బుధవారం, ఏప్రిల్ 17, 2024

రామాయణం... మన జీవన పారాయణం!



ఏడాదికోసారి నవమి రోజు 

తల్చుకునే దేవుడు కాడు రాముడు...

ప్రతి రోజూ నిత్యం స్మరించుకోవలసిన స్ఫూర్తిమంతుడు రాముడు!

రాముడు ఏమన్నడో గుర్తు చేసుకుంటే మనల్ని మనం సంస్కరించుకోవచ్చు!

రాముడు ఎలా ప్రవర్తించాడో జ్ఞప్తికి తెచ్చుకుంటే మన నడవడిని మనం తీర్చిదిద్దుకోవచ్చు!

రాముడి మార్గంలో నడిస్తే మన బతుకుల్ని మనం ఉద్ధరించుకోవచ్చు!

జీవితంలో ఏం జరిగినా దాన్ని తక్షణమే స్వీకరించి, ఆ తర్వాత ఏం చేయాలో దానికి సంసిద్ధమవ్వాలనే గొప్ప సందేశాన్ని రాముడు మానవాళికి అందించాడు. 

ప్రతి దశలోనూ మన కర్తవ్యమేంటో గుర్తించి దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్లాలని ఆచరించి చూపించాడు రాముడు.

ఆ కర్తవ్య నిర్వహణలో ధర్మం ఉందా లేదా అని తరచి చూసుకుంటే చాలు, ఎలాంటి పరిస్థితులలోనైనా చలించకుండా ముందుకు సాగిపోవచ్చనే ధైర్యాన్ని మనకి ఇచ్చాడు.

ఒక కొడుకుగా, ఒక సోదరుడిగా, ఒక భర్తగా, ఒక రాజుగా, ఒక వ్యక్తిగా తన పాత్రను తాను అత్యున్నతంగా నిర్వహించాడు. పరబ్రహ్మమైనప్పటికీ, మానవుడిగా అవతారం దాల్చిన తర్వాత ఆ పాత్రలోనే ఒదిగిపోయాడు. ఆఖరికి బ్రహ్మాది దేవతలు కూడా ''సాక్షాత్తు దేవాధిదేవుడవు నీవు'' అని చెప్పినా ఒప్పుకోలేదు. ''నేను దశరథుడి పుత్రుడిని. మానవుడిని'' అని వినయంగా చెప్పి అవతార ధర్మాన్ని పాటించాడు. తద్వారా మానవులు మినహా ఎవరి చేతనైనా చావు లేకుండా వరమిచ్చిన బ్రహ్మ మాటను గౌరవించాడు. ఆ మాట కోసం మానవమాత్రుడిగా అష్టకష్టాలు పడ్డాడు. 

తండ్రి మాట కోసం అడవులకు వెళ్లిన రాముడు గురించి అందరికీ తెలుసు...

కానీ... ఆ తండ్రి మాటనే తిరస్కరించిన రాముడు కూడా రామాయణంలోనే కనిపిస్తాడు!

అవును... 

''రామా! నా మీద తిరుగుబాటు చెయ్యి. నన్ను ఖైదు చేసి రాజ్యాన్ని ఏలుకో'' అని దశరథుడే స్వయంగా రాముడికి చెప్పాడు. నారచీరలు కట్టుకుని వనవాసానికి బయల్దేరిన రాముడు ఆ మాటను వినమ్రంగా తిరస్కరించాడు.

''తండ్రి కాముకుడు. భార్య కోసం నిన్ను అడవులకు పంపుతానంటాడా? ఆ తండ్రిని ఎదిరించి నీకు రాజ్యం ఇస్తాను'' అంటూ రగిలిపోయిన లక్ష్మణుడి మాటను కాదని, అతడిని నిదానంగా నచ్చ చెప్పాడు.

''తండ్రి మాటే కాదు. తల్లి మాట వినడం కూడా ధర్మమే కదా? నన్ను కూడా నీతో పాటు అడవులకు తీసుకుపో. నువ్వు లేని చోట నేను ఉండలేను'' అని కౌసల్య అన్నప్పుడు ఆ తల్లి మాటను కూడా కాదన్నాడు.

అప్పుడు రాముడికి దారి చూపించింది ధర్మం. రాముడికి కర్తవ్యాన్ని బోధించింది ధర్మం. ఆ ధర్మాన్నే రాముడు ఆచరించాడు. దాన్ని ఆలంబనగా చేసుకునే అందరికీ జవాబు చెప్పగలిగాడు. 

''నేను రాజ్యాన్ని స్వీకరిస్తే తండ్రి అసత్యం పలికినట్టవుతుంది. ఆ దోషం వల్ల ఆయన నరకానికి వెళతాడు. తండ్రి నరకంలో ఉన్నప్పుడు నేను రాజ్యాన్ని అనుభవించగలనా?'' అని రాముడు అడిగితే లక్ష్మణుడి దగ్గర సమాధానం లేదు.

''నేను వనవాసాలకు వెళ్లానని కుమిలిపోతున్న నాన్నగారిని ఎవరు ఓదారుస్తారు? ఆయనకు ఈ సమయంలో తోడుగా ఉండే ధర్మం భార్యగా నీది కాదా?'' అని రాముడు చెబితే, తల్లి కౌసల్య ఇంకేం చెప్పగలుగుతుంది?

ఆఖరికి దశరథుడు, ''అయితే నీతో పాటు వనవాసానికి చతురంగ బలాల్ని కూడా తీసుకు వెళ్లు. సేవకులు, కళాకారులు కూడా నీతో పాటు వస్తారు'' అన్నాడు. ఆ మాటను సైతం సున్నితంగా తిరస్కరించాడు రాముడు.

''చతురంగ బలాలు, సైనికులు నా వెంట నడిస్తే అది భరతుడికి రాజ్యం ఇచ్చినట్టు కాదు కదా? అప్పుడు పినతల్లికి మీరు ఇచ్చిన మాట ఏమైనట్టు?'' అని ప్రశ్నించాడు. దశరథుడు మారు మాట్లాడలేకపోయాడు. 

అంతకు ముందు రోజు దశరథుడు పిలిపించి ''రేపే నీకు పట్టాభిషేకం'' అంటే, రాజధర్మం తెలిసిన పెద్ద కొడుకుగా అందుకు సిద్ధమయ్యాడు.

మర్నాడు మంగళ స్నానాలు చేసే వేళకి పరిస్థితి మొత్తం మారిపోయింది. 

పట్టు పీతాంబరాలు ధరించి, కిరీట ధారణ చేసి, బంగారు సింహాసనంపై కూర్చోవలసిన రాముడు, అప్పటికప్పుడు నార దుస్తులు ధరించి, అడవులకు వెళ్లాల్సి వచ్చింది. 

అంతవరకు యువరాజు. పాలరాతి భవంతుల్లో విహరిస్తూ, చుట్టూ సేవకులు అప్రమత్తమై సేవిస్తుండగా, పంచభక్ష్య పరమాన్నాలు ఆరగిస్తూ, హంస తూలికా తల్పాలపై పవళించిన సుకుమారుడు రాముడు.

అడవుల్లో అవేమీ ఉండవు. క్రూరమృగాల భయం. రాత్రి పడితే చీకటి. పురుగు, పుట్రా చూసుకోవాలి. తినడానికి కంద మూలాలు తవ్వుకోవాలి. కటిక నేలపై పడుకోవాలి. 

అయినా... చలించాడా రాముడు? 

మందహాసంతో ముందుకు సాగాడు. 

''అన్నా! నాన్నగారు చనిపోయారు. ఆయన మాట ఇంకా పాటించడం ఎందుకు? ఈ రాజ్యం నీది. వచ్చి పాలించు'' అంటూ వాదించిన భరతుడి మాటకు కూడా అంగీకరించలేదు. దశరథుడి నుంచి వరాలు పొందిన పినతల్లి కైకేయి స్వయంగా రమ్మని అడిగినా వినలేదు. 

తండ్రికి అసత్య దోషం కలుగకుండా చేయాలనే దృఢ సంకల్పం, ఆయన మరణంతో పాటు ఎలా సడలిపోతుంది? అందుకే పద్నాలుగేళ్ల సుదీర్ఘ వనవాసానికి రాముడు ముందడుగు వేశాడు. 

అడవుల్లో మాత్రం ఏం సుఖపడ్డాడని? అడుగడుగునా రాక్షసుల దాడులు. విరాధుడు సీతను ఎత్తుకుపోతే పోరాడి వధించాడు. శూర్పణఖ కామరూపం ధరించి వరించమని కోరితే, అలా చేయడం ధర్మం కాదన్నాడు. హద్దు మీరిన ఆ రక్కసిని లక్ష్మణుడు శిక్షించినందుకు ఖరదూషణాదులైన పద్నాలుగు వేల మంది రాక్షసులు వచ్చి చుట్టు ముట్టారు. వీరధర్మాన్ని ఆచరించి, రాముడొక్కడే అంతమందినీ నేలకూల్చాడు. 

చివరికి రావణాసురుడు మాయోపాయం పన్ని సీతకు అపహరించాడు.  భార్యా వియోగానికి రాముడు విలపించాడు కానీ, వెనుకడుగు వేయలేదు.

రావణాసురుడిని ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన జటాయువును గుండెలకు హత్తుకుని కన్నీరు కార్చాడు. ఆ పక్షికి స్వయంగా అంత్యక్రియలు జరిపాడు. 

సీత కోసం అడవుల్లో అన్వేషిస్తుంటే కబంధుడు కబళించబోయాడు. ధీరోదాత్తుడై కత్తి దూసి, ఆ గండం నుంచి కూడా గట్టెక్కాడు.

భార్యను ఎవరెత్తుకెళ్లారో తెలియదు. ఎక్కడ దాచారో తెలియదు. ఎక్కడ వెతకాలో తెలియదు. కేవలం జటాయువు, శబరి చేసిన సూచనలను అనుసరించి ముందుకు సాగాడు. కిష్కింధ చేరాడు.

సుగ్రీవుడికి రాజ్యం లేదు.  అన్న వాలికి భయపడి ఎక్కడో తలదాచుకున్నాడు. ఈ దశలో రాముడు, కిష్కింధ రాజైన వాలితో స్నేహం చేస్తే సీతను వెతకడం సులవవుతుంది. కానీ రాముడు ఆ పని చేయలేదు. 

కారణం... ధర్మం!

తమ్ముడి భార్యను చెరబట్టిన వాలి, ఎంత బలవంతుడైనా తన స్నేహానికి తగడనుకున్నాడు. వాలిని చెట్టు చాటు నుంచి దండించి, అలా ఎందుకు చేశావని వాదించిన అతడికి ధర్మసూక్ష్మం తెలియజేశాడు. 

సముద్రంపై వారధి నిర్మించి వానర సైన్యంతో లంకను ముట్టడించాక కూడా శాంతి కోసమే ఆలోచించాడు. రావణుడి దగ్గరకు అంగదుడిని రాయబారిగా పంపుదామన్నాడు.

''ఇప్పుడు రాయబారమా?'' అని అడిగిన విభీషణుడికి, సుగ్రీవుడికి కూడా ధర్మం ఆధారంగానే సమాధానం చెప్పాడు. 

''మనకి వైరం రావణుడితోనే. యుద్ధం వస్తే రాక్షసులందరూ మరణిస్తారు. శత్రువుకి కూడా ఆఖరి అవకాశం ఇవ్వాలి'' అని రాముడు కాక ఇంకెవరు అనగలరు?

రావణాసురుడు చనిపోయాక విభీషణుడితో శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించాడు.

''అతడి మరణంతోనే శత్రుత్వం కూడా పోయింది'' అన్న రాముడి పలుకులు ఆనాటికే కాదు, ఈనాటికి కూడా ఆచరణీయాలు కాదా?

పుష్పక విమానంపై అయోధ్య సమీపానికి వచ్చిన రాముడు, హనుమంతుడికి ఒక పని అప్పగించాడు.

''వెళ్లు. భరతుడిని గమనించు. పద్నలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత, అతడిలో ఏమాత్రమైనా రాజ్యకాంక్ష కనిపిస్తే నాకు చెప్పు. నేను మళ్లీ అడవులకి వెళ్లిపోతాను''. 

వనవాసంలో అనేక కష్టాలు పడ్డాక, రావణాది రాక్షసులతో పోరాడి విజయం సాధించాక కూడా ఇలా అనగలిగాడంటే, ఆ రాముడికి మించిన ఆదర్శమూర్తి ఎవరుంటారు? 

అందుకే ఈనాటికీ మనం రాముడిని తల్చుకోవాలి!

ఏదైనా కష్టం వస్తే రాముడిని తల్చుకుని ధైర్యంగా నిలబడాలి. తర్వాతి కర్తవ్యమేంటో నిర్ణయించుకుని ముందడుగు వేయాలి.

ఈ పరమ సత్యం యుగాలు మారినంత మాత్రాన మాసిపోతుందా?

ఈ మహోన్నత వ్యక్తిత్వ లక్షణం ఎంతటి ఆధునిక కాలమైనా, ఆదరణకు నోచుకోకుండా ఉంటుందా?

అందుకే సృష్టికర్త బ్రహ్మ చెప్పినట్టు ''భూమి, పర్వతాలు, నక్షత్రాలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది''!

రామాయణం, కేవలం ఒక గ్రంథం కాదు. 

మన బతుకు మార్గాన్ని సుగమం చేసే జీవన పారాయణం!








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి