శనివారం, జూన్ 28, 2025

ఏడ్చే వాళ్లని ఏడవనీ!



హాస్యం వేరు... వేదాంతం వేరు... రెంటికీ పొంతన కుదరదు. వేదాంతం చెబుతుంటే నవ్వు రాదు. రాకూడదు కూడా. హాస్యంగా చెప్పాలంటే వేదాంతం నప్పదు. అలాంటిది హాస్యాన్ని, వేదాంతాన్ని కలగలిపి పాట రాయాలంటే ఎంత కష్టం? కత్తి మీద సాము లాంటిదే. ఏమాత్రం మోతాదు తప్పినా వేదాంతం అభాసుపాలవుతుంది. లేదా హాస్యం పేలవంగా మిగిలిపోతుంది. అలాంటి పాట ఒకటి నాకు భలే నచ్చుతుంది. పాత పాట. 'అర్థాంగి' (1955) సినిమా లోది. అందులోని ఏ వాక్యాన్ని తీసుకున్నా, ఏ చరణాన్ని తీసుకున్నా అది నికార్సయిన వేదాంతమే. వింటుంటే 'నిజమే కదా!' అనిపిస్తుంది. కానీ చెప్పే తీరులో మాత్రం హాస్యం తొణికిసలాడుతుంది. ఇక చిత్రీకరణ అయితే ఇంకా నవ్వులు పూయిస్తుంది.

ఆ పాటే... 'నవ్వే వాళ్ల అదృష్టమేమని, ఏడ్చేవాళ్లని ఏడవనీ...' పాట. 

సినిమాలో ఆ పాట వచ్చే సందర్భం చాలా గంభీరమైనది. ఓ పక్క జమీందారు గుమ్మడి చావు బతుకుల్లో ఉంటాడు. ఇంట్లో వాళ్లు అందరూ విషాదంలో మునిగిపోతారు. జమీందారు చిన్న కొడుకు జగ్గయ్య అప్పటికే ఇల్లు వదిలి ఓ వేశ్య సురభి బాల సరస్వతి ఇంట్లో ఉంటుంటాడు. అతడిని తీసుకు రావడానికి మనిషిని పంపినా, ఆఖరికి పెద్ద కొడుకు అక్కినేని నాగేశ్వరరావు వెళ్లి బతిమాలినా రానంటాడు. జమీందారు మొదటి భార్య కొడుకు అక్కినేని అయితే, రెండో భార్య కొడుకు జగ్గయ్య. చావు బతుకుల మధ్య ఉన్న జమీందారు, తన ఆస్తిని అక్కినేనికి అప్పగించి కన్నుమూస్తాడు. 

జమీందారు ఇంట్లో అందరూ ఘొల్లు మని ఏడుస్తుంటే... అక్కడ సురభి బాల సరస్వతి ఇంట్లో ఈ పాట మొదలవుతుంది.

''ఏడవనీ... ఏడ్చేవాళ్లని ఏడవనీ...'' అని! 

సినిమాలో గంభీరమైన సన్నివేశం చూస్తున్న ప్రేక్షకులంతా చటుక్కున కులాసా వాతావరణంలోకి మారిపోతారు. దీని వల్ల రెండు ప్రయోజనాలు నెరవేరుతాయి. ఒకటి ప్రేక్షకుల మూడ్‌ మారి రిలాక్స్‌ కావడం. రెండు, సినిమాలో చిన్న కొడుకు ఎంత బాధ్యతా రహితంగా తయారయ్యాడో బలంగా చెప్పగలగడం. ఇది మంచి స్క్రీన్‌ప్లే టెక్నిక్‌. దర్శకుడు పి.పుల్లయ్య ప్రతిభ కూడా. 

ఇక పాట విషయానికి వస్తే... రాసింది ఆచార్య ఆత్రేయ. సినిమాలో 9 పాటలుంటే అన్నీ ఆత్రేయ కలం నుండి జాలువారినవే. 

మణిలాల్‌ బెనర్జీ రాసిన బెంగాలీ నవల 'స్వయంసిద్ధ' ఆధారంగా తీసిన ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించింది కూడా ఆత్రేయనే. 

చాలా గంభీరమైన విషాద సన్నివేశం వెంటనే ''ఏడవనీ...'' అంటూ మొదలయ్యే పాట రాయడం, సాహసమే కాదు సమయస్ఫూర్తి కూడా అనిపిస్తుంది. 

ముందు పాట ఎలా సాగిందో చూద్దాం!...

''ఏడవనీ... ఏడవనీ... ఏడ్చే వాళ్లని ఏడవనీ

ఎదుటి వాళ్లు బాగున్నారని ఏడవనీ

నవ్వే వాళ్ల అదృష్టమేమని ఏడ్చేవాళ్లని ఏడవనీ ఏడవనీ!

నవ్వండి నవ్వే వాళ్లతో నవ్వండీ

నాలుగు ఘడియల నర జీవితము

నవ్వుల తోడుగ చేయండి ||ఏడ్చేవాళ్లని||

వచ్చిన వాళ్లు పోతారు

పోయిన వాళ్లు రాబోరు

ఈ రాకపోకల సందున ఉంది

రంజైన ఒక నాటకము

కదిలిస్తే అది బూటకము

అది అంతా ఎందుకు కానీ

అనుభవించి పోనీ

జీవిని అనుభవించి పోనీ!  ||ఏడ్చే వాళ్లని||

ఉండేది ఎంత కాలమో

ఊడిపోతాము ఏ క్షణమో

రేపన్నది రూపే లేనిది

ఈ క్షణమే నీకున్నది

అందాన్నీ, ఆనందాన్నీ

అనుభవించి పోనీ

జీవిని అనుభవించి పోనీ 

ఏడ్చేవాళ్లని ఏడవనీ

కళ్లు కుట్టి ఏడవనీ

కడుపు మండి ఏడవనీ

కుళ్లి కుళ్లి ఏడవనీ

ఏడవనీ ఏడవనీ''

-ఈ పాటకి సంగీత దర్శుకుడు మాస్టర్‌ వేణు ఓ నాటక ఫక్కీలో బాణీ కట్టారు. హార్మోయినం పెట్టి పట్టుకుని మీటలు నొక్కుతూ జగ్గయ్య చేసే అభినయాన్ని చూసి తీరాలి. సురభి బాల సరస్వతి వగలు, వయ్యారాలతో కూడిన నటన గిలిగింతలు పెడుతుంది. హాస్య నటుడు రామకృష్ట ఇతర నటీనటులు కలిసి హుషారుగా డ్యాన్సులు, స్టెప్పులతో పాటను రక్తి కట్టిస్తారు. 

డెబ్భై ఏళ్ల నాటి ఈ సినిమా పాట, యూట్యూబ్‌లో ఈతరం వాళ్లు చూసినా ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. 

అసలామాటకొస్తే, అర్థాంగి సినిమా గురించి చాలా చెప్పుకోవచ్చు. నల్లమందు పెట్టి పెంచడం వల్ల బుద్ధిమాంద్యానికి గురైన పెద్దకొడుకుగా అక్కినేని నటన అద్భుతంగా ఉంటుంది. జమీందారు కొడుకు అలాంటి వాడని తెలియకుండా పెళ్లి చేసుకుని,  అతడికి చదవు చెప్పి ప్రయోజకుడి చేసే పాత్రలో సావిత్రి అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అమాయకుడిగాను, ఆ తర్వాత వివేకవంతుడిగాను నటనలో అక్కినేని చూపించిన వేరియేషన్‌ చాలా బాగుంటుంది. పుల్లయ్య, శాంతకుమారి దంపతులే ఈ సినిమాకి నిర్మాతలు. విజయవంతమై శత దినోత్సవం జరుపుకున్న ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు ఫిలింఫేర్‌ లాంటి మరెన్నో పురస్కారాలు అందుకుంది. 


https://www.youtube.com/watch?v=PRBdvuLFrYQ






గురువారం, జూన్ 05, 2025

హడావుడిగా రీషూట్! పాట మాత్రం భలే హిట్!!


తెరవెనుక ఘంటసాల గళం... తెర మీద ఏఎన్నార్ అభినయం... 

తెర వెనుక సుశీల గానమాధుర్యం... తెర మీద జమున నటనా లాలిత్యం...

''ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులూ...''

పల్లవి చదవగానే 'మూగనోము' సినిమా గుర్తొస్తే, పాత సినిమాల అభిమానులన్నమాటే. పాత పాటలంటే చెవి కోసుకుంటారన్నమాటే!

ఈ పాట వెనుక ఓ ఆసక్తికరమైన సంగతి ఉంది. 

ఇంత హిట్ సాంగ్‌ ని  చాలా హడావుడిగా కేవలం ఒక్క రోజు వ్యవధిలో చిత్రీకరించారు. అప్పటికి సినిమా తీయడం మొత్తం అయిపోయింది. అక్కినేని కాల్షీట్లతో సహా అందరి పనీ పూర్తయింది. అక్కినేని, జమునలపై పాటలన్నీ కూడా అయిపోయాయి. మరి ఎందుకు అంత హడావుడిగా ఈ పాట తీశారు?

అదే తెలుసుకుందాం. ఈ పాట స్థానంలో అంతకు ముందే ఓ పాట తీశారు. అది 'అందం నీలో ఉందని, అది అందుకునే వీలుందని, తొందర చేసెను హృదయం, తొలి పందెం వేసెను పరువం...' అనే పాట. 

'మూగనోము' సినిమా తీసిన ఏవీయం సంస్థ నిర్మాత ఏవీ మెయ్యప్పన్‌ చెట్టియార్‌ కి ఈ పాట చిత్రీకరణ నచ్చలేదు. షూటింగ్‌ మొత్తం అయిపోయాక రషెస్‌ చూస్తున్నప్పుడు ఆయన దీన్ని గమనించారు. పాటను కొంత అవుట్‌ డోర్‌ లోను, మరి కొంత ఇన్‌డోర్‌ లోను తీశారు. ఆయా సీన్లు అంతగా మ్యాచ్‌ కాలేదని ఆయనకి అనిపించింది. దర్శకుడు యోగానంద్‌ ని పిలిపించి చూడమన్నారు. ఆయన కూడా ఏకీభవించారు. ఓ పక్క అక్కినేని అదే రోజు సాయంత్రం విమానంలో హైదరాబాద్‌ బయల్దేరుతున్నారు. అక్కినేనికి కూడా చూపించారు. చూశాక, 'అందులో మొదటి పాట ఎలా ఉంది?' అని అడిగారు చెట్టియార్‌. 

'బాలేదు' అన్నారు అక్కనేని కూడా. అయితే రీషూట్‌ చేద్దాం అన్నారు. అయితే ఆ మర్నాటి నుంచి అక్కినేనికి మరో సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ లో ఉంది. మరెలా? అక్కినేని ఆ సినిమా నిర్మాతకు ఫోన్‌ చేసి గడువు అడిగారు. ఆ నిర్మాత సరేనన్నారు. దాంతో 'ఎళ్లుండి రీషూట్ పెట్టుకుందాం' అనుకున్నారు. ఈలోగా నిర్మాతకి మరో ఆలోచన వచ్చింది. 

అసలా పాటనే మార్చేస్తే? నిర్మాత తల్చుకుంటే కొదవేముంది? ఆయన వెంటనే సంగీత దర్శకుడు గోవర్దన్‌కి విషయం చెప్పి, 'దాశరథి చేత మరో పాట రాయించండి. అది కూడా సాయంత్రానికి అయిపోవాలి' అని హుకుం జారీ చేశారు.  

ఇంకేముంది? ఆగమేఘాల మీద సంగీత దర్మకుడు, గీత రచయిత, నిర్మాత కొత్త పాట మీద కూర్చున్నారు.  గోవర్దన్‌ ట్యూన్‌ ఇవ్వడం, అది నిర్మాతకు నచ్చకపోవడం ఇలా కాసేపు సాగింది. విసుగెత్తిన చెట్టియార్‌ కి 'ఇది కాదు పని' అనిపించింది. వెంటనే తాను విన్న ఓ హిందీ పాట ట్రాక్‌ను తెప్పించారు. అది అప్పటికే బాగా హిట్టయిన ట్యూన్‌. 

'ఇదిగో... ఈ ట్యూన్‌కి తెలుగు పాట రాసేయండి. పెట్టేద్దాం' అన్నారు. 

ఆ హిందీ పాట 'దోకలియా' అనే సినిమాలోది. అదే తెలుగులో 'లేత మనసులు' సినిమా. 

ఆ పాట... 'తుంహారీ నజర్ క్యో కఫా హోగయీ... ఖతా బఖ్ష్ దో గర్ ఖతా హోగయీ’ అనేది. 

అది వింటూ దాశరథి రాత్రికి రాతి 'ఈవేల నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులు...' పాట రాశారు. 

మర్నాటి ఉదయమే ఘంటశాల, సుశీలకు కబురెళ్లింది. వాళ్లు రాగానే పాట రికార్డింగ్‌ జరిపించేశారు. 

ఆ పాట ట్రాక్‌ సిద్ధం కాగానే ముందుగా జమునను పిలిపించి పాటకు అనుగుణంగా ఆమె క్లోజప్‌ షాట్లు తీసేశారు. మర్నాడు అక్కినేని రాగానే హీరోహీరోయిన్లు కలిసి నటించే సీన్లన్నీ చకచకా తీసేశారు. పాట పాట తీసేసి, కొత్త పాట పెట్టేసి సినిమాను రెడీ చేశారు. ముందుగా అనుకున్నట్టుగానే సినిమా 1969 ఫిబ్రవరి 13న విడుదల అయింది. సినిమా శతదినోత్సవం చేసుకుంది. హిందీ పాటకి కాపీ ట్యూన్‌ అయినప్పటికీ తెలుగు పాట కూడా హిట్టయిపోయింది. 

https://youtu.be/h2Kmo85h4Xg?si=s0RGfYqTSFcR80UK