శుక్రవారం, ఏప్రిల్ 12, 2024

శ్రీరామ జననం... సకల జన రంజనం! (పిల్లల కోసం రాముడి కథ-6)

 

దశరథుడు అశ్వమేధ, పుత్రకామేష్టి యాగాలను శోభాయమానంగా పూర్తి చేశాడు. దేవతలందరూ హవిస్సులు స్వీకరించి సంతోషంతో తమ స్థానాలకు వెళ్లారు. దశరథుడు తన రాణులతో కలిసి యాగశాల నుంచి అయోధ్య నగరానికి చేరుకున్నాడు. యాగానికి వచ్చిన రాజులను, అతిథులను దశరథుడు తగిన రీతిలో సన్మానించాడు. వారందరూ సంతృప్తిగా తమ తమ నగరాలకు ప్రయాణమై వెళ్లిపోయారు. యాగ నిర్వహణ చేసిన రుష్యశృంగుడిని దశరథుడు సాదరంగా పూజించాడు. ఆ మహర్షి, తన భార్య అయిత శాంతతోను, అంగరాజైన రోమపాదుడుతోను కలిసి తిరుగు ప్రయాణమయ్యాడు. 

పుత్రకామేష్టి యాగం తర్వాత 12 నెలలు గడిచాయి. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కౌసల్య శ్రీరాముడిని ప్రసవించింది. మహా విష్ణువు అంశతో లోకోద్ధారకుడైన శ్రీరాముడు అవతరించే సమయానికి సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని అనే అయిదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. ఆ మరునాడు, అంటే చైత్రశుద్ధ దశమి నాడు పుష్యమి నక్షత్రంలో భరతుడికి కైకేయి జన్మనిచ్చింది. అదే రోజు అంటే చైత్రశుద్ధ దశమినాడు ఆశ్లేషా నక్షత్రంలో సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు పుట్టారు. 

దశరథుడికి నలుగురు పుత్రులు పుట్టిన వేళ గంధర్వులు మధురంగా గానం చేశారు. అస్సరసలు నాట్యం చేశారు. దేవ దుందుభులు మ్రోగాయి. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. ఇక కోసల రాజ్య పౌరుల ఆనందానికి అంతే లేకపోయింది. రాజవీధులన్నీ ప్రజల కోలాహలంతో మారుమోగిపోయాయి. నృత్య గాన వినోదాలతో అయోధ్య వాసులు ఆనంద పరవశులయ్యారు. వందిమాగధులు స్తోత్రాలు పఠించారు.  పరమానంద భరితుడైన దశరథుడు గొప్పగా దాన ధర్మాలు చేశాడు. బ్రాహ్మణులకు వేలాది గోవులను, పౌరాణికులకు ధన కనక వస్తు వాహనాలను దానం చేశాడు. 

పుత్రులు పుట్టిన పదకొండు రోజులకు కులగురవైన వశిష్ణుడు, పిల్లలకు జాత కర్మ, నామకరణ  ఉత్సవాలు ఘనంగా  జరిపించాడు. 

తన గుణాలతో అందరినీ ఆనందింప జేసేవాడు కాబట్టి పెద్ద కుమారుడికి రాముడు అని పేరు పెట్టాడు. రాజ్య భారాన్ని భరించగలవాడు కాబట్టి కైకేయి కుమారుడికి భరతుడని నామకరణం చేశాడు. సర్వ సంపదలతో శోభిల్లేవాడనే ఉద్దేశంతో లక్ష్మణుడని, శత్రువులను తుద ముట్టిస్తాడు కనుక శత్రుఘ్నుడని సుమిత్ర పుత్రులకు పేర్లు పెట్టాడు. 

రాముడు లక్ష్మణుడు ఎప్పుడూ కలిసి ఉండేవారు. అలాగే భరతుడు, శత్రుఘ్నుడు జంటగా ఉండేవారు. లక్ష్మణుడు లేకపోతే రాముడు నిద్ర కూడా పోయేవాడు కాడు. కంటి ముందు మధుర పదార్థాలు ఉన్నా, లక్ష్మణుడు లేనిదే తినేవాడు కాడు. నలుగురు పిల్లలూ  పెరిగి పెద్దవారవసాగారు.  పుత్రులను చూసుకుంటూ దశరథుడు పరమానందాన్ని పొందుతూ ఉండేవాడు. 

రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు క్రమంగా వేద శాస్త్రాలు అభ్యసించారు. విలువిద్యలో ఆరితేరారు. మంచి గుణాలతో, చక్కని నడవడికతో, వినయ విధేయతలతో అందరినీ ఆకట్టుకునే ఈ నలుగురూ యుక్తవయస్కులు అయ్యారు. దశరథుడు తన పుత్రుల వివాహాల గురించి ఆలోచనలు కూడా చేయసాగాడు. 

రామ కల్యాణానికే కాదు, లోక కల్యాణానికి కూడా సమయం ఆసన్నమైంది. అందుకే విశ్వామిత్ర మహర్షి అయోధ్య నగరానికి వేంచేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి