గురువారం, మే 31, 2012

వికృత యోచన

వికృత యోచన!

పట్టువదలని అక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్లి కొమ్మకు వేలాడుతున్న ఆశల శవాన్ని భుజాన వేసుకుని గబగబా నడవసాగాడు. శవంలోని రాజకీయ బేతాళుడు గట్టిగా గొంతు సవరించుకుని, 'అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు ఎక్కడా దాఖలాలు లేవనే డైలాగు విన్నావా అక్రమార్కా? చిత్రమేమంటే... ఈ రెండు గుణాలూ నీలో ఎక్కువగానే ఉన్నట్టున్నాయే?' అన్నాడు.
అక్రమార్కుడు మాట్లాడలేదు.

'అలనాటి విక్రమార్కుడిలాగా మౌనం పాటించక్కర్లేదని చెప్పాగా! సమాధానం చెప్పు?' అంటూ బేతాళుడు రెట్టించాడు.

అక్రమార్కుడు నిట్టూర్చి, 'నువ్వేమన్నా నేనేమీ అనలేను బేతాళా! బరువైన ఆశల్ని భుజాన వేసుకున్నాక తప్పుతుందా? నువ్వెలాగనుకుంటే అలాగే' అన్నాడు.

బేతాళుడు చటుక్కున భుజం దిగిపోయి అక్రమార్కుడి భుజం మీద చెయ్యి వేసి పక్కనే నడుస్తూ, 'ఇంత బరువు నువ్వు తట్టుకోలేవు కానీ, నా చెయ్యి మొయ్యి చాలు. చెయ్యంటే గుర్తొచ్చింది... అభయ హస్తం నీడలో ఎదిగి భస్మాసుర హస్తంలా మారిన నిన్నొక కోరిక కోరతాను. కాదనవుగా?' అన్నాడు.

'ఏమిటది?'

'అహ... ఏం లేదూ, ఈ శ్మశానాన్ని మాత్రం ఎవరికీ కట్టబెట్టకేం! ఎన్నో ఏళ్లనుంచి ఇక్కడే బతుకుతున్నా. కావాలంటే నువ్వు చెప్పిన కంపెనీ షేర్లని, నువ్వు నిర్ణయించిన అడ్డగోలు రేటుకు నోరెత్తకుండా కొనేలా ఎవరి మీదనైనా ఆవహించి పెట్టుబడి పెట్టిస్తాలే. ఇంతవరకు ప్రజల భూములిచ్చి పెట్టుబడులు పిండుకున్నావు కానీ, తొలిసారిగా మా మరుభూమిని ముట్టుకోకుండా ఉంటే చాలు- పెట్టుబడులు వచ్చే అవకాశమిది. బాగుంది కదూ?'

బేతాళుడి చతురోక్తికి అక్రమార్కుడి మొహం కోపంతో జేవురించింది. అది చూసిన బేతాళుడు చటుక్కున అతడి మొహం అరచేతుల్లోకి తీసుకుని మొహంలోకి మొహం పెట్టి చెంపలు నిమిరి, తలను బలవంతంగా వంచి నెత్తి మీద ముద్దు పెట్టుకున్నాడు.

'ఏమిటిది?' అన్నాడు అక్రమార్కుడు మరింత కోపంగా.

'ఏమో నాకేం తెలుసు? నువ్వు ఎక్కడికి వెళ్లినా అమాయక ప్రజల్ని ఇలాగే చేస్తుంటావుగా? అలా చేస్తే ఏమవుతుందోనని చేసి చూశా. అయినా అంత కోపం ఎందుకు అక్రమార్కా!' అన్నాడు బేతాళుడు వికవికా నవ్వుతూ.

అక్రమార్కుడు తమాయించుకుని 'కోపం నీమీద కాదులే. నా మీద పెద్ద కుట్ర జరిగింది. అది తలచుకుంటే ఒళ్లంతా కుతకుతలాడిపోతోంది' అన్నాడు.

'ఏమా కుట్ర, ఏమా కుతకుత?'

అక్రమార్కుడు ఆవేశాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. 'ఢిల్లీ నుంచి దూతలొచ్చారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షం వాళ్లు ఏకమయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు వ్యూహరచన చేశారు. గెలవలేక, నా విజయాన్ని అడ్డుకోలేక, అరెస్ట్‌ చేసి ఎన్నికలు వాయిదా వేయిద్దామని ప్రయత్నిస్తున్నారు. కానీ జనం గుండెల్లో నేనెప్పుడో ఖైదీనని తెలుసుకోలేకపోతున్నారు...' అంటూ రెచ్చిపోయాడు.

