ఆదివారం, మే 13, 2012

జన్యు రహస్యం

జన్యు రహస్యం



'యురేకా అంటూ అరిచాడు న్యూస్‌టన్‌. ఇతడు న్యూటన్‌ కోవలోనివాడే. ఉండుండి ఏవేవో కనిపెడుతూ ఉంటాడు. ముఖ్యంగా వార్తల్లోంచి వాస్తవాలు కనిపెడతాడు. ఊహల్లోంచి ఉత్పాతాలు సృష్టిస్తాడు.
'కనిపెట్టా... డీఎన్‌ఏ గుట్టు విప్పా...' అంటూ అతడు వీధిలోకి పరిగెత్తాడు.

'డీఎన్‌ఏ గుట్టు నువ్వు కనిపెట్టేదేంటి? ఇప్పటికే కనిపెట్టారు' అన్నాడో గుంభనాల గుర్నాథం.

'అందులోని కొత్త లింకులు నేను కనిపెట్టా!'

'ఏంటో ఆ లింకులు?'

'ఉదాహరణకు తివారీ తిరకాసు కేసు గుర్తుందా?'

'ఎందుకు గుర్తులేదు? నేనాయనకే పుట్టానన్నాడొకడు. అబ్బే కాదంటాడీయన. డీఎన్‌ఏను పరీక్షిస్తే ఆ జన్మరహస్యం లోగుట్టుమట్లు తేలిపోతాయట కదా... అది చేయించండన్నాడా కొడుకు కాని కొడుకు. నేనొప్పుకోనన్నాడీ తండ్రి కాని తండ్రి. విషయం సుప్రీంకోర్టు దాకా దేకింది. తాజాగా బలవంతంగానైనా ఆయన డీఎన్‌ఏని పరీక్షించమని తీర్పు వచ్చింది. పేపర్లో మొత్తం చదివాంలే!'

వీళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే జనమంతా చుట్టూ మూగి, ఆసక్తిగా చూడసాగారు.

'అంటే దానర్థం... డీఎన్‌ఏలో జన్యు సంబంధమైన రసాయనాలను గుర్తిస్తే జన్మరహస్యం తెలిసిపోతుందనే కదా? అందుకే నేను ఎవరి డీఎన్‌ఏలో ఎలాంటి రసాయనాలు ఉన్నాయో పరిశోధించి కనిపెట్టా. కావాలంటే నా ల్యాబ్‌కి రండి' అంటూ న్యూస్‌టన్‌ పరిగెత్తాడు. జనం కూడా ఆ వెనకే పరుగులు తీశారు.

ప్రయోగశాలలో సూక్ష్మదర్శినికి పెద్ద కంప్యూటర్‌ తెర అనుసంధానమై ఉంది. న్యూస్‌టన్‌ ఓ చిన్న గాజుముక్కను సూక్ష్మదర్శినిలో పెట్టగానే తెరపై దృశ్యం కనిపించసాగింది. ఓ సూచికతో తెరపై భాగాలు చూపిస్తూ న్యూస్‌టన్‌ వివరించాడు.

'జన్యుశాస్త్రం ద్వారా మనిషిలోని గుణగణాల మూలాలను, వంశపారంపర్య లక్షణాలను అంచనా వేయవచ్చన్నది తెలిసిందే. ఇలా కొందరి ప్రముఖుల డీఎన్‌ఏలోని రసాయనాల పేర్లను, వాటివల్ల కలిగే లక్షణాలను చెబుతాను. దాన్నిబట్టి ఆ వ్యక్తులెవరో పోల్చుకోండి. అప్పుడే మీకు నా పరిశోధన మీద నమ్మకం కలుగుతుంది' అన్నాడు న్యూస్‌టన్‌.

జనమంతా ఉత్సాహంగా 'ఓ...' అన్నారు.

'ఇది మనరాష్ట్రంలో సుడిగాలిలా పర్యటిస్తున్న యువనేత డీఎన్‌ఏ. చూశారా ఎంత సంక్లిష్టంగా ఉందో! మామూలు డీఎన్‌ఏ మెలితిరిగిన నిచ్చెనలా ఉంటే ఈయనగారి డీఎన్‌ఏ అడ్డమైన వంకర్లు పోయింది. అసలు డీఎన్‌ఏ నుంచి అడ్డదారుల్లో వేరే లింకులు కనిపిస్తున్నాయి. ఆ లింకులున్న ప్రతిచోటా ఎర్రచుక్కలా కనిపిస్తున్న ఈ రసాయనం పేరు 'కరప్షనో ఎమినో యాసిడ్‌'. ఆయన అవినీతి లింకులకు ఇదే కారణం. ఇది వంశపారంపర్యంగా తండ్రినుంచి సంక్రమించింది. ఆ తండ్రి డీఎన్‌ఏ కూడా పరిశీలించా. ఆయనలో ఉన్నది, ఈయనలో లేనిది ఒకేఒక రసాయనం. అదే 'పవరో డైక్లోరో టాక్సిన్‌.' ఆ అధికార లక్షణం అందుకోలేకపోవడం వల్లనే ఈయనలో ప్రతి కణం తహతహలాడిపోతోంది. రోడ్లమీద కంగారుగా తిరిగేలా చేస్తోంది. కనిపించినవారి బుగ్గలు నిమిరి, తలమీద ముద్దులు పెట్టుకుని, వాళ్లకేదో కష్టం వచ్చినట్టు భ్రమలో పడేసి తల్లడిల్లేలా చేస్తోంది. సాధారణంగా అందరిలో 'వై' క్రోమోజోమ్స్‌, 'ఎక్స్‌' క్రోమోజోమ్స్‌ ఉంటాయని తెలిసిందే. కానీ, ఈయనలో ఎక్స్‌ క్రోమోజోమ్‌లో చిన్న మార్పు జరగడంతో అవి 'వై, ఎస్‌' క్రోమోజోములుగా రూపాంతరం చెందాయి. అందువల్ల రాష్ట్రంలో జరిగిన మంచి పనులన్నింటికీ తండ్రే కారణమని, అవినీతి పనులకు మాత్రం ప్రభుత్వమే కారణమని వాదిస్తుంటాడు. ఇక్కడ తెరమీద పసుపు రంగులో కనిపిస్తున్నదే 'ఇంప్యూర్‌ డైల్యూట్‌ వేల్యూస్‌ యాసిడ్‌'. దీనివల్ల సామాజిక విలువలపట్ల ఈయన దృక్పథం పలచబడిపోయింది. ఇదిగో ఈ 'కరెన్సీ సిస్టోజైన్‌' వల్ల ఏ పథకం నుంచైనా ప్రజల సొమ్మును సొంత ప్రయోజనాలకు మళ్లించే అపారమైన తెలివితేటలు అభివృద్ధి చెందాయి. మరి ఈయనెవరో గుర్తుపట్టారా?' అడిగాడు న్యూస్‌టన్‌.

'ఓ... గుర్తుపట్టేశాం... మరో డీఎన్‌ఏ చూపించండి' అన్నాడు గుంభనాల గుర్నాథం. మరో గాజు ముక్కను సూక్ష్మదర్శినిలో పెట్టగానే తెరమీద దృశ్యం వచ్చింది.

'ఇదిగో ఇది మనరాష్ట్రానికే పెద్దాయన డీఎన్‌ఏ. ఇందులో ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నదే 'హై కమాండో టెట్రాక్సిన్‌'. ఈ రసాయనంవల్ల ఏ నిర్ణయాన్నీ సొంతంగా తీసుకోలేరు. ప్రతి పనికీ హైకమాండ్‌ అనుమతి పొందాల్సిందే. ఇక్కడ కనిపిస్తున్న 'నేచురల్‌ పవరిక్‌ యాసిడ్‌' వల్లనే ఆయనకు అనుకోకుండా అధికార లక్షణాలు పుట్టుకొచ్చాయి. ఎవరో అర్థమైందిగా?' అన్నాడు న్యూస్‌టన్‌.

'అర్థం కాకేం? మీరు మరోటి చూపించండి' అన్నాడు గుంభనాల గుర్నాథం.

'ఇదిగో ఇది మరో వ్యక్తి డీఎన్‌ఏ. ఇందులో ముదురు ఎరుపు రంగులో కనిపిస్తున్నదే 'మిథైల్‌ బినామీ ఆల్కహాల్‌'. దీనివల్ల ఈయనకు మద్యం వ్యాపారంలో బినామీ లింకులు ఏర్పాటు చేసుకోవాలనే లక్షణం అభివృద్ధి చెందింది. ఈ 'యాంటీ సీఎమ్‌ ఎంజైమ్‌'వల్ల ఈయనకు ముఖ్యమంత్రి పనులేవీ నచ్చవు. అర్థమైందిగా?'

'అయింది' అన్నాడు గుర్నాథం.

న్యూస్‌టన్‌ మరో నమూనా తీశాడు. 'ఈయన మనదేశానికే పెద్ద తలకాయ. ఈయన డీఎన్‌ఏలో తెలుపు రంగులో ఉన్న 'నో కామెంటో న్యూక్లియోటైడ్‌' వల్ల ఈయన తన చుట్టూ ఏం జరిగినా స్పందించరు. ఎలాంటి కుంభకోణాలు తన దృష్టికి వచ్చినా పెదవి విప్పరు'

గుర్నాథంతో పాటు జనమంతా 'ఎవరో తెలిసింది' అని అరిచారు.

'ఇదిగో ఈమె డీఎన్‌ఏ చూడండి. ఇందులో ప్రముఖంగా కనిపిస్తున్నది 'ఇండైరెక్ట్‌ ఇమ్యూనో పవరోసైడ్‌'. ఇందువల్ల ఈమె పరోక్షంగా అధికారాన్ని ప్రభావితం చేసే లక్షణాలను పెంపొందించుకున్నారు. ఇది ఆమె కుమారుడిదే. ఈయనలోని 'అన్‌రైపన్‌ అడినైన్‌' వల్ల ఇంకా పరిపక్వమైన బుద్ధులు ఒంటబట్టలేదు'

'ఆ తల్లీకొడుకులు ఎవరో తెలిసిపోయింది' అంటూ ఉత్సాహంగా అరిచారు జనం.

ఆఖరుగా న్యూస్‌టన్‌ ఒక నమూనా తీసి, 'ఇది చాలా కీలకమైన వ్యక్తి డీఎన్‌ఏ. ఇందులోని 'కీలెరిగి వాతో వోటోక్సిన్‌' వల్ల ఈయన తన చేతిలోని ఓటు అనే ఆయుధంతో ఎవరినైనా, ఏ పార్టీనైనా అధికారంలోంచి దించేయగలడు' అన్నాడు.

'అవును. అతడే వట్టి సామాన్యుడు. రాజకీయాల్లో మార్పు తేగల అనన్య సామాన్యుడు. మొత్తానికి మీ పరిశోధన అద్భుతం!' అన్నాడు గుంభనాల గుర్నాథం. జనమంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు.

PUBLISHED IN EENADU ON 12.5.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి