ఆదివారం, మే 27, 2012

కుతంత్రాల పుట్ట

కుతంత్రాల పుట్ట


పట్టు వదలని అక్రమార్కుడు శ్మశానంలోకి అడుగుపెట్టాడు. అక్కడ నిశ్చింతగా సంచరిస్తున్న పిశాచాలన్నీ అతడిని చూడగానే భయంతో 'కెవ్వు కేక' పెట్టి గుంపుగా చేరి గుబులుగా చూడసాగాయి.
'వీడిక్కడికి వచ్చాడేంటి? మనకు ఓట్లు లేవుగా?' అంది రక్తాక్షి అనే పిల్లపిశాచి.

'కొంపదీసి మనల్ని కూడా ఓదార్చడు కద?' అంది చిత్రనఖి అనేనడివయసుది.

'ఈ శ్మశానాన్నెవరికైనా ధారాదత్తం చేస్తున్నాడేమో, దానికి బదులుగా సొంత వ్యాపారానికి పెట్టుబడులు పట్టేసి ఉంటాడు' అంది రాజకీయాల్లో ఆరితేరి, ఆరిపోయిన వక్రదృష్టి అనే పిశాచం. శ్వేతకేశి అనే ఓ వృద్ధ పిశాచం వారిని వారించి, 'ఇతడు అధికార పీఠాన్ని అడ్డంగా పెట్టుకుని ప్రజాధనాన్ని కొల్లగొట్టిన అక్రమార్కుడు. ఇప్పుడు రాజకీయ బేతాళుడిని వశం చేసుకోవడానికి ఇలా వచ్చాడు. ఇక మనకు భలే కాలక్షేపం' అంది.

పిశాచాలన్నీ 'కీ...క్రీచు...' మని నవ్వుతూ చప్పట్లు కొట్టాయి.

పట్టువదలని అక్రమార్కుడు ఓ చెట్టువద్దకు నడచి వెళ్లి, దాని కొమ్మకు వేలాడుతున్న ఆశల శవాన్ని భుజాన వేసుకుని మొహం గంటు పెట్టుకుని మౌనంగా నడవసాగాడు.

శవంలోని రాజకీయ బేతాళుడు వికవికమంటూ నవ్వి, 'రాజకుమారా! నీ ప్రయత్నం చూస్తే జాలేస్తోంది. నీ పట్టుదల చూస్తే ముచ్చటేస్తోంది. కాబట్టి నీకో అవకాశం ఇస్తున్నాను. అలనాటి విక్రమార్కుడిలాగా నువ్వు మౌనం పాటించక్కర్లేదు. నాతో కబుర్లు చెప్పవచ్చు. కానీ, నేను ఎలా అడిగే ప్రశ్నలకు అలా నువ్వు సమాధానాలు చెప్పాలి. లేకపోతే నీ తల వెయ్యి ముక్కలైపోతుంది. నువ్వు సరైన సమాధానం చెప్పలేకపోయిన నాడు నేను నీకు వశమవుతాను. ఈ షరతు బాగుందా?' అన్నాడు.

అక్రమార్కుడు నోరు విప్పాడు. 'చాలా బాగుంది బేతాళా! ఆశల శవంపై ఆవహించి మాట్లాడే నీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. ఈలోగా నువ్వేం బాధపడకు. నీకు నేనున్నాను' అన్నాడు.

బేతాళుడు పకపకా నవ్వాడు. 'అక్రమార్కా! ఆగాగు. నీకు ఓదార్చడం బాగా అలవాటైపోయింది. నా దగ్గర కూడా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఇంతకూ మంచి రోజులంటున్నావు, ఎలాగట?'

'త్వరలో నన్ను సీఎం పీఠంపై చూడబోతున్నావు. అప్పుడంతా స్వర్ణయుగమే. ఆశలన్నీ తీరిపోతాయి. ఎవరికీ ఏ లోటూ ఉండదు'

బేతాళుడు ఫక్కుమని, 'ఇవన్నీ ప్రజల దగ్గరకు పోయి చెప్పుకో. నా దగ్గర కాదు. నీ నాలుక మీద పలుకేంటో, నీ మనసులో కులుకేంటో నాకు తెలియదనుకోకు. నేనసలే రాజకీయ బేతాళుణ్ని, తెలిసిందా?' అన్నాడు.

'కోపగించుకోకు బేతాళా! ఏంటో ఈమధ్య నిద్రలోంచి ఉలిక్కిపడి లేచినా ఇలాంటి మాటల్నే పలవరిస్తున్నాను. సరేకానీ, ఏవో ప్రశ్నలన్నావు... ఏమిటో అడుగు' అన్నాడు అక్రమార్కుడు.

'అక్రమార్కా! అసలెందుకు ఇంతలా కష్టపడుతున్నావని అడిగితే ప్రజలకేం చెబుతావో అది చెప్పు?' అడిగాడు బేతాళుడు.

అక్రమార్కుడు ఆవేశంగా నోరు విప్పి, 'ఈ ప్రభుత్వానికి పాలించే హక్కులేదు. మేం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ అణగార్చి వేసింది. నాపై కుట్రలు పన్ని అరెస్టు చేయాలని చూస్తోంది. రాష్ట్రంలో ప్రజలెవ్వరూ సుఖసంతోషాలతో లేరు....' అంటూ కసాయివాడు మాంసాన్ని ముక్కలు చేస్తున్న తరహాలో చేతిని పైకి కిందికీ వూపుతూ చెప్పసాగాడు.

బేతాళుడు పకపకా నవ్వి, 'ఆపెయ్‌, నీ ఉపన్యాసాలు రోజూ పత్రికల్లో చదువుతున్నాంలే. ఇప్పుడు నీ మనసులో మాటేంటో చెప్పు?' అంది.

అక్రమార్కుడు నవ్వో ఏడుపో తెలియని మొహం పెట్టి, 'గొప్ప చిక్కులో పడేశావు బేతాళా! అయినా నువ్వు శాపం పెట్టాక తప్పుతుందా? విను. ఒకటా రెండా, లక్షకోట్ల రూపాయల ప్రజాధనాన్ని నా అపార మేధాసంపత్తితో దారి మళ్లించాను. అధికారాన్ని అడ్డంపెట్టుకుని సొంత వ్యాపారాలకు పెట్టుబడులు సేకరించి, అలా పెట్టినవారికి ఈ రాష్ట్రం నా సొంత జాగీరన్నంత ధీమాగా ఎక్కడ అడిగితే అక్కడ భూములు, గనులు కట్టబెట్టించాను. అందుకోసం జీఓలు సైతం మార్పించాను. అధికారుల్ని ప్రలోభపెట్టి పరుగులు పెట్టించాను. ప్రజల పేరిట పథకాలు రచించి, వాటి అమలు మాటున అయినవారికి అధిక మేలు జరిగేలా పావులు కదిపి అనుచరవర్గాన్ని పెంచుకున్నాను. పప్పుబెల్లాల్లా ప్రజలకు అందింది కొంతైతే, చాటుమాటున కొల్లగొట్టింది అంతకు లక్షింతలు ఉండేలా చూసుకున్నాను. ఒకప్పుడు ఇంటిని తాకట్టుపెట్టే స్థితినుంచి ఇప్పుడు పొరుగు రాష్ట్రానా కోటలు కట్టేంతగా వృద్ధి చెందాను. కానీ ఏం చేయను? తానొకటి తలిస్తే విధి వేరొకటి తలచినట్టు అనుకోకుండా అంతా తారుమారై అధికార పీఠంపై పట్టు కోల్పోయాను. ఇప్పుడు చూడు? నేను చేసిన నీతిమాలిన పన్లన్నీ ఒకటొకటికగా బయటపడుతున్నాయి. నా తరఫున పనిచేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఒకరొకరుగా అరెస్టవుతున్నారు. ఇదంతా ఏదో ఒకనాటికి జరుగుతుందని ముందే వూహించాను. అందుకే మరింత విజృంభించాను. పెంచి పోషించిన సొంత పార్టీనుంచి వేరుపడి వేరు పార్టీపెట్టినా... ఇంతవరకు ఎదిగిన పార్టీనే తిట్టి పోస్తున్నా... నా అనుచరులచేత అసంబద్ధంగా రాజీనామాలు చేయించి ఎన్నికలకు దారులు వేసినా... లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా ఖర్చుకు కారకుడినైనా... అన్నీ అధికారం కోసమే. మేం విసిరిన పప్పుబెల్లాలనే పదేపదే ముచ్చటిస్తూ ప్రజల్ని ప్రలోభపెడితే అధికారానికి చేరువ కావచ్చనే ఇలా ఎండనక, కొండనక శ్రమ పడుతున్నాను. వారిలో స్వర్ణయుగమంటూ ఆశలు కల్పించి వూరిస్తున్నాను. నీకు తెలియనిదేముంది? అధికారం ఉంటే తిమ్మిని బమ్మిని చేయవచ్చు. కేసుల తీవ్రత తగ్గించుకోవచ్చు. కాబట్టి అస్థిరత, అనిశ్చితిని పెంపొందించడమే నా ముందున్న ఏకైక లక్ష్యం' అంటూ ఏకరవు పెట్టాడు.

అక్రమార్కుడు సరైన సమాధానం చెప్పడంతో బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.

PUBLISHED IN EENADU ON 26.5.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి