సోమవారం, ఏప్రిల్ 01, 2024

తరలి వచ్చిన రామదండు!


 

లోక కంటకుడైన రావణ సంహారం కోసం, దశరథుడి కుమారుడిగా అవతరించడానికి మహావిష్ణువు సంకల్పించిన తర్వాత బ్రహ్మదేవుడు భవిష్యత్తు పరిమాణాలను అవలోకించాడు. రాముడిగా జన్మించనున్న విష్ణువుకి సహాయపడడానికి రామదండును సిద్ధం చేయదలిచాడు. ఆ ఉద్దేశంతో దేవతలందరికీ ఆదేశాలు జారీ చేశాడు.

''దేవతలారా! ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలిగినా అప్పుడల్లా విష్ణు భగవానుడు అవతరించి దుష్టులను శిక్షించి, సమస్త ప్రాణకోటికీ సుఖసంతోషాలు కలిగిస్తాడు. ఇప్పుడాయన దశరథుడికి కుమారుడిగా పుట్టనున్నాడు. రావణాది రాక్షసుల సంహారంలో ఆయనకు సహాయపడడానికి మీరంతా కూడా భూలోకంలో మీ అంశలతో మహా వీరులను సృష్టించండి. వారంతా అమిత బలశాలురై వాయువేగంతో చరించగలగాలి. కోరిన రూపాన్ని పొందగలిగే కామరూపులై ఉండాలి. అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగించడంలో నిపుణులై ఉండాలి. అప్సరసలు, గంధర్వ స్త్రీలు, యక్షవనితలు, నాగకన్యలు, విద్యాధర యువతులు, కిన్నెర మహిళలు, వానర స్త్రీలలో మీ అంశలను ప్రవేశపెట్టి యోధానుయోధులైన వానర సైన్యాన్ని సృష్టించండి'' అంటూ అనుజ్ఙ ఇచ్చాడు.

ఈ సందర్భంలోనే బ్రహ్మదేవుడు జాంబవంతుడి జన్మ గురించి కూడా చెప్పుకొచ్చాడు.

దాని ప్రకారం, ఒకసారి బ్రహ్మ ఆవులించినప్పుడు ఆయన నోటి నుంచి మహావీరుడు పుట్టుకొచ్చాడు. అతడే భల్లూక రాజైన జాంబవంతుడు.  ''రాముడికి సహయపడడానికి మీరు సృష్టించే వానర యోధులందరికీ జాంబవంతుడు అండగా ఉంటాడు'' అంటూ బ్రహ్మ దేవుడు ముగించాడు.

వెంటనే దేవతలందరూ రుషి, సిద్ధ, విద్యాధర, నాగ, చారణ, గంధర్వ, అప్సరసలైన వేర్వేరు స్త్రీల ద్వారా వానర, భల్లూక వీరులను పుత్రులుగా ప్రభవింపజేశారు. దేవేంద్రుడి అంశతో వాలి జన్మించాడు. సూర్యుడి ప్రభావంతో సుగ్రీవుడు పుట్టాడు. వాయుదేవుని అంశతో హనుమంతుడు అవతరించాడు. ఇలా... దేవగురువు బృహస్పతికి తారుడు, కుబేరుడికి గంధమాదనుడు, విశ్వకర్మకు నలుడు, అగ్నికి నీలుడు, అశ్వనీదేవతల  వల్ల మైంద ద్వివిదులూ, వరుణుడికి సుషేణుడు, పర్జన్యుడికి శరభుడు జన్మించారు. వీరంతా మహా పరాక్రమవంతులైన వానర యోధులు. ఇతర దేవతల వల్ల లక్షల సంఖ్యలో రామదండు పుట్టింది. వీరంతా వానర, భల్లూక, గోపుచ్ఛ జాతులలో బలపరాక్రమాలతో పుట్టారు. అందరూ వజ్రకాయులు, మహాకాయులు, కామరూపులు, అమిత బల పరాక్రమ వంతులు. పర్వతాలను సైతం చలింపజేయగలరు. సముద్రాన్ని కల్లోల పరచగలరు. పెను వృక్షాలను సైతం పెకలించగలరు. పెద్ద పెద్ద బండరాళ్లను   బంతుల్లా పట్టుకుని విసరగలవారు. ఆకాశంలో ఎగరగలరు. సింహాల్లాంటి క్రూర మృగాలను కూడా బెదరగొట్టగలరు. మదపుటేనుగులను సైతం అదుపు చేయగలవారు. రుక్షరజుని కుమారులుగా పుట్టిన వాలి సుగ్రీవులిద్దరూ నలుడు, నీలుడు, హనుమంతుడు తదితరులను మంత్రులుగా చేసుకుని రుష్యమూకమనే పర్వతం దగ్గర రాజ్యాన్నిఏర్పరుచుకుని వానర, భల్లూక సైన్యానికి నాయకులుగా ఉండసాగారు.

అలా రాముడికి సాయపడడానికి పుట్టిన వానరులంతా భూమండలమంతా వ్యాపించి వర్థిల్లారు. రావణ సంహారానికి సైన్యం సిద్ధమైంది. ఇక వారిని నడిపించే ప్రభువైన రామచంద్రుడు అవతరించడానికి సమయం ఆసన్నమైంది. వచ్చే భాగంలో రామజననం గురించి తెలుసుకుందాం! జై శ్రీరామ్‌!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి