బుధవారం, జులై 30, 2025

మాస్‌ సినిమాలకు తగ్గని 'మహావతార్‌'!


చప్పట్లు...

ఈలలు...

కేకలు...

ఇవన్నీ థియేటర్లో వినిపిస్తున్నాయంటే ఏంటి దానర్థం?

అది మాస్‌ సినిమా అయ్యుండాలి...

హీరో ఇమేజ్‌ అదిరిపోయి ఉండాలి...

పాటలు ఉర్రూతలూగిస్తూ ఉండాలి...

ఫైట్లు, డ్యాన్సులు ఆకట్టుకుని ఉండాలి...

కానీ ఇవేమీ లేకుండాలనే థియేటర్‌ చప్పట్లు, ఈలలు, కేకలతో సందడిగా మారితే?

అది చాలా అరుదైన విషయమే!

అదే జరుగుతోంది ఇప్పుడు చాలా థియేటర్లలో...

అయితే అది మాస్‌ సినిమానా? కాదు!

అగ్ర కథానాయకుడి సినిమానా? కాదు!

హీరో హీరోయిన్ల డ్యాన్సులు అదిరాయా?

అబ్బే... అసలు డ్యూయెట్లే లేవు!

పోనీ హాలీవుడ్ యాక్షన్‌ సినిమానా? కానే కాదు!

చిత్రంగా ఉందే... ఇంతకీ ఏంటా సినిమా?

సాదాసీదా భక్తి సినిమా!

అందరికీ తెలిసిన కథతో తీసిన సినిమా!

మామూలు యానిమేషన్‌ సినిమా!

అదే... ''మహావతార్‌ నరసింహ'' సినిమా!

పెద్దగా ప్రచారం లేకుండానే థియేటర్లలోకి వచ్చిన  ఈ యానిమేషన్‌ సినిమాకు తల్లిదండ్రులు పనిగట్టుకుని పిల్లలతో కలసి వస్తున్నారు. ఒకరికొకరు చెప్పుకుని మరీ చూస్తున్నారు. సినిమాలో చాలా చోట్ల ఈతరం పిల్లలు, నవతరం యువతీ యువకులు చప్పట్లు, ఈలలు, కేకలతో థియేటర్లను ఊదరగొడుగున్నారు.

అవడానికి ప్రహ్లాదుడి కథే! హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకుపోతే వరాహస్వామి అవతరించడం, హిరణ్యకశిపుడు గొంతెమ్మ కోరికలు కోరుతూ తపస్సు చేస్తే బ్రహ్మ వరాలివ్వడం, ఆ వరగర్వంతో విష్ణు ద్వేషిగా మారి అకృత్యాలు చేయడం, తన కొడుకు ప్రహ్లాదుడే హరి భక్తుడవడంతో

నానా కష్టాలూ పెట్టడం, ఆఖరికి విష్ణువు నరసింహ స్వామిగా అవతరించి, బ్రహ్మ వరాలకు అనుగుణంగానే హిరణ్యకశిపుడిని సంహరించడం!

ఈ కథతో గతంలో దాదాపు అన్ని భాషల్లో పూర్తి స్థాయి ఫీచర్‌ ఫిల్ములు వచ్చాయి. తెలుగులోనే రెండు మూడు సినిమాలు వచ్చాయి.

అయినా ఇది ఈతరం వాళ్లని బాగా ఆకట్టుకుంటోందనడానికి థియేటర్లలో సందడే కాదు, వసూళ్లు కూడా ప్రత్యక్ష సాక్ష్యాలే.

రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ 141 నిమిషాల యానిమేషన్‌ సినిమా జులై 25న విడుదలై ఆరు రోజుల్లోనే దాదాపు రూ. 38 కోట్లు వసూలు చేసిందంటే చెప్పుకోదగ్గ విషయమే.

సినిమా దర్శుకుడు అశ్విన్‌ కుమార్‌. ఎడిటింగ్‌ కూడా అతడే. రచనలో కూడా భాగస్వామ్యం ఉంది.

బాగా తెలిసిన పురాణ కథే అయినా, అందులోనూ యానిమేషన్‌ సినిమానే అయినా ఓ కమర్షియల్‌, మాస్‌ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ''మహావతార్‌ నరసింహ'' సినిమాను తెరకెక్కించిన అతడిని అభినందించాల్సిందే.

అందులోనూ... సినిమాకు వచ్చినా వెండితెర మీద కన్నా చేతిలోని సెల్‌ ఫోన్‌ తెరమీదే దృష్టి నిలిపే ఈతరం వాళ్లని కూడా ఆకట్టుకునేలా తీసినందుకు మెచ్చుకోవలసిందే.

పౌరాణిక సినిమాలనగానే పురాణాల్లోని మూల కథకి సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టు కల్పనలు జోడించి ప్రేక్షకుల మీదకు వదిలేసిన అనేక సినిమాల్లాంటిది కాదిది.

సినిమా మొదట్లోనే చెప్పినట్టు.... పురాణాలను గౌరవిస్తూ, మూలకథకి ఎక్కడా భంగం కలగకుండా తీయడం ఓ మంచి విషయం. ఇందులోనూ కల్పనలు ఉన్నా, కొంత డ్రామాను జోడించినా, నేటి తరానికి తగ్గట్టుగా తీసినా... ఎక్కడా మితి మీరకుండా, పాత్రల ఔచిత్యానికి అనుగుణంగా తీయడం మరో గొప్ప విషయం. 

తీసేలా తీస్తే, భావోద్వేగాలను చక్కగా వ్యక్తీకరించగలిగితే, తగిన సన్నివేశాలతో కథను మలచగలిగితే అది పురాణ కథ అయినా, భక్తి కథ అయినా, మరే కథ లయినా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ సినిమా చర్చల దగ్గర నుంచి తెరకెక్కేవరకు చూసుకుంటే దాదాపు నాలుగున్నరేళ్లు  పట్టింది. 

ఈ చిత్ర నిర్మాణ సమయంలో చిత్రం యూనిట్‌ వాళ్లెవరూ మాంసాహారాన్ని ముట్టుకోలేదు. కొందరైతే ఏకాదశి ఉపవాసాలు సైతం చేశారు. 

అంతటి భక్తి శ్రద్ధలతో తీశారు కాబట్టే... ఓ యానిమేషన్‌ అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరించిన సినిమాగా ఇది అందరినీ అలరిస్తోంది. 

'మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌'లో భాగంగా తలపెట్టిన ఏడు సినిమాల్లో ఇది కూడా ఒకటి. విష్ణుమూర్తి పది అవతారాలపై తీయనున్న సినిమాల్లో మొదటిది ఇది. ఈ సినిమాలన్నీ కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రానున్నాయి.

ఈ సినిమా తర్వాత 'మహావతార్‌ పరశురామ్‌' (2027), 'మహావతార్‌ రఘునందన్‌' (2029), 'మహావతార్‌ ద్వారకాధీశ్‌' (2031), 'మహావతార్‌ గోకులనంద' (2033), 'మహావతార్‌ కల్కి'-1 (2035), 'మహావతార్‌ కల్కి-2' (2037) సినిమాలను రూపొందించే పనిలో దర్శక నిర్మాతలు, చిత్ర యూనిట్ సభ్యులు లక్ష్యాలు పెట్టుకున్నారు. హోంబాలే ఫిలింస్‌, క్లీం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రానున్న ఈ సినిమాలన్నీ విజయవంతం కావడంతో పాటు నవతరం ప్రేక్షకులకు హిందూ పురాణ కథలను మరోసారి అద్భుతంగా పరిచయం చేస్తాయని ఆశిద్దాం. 


శనివారం, జులై 12, 2025

భక్తులారా... ఇది శ్రీశ్రీ హరికథ


ఓ గుర్రబ్బండి గోతిలో పడడానికి... సీతా స్వయంవర ఘట్టానికి ఎక్కడైనా పొంతన ఉందా?

మామూలుగా అయితే ఉండదు... 

కానీ అది సినిమా అయితే ఉంటుంది!

దర్శక రచయిత ఆచార్య ఆత్రేయ అయితే ఉంటుంది!

గోతిలో పడిన గుర్రబ్బండి చక్రాన్ని హీరో ముందుకు గెంటడానికి... 

సీతా స్వయంవరంలో రాముడు శివధనుర్భంగం చేయడానికి... కూడా ఎక్కడా పొంతన ఉండదు...

కానీ ఆ రెండింటికీ ముడిపెట్టి హీరోయిన్‌ కృష్ణకుమారి మనసును హీరో అక్కినేని దోచుకున్నట్టు చూపించాలని మనసు కవి ఆత్రేయ ముచ్చట పడితే పొంతన అదే కుదురుతుంది!

పైగా సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కూడానూ!

కావాలంటే... 'వాగ్దానం' సినిమా చూడండి. 

లేకపోతే యూట్యూబ్‌లో 'శ్రీ నగజా తనయం సహృదయం...' అనే పాటను వెతుక్కుని తిలకించండి.

ఓ పక్క రసవత్తరమైన సీతాకళ్యాణ సత్కథ, మరోవైపు హీరోహీరోయిన్ల అందమైన ప్రేమకథ కలిసి వెండితెర మీద ఎలా పండాయో తెలుస్తుంది!

ఇవే కాదు... ఆత్రేయ ముచ్చట పడడం వల్ల పొంతన లేని చాలా  సంగతులు ఈ సినీ హరికథలో చక్కగా ఒదిగిపోయాయి. 

తాను గీత రచయిత అయినా ఈ పాటను మహాకవి శ్రీశ్రీ చేత రాయించడం ఓ చిత్రం!

విప్లవ రచయితగా, నాస్తికుడిగా పేరొందిన శ్రీశ్రీ ఈ సీతా కళ్యాణ సత్కథను అద్భుతంగా రాయడం మరో చిత్రం!

హాస్య నటుడు రేలంగి హరికథా భాగవతార్‌గా పాత్రను పండిస్తుంటే...

వాయులీనం మీద సూర్యకాంతం మురిపించడం...

మృదంగం మీద పద్మనాభం రెచ్చిపోవడం...

అందరూ కలిసి 'శ్రీమద్రమారమణ గోవిందో హా...' అని మన చేత అనిపించడం కూడా చెప్పుకోదగ్గ చిత్రాలే!

కవితా చిత్ర వారి ద్వారా 1961లో విడుదలైన 'వాగ్దానం' అప్పట్లో అనుకున్నంతగా విజయవంతం కాకపోవచ్చ కానీ, ఇప్పుడిది చూడదగ్గ సినిమానే. మంచి కథా బలం, తారా బలం ఉన్నదే. 

బెంగాలీ కథలు తెలుగులో తెరరూపం దాలుస్తున్న ఆ రోజుల్లో శరత్‌ బాబు రాసిన 'దత్త' నవల ఈ సినిమాకు ఆధారం.

నిర్మాతలు కె. సత్యనారాయణ, డి. శ్రీరామ మూర్తి ఈ సినిమా దర్వకత్వ బాధ్యతలను ఆత్రేయకు అప్పగించారు. 

 హీరో అక్కినేని నాగేశ్వరరావు. హీరోయిన్‌ కృష్ణకుమారి. ఇంకా గుమ్మడి, చలం, గిరిజ లాంటి ప్రముఖులు తమ తమ పాత్రలు పోషించారు.  సంగీత దర్శకుడు పెండ్యాల స్వరపరచిన పాటలన్నీ హిట్లే. 

ఇందులో దర్శకుడు ఆచార్య ఆత్రేయ చేసిన ప్రయోగాలు చాలానే ఉన్నాయి.  దాశరథిలాంటి గొప్ప కవిని వెండితెరకు పరిచయం చేసింది ఇందులోనే మరి.  చిత్రంలోని మొత్తం 8 పాటల్లో ‘నాకంటి పాపలో నిలిచిపోరా’ అనే పాటను దాశరథి చేత రాయించారు. నాలుగు పాటలను ఆత్రేయ రాశారు.  ‘తప్పెట్లో తాళాలో’ అనే ఒక పాటను నార్ల చిరంజీవి చేత, మిగిలిన రెండుపాటలను మహాకవి శ్రీశ్రీ చేత రాయించారు. శ్రీశ్రీ రాసిన రెండుపాటల్లో ఒకటే, ‘సీతాకళ్యాణ సత్కథ’ అనే హరికథ.

పాటలో భాగంగా సాగే మాటలు, పద్యాలు, స్వరాలను అద్భుతంగా గళంలో పలికించిన అమర గాయకుడు ఘంటసాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది? గాన గంధర్వుడు కదా ఆయన!

నాస్తికుడైనా పురాణ ఇతిహాసాలను కూలంకషంగా చదివిన శ్రీశ్రీ పాండిత్యం ఎలాంటిదో ఈ పాటలో అడుగడుగునా కనిపిస్తుంది. 

ఈ పాట బంగారు ఆభరణం అనుకుంటే... అందులో శ్రీశ్రీ నలుగురి కవుల పద్యాలను కాంతులీనే మణులుగా ఇంపుగా, సొగసుగా పొదిగారు. 

తెలుగు భాగవత కవి పోతన, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, హరికథా భాగవతార్ పెద్దింటి దీక్షిత దాసు, మరో చక్కని కవి దాసు రామారావు రచనల్లోని కొన్ని పంక్తులను, పద్యాలను శ్రీశ్రీ చాలా చక్కగా సందర్బోచితంగా ఈ పాటలో అనుసంధానించి వన్నెతెచ్చారు.  

'శ్రీనగజా తనయం సహృదయం... చింతయామి సదయం, త్రిజగన్మహోదయం' అనే ప్రారంభ వాక్యాలు, ప్రముఖ హరికథా విద్వాంసులు పెద్దింటి దీక్షితదాసు రచించి, ఆలపించిన కీర్తన నుంచి సేకరించినవి. ఆ తర్వాత 'శ్రీరామభక్తులారా! ఇది సీతాకల్యాణ సత్కథ' అంటూ వచన వర్ణనతో ఈ హరికథ ప్రారంభమౌతుంది. 

సీతాదేవి స్వయంవరానికి ముల్లోకాలనుంచి వచ్చిన వీరాధివీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్యసుందరమూర్తి రఘురాముడు అంటూ వర్ణన మొదలవుతుంది. 

ఇక్కడ హరికథ ప్రారంభం కాగానే ఆ పక్కనే కృష్టకుమారి, చలం వస్తున్న ఓ గుర్రబ్బండి గోతిలో పడినట్టు చూపిస్తారు దర్శకుడు ఆత్రేయ. 

హరికథలో రఘురాముడి వర్ణన సాగుతుంటే అక్కడ కథానాయకుడు అక్కినేని హుందాగా నడస్తూ వస్తున్నట్టు అనుసంధానించారు. 

హరికథలో రఘురాముడిని అంతఃపుర గవాక్షం నుంచి ఓరకంట చూసిన సీతాదేవి పరవశయై ఉండగా, ఆ పక్కనే కృష్ణకుమారి కళ్లలో కూడా మెరుపులు కనిపిస్తాయి. 

మళ్లీ హరికథలోకి వస్తే అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి సభాసధులకు సీతాదేవిని పరోక్షంగా పరిచయం చేస్తుంటాడు.  

ముక్కంటి వింటిని ఎక్కిడ జాలిన వీరుడిని సీతాదేవి మక్కువ మీరగ మల్లెల మాల వైచి పెండ్లాడుతుందని నిబంధన విధిస్తాడు. 

ఇది వినగానే సభలోని వారందరూ 'ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట...' అంటూ రేలంగి వేదిక మీద చెబుతుండగా, పక్కన రోడ్డు మీద గుర్రబ్బండి చక్రాన్ని ముందుకు తోయడానికి చలం పాట్లు పడుతుంటాడు. 

తదనంతరంబున... హరికథలో 'ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపు వలె నిల్చి.... తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి...' అన్నవి శ్రీశ్రీ రాసి పంక్తులు.  కానీ ఆ తర్వాత ఆయన కవి దాసు రామారావు పద్యంలోని కొంత భాగాన్ని వాడుకున్నారు.

’సదమల మదగజ గమనముతోడ స్వయంవర వేదిక చెంత... మదనవిరోధి శరాసనమును తన కరమును బూనినయంత’... అనే పంక్తులను చక్కగా అనుసంధానించారు. 

హరికథలో రాముడు గజగమనంతో నడుస్తుండగా... ఆ పక్కన హీరో అక్కినేని గుర్రబ్బండి చక్రాన్ని ఒడుపుగా పట్టుకుని తోయడాన్ని దర్శకుడు ఆత్రేయ మరింత చక్కగా చూపించారు.

సరే... రాముడు శివుడి విల్లును పట్టుకుని పైకెత్తగానే... 'ఫెళ్లుమనె విల్లు... గంటలు ఘల్లుమనే...' అనే పద్యాన్ని కూడా శ్రీశ్రీ సమయోచితంగా ఉపయోగించుకున్నారు. ఇది కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన 'ఉదయశ్రీ' కావ్యంలోనిది. 

సరిగ్గా అదే సమయంలో సినిమా సన్నివేశంలో ఆగిపోయిన గుర్రబ్బండి చక్రం 'ఫెల్లుమనె...' అన్నట్టు బయటకు వచ్చేస్తుంది.  

హరికథలో సీతాదేవి, సినిమాలో కృష్ణకుమారి కూడా పరవశించిపోతారు. 

శివ ధనుర్భంగం తర్వాత శ్రీశ్రీ తన పాటలో పోతన రాసిన భాగవతంలోని వాక్యాలను పొదిగారు.

’భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెళ్ళి యాడె... బృథుగుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్... 'అనేవే ఆ వాక్యాలు.

ఆ విధంగా ఈ పాటలో అటు గీత రచయిత శ్రీశ్రీ చాతుర్యం, ఇటు దర్శకుడు ఆత్రేయ నైపుణ్యం రెండూ వీనుల విందు, కనువిందు చేస్తాయి. ఇప్పుడు ఈ పాట పూర్తి పాఠాన్ని చదవండి. ఆ తర్వాత కింద ఇచ్చిన లింకు ద్వారా పాటను చూసి ఆనందించండి.

....

శ్రీ నగజా తనయం సహృదయం || శ్రీ ||

చింతయామి సదయం త్రిజగన్మహోదయం || శ్రీ ||


శ్రీరామ భక్తులారా ! ఇది సీతా కళ్యాణ సత్కథ! నలభై రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత, కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది.

నాయనా... కాస్త పాలు మిరియాలు ఏవైనా...

చిత్తం ! సిద్ధం

భక్తులారా ! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో అందరిని ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందర మూర్తి. ఆహ్హా ! అతడెవరయ్యా అంటే...


రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు

రమణీయ వినీల ఘనశ్యాముడు

వాడు నెలఱేడు సరిజోడు మొనగాడు

వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాలు జాలురా || వాని కనులు ||

వాని జూచి మగవారలైన మైమరచి

మరుల్ కొనెడు మరోమరుడు మనోహరుడు

రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు

సనిదని, సగరిగరిగరిరి, సగరిరిగరి, సగగరిసనిదని,

సగగగరిసనిదని, రిసనిద, రిసనిద, నిదపమగరి రఘురాముడు

ఔను ఔను

సనిసా సనిస సగరిరిగరి సరిసనిసా పదనిసా

సనిగరి సనిస, సనిరిసనిదని, నిదసనిదపమ గా-మా-దా

నినినినినినిని

పస పస పస పస

సపా సపా సపా తద్ధిమ్ తరికిటతక

శభాష్, శభాష్


ఆ ప్రకారంబున విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో...


ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే

మనసింతలోనె దోచినాడే ఎంత సొగసుగాడే

మోము కలువఱేడే... ఏ... మోము కలువఱేడే

నా నాము ఫలము వీడే ! శ్యామలాభిరాముని చూడగ

నామది వివశమాయె నేడే

ఎంత సొగసు గాడే


ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై యుండగా అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి సభాసదులను జూచి...


అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగుపుత్రి సీత!

వినయాధిక సద్గుణవ్రాత ముఖవిజిత లలిత జలజాత

ముక్కంటి వింటి నెక్కిడ దాలిన ఎక్కటి జోదును నేడు

మక్కువ మీరగ వరించి మల్లెల మాలవైచి పెండ్లాడు ఊ... ఊ ఊ


అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరు ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా "హా ! ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని చాపము దీనిని స్పృశించుటయే మహాపాపము" అని అనుకొనిన వాడై వెనుదిరిగి పోయాడట. తదనంతరంబున...


ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి

తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి

సదమల మదగజగమనము తోడ స్వయంవర వేదిన చెంత

మదన విరోధి శరాసనమును తన కరమున బూనినయంత


ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనే

గుభిల్లుమనె గుండె నృపులకు

ఝల్లుమనియె జానకీ దేహము...

ఒక నిమేషమ్ము నందే

నయము జయమును భయము విస్మయము గదురా


ఆ... శ్రీ మద్రమారమణ గోవిందో హరి...


భక్తులందరు చాలా నిద్రావస్థలో ఉన్నట్లుగా వుంది

మరొక్కసారి

జై! శ్రీ మద్రమారమణ గోవిందో హరి...

భక్తులారా ! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు అంతట


భూతలనాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె

పృధుగుణమణి సంఘాతన్ భాగ్యోసేతన్ సీతన్ || భూతల ||

శ్రీ మద్రమారమణ గోవిందో హరి

https://www.youtube.com/watch?v=ZZcwjc7TbXc&list=RDZZcwjc7TbXc&start_radio=1


శనివారం, జూన్ 28, 2025

ఏడ్చే వాళ్లని ఏడవనీ!



హాస్యం వేరు... వేదాంతం వేరు... రెంటికీ పొంతన కుదరదు. వేదాంతం చెబుతుంటే నవ్వు రాదు. రాకూడదు కూడా. హాస్యంగా చెప్పాలంటే వేదాంతం నప్పదు. అలాంటిది హాస్యాన్ని, వేదాంతాన్ని కలగలిపి పాట రాయాలంటే ఎంత కష్టం? కత్తి మీద సాము లాంటిదే. ఏమాత్రం మోతాదు తప్పినా వేదాంతం అభాసుపాలవుతుంది. లేదా హాస్యం పేలవంగా మిగిలిపోతుంది. అలాంటి పాట ఒకటి నాకు భలే నచ్చుతుంది. పాత పాట. 'అర్థాంగి' (1955) సినిమా లోది. అందులోని ఏ వాక్యాన్ని తీసుకున్నా, ఏ చరణాన్ని తీసుకున్నా అది నికార్సయిన వేదాంతమే. వింటుంటే 'నిజమే కదా!' అనిపిస్తుంది. కానీ చెప్పే తీరులో మాత్రం హాస్యం తొణికిసలాడుతుంది. ఇక చిత్రీకరణ అయితే ఇంకా నవ్వులు పూయిస్తుంది.

ఆ పాటే... 'నవ్వే వాళ్ల అదృష్టమేమని, ఏడ్చేవాళ్లని ఏడవనీ...' పాట. 

సినిమాలో ఆ పాట వచ్చే సందర్భం చాలా గంభీరమైనది. ఓ పక్క జమీందారు గుమ్మడి చావు బతుకుల్లో ఉంటాడు. ఇంట్లో వాళ్లు అందరూ విషాదంలో మునిగిపోతారు. జమీందారు చిన్న కొడుకు జగ్గయ్య అప్పటికే ఇల్లు వదిలి ఓ వేశ్య సురభి బాల సరస్వతి ఇంట్లో ఉంటుంటాడు. అతడిని తీసుకు రావడానికి మనిషిని పంపినా, ఆఖరికి పెద్ద కొడుకు అక్కినేని నాగేశ్వరరావు వెళ్లి బతిమాలినా రానంటాడు. జమీందారు మొదటి భార్య కొడుకు అక్కినేని అయితే, రెండో భార్య కొడుకు జగ్గయ్య. చావు బతుకుల మధ్య ఉన్న జమీందారు, తన ఆస్తిని అక్కినేనికి అప్పగించి కన్నుమూస్తాడు. 

జమీందారు ఇంట్లో అందరూ ఘొల్లు మని ఏడుస్తుంటే... అక్కడ సురభి బాల సరస్వతి ఇంట్లో ఈ పాట మొదలవుతుంది.

''ఏడవనీ... ఏడ్చేవాళ్లని ఏడవనీ...'' అని! 

సినిమాలో గంభీరమైన సన్నివేశం చూస్తున్న ప్రేక్షకులంతా చటుక్కున కులాసా వాతావరణంలోకి మారిపోతారు. దీని వల్ల రెండు ప్రయోజనాలు నెరవేరుతాయి. ఒకటి ప్రేక్షకుల మూడ్‌ మారి రిలాక్స్‌ కావడం. రెండు, సినిమాలో చిన్న కొడుకు ఎంత బాధ్యతా రహితంగా తయారయ్యాడో బలంగా చెప్పగలగడం. ఇది మంచి స్క్రీన్‌ప్లే టెక్నిక్‌. దర్శకుడు పి.పుల్లయ్య ప్రతిభ కూడా. 

ఇక పాట విషయానికి వస్తే... రాసింది ఆచార్య ఆత్రేయ. సినిమాలో 9 పాటలుంటే అన్నీ ఆత్రేయ కలం నుండి జాలువారినవే. 

మణిలాల్‌ బెనర్జీ రాసిన బెంగాలీ నవల 'స్వయంసిద్ధ' ఆధారంగా తీసిన ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించింది కూడా ఆత్రేయనే. 

చాలా గంభీరమైన విషాద సన్నివేశం వెంటనే ''ఏడవనీ...'' అంటూ మొదలయ్యే పాట రాయడం, సాహసమే కాదు సమయస్ఫూర్తి కూడా అనిపిస్తుంది. 

ముందు పాట ఎలా సాగిందో చూద్దాం!...

''ఏడవనీ... ఏడవనీ... ఏడ్చే వాళ్లని ఏడవనీ

ఎదుటి వాళ్లు బాగున్నారని ఏడవనీ

నవ్వే వాళ్ల అదృష్టమేమని ఏడ్చేవాళ్లని ఏడవనీ ఏడవనీ!

నవ్వండి నవ్వే వాళ్లతో నవ్వండీ

నాలుగు ఘడియల నర జీవితము

నవ్వుల తోడుగ చేయండి ||ఏడ్చేవాళ్లని||

వచ్చిన వాళ్లు పోతారు

పోయిన వాళ్లు రాబోరు

ఈ రాకపోకల సందున ఉంది

రంజైన ఒక నాటకము

కదిలిస్తే అది బూటకము

అది అంతా ఎందుకు కానీ

అనుభవించి పోనీ

జీవిని అనుభవించి పోనీ!  ||ఏడ్చే వాళ్లని||

ఉండేది ఎంత కాలమో

ఊడిపోతాము ఏ క్షణమో

రేపన్నది రూపే లేనిది

ఈ క్షణమే నీకున్నది

అందాన్నీ, ఆనందాన్నీ

అనుభవించి పోనీ

జీవిని అనుభవించి పోనీ 

ఏడ్చేవాళ్లని ఏడవనీ

కళ్లు కుట్టి ఏడవనీ

కడుపు మండి ఏడవనీ

కుళ్లి కుళ్లి ఏడవనీ

ఏడవనీ ఏడవనీ''

-ఈ పాటకి సంగీత దర్శుకుడు మాస్టర్‌ వేణు ఓ నాటక ఫక్కీలో బాణీ కట్టారు. హార్మోయినం పెట్టి పట్టుకుని మీటలు నొక్కుతూ జగ్గయ్య చేసే అభినయాన్ని చూసి తీరాలి. సురభి బాల సరస్వతి వగలు, వయ్యారాలతో కూడిన నటన గిలిగింతలు పెడుతుంది. హాస్య నటుడు రామకృష్ట ఇతర నటీనటులు కలిసి హుషారుగా డ్యాన్సులు, స్టెప్పులతో పాటను రక్తి కట్టిస్తారు. 

డెబ్భై ఏళ్ల నాటి ఈ సినిమా పాట, యూట్యూబ్‌లో ఈతరం వాళ్లు చూసినా ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. 

అసలామాటకొస్తే, అర్థాంగి సినిమా గురించి చాలా చెప్పుకోవచ్చు. నల్లమందు పెట్టి పెంచడం వల్ల బుద్ధిమాంద్యానికి గురైన పెద్దకొడుకుగా అక్కినేని నటన అద్భుతంగా ఉంటుంది. జమీందారు కొడుకు అలాంటి వాడని తెలియకుండా పెళ్లి చేసుకుని,  అతడికి చదవు చెప్పి ప్రయోజకుడి చేసే పాత్రలో సావిత్రి అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అమాయకుడిగాను, ఆ తర్వాత వివేకవంతుడిగాను నటనలో అక్కినేని చూపించిన వేరియేషన్‌ చాలా బాగుంటుంది. పుల్లయ్య, శాంతకుమారి దంపతులే ఈ సినిమాకి నిర్మాతలు. విజయవంతమై శత దినోత్సవం జరుపుకున్న ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు ఫిలింఫేర్‌ లాంటి మరెన్నో పురస్కారాలు అందుకుంది. 


https://www.youtube.com/watch?v=PRBdvuLFrYQ






గురువారం, జూన్ 05, 2025

హడావుడిగా రీషూట్! పాట మాత్రం భలే హిట్!!


తెరవెనుక ఘంటసాల గళం... తెర మీద ఏఎన్నార్ అభినయం... 

తెర వెనుక సుశీల గానమాధుర్యం... తెర మీద జమున నటనా లాలిత్యం...

''ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులూ...''

పల్లవి చదవగానే 'మూగనోము' సినిమా గుర్తొస్తే, పాత సినిమాల అభిమానులన్నమాటే. పాత పాటలంటే చెవి కోసుకుంటారన్నమాటే!

ఈ పాట వెనుక ఓ ఆసక్తికరమైన సంగతి ఉంది. 

ఇంత హిట్ సాంగ్‌ ని  చాలా హడావుడిగా కేవలం ఒక్క రోజు వ్యవధిలో చిత్రీకరించారు. అప్పటికి సినిమా తీయడం మొత్తం అయిపోయింది. అక్కినేని కాల్షీట్లతో సహా అందరి పనీ పూర్తయింది. అక్కినేని, జమునలపై పాటలన్నీ కూడా అయిపోయాయి. మరి ఎందుకు అంత హడావుడిగా ఈ పాట తీశారు?

అదే తెలుసుకుందాం. ఈ పాట స్థానంలో అంతకు ముందే ఓ పాట తీశారు. అది 'అందం నీలో ఉందని, అది అందుకునే వీలుందని, తొందర చేసెను హృదయం, తొలి పందెం వేసెను పరువం...' అనే పాట. 

'మూగనోము' సినిమా తీసిన ఏవీయం సంస్థ నిర్మాత ఏవీ మెయ్యప్పన్‌ చెట్టియార్‌ కి ఈ పాట చిత్రీకరణ నచ్చలేదు. షూటింగ్‌ మొత్తం అయిపోయాక రషెస్‌ చూస్తున్నప్పుడు ఆయన దీన్ని గమనించారు. పాటను కొంత అవుట్‌ డోర్‌ లోను, మరి కొంత ఇన్‌డోర్‌ లోను తీశారు. ఆయా సీన్లు అంతగా మ్యాచ్‌ కాలేదని ఆయనకి అనిపించింది. దర్శకుడు యోగానంద్‌ ని పిలిపించి చూడమన్నారు. ఆయన కూడా ఏకీభవించారు. ఓ పక్క అక్కినేని అదే రోజు సాయంత్రం విమానంలో హైదరాబాద్‌ బయల్దేరుతున్నారు. అక్కినేనికి కూడా చూపించారు. చూశాక, 'అందులో మొదటి పాట ఎలా ఉంది?' అని అడిగారు చెట్టియార్‌. 

'బాలేదు' అన్నారు అక్కనేని కూడా. అయితే రీషూట్‌ చేద్దాం అన్నారు. అయితే ఆ మర్నాటి నుంచి అక్కినేనికి మరో సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ లో ఉంది. మరెలా? అక్కినేని ఆ సినిమా నిర్మాతకు ఫోన్‌ చేసి గడువు అడిగారు. ఆ నిర్మాత సరేనన్నారు. దాంతో 'ఎళ్లుండి రీషూట్ పెట్టుకుందాం' అనుకున్నారు. ఈలోగా నిర్మాతకి మరో ఆలోచన వచ్చింది. 

అసలా పాటనే మార్చేస్తే? నిర్మాత తల్చుకుంటే కొదవేముంది? ఆయన వెంటనే సంగీత దర్శకుడు గోవర్దన్‌కి విషయం చెప్పి, 'దాశరథి చేత మరో పాట రాయించండి. అది కూడా సాయంత్రానికి అయిపోవాలి' అని హుకుం జారీ చేశారు.  

ఇంకేముంది? ఆగమేఘాల మీద సంగీత దర్మకుడు, గీత రచయిత, నిర్మాత కొత్త పాట మీద కూర్చున్నారు.  గోవర్దన్‌ ట్యూన్‌ ఇవ్వడం, అది నిర్మాతకు నచ్చకపోవడం ఇలా కాసేపు సాగింది. విసుగెత్తిన చెట్టియార్‌ కి 'ఇది కాదు పని' అనిపించింది. వెంటనే తాను విన్న ఓ హిందీ పాట ట్రాక్‌ను తెప్పించారు. అది అప్పటికే బాగా హిట్టయిన ట్యూన్‌. 

'ఇదిగో... ఈ ట్యూన్‌కి తెలుగు పాట రాసేయండి. పెట్టేద్దాం' అన్నారు. 

ఆ హిందీ పాట 'దోకలియా' అనే సినిమాలోది. అదే తెలుగులో 'లేత మనసులు' సినిమా. 

ఆ పాట... 'తుంహారీ నజర్ క్యో కఫా హోగయీ... ఖతా బఖ్ష్ దో గర్ ఖతా హోగయీ’ అనేది. 

అది వింటూ దాశరథి రాత్రికి రాతి 'ఈవేల నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులు...' పాట రాశారు. 

మర్నాటి ఉదయమే ఘంటశాల, సుశీలకు కబురెళ్లింది. వాళ్లు రాగానే పాట రికార్డింగ్‌ జరిపించేశారు. 

ఆ పాట ట్రాక్‌ సిద్ధం కాగానే ముందుగా జమునను పిలిపించి పాటకు అనుగుణంగా ఆమె క్లోజప్‌ షాట్లు తీసేశారు. మర్నాడు అక్కినేని రాగానే హీరోహీరోయిన్లు కలిసి నటించే సీన్లన్నీ చకచకా తీసేశారు. పాట పాట తీసేసి, కొత్త పాట పెట్టేసి సినిమాను రెడీ చేశారు. ముందుగా అనుకున్నట్టుగానే సినిమా 1969 ఫిబ్రవరి 13న విడుదల అయింది. సినిమా శతదినోత్సవం చేసుకుంది. హిందీ పాటకి కాపీ ట్యూన్‌ అయినప్పటికీ తెలుగు పాట కూడా హిట్టయిపోయింది. 

https://youtu.be/h2Kmo85h4Xg?si=s0RGfYqTSFcR80UK


గురువారం, మే 29, 2025

మార్స్‌పై సెల్ఫీ... అందులో ఓ దెయ్యం!


ఎక్కడికి వెళ్లినా సెల్‌ఫోన్‌ పైకెత్తి అందులోని కెమేరాతో ఓ సెల్ఫీ కొట్టకపోతే తోచదు కదా! ఆ సెల్ఫీని చూసుకుని మీరు మురిసిపోయి మీ స్నేహితులందరికీ పంపిస్తారవునా?

కానీ ఎవరూ వెళ్లలేని చోట తీసుకున్న సెల్ఫీ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఆ సెల్ఫీని ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తి కరంగా చూస్తోంది. అంతేకాదండోయ్‌... అందులో ఓ 'డెవిల్‌' కూడా ఉందని గమనించారు. ఇంతకీ ఏంటా సెల్ఫీ? ఎవరు తీసుకున్నారు? ఎక్కడ? ఆ దెయ్యం ఏంటి? 

.... ఇవన్నీ తెలుసుకోవాలంటే చదువుకోండి మరి. 

ఆ సెల్ఫీ భూమ్మీద తీసినది కాదు. భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో తీసుకున్నది! 

తీసుకున్నది ఎక్కడో తెలుసా? మార్స్‌ గ్రహం మీద!

తీసిందెవరనుకుంటున్నారు? నాసా వాళ్లు అక్కడికి పంపిన రోవర్‌! రోవరంటే తెలుసుగా? వేరే గ్రహాల మీద పరిశోధనల కోసం వేర్వేరు దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు  పంపే ఓ చిన్న రోబో వాహనం అన్నమాట. దాని పేరు పెర్‌ సెర్వరెన్స్‌ రోవర్‌. దీన్ని అమెరికా వాళ్లు అక్కడికి పంపి 1500 మార్షియన్‌ డేస్‌ అయింది. ఆ సందర్భంగా అదొక సెల్షీ తీసుకుని భూమికి పంపించింది. ఒక మార్షియన్‌ డే అంటే సుమారు 24 గంటల 39 నిమిషాలు. ఇంచుమించు మన భూమి మీద రోజుతోనే సమానం. దాన్ని మన భూమి రోజుల్లోకి మారిస్తే అది సుమారు నాలుగేళ్ల రెండు నెలలతో సమానం. ఈ రోవర్‌ 2021 ఫిబ్రవరిలో మార్స్‌ గ్రహం మీద దిగింది. ఈ నాలుగేళ్లూ అదక్కడ ఏం చేసిందయ్యా అంటే... తన బుల్లి బుల్లి చక్రాల సాయంతో 22 మైళ్లు చక్కర్లు కొట్టింది. 37 బండల్ని తొలిచి వాటిలో ఏముందో చూసింది. మరో 27 మార్స్‌ ఉపరితలం శాంపిల్స్‌ను తీసుకుంది. అంతేకాదు, ఇప్పటి వరకు ఏ రోవరూ పంపనంత సమాచారాన్ని భూమికి పంపించింది. మార్స్‌ మీద వాతావరణం ఎలా ఉంటుందో పరిశోధించడానికి ఇవన్నీ చాలా విలువైన వివరాలన్నమాట. 

ఇంతకీ సెల్షీ ఎక్కడ తీసుకుందో తెలుసా? మార్స్‌ మీద 'జెజొరో' అనే ఓ బిలం ఉంది. దాని పక్కనే 'విచ్‌ హాజిల్‌' అనే కొండ ఉంది. రోవర్‌ గారు ఆ ఎత్తయిన ప్రదేశానికి ఎక్కి అక్కడి నుంచి చకచకా సెల్ఫీలు తీసుకుని 'చూసుకోండ్రా' అన్నట్టు భూమ్మీదకి పంపేసింది. వాటన్నింటినీ ఇక్కడి అంతరిక్ష పరిశోధకులు కొన్ని నెలలుగా క్షుణ్ణంగా పరిశీలించారు. 

అలా చూస్తుంటేనే వాటిలో ఓ 'దెయ్యం' కనిపించింది!

ఏంటా దెయ్యం?

మార్స్‌ మీద దెయ్యమా? అమ్మో! అని భయపడకండి. అది శాస్త్రవేత్తలు పెట్టిన పేరు. రోవర్‌కి మూడు మైళ్ల దూరంలో దుమ్ము ధూళితో కూడిన ఓ పెద్ద సుడిగాలి అన్నమాట. దీన్ని 'డస్ట్‌ డెవిల్‌' అని పిలుస్తున్నారు. రోవర్‌గారు పంపిన 59 సెల్ఫీలను క్రోడీకరించి ఒకే పెద్ద దృశ్యంగా మార్చినప్పుడు అందులో ఓ డస్ట్‌ డెవిల్‌ కనిపించిందన్నమాట. 'ఇలాంటి సమాచారాన్ని, ఫొటోలను విశ్లేషించినప్పుడు ఆ గ్రహం గురించి ఆశ్చర్యకరమైన ఎన్నో విషయాలు తెలస్తాయి' అంటూ కాలిఫోర్నియాలోని అంతరిక్ష పరిశోధకులు తెగ సంబరపడిపోతున్నారు. అదన్నమాట... ఈ అరుదైన సెల్షీ, అందులో దెయ్యం కథ!