బేతాళుడు శ్మశానంలో కింద పడి పొట్ట పట్టుకుని పకపకా నవ్వుతూ దొర్లసాగాడు. చెట్ల మీద, సమాధుల మీద కూర్చుని ఇదంతా వింటున్న పిశాచాలు కూడా కడుపుబ్బ నవ్వుతూ గెంతసాగాయి. అక్రమార్కుడు తెల్లమొహం వేశాడు.

బేతాళుడు తేరుకుని, 'హ...హ్హ...హ్హా! భలే నవ్వించావు అక్రమార్కా! బతికినన్నాళ్లూ నానా బాధలు పడి చచ్చి ఇక్కడికొచ్చాక మా పిశాచాలు వింటున్న గొప్ప జోక్‌ ఇదేనయ్యా! ఇక ఆపెయ్‌. ఈ కబుర్లన్నీ ప్రజల దగ్గర చెల్లుతాయేమో కానీ, నా లాంటి రాజకీయ బేతాళుడి దగ్గర కాదు సుమా! ఇప్పుడు చెప్పు? తలాతోకా లేని ఈ కుట్ర కథనెందుకు తలకెత్తుకున్నావు? ప్రజల మనసుల్ని ఎందుకు కలుషితం చేయాలని చూస్తున్నావు? నీ మదిలోని మాటను ఉన్నదున్నట్టుగా చెప్పకపోతే... ప్రజల్లో చైతన్యం వచ్చినంత ఒట్టు...'అన్నాడు.

అక్రమార్కుడు కంగారుపడ్డాడు. 'వద్దు బేతాళా! అంత మాటనకు. ప్రజలు నా నిజస్వరూపం గ్రహిస్తే నా ఆశలు నెరవేరవు. నిన్నెలాగైనా వశం చేసుకుని, తద్వారా అధికార పీఠం అధిరోహించడానికి సిద్ధపడ్డాక... నిజం చెప్పక తప్పుతుందా! విను. నాకు పూర్తిగా అర్థమైపోయింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను చేసిన అడ్డగోలు, అకృత్య, అవినీతి పనులన్నీ బయటపడుతున్నాయి. వాటి ఫలితమే నా విచారణ. చివరికి చేరవలసిన చోటుకే చేరాను. ఇదంతా నేను ముందుగానే వూహించాను. గమనించావో లేదో, ప్రతి రోజూ ప్రజలకు తాజాగా కనిపించిన నేను... సీబీఐ విచారణకు రెండు రోజుల ముందునుంచే గెడ్డం పెంచాను. నా సానుభూతి వేషాలకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. నేను అరెస్టయ్యాక ఎవరెవరు ఎలా మాట్లాడాలో, ఏమేం చేయాలో కూడా ఏర్పాటు చేశాను. ఎందుకో తెలుసా? నా అరెస్ట్‌ తరవాత ప్రజల మనోభావాలు మారకుండా ఉండటానికే. మా హయాములో ప్రజల కోసం చేసింది ఆవగింజైతే, దాని వెనక నేను భోంచేసింది మేరు పర్వతమంతనే సత్యం వారికి బోధపడకుండా ఉండాలంటే- కన్నీటి కెరటాల్లో వారిని ముంచెత్తాలి. సానుభూతి సునామీలో ఊపిరాడకుండా చేయాలి. తమిళ తమ్ముడు రాజా, చెల్లెమ్మ కనిమొళి, కర్ణాటక కంత్రీ గాలి వంటివారి అరెస్టుల కథలన్నీ చూశాక నేను ఆఖరి అస్త్రంగా పన్నిన పన్నాగమిది. ఇక ఎప్పుడు బయటికి వస్తానో తెలియదు కాబట్టే కుట్ర కథను తెరపైకి తెచ్చాను. ఇలా ఎదురొడ్డి వీరంగమాడటం నా రాజకీయ చతురతకు సాక్షి. ఇది రెండు వైపులా పదునున్న ప్రచారాస్త్రం' అంటూ వికృత మనోభావాలన్నీ బయటపెట్టేశాడు.

బేతాళుడు తెల్లబోయి, 'మరీ ఇంత నీచ నికృష్ట తరహాలో ఆలోచించడం మా పిశాచాల్లో కూడా సాధ్యం కాదయ్యా! అయినా నువ్వు సరైన సమాధానం చెప్పాక నేనిక చేసేదేముంది? మరో నిశిరాత్రి కలుద్దాం. వస్తా' అంటూ చటుక్కున మాయమై, రివ్వుమంటూ ఎగిరి, తిరిగి చెట్టెక్కాడు.

PUBLISHED IN EENADU ON 30.5.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి