శుక్రవారం, మే 18, 2012

అడ్డగోలు స్వేచ్చ

అడ్డగోలు స్వేచ్ఛ!


'స్వేచ్ఛ అంటే ఏమిటి గురూగారూ?'
'నీకు తెలీకనే అడుగుతున్నావా?'

'అంటే... కొంత తెలుసనుకోండి. కానీ మన రాజకీయాల్లో దానర్థం ఏమిటో మీ నోటిద్వారా విందామని...'

'నీకామాత్రం స్వేచ్ఛ ఉందిలే. అడగొచ్చు, తప్పులేదు. రాజకీయాల్లోకి రాగానే నీ స్వేచ్ఛకు పట్టపగ్గాలుండవని తెలిసిందే. అదెలాంటిదో నీకూ తెలుసు, నాకూ తెలుసు. స్వేచ్ఛగా పథకాలు రచిస్తాం. యథేచ్ఛగా ఆటిని అడ్డం పెట్టుకుని జనం సొమ్ము దండుకుంటాం. కానీ, చేసిన ఎదవ పన్లు బయటపడే రోజొస్తుంది. ఆ సంగతీ నీకు తెలుసు. అదిగో... అప్పుడే అసలైన స్వేచ్ఛ గురించి తెలుసుకోవాలి'

'అసలైన స్వేచ్ఛా- అదేంటండీ?'

'అదేరా, నీ స్వేచ్ఛేదో కోల్పోయినట్టు గందరగోళ పెట్టడం. అక్కడికి నువ్వేదో పెద్ద సత్తెహరిచ్చంద్రుడిలాగా పోజు పెట్టి ఊరూవాడా యాగీ చేయడం. ఇట్టాంటి సందర్భాల్లో ఇది భలే ఉపయోగపడుతుందిరా...'

'అంటే మితిమీరిన స్వేచ్ఛతో ఇలాంటి అడ్డగోలు వాదనలు చేయాలంటారు. అసలింతకీ ఈ స్వేచ్ఛలెన్ని రకాలు గురూగారూ?'

'పనికొచ్చే ప్రశ్న అడిగావురా. యాత్రల స్వేచ్ఛ, ఉపన్యాసాల స్వేచ్ఛ, ఆరోపణల స్వేచ్ఛ, బురద జల్లుడు స్వేచ్ఛ, బెదిరింపుల స్వేచ్ఛ, బుకాయింపుల స్వేచ్ఛ, ప్రలోభ స్వేచ్ఛ, ప్రతిఫల స్వేచ్ఛ, కొల్లగొట్టు స్వేచ్ఛ, కంటితుడుపు స్వేచ్ఛ... అబ్బో... ఇంకా ఇలాంటి నీచనికృష్ట స్వేచ్ఛలెన్నో ఉన్నాయిలేరా. ఇవన్నీ కానుకుని ఎప్పటికేది అవసరమో అప్పుడది వాడుకుంటూ ముందుకు సాగిపోతే నీకు ఢోకా ఉండదు'

'ఆహా... ఏం సెలవిచ్చారండీ! వీటిలో ఆరితేరిన మేధావి ఎవరైనా ఉన్నారాండీ?'

'ఎందుకు లేర్రా! నవ్వో ఏడుపో తెలీని మొహంతో జనం మొహాల మీద మొహం పెట్టి కన్నీరు లేకపోయినా కళ్లు తుడిచేస్తున్న యువనేతను మరిచిపోతే ఎలా? ఇంతవరకు నేను చెప్పిన స్వేచ్ఛలే కాకుండా అంతకు మించిన ఘనస్వేచ్ఛలను కూడా వాడుకుంటున్న ఘనుడురా అతడు...'

'ఘనస్వేచ్ఛలా- మళ్ళీ అవేంటండీ?'

'అవే పత్రికాస్వేచ్ఛ, అది పోయిందని వాదించే గగ్గోలు స్వేచ్ఛ...'

'అదేంటండోయ్‌... రెండూ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి...'

'అదేకదరా కీలకం! మొదటిది పెట్టేదే రెండోదాని కోసం మరి. కాబట్టి నీలాంటి నీచ రాజకీయవేత్తలు తక్షణం పాటించాల్సిన స్వేచ్ఛ ఒకటుందిరా. అదే... ఓ పత్రిక పెట్టుకోవడం. కావడానికి కాగితమేకానీ, అదొక పెద్ద కవచంరా సన్నాసీ. నువ్వు చేసిన ఎదవ పన్లు ఏవి బయటపడినా- ఆ కవచాన్ని అడ్డమేసుకోవచ్చు మరి'

'అంటే... కాపాడేస్తుందాండీ?'

'గ్యారంటీ లేదుకానీ, కాలయాపనకి పనికొస్తుంది. ఈలోగా నువ్వు ఎక్కడివక్కడ సర్దేసుకోవచ్చు'

'ఏం స్వేచ్ఛలో గురూగారూ! మీ మాటలు వింటుంటే ధైర్యంగానే ఉంటుందికానీ, ఎప్పటికైనా నిజాలు బయటకొస్తే మనం లోపలికి పోయి నిజమైన స్వేచ్ఛ కోల్పోతామని గుబులుగా ఉంటుందంటే నమ్మండి...'

'ఓరెర్రోడా! మనలో మన మాటగా నా మాటలకు అర్థమేమంటే- మన చట్టాల్లో ఉన్న వీలేమిటో, సాలేమిటో, లొసుగులేమిటో, లోపాలేమిటో తెలుసుకుని ఆటిని అడ్డమేసుకోవాలని. ఇక ప్రజాస్వామ్యమంటావా? దాన్నీ మనకి అనుకూలంగా మార్చుకోవాలని...'

'కానీ- పవిత్రమైన ఈ రెండూ మనకెలా పనికొస్తాయండీ?'

'అందుకేరా... నువ్వింకా చాలా ఎదగాలని చెబుతుంట. చట్టమైనా, ప్రజాస్వామ్యమైనా కొన్ని స్వేచ్ఛల్ని ప్రసాదించాయిరా. ఉదాహరణకి- నీ ఎదవపన్లు స్పష్టంగా బయటపడిపోయినా చిన్న కోర్టునుంచి పెద్ద కోర్టు వరకు పిటిషన్లు తగిలించుకునే స్వేచ్ఛ ఉంది. గల్లీనుంచి ఢిల్లీదాకా వెళ్లేలోగా ఏళ్లకేళ్లు గడిచిపోతాయి కదా! ఈ విషయంలో కూడా నువ్వు మన యువనేతనుంచి చాలా నేర్చుకోవాలి మరి'

'మరి ప్రజాస్వామ్యం సంగతేమిటండీ?'

'ఇది మరీ పవర్‌ఫుల్లురోయ్‌! ఇది కల్పించే స్వేచ్ఛల్ని అడ్డమెట్టుకుని అవసరమైతే ప్రభుత్వాలనే గడగడలాడించే వీలుంది. మన ఆంధ్రాటకమైనా, పొరుగున కర్నాటకమైనా జరుగుతున్నదదే కదా! ఇక్కడ గడ్డితిన్న యువకుడైనా, అక్కడ యెడ్డెమంటే తెడ్డెమంటున్న పెద్దాయనైనా నీకు మార్గదర్శకులే. ఇద్దరిదీ ఒకేదారి. అధికారాన్ని అడ్డమెట్టుకుని గనుల్ని, భూముల్ని ధారాదత్తం చేసిన ఆ మహానుభావులే మనకు ఆదర్శం. రాజీనామాలతో ఎన్నికలు తెచ్చినా, సొంత పార్టీ అధిష్ఠానాల్ని బెదిరించినా చేసిన పన్లకు మసిపూసి మారేడు కాయ చేయడానికేనని వేరే చెప్పాలా? నువ్వొట్టి నీతిమాలినవాడివని ఓ పక్కన తేలిపోతున్నా- నవ్వుకుంటూ ప్రజల దగ్గరకి వెళ్లే సిగ్గుమాలిన స్వేచ్ఛని మించినదేముంటుంది చెప్పు? కాబట్టి అధికారం అందుకోవాలంటే ఇలాంటి అడ్డగోలు స్వేచ్ఛలన్నింటినీ ఎడాపెడా వాడేసుకోవాలి మరి'

'కానీ గురూగారూ! ప్రజలు అంత అమాయకులంటారా? మన మాటలకి, చేతలకి మధ్య తేడాపాడాలు పసిగట్టలేరంటారా?'

'దాని గురించి ఆలోచిస్తే అసలు ప్రజల దగ్గరకే పోలేవు కదరా. నిన్ను, నీ నిజస్వరూపాన్ని గమనించి ఏం చేయాలో అది చేసే స్వేచ్ఛ ప్రజలకి కూడా ఉన్నా, దాన్ని తలచుకుంటే నిద్ర పట్టదు మరి. అందుకని అడ్డంగా దొరికిపోయినా ఇదంతా కిట్టనివాళ్ల కుట్రని నిబ్బరంగా, సిగ్గులేకుండా మాట్లాడే స్వేచ్ఛ కూడా నీకుందని మరిచిపోకు!'

'ఆహా... మీ దగ్గరికొస్తే భయాలన్నీ తీరిపోతాయండీ... ఇక వెళ్లొస్తానండి..'.

'ఏం? ఎందుకంత తొందర?'

'ఎందుకంటే... ఇంటికి ఆలస్యంగా వెళ్లే స్వేచ్ఛని మా ఆవిడ నాకింకా ఇవ్వలేదండి మరి!'

PUBLISHED IN EENADU ON 18.05.12

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి