నిలదీసే నిజాలు!
ఉదయించిన సూర్యుడి వెలుగుకి గదిలోకి సన్నగా పొడుగ్గా విస్తరించాయి నీడలు. అవి ఆ గది తలుపు వూసలవి. వూసల నీడలు తన మీద పడేసరికి ఖైదీ ఉలిక్కిపడ్డాడు. మంచి నీళ్లు తాగాలనిపించింది.
'బాబూ, దాహం...' అన్నాడు వూసల వెనకనుంచి చూస్తున్న సెంట్రీతో.
'ధన దాహమా, అధికార దాహమా?' ప్రశ్నించాడా సెంట్రీ.
ఖైదీ కళ్లెర్రజేసి కోపంగా- 'ఏం, వేళాకోళంగా ఉందా?' అన్నాడు గట్టిగా.
సెంట్రీ నవ్వి 'ఇందులో వేళాకోళానికేముంది? నీ దాహాలు ఎలాంటివో నాకు తెలియనిదా? భూదాహం, గని దాహం, కీర్తి దాహం, కరెంట్ దాహం, కంపెనీల దాహం... లాంటివెన్నో ఉన్నాయి కాబట్టి ఏ దాహమో తెలుసుకుందామని అడిగాను, తప్పా?' అన్నాడు.
ఖైదీ ఇక భరించలేక 'ఏయ్, నేనెవరో తెలుసా?' అంటూ గద్దించాడు.
సెంట్రీ ఏమాత్రం తగ్గకుండా, 'ఆపవోయ్, పెద్ద అరుస్తున్నావ్... అసలు నేనెవరో తెలుసా?' అంటూ టోపీ తీశాడు.
అతడికేసి తేరిపారి చూసిన ఖైదీ ఉలిక్కిపడ్డాడు. అచ్చం అది తన రూపే.'ఏమిటిది?' అనుకున్నాడు.
సెంట్రీ వూసల్లోంచి జైలుగదిలోకి నడిచి వచ్చేసి పక్కనే కూర్చున్నాడు. చిత్రంగా చూస్తున్న ఖైదీతో, 'ఇంకా గుర్తు పట్టలేదా? నేనే, నీ అంతరాత్మను!' అన్నాడు.
ఖైదీ నిట్టూర్చి, 'ఆఖరికి నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా?' అన్నాడు దీనంగా.
'అంతరాత్మ దగ్గర కూడా అంతరాలు దేనికి? ఈ గదిలో నువ్వు ఒంటరివి. నీ మదిలో నేను తుంటరిని. కాదంటావా?'
'సరే... చెప్పు! ఇంతకూ నేను చేసిన తప్పేంటి?'
'చేయనిదేంటని అడగరాదూ! అహ... మనలో మాటలే. గొంతులో దాహం ఇన్ని నీళ్లు గుటకేస్తే తగ్గుతుంది. నీ దాహాలు ఎప్పటికి తీరేను? ధన దాహంతోనే కదా అడ్డగోలుగా దోచుకున్నావ్? అధికార దాహంతోనే కదా ఇన్ని ఆపసోపాలు పడుతున్నావ్? ఇప్పుడు చూడు, ఎలాంటి స్థితికి దిగజారావో! అందర్నీ ఓదారుస్తానంటూ బయల్దేరి, ఆఖరికి నిన్నెవరూ ఓదార్చడానికి లేని స్థితిని, ఎవరూ ఓదార్చలేని పరిస్థితిని తెచ్చుకున్నావు. తొలినుంచి చూస్తే నీ అడుగులన్నీ తప్పుల మడుగులే కదా?'
'అంటే... దుఃఖంలో ఉన్న ప్రజల్ని ఓదార్చాలనుకోవడం తప్పంటావా?'
'నా దగ్గర కూడా వాదనలెందుకు చెప్పు? దుఃఖంలో నువ్వున్నావా, ప్రజలున్నారా? అధికార పీఠం మీద పట్టు అనూహ్యంగా దూరమైన ఏడుపు నీది. వారసత్వ ఆశల్ని సంతకాలుగా మార్చినా- ఫలితం దక్కని ఏడుపు నీది. మహానేత కొడుకన్న ఏకైక అర్హత ఉన్నా అందలం ఎక్కించలేదన్న ఏడుపు నీది. ఎదిగిన ఒడినే కాలదన్ని వీధులకెక్కిన ఏడుపు నీది. చేసిన పనులు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ప్రజల మనోభావాలు మారిపోతాయన్న ఏడుపు నీది. ఇన్ని ఏడుపులు నీకు ఉండగా ఎడతెగని ఓదార్పులంటూ ఓర్పు లేకుండా ఒగరుస్తున్న నీ ప్రయత్నాలేంటో నేను గ్రహించలేననుకున్నావా?'
'నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. ఇంతకూ నువ్వు నాకు మిత్రుడివా, శత్రువ్వా?'
'ఆఖరికి ఈ స్థాయికొచ్చేశావన్నమాట. నీలో అనుమానం బాగా పెరిగిపోయింది. నీ చుట్టూ జరిగేదంతా కుట్రంటున్నావు. ఆ కుట్రకథతో జనాల్ని నమ్మించాలనుకుంటున్నావు. ఆఖరికి నీ అంతరాత్మనే శత్రువనుకుంటున్నావు. ఇక నువ్వు చేసేదేం లేదు. నీలో నువ్వే వగర్చుకో... ఓర్చుకో... ఓదార్చుకో...!'
ఖైదీ కళ్లెర్రబడ్డాయి.
'ఛ... నోర్ముయ్! వూరుకున్నకొద్దీ రెచ్చిపోతున్నావు. ఈ ప్రజాస్వామ్య సమాజంలో ఏ వ్యక్తయినా అనుకున్నది చేసే హక్కు లేదా? యాత్రలు చేసుకునే వీలు లేదా? ఏంటి పెద్ద చెప్పొచ్చావ్?' అంటూ అరిచాడు.
అంతరాత్మ పకపకమంటూ నవ్వింది. చూస్తుండగానే పెద్దగా ఎదిగిపోయింది.
'హ...హ...హ్హ...హ్హ...! ఇంకా నువ్వేంటో, నీ గతేంటో నీకు అర్థం కానట్టు మాట్లాడుతున్నావు. ఆత్మస్తుతీ, పరనిందా నీకెంతగా అలవాటయిపోయాయంటే, చివరికి నీలో ఉండే నామీద కూడా వాటినే ప్రయోగిస్తున్నావు. నా దగ్గరా నటనలా? నీలోకి నువ్వు తరచి చూసుకో. మొదట్నుంచీ నీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదు. నీ మనసులో ఉన్నదొకటి. పైకి మెత్తగా మాట్లాడుతున్నదొకటి. నన్ను నీ మది గదిలో ఖైదుచేసి నీ బుద్ధికి తోచినట్టు అడ్డమైన పనులన్నీ చేశావ్. ఫలితంగా ఇప్పుడు నువ్వే చంచల్‌గూడా జైల్లో ఓ ఖైదీగా మారావు. అధికార పీఠం అందుబాటులోకి వచ్చింది మొదలు నువ్వెన్ని పన్నాగాలు పన్నావో, ఎంతగా దోచుకున్నావో తెలియనట్టు అమాయక మొహం పెడతావేం? ఒకప్పుడు కేవలం మూడు లక్షల లోపు ఆదాయపు పన్ను కట్టిన నువ్వు, నాలుగైదు ఏళ్లలో ఏడు కోట్లకు పైగా ఎలా కట్టావంటే జవాబు చెప్పగలవా? మరో రెండేళ్లకల్లా ఏకంగా 84కోట్లు ముందస్తు పన్ను కట్టడం వెనక బాగోతాలు ఎప్పటికీ బయటకు రావనే అనుకున్నావా? ఒకటా రెండా... లక్ష కోట్లకు పడగలెత్తిన నీ సిరుల వెనక ఎన్నెన్ని విష పథకాలున్నాయో నాకు తెలియదనుకుంటున్నావా? భూములు, గనులు, ప్రాజెక్టులు, ఓడరేవులంటూ అభివృద్ధి పనుల మిషమీద అయినవారికి అడ్డగోలుగా కట్టబెట్టి, వాటికి ప్రతిగా కోట్లు కొల్లగొట్టి, నిజాలు బయటకొచ్చే సరికి అంతా కుట్రంటావా? ఇంతచేసీ ప్రజల్ని మభ్యపెట్టినట్టు, నీ అంతరాత్మనైన నన్నూ ఏమార్చాలని చూస్తున్నావంటే- నువ్వెంత కరడుగట్టిపోయావో తెలుస్తోందా? సీబీఐ ప్రశ్నలకైనా అడ్డదిడ్డంగా జవాబివ్వగలవేమో కానీ, నా ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పగలవా?' అంటూ గద్దించింది.
ఖైదీ కళ్లు గిర్రున తిరిగాయి. సూర్య కిరణాలు నిజాల బాణాల్లా చురుక్కుమనిపించడంతో జైలుగదిలో కళ్లు మూసుకున్నాడు ఆ కొత్త ఖైదీ!
Published in Eenadu on 06-06-2012.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి