మంగళవారం, డిసెంబర్ 09, 2025

జీవం... ఓ అద్భుతమైన ప్రకాశం



జీవం అంటేనే వెలుగు. ప్రకాశం. సృష్టికి మూలం ఈ ప్రకాశమే.

అలాంటి ఓ అద్భుతమై ప్రకాశాన్ని జీవ శాస్త్రవేత్తలు చూడగలిగారు. సృష్టికి మూలమైన ఆ కాంతి పుంజాన్ని చూడడమే కాదు, తొలి సారిగా ఫొటో కూడా తీయగలిగారు.

జీవం ఏర్పడే ఆ క్షణంలో సూక్ష్మంగా విరజిమ్మిన ఆ వెలుగును చూసి ఆశ్చర్యపోయారు.

ఇది జీవ శాస్త్రంలో చోటు చేసుకున్న ఓ అరుదైన, అద్భతమైన ఆధునిక విజయం.

వీర్యకణం, అండాన్ని చేరుకున్న తరుణంలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా వీక్షించారు.

జీవం ఏర్పడడానికి తొలి దశ అయిన ఆ అపురూప క్షణంలో మెరుపు లాంటి ఓ ప్రకాశం వెల్లివిరుస్తుందని గమనించారు. దీనికి ‘జింక్ స్పార్క్’ అని పేరు పెట్టారు.

వీర్యకణం విజయవంతంగా అండాన్ని చేరే క్షణంలో ఈ ప్రకాశం ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో అండం మిలియన్ల సంఖ్యలో జింక్ అయాన్లను ఒక్కసారిగా విడుదల చేస్తుంది. అది కేవలం క్షణంలో జరిగే మెరుపువంటి ప్రక్రియ. అత్యంత శక్తివంతమైన మైక్రోస్కోపులతో మాత్రమే చూడగలిగేది. మొదట ఈ ఘటనను ఎలుకల అండాలలో గమనించారు. తరువాత అదే ప్రక్రియ మానవ అండాలలో కూడా జరుగుతుందని శాస్త్రవేత్తలు నిర్ధరించారు. దీనితో జీవం మొదలయిందనడానికి చిన్న మెరుపు ఒక సంకేతమని తేలింది.

జీవ సంకేతమైన ఆ వెలుగు, ఆ ప్రకాశం, ఆ మెరుపు, ఆ కాంతి పుంజం... అందంగా, అద్భుతంగా గోచరమైంది. అంతే కాదు, ఫలదీకరణ విజయవంతమైందనడానికి... ఆ వెలుగే ఓ ఆరంభమని సూచించే అరుదైన శాస్త్రీయ ఆవిష్కరణ ఇది.

దాని అందం ఒక్కటే కాదు—ఈ జింక్ స్పార్క్ ఒక ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణ. ఇది ఫలదీకరణ నిజంగా విజయవంతమైందని ఖచ్చితంగా తెలియజేసే సంకేతం.  భ్రూణ శాస్త్రవేత్తలకు, ఫెర్టిలిటీ నిపుణులకు ఈ ఆధునిక ఆవిష్కరణ... గర్భధారణ ప్రక్రియను మరింతగా అర్థం చేసుకోవడానికి, పరిశీలించడానికి సహాయపడే కొత్త సాధనంగా మారనుంది.

ఒక జీవితం ప్రారంభమయ్యే క్షణాన్ని అక్షరాలా వెలుగులా చూడగలగడం ఎంత విస్మయకరమో ఇదంతా తెలియజేస్తుంది. సూక్ష్మ ప్రపంచంలో జరిగే ఈ మెరుపు, కొత్త జీవం ప్రారంభమయ్యే ఆ నిమిషానికే ప్రకృతి ఇచ్చే ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వేడుకవంటిది. జీవం ఎంత సున్నితమైనదో, ఎంత ఖచ్చితమైనదో, ఎంత అద్భుతమైనదో ఇది గుర్తు చేస్తుంది.

 

గురువాయూర్ మహిమ





 ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో కేరళలోని గురువాయూర్‌ ఒకటి. 

🌹ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గురువాయురప్పన్‌గా వెలిసి భక్తజన కల్పవృక్షంగా భాసిస్తున్నాడు. 

🌹ఈ క్షేత్రంలోనే "నారాయణీయం " అన్న స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మానవుడు ఎదుర్కొనే ఆధి "వ్యాధులు"  హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. ఇది "" మేల్పుత్తూర్‌ నారాయణ భట్టతిరి""  సంస్కృతంలో స్తోత్ర రూపంలో చేసిన అద్భుత రచన. దీని ఆవిర్భావం వెనుక ఆసక్తికర కథ ఒకటి ప్రచారంలో ఉంది.

🌹పదహారేళ్ల ప్రాయానికే వేదాధ్యయనాన్ని, సంస్కృత వ్యాకరణాన్ని ఆపోశన పట్టిన అసమాన ధీశాలి నారాయణ భట్టతిరి. తన గురువైన "అచ్యుతపిషారతి"  క్షయ వ్యాధితో బాధ పడుతుండటం చూసి నారాయణ భట్టతరి ఎంతో కుమిలిపోయాడు. గురుదక్షిణగా ఆ వ్యాధిని భగవత్‌ ప్రార్థనతో తనకు బదిలీ చేసుకుంటాడు. తరువాత గురువాయూర్‌ చేరుకుని తన వ్యాధిని తగ్గించమని వేడుకుంటూ "రోజుకు ఒక దశకం"  చొప్పున స్తుతి చేయడం ప్రారంభించాడు. ప్రతి శ్లోకం చివర తన వ్యాధిని నయం చేయమని భగవంతుడిని వేడుకుంటాడు.

🌹ఈ విధంగా 1036 శ్లోకాలు పూర్తయ్యేసరికి ఆయన వ్యాధి పూర్తిగా తగ్గడంతో పాటు దైవ సాక్షాత్కారం కూడా లభించింది. వేదవ్యాసుడు పద్దెనిమిది వేల శ్లోకాలతో రచించిన భాగవతానికి సంక్షిప్త రూపంగా అసాధారణ ప్రజ్ఞతో నారాయణీయం రచించాడు భట్టతిరి. ఇప్పటికీ గురువాయూర్‌ దేవాలయంలో ఈ పారాయణాన్ని చేయడం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.నడిచే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నారాయణీయం మొత్తం పారాయణం చేయలేని వారి కోసం ఒక దగ్గరి దారిని చూపారు.

🌹అస్మిన్‌ పరాత్మన్‌ నను పాద్మకల్పే
త్వమిత్థ ముత్థాపిత పద్మయోనిః
అనంత భూమా మమ రోగరాశిం
నిరుంధి వాతాలయవాస విష్ణో

🌹నారాయణీయంలోని ఎనిమిదో దశకంలోని పదమూడవ శ్లోకం ఇది. నిత్యం 108 సార్లు చొప్పున, 48 రోజులు పాటు భక్తి విశ్వాసాలతో ఈ శ్లోకం పారాయణం చేస్తే వైద్యానికి లొంగని మొండి రోగాలు సైతం ఉపశమిస్తాయని ప్రతీతి. పరమాచార్యుల సూచన మేరకు శ్లోకపారాయణం చేసి ప్రయోజనం పొందిన వారెందరో ఉన్నారు...

మన కర్మలకు పద్దెనిమిది మంది సాక్షులు





🍁👉🏾చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత. కానీ...

🍁👉🏾‘నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి "" మూగ సాక్షులు""  పద్దెనిమిది ఉన్నాయి. 

🌹👉🏾అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. 

🍁👉🏾ఈ మూగ సాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు.

🍁👉🏾దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు. ఈ మహా పదార్థాలు రహస్య యంత్రాల వంటివి. అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి. ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం.

🌹👉🏾అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు. అది మనం చేసే పని మంచిదా? చెడ్డదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే. ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం.

🍁👉🏾నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించలన్న కుతూహలం అవివేకం. అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు.

శుక్రవారం, నవంబర్ 28, 2025

తేనెటీగ రుణం తీర్చుకోగలమా?








ఇంట్లో తేనె సీసా ఉందా? అయితే ఓ చెంచాడు తేనె తీసుకోండి. తీసుకున్నాక ఈ విషయం తెలుసుకోండి. మీ చేతిలో ఉన్న చెంచాడు తేనె 12 తేనెటీగల జీవితకాల శ్రమ నుంచి తయారైంది. ఈ తేనెను అవి 30,000 పువ్వుల నుంచి సేకరించాయి. అందుకోసం అవి 800 మైళ్లు ప్రయాణించాయి.

ఇప్పుడు మీ చేతిలో ఉన్న చెంచాడు తేనెను నోట్లో పెట్టుకుని చప్పరించండి. తర్వాత ఈ విషయాలు కూడా తెలుసుకోండి.

·        * మీకు తెలుసా — ఒక చెంచా తేనె మనిషిని 24 గంటల పాటు బతికించగలదని!

·            * మీకు తెలుసా — ప్రపంచంలోని తొలి నాణేలలో ఒక దానిపై తేనెటీగ (Bee) చిహ్నం ఉండేదని!

·             * మీకు తెలుసా — తేనెలో సజీవ ఎంజైములు (live enzymes) ఉంటాయని!

·           * మీకు తెలుసా — ఈ ఎంజైములు లోహపు చెంచాతో తాకినప్పుడు చనిపోతాయని! అందుకే తేనె తీసుకోడానికి మట్టి లేదా చెక్క చెంచా ఉపయోగించాలి. లేకపోతే ప్లాస్టిక్ చెంచా వాడండి.

·            * మీకు తెలుసా — తేనెలో మెదడు పనితీరును మెరుగుపరిచే పదార్థం ఉంటుందని! 

·            * మీకు తెలుసా — ఆఫ్రికాలో కరువు వచ్చినప్పుడు తేనెటీగలు అక్కడి ప్రజలను ఆకలిమరణం నుండి రక్షించాయని!

·            * మీకు తెలుసా — తేనెటీగలు తయారు చేసే ప్రోపోలిస్ (Propolis) అనే పదార్థం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సహజ యాంటీబయోటిక్స్‌లో ఒకటని!

·            * మీకు తెలుసా — తేనె గడువు కాలం (ఎక్పైరీ డేట్) లేకుండా చిరకాలం నిలవ ఉంటుందని!

·            * మీకు తెలుసా — ప్రపంచంలోని కొందరు మహా చక్రవర్తుల మృతదేహాలను బంగారు పేటికల్లో ఉంచి, వాటిపై తేనె పోసి కుళ్లిపోకుండా కాపాడారని!

·            * మీకు తెలుసా — “హనీమూన్” (Honeymoon) అనే పదం, వివాహం తర్వాత కొత్త దంపతులు సంతానోత్పత్తి కోసం తేనె తీసుకునే సంప్రదాయం నుండి పుట్టిందని!

·            * మీకు తెలుసా — ఒక తేనెటీగ జీవితకాలం 40 రోజుల కన్నా తక్కువే కానీ, ఆ కాలంలో కనీసం 1000 పువ్వులు సందర్శించి, ఒక చెంచా కన్నా తక్కువగానే తేనెను ఉత్పత్తి చేస్తుందని! కానీ అది దాని జీవితకాలపు సాధనని!

మరి ఇంత తెలిశాక తేనెటీగకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండగలమా? అసలు దాని రుణం మనం తీర్చుకోగలమా అని!

 

 

 

 

 

గురువారం, నవంబర్ 27, 2025

ఓరి నా వెర్రి మనుషుల్లారా... ఎందుకర్రా ఈ గొడవలు?



 


ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు...

అపార్టుమెంట్లో ఫ్లాట్ల వారీ పట్టింపులు...

వీధిలో ఇరుగు పొరుగుల పేచీలు...

ఊర్లో వీధుల మధ్య తేడాలు...

ఇక్కడితో ఆగిందా?

మతాల మధ్య వైషమ్యాలు...

కులాల మధ్య విభేదాలు...

దేశాల మధ్య పగలు...

సంపన్నులు, సామాన్యుల మధ్య అడ్డుగోడలు...

తరాల మధ్య అంతరాలు...

ఓరి నా వెర్రి మనుషుల్లారా... ఎందుకర్రా ఈ గొడవలు?

ఒక్క సారి అలా ఆకాశంలోకి చూడండ్రా...

సూర్యుడు ధగధగలాడుతూ కనిపిస్తున్నాడా?

మనతో సహా ఈ భూమ్మీద జీవిస్తున్న జీవులన్నింటి పుట్టుకకు కారణమైన ఆ బ్రహ్మాండమైన సూర్యుడు ఎంత పెద్ద వాడో తెలుసా? సూర్యుడి నిండా మన భూగోళాలను సర్దేయాలనుకున్నామనుకోండి. ఎన్ని పడతాయనుకుంటున్నారు? ఏకంగా 13 లక్షలు. అంత చిన్న భూమిరా మనది.

వెర్రి నాగన్నలారా... అందులో మళ్లీ సరిహద్దులు, అంతరాలూనూ... అవసరమా?

అక్కడితో అయిపోయిందనుకోకండర్రా...

ఇంత చిన్న భూమి మీద ఉన్న నువ్వు, 700 కోట్ల మందిలో ఒకడివి. ఏదో సామెజ్జెప్పినట్టు... శత కోటి గాళ్లలో నువ్వో బోడిగాడివన్నమాట.

అందుకనే మరి, ఆకాశం కేసి చూడమంట...

సరే... అక్కడ కనిపించే సూర్యుడు మాత్రం ఏ పాటి అని?

పాలపుంత అనే ఓ నక్షత్ర మండలంలో ఒకడు. మిల్కీవే అనే ఆ గెలాక్సీలో ఉండే దాదాపు 300 బిలియన్ నక్షత్రాలలో ఓ మామూలు నక్షత్రం అంతే. బిలియన్ అంటే వంద కోట్లని తెలుసుగా. అంటే 30,000 కోట్ల తారల సమూహంలో పాలపుంతలో ఓ మూలన ఉండే ఆ సూర్యుడే నిజానికి ఓ ఇసుక రేణువంత. ఆ సూర్యుడిని ఆధారం చేసుకుని, ఆయన ఆకర్షణతో ఆయన చుట్టూ తిరుగుతున్న ఓ ఎనిమిదో, తొమ్మిదో గ్రహాలు, మళ్లీ వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, ఇంకా కోట్లాదిగా ఉండే గ్రహశకలాలు... వీటన్నింటి మధ్య మన భూమి. కేవలం ఇందులోనే జీవం ఉంది. జీవ రాసులు ఉన్నాయి. కీటకాలు, పక్షులు, జలచరాలు, జంతువులు... ఇలా చెబుతూ పోతే కనిపించేవీ, కనిపించనివీ అన్నీ కలిపి లక్షలాది జీవజాతులు. వాటి మధ్య బుద్ది జీవిననుకునే నువ్వు.

ఇప్పుడు చెప్పండొరే...

మన పాలపుంతతోను, మన సూర్యుడితోను పోల్చి చూసుకుంటే మన భూమెంత? దాని మీద మూడొంతులు ఆక్రమించుకున్న సముద్రాలెంత? మిగిలిన కాస్త నేలమీద నీ దేశమెంత? నీ రాష్ట్రమెంత? నీ జిల్లా ఎంత? నీ ఊరెంత? అందులో నువ్వెంత?

ఒక్కసారైనా ఆలోచించావా?
అందుకనేరొరేయ్... ఎప్పుడైనా గర్వం తలకెత్తితే ఓసారి ఆకాశం కేసి చూడండ్రా...

అంతే కాదురా నాయనా... ఇంకాస్త ముందుకెళ్దాం...

మన పాలపుంత ఉంది చూశావూ? అది కూడా ఈ విశ్వంలో చిన్నదేరా...

ఇంతవరకు మానవుడు కనిపెట్టిన అత్యాధునిక పరికరాల సాయంతో, మనం చూడగలిగినంత మేరకు విశ్వాన్నే లెక్కలోకి తీసుకుంటే, అందులో ఉండే దాదాపు 3 ట్రిలియన్ గెలాక్సీలలో మన పాలపుంత కూడా ఒకటి. ఇక్కడ కూడా మనం ‘శత కోటి...’ సామెతను గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఇంతకీ ట్రిలియన్ అంటే తెలుసుగా? లక్ష కోట్లు! అంటే... మూడు లక్షల కోట్ల నక్షత్ర మండలాల్లో ఒకటన్నమాట మన పాలపుంత. ఇక మనం ఇంకా గమనించలేని విశ్వం ఎంతుందో తెలీదు.

 

సరే... మనం మనతో మొదలు పెట్టి మన విశ్వంగాడి దగ్గర వరకు వచ్చాం కదా? మరి ఈ విశ్వంగాడు పాపం ఒంటరి వాడేనా?

కాదుట్రా... ఒరేయ్... అనేక విశ్వాల సమూహమైన ‘‘మల్టీవర్స్’’ లో మన విశ్వం కూడా ఒకటని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

మరి ఇన్ని విశ్వాల్లోనూ, మన విశ్వంలోనూ ఉండే కోటాను కోటాను కోటాను కోట్లాది నక్షత్రాలలో దాదాపు ప్రతి దానికీ, మన సూర్యుడికి ఉన్నట్టుగానే గ్రహ వ్యవస్థ ఉండొచ్చు. ఆ గ్రహాలలో కొన్నింటిలో మన భూమి లాంటి వాతావరణ పరిస్థితులే ఉండొచ్చు. అక్కడా జీవం ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు మనకైతే తెలీదు. ఎందుకంటే ఎక్కడో సుదూర అంతరిక్ష తీరాల్లో మన లాంటి వాళ్లు ఉన్నా వాళ్ల గురించి తెలుసుకునే స్థాయికి మన సైన్స్ ఇంకా ఎదగలేదు.

 

అర్థమైందా? కాకపోవచ్చులే... ఈ సువిశాలమైన, విస్తారమైన కాస్మిక్ వేదిక పొడవెంతో, వెడల్పెంతో.... దాని సిగతరగ లోతెంతో... మన బుర్రలకి ఎక్కడ అందుతుందిరా...

కాబట్టి... ఏతా వాతా చెప్పేదేమంటే... మనమందరకీ ఈ భూమే నివాసం రా. ఇందులో మన ఉనికి ఎంత సూక్ష్మమో అర్థం చేసుకుంటే... ఇక ఈ గొడవలు, అంతరాలు, విభేదాలు, కక్షలు, కావేషాలు, వైషమ్యాలు... ఎక్కడ ఉంటాయిరా.

అసలొరే... అంతుపట్టని ఈ అంతరిక్షంలో నువ్వు ఓ అద్భుతంరా. నీ జీవితంలో ప్రతి క్షణం ఓ అరుదైన సంఘటన. నీ ఆలోచనలు, నిర్ణయాలు, అనుభవాలు... ఇవన్నీ నీకే చెందిన కథలో చిన్న చిన్న భాగాలు.

 

కాబట్టొరే... ఎప్పుడైనా నీకు అసహాయంగా అనిపించినప్పుడు, అసలు నీ ఉనికే ఎంత అరుదైన అద్భుతమో గుర్తు చేసుకోరా...

నీ ప్రతి హృదయ స్పందన, నీ ప్రతి నవ్వు, నువ్వు ఏర్పరుచుకునే ప్రతి బంధం — ఇవన్నీ ఒక అద్భుతమేరా.  మనమంతా ఇక్కడ, ఇప్పుడు, ఈ క్షణంలో ఈ విశ్వాన్ని అనుభవిస్తున్నాంరా. అనుభూతి చెందుతున్నాం. ఇది అసాధారణమైన విషయం కదా?

ఏది ఏమైనా ఒరే... ఒక్కటి మాత్రం నిజంరా.  విశ్వం అనంతమైనదే కాదు, అవకాశాలతో నిండినది కూడానూ. కాబట్టి హాయిగా జీవితాన్ని అనుభవించర్రా... అనుభూతి చెందడర్రా... మిగతా విషయాలన్నీ పక్కకు పెట్టండ్రా... వెర్రి నాగన్నల్లారా.

 

బుధవారం, నవంబర్ 12, 2025

‘ఫాస్ట్ ఫుడ్’ తింటున్నారా? అయితే ‘స్లో’ అయిపోయినట్టే






తినండి... మీ ఇష్టం వచ్చినట్టు తినండి...

పిజ్జాలు... బర్గర్లు... ఫ్రెంచ్ ఫ్రైలు... హాట్ డాగ్స్... ఫ్రైడ్ చికెన్లు... డోనట్లు పాస్టరీలు... ఇన్ స్టంట్ న్యూడిల్స్... సాఫ్ట్ డ్రింకులు... శాండ్ విచ్చులు... రాప్ లు... కూల్ డ్రింకులు... ఐస్ క్రీములు... మిల్క్ షేకులు...

అబ్బో... అడుగు బయట పెడితే చాలు... ఎన్నో... ఎన్నెన్నో.

అయితే ఒక్క క్షణం ఇది చదివి... అప్పుడు తినండి. మీ తిండి, మీ ఇష్టం... చెప్పడానికి మేమెవరం?

 ఇంతకీ ఫాస్ట్ ఫుడ్ అంటే ఏమిటి?

ఏముందీ... న్యూటిషన్స్ కన్నా క్యాలరీలు అధికంగా ఇచ్చే తిళ్లన్నీ అవే.

ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ తిండి పదార్థాలు ఏదో కాస్తో కూస్తో మీ నడుము చుట్టూ కొవ్వు పెంచుతాయిలే... దాందేముంది? అనుకుంటున్నారా?

కాదు... కానే కాదు...

ఇవి కేవలం వారం రోజుల్లోనే మీ మెదడును “రీవైర్” చేయగలవట. అంటే మీ మెదడు అంతర్గత పనితీరును దెబ్బతీస్తాయన్నేమాట. ఎలాగట? చూద్దాం...

ఉత్తర కరోలైనా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన కొత్త అధ్యయనం ప్రకారం కనుగొన్నే సంగతి ఇది.  కేవలం నాలుగు రోజుల పాటు జంక్ ఫుడ్ లాగిస్తే చాలు... మెదడు జ్ఞాపక శక్తికి సంబంధించిన న్యూరల్ సర్క్యూట్లు మారిపోవడం ప్రారంభమవుతుంది.

పరిశోధకులు కనుగొన్నదేమిటంటే, ఫాస్ట్ ఫుడ్‌లనబడే అధిక కొవ్వు ఆహారం, మెదడులోని జ్ఞాపకాల కేంద్రమైన హిప్పోకాంపస్ లోని న్యూరాన్ల పనితీరును దెబ్బతీస్తాయి.

దీని ఫలితంగా మెదడులో “సీసీకే ఇంటర్ న్యూరాన్లు” అనే ఒక రకం న్యూరాన్‌ కణాలు అధిక క్రియాశీలతకు లోనవుతాయి. ఇందువల్ల కలిగే చెడ్డ ఏమిటయ్యా, అంటే...  జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. న్యూరాన్ అనే  పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, ఆరోగ్యానికి హానికరమైన ఆహారపు అలవాట్లు, బరువు పెరగడం లేదా మధుమేహం రావడం కంటే ముందే, మెదడు ఆరోగ్యాన్ని తక్షణమే ప్రభావితం చేస్తాయి.

ఇది చదవగానే... ‘అయ్యబాబోయ్’ అని భయపడిపోకండి. ఎందుకంటే, ఈ నష్టాన్ని తిరిగి సరిచేయవచ్చు. ఆహారంలో మార్పులు, ఉపవాసం లేదా మందుల ద్వారా అయినా సరే — అధిక క్రియాశీల న్యూరాన్లను శాంత పరచవచ్చట. అలా చేస్తే జ్ఞాపకశక్తిని మెరుగుపరచవచ్చని కూడా పరిశోధక బృందం గుర్తించింది. ఇంతకాలం జంక్ ఫుడ్ ఆరోగ్యం మీదనే దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తుందనుకున్నారు. కానీ వీటి వల్ల మెదడు కణాలపై కూడా తక్షణ ప్రభావం పడుతుందని ఇప్పుడే తేలిందన్నమాట.

అదండీ సంగతి... ఇంకా మీకు తినాలనిపిస్తే ఏ జొమాటో ద్వారానో ఫాస్ట్ ఫుడ్ ను ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసి లాగించేయండి. మీ ఇష్టం మరి.

ఆదివారం, నవంబర్ 09, 2025

మెదడు మెదడుతో కలబడితే...



‘మెదడు మెదడుతో కలబడితే ఆ కలయిక ఫలమేమి?’ అని పాతపాటనేమీ పాడుకోనక్కరలేదు. ఒక వేళ పాడినా సమాధానం దొరకదు. అయితే మెదడు గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న న్యూరో సైన్స్ శాస్త్రవేత్తలు మాత్రం ఓ కొత్త విషయం కనిపెట్టారు. నిజం చెప్పాలంటే ఈ విషయంలో ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలతో తేలిందేమిటంటే, న్యూరోసైన్స్ అర్థం చేసుకున్న దాని కన్నా మనిషి మెదడు మరెంతో సామర్థ్యాన్ని కలిగి ఉందని. తాజా పరిశోధన విషయానికి వస్తే... మెదడు ‘అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ’ ఉన్న విద్యుత్ అయస్కాంత తరంగాలను విడుదల చేస్తుందని తేలింది. ఈ సంకేతాలు చాలా దూరం ప్రయాణిస్తూ, ఇతరుల మెదళ్ల నుంచి విడుదల అయ్యే అవే తరహా తరంగాలతో అనుసంధానం కాగలవని కూడా తెలిసింది. ఈ విషయం సహజంగానే అనేక ఆసక్తికరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇలాంటి సంకేతాలను కచ్చితంగా కలపగలిగితే మనుషుల మధ్య మాటలు అవసరం లేకుండానే భావాలను పంచుకోవచ్చా అనేది ఓ ప్రశ్న. అలాగైతే అవచేతనంగా కూడా మౌనంగా సంభాషించోగలమా అనేది మరో ప్రశ్న.

అప్పుడు... ‘మౌనంగా నీ మనసు పాడిన ప్రేమ గానమును వింటినే... తెలుపక తెలిపే అనురాగము నీ కనులలో కనుగొంటినే...’ లాంటి పాటలను కవితాత్మక ఊహలతో కాకుండా, ప్రేమికులు నిజంగానే తెలుసుకుంటారనుకోవచ్చు. ఏదో సరదాగా ప్రేమ అనుకున్నా, అన్ని రకాల భావజాలాన్ని ఇలాంటి ఒకే తరహా విద్యుదయస్కాంత తరంగాల సాయంతో పంచుకోగలిగితే ఎలా మారుతుందనేది మరొక ప్రశ్న.

‘ఇదిగో ఇప్పుడే నువ్వు నన్ను మనసులో తిట్టుకున్నావ్. ఏం? ఒళ్లు ఎలా ఉందేంటి?’ తరహా కీచులాటలు కూడా మొదలవుతాయేమో మరి.

ఇంతకీ మెదడు నుంచి ఈ తరంగాలు ఎలా పుడతాయి? మెడడులో కోట్లాదిగా ఉండే కణాలైన న్యూరాన్లు, లయబద్ధంగా చలించినప్పుడు ఇలా జరుగుతోందని చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ తరంగాలు, ఇతర వ్యక్తుల మెదడు పంపించే తరంగాలకు సమన్వయంగా స్పందించవచ్చు. దీని వల్ల ఆ వ్యక్తుల మనస్థితి, ఏకాగ్రత, నిర్ణయాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

మెదడు నుండి మెదడుకి భావాల ప్రసారం అనేది ఇప్పటికిప్పుడు ఏదో సైన్స్ ఫిక్షన్ లాగానో, భవిష్యత్తు శాస్త్రం లాంటిదో అనిపించినా, ప్రారంభ పరిశోధనలను బట్టి... ఇప్పటికే కొంత అనుభవంలోకి వచ్చింది. ఉదాహరణకు సంగీతం వినడం, ఒకే అనుభూతి కలగడం లాంటి విషయాల్లో చెప్పుకోదగిన సమన్వయం ఉంటుందనే తెలుస్తోంది.

పరిశోధనలు మరింత ధృవపడితే, అవి మానవ అనుబంధాలు, అనుభూతులు, సమూహ ప్రవర్తనలను కూడా మార్చివేయగలుగుతాయనే చెప్పాలి.  అంటే, మన మెదడు కేవలం వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించడమే కాకుండా ఒక సున్నితమైన, ప్రపంచవ్యాప్త "సామూహిక చైతన్య జాలంలో" కూడా భాగస్వామ్యం చేస్తుందేమో అనే సంకేతం ఇస్తున్నాయి. సైన్స్ ఇప్పుడే ఈ అజ్ఞాత, లోతైన మానవ అనుసంధానాలను అవగతం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది.   

 

 

గురువారం, అక్టోబర్ 30, 2025

వార్నాయనో... అన్ని బిలాలే!


 



‘అంతుపట్టని లేత గుండెలో ఎంత తోడితే అంతుంది..’ అన్నాడో సినీ కవి. లేత గుండె సంగతలా ఉంచితే అంతరిక్షం కూడా అలాంటిదే. అనంతమైన గగనాంతర సీమలతో పోలిస్తే... తొమ్మిది గ్రహాలు, లక్షలాది గ్రహ శకలాలు సహా భూమిపై ఉన్నే మనల్నందరినీ కూడా తన చుట్టూ తిప్పుకుంటున్న మన సూర్యుడే అంతరిక్షంలో పోలిస్తే ఓ నలుసులాంటి వాడు. ఇక మనమెంత? మనకు తెలిసిందెంత?

కోటాను కోట్ల తారలు, తారా మండలాలు మినుకు మినుకు మంటూ వెలుగులు పంచుతుంటే, వాటి మధ్య తమ చుట్టు పక్కల ఉన్నే పదార్థాలన్నింటినీ గుట్టు చప్పుడు కాకుండా కబళించే కృష్ణబిలాలు కూడా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. బ్లాక్ హోల్స్ అనే వీటి గురించి మనకి తెలిసింది చాలా చాలా తక్కువ. ఆఖరికి కాంతిని, కాలాన్ని కూడా స్వాహా చేస్తాయవి. వాటి బారిన పడిన పదార్థాలన్నీ ఎక్కడికి పోతాయో ఇప్పటికీ అంతుపట్టని విషయమే.

అలాంటి కృష్ణబిలాల గురించి ఓ కొత్త విషయం తెలిసింది. మనం చూడగలిగినంత మేరకు, మనకు తెలిసిన అంతరిక్షంలో వాటి సంఖ్యపై తాజా అవగాహన కలిగింది. ఈ విశ్వంలో దాదాపు 40 క్వింటిలియన్ బ్లాక్ హోల్స్ ఉన్నాయన్నదే ఆ కొత్త అంచనా. అంటే 40 పక్కన పద్దెనిమిది సున్నాలు పెట్టి అవి ఎన్ని కోటాను కోట్లో లెక్కపెట్టుకోవాలి.

కావాలంటే 40,000,000,000,000,000,000 ఎంతో ఓపిగ్గా తెలుసుకోండి. ఆధునిక కంప్యూటర్ మోడలింగ్ ద్వారా, నక్షత్ర మండలాలు, విశ్వపరిణామానికి సంబంధించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. విశ్వం మొత్తంలో ఉన్న పదార్థరాశిలో బ్లాక్ హోల్స్ వాటా కేవలం ఒక్క శాతం మాత్రమే. ఇవన్నీ విశ్వంలో విస్తారమైన ఖగోళ దూరాల్లో నెలకొని ఉన్నాయి.