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం... వింత నాటకం!' అని పాడుకునే పరిస్థితిలో పడిపోయార్రా. అవునా?''

''అవునండి. మరయితే గురువుగారూ! రాబోయే ఎన్నికల్లో జనం ఏం పాడుకుంటారో, అది కూడా వినిపిద్దురూ...''

''కొట్టు కొట్టండి, కొట్టండి బుర్ర పగుల...

జుట్టూడలాగండి చెవులు మెలేయండి...

నడుములిరగ బుర్రపగల చచ్చేటట్టు కొట్టండెహే!''

-సృజన

PUBLISHED ON 13.2.2024 ON JANASENA WEBSITE

 

 

 

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి