సోమవారం, జూన్ 04, 2012

ఆటాడు కుందాం రా


ఆటాడు కుందాం రా



పట్టువదలని అక్రమార్కుడు శ్మశానంలోకి అడుగుపెట్టగానే చెట్టు చాటు నుంచి 'యు ఆర్‌ అండర్‌ అరెస్ట్‌' అని వినిపించింది. అక్రమార్కుడు దడుసుకుని చుట్టూ చూసేసరికి రాజకీయ బేతాళుడు చాటు నుంచి వచ్చి, 'భయపడ్డావా అక్రమార్కా? నేనేలే. నువ్వొచ్చి ఎలాగూ నన్ను చెట్టు మీంచి దించి భుజాన వేసుకుంటావు కాబట్టి, కాలయాపనెందుకని నేనే దిగిపోయా. నిన్ను చూడగానే సరదాగా దొంగాపోలీస్‌ ఆట ఆడాలనిపించింది. అలా సమాధుల వెనక దాక్కుంటూ ఆడుకుందామా?' అన్నాడు భుజం మీదకి దూకుతూ!
అక్రమార్కుడు బేతాళుడిని మోస్తూ ఎప్పటిలాగే నవ్వో ఏడుపో తెలియని తన మార్కు మొహం పెట్టి, 'నేనంటే నీక్కూడా ఆటలుగా ఉందా బేతాళా! మౌనం అక్కర్లేదని చెప్పి మాట్లాడమంటావు. మాటల్లో పెట్టి మనసులోది కక్కిస్తావు. ఏం చేస్తాం? ఎలాగోలా నిన్ను శ్మశానం దాటించి వశం చేసుకోవాలనే ఇదంతా భరిస్తున్నాను' అన్నాడు.

'అబ్బ! ఆశ... దోశ... అధికారం... అప్పడం!' అంటూ బేతాళుడు వికవికా నవ్వాడు. పిశాచాలు కూడా గొంతు కలిపాయి.

అక్రమార్కుడు తలపట్టుకున్నాడు. బేతాళుడు అది చూసి, 'పోన్లే. దొంగాపోలీస్‌ ఆట వద్దు. 'నాకది...నీకిది' ఆట ఆడుకుందామా? ఇందులో నువ్వు ఛాంపియనంటగా? సరేనా?' అన్నాడు.

'ఇదెక్కడి ఆట? దీన్ని నేనెపుడూ వినలేదే...' అన్నాడు అక్రమార్కుడు.

'అబ్బ... ఎంత అమాయకంగా మొహం పెట్టావయ్యా! ప్రజల ముందు ఉన్నావనుకున్నావా? వాళ్లయితే నమ్ముతారేమో కానీ నా దగ్గరెందుకయ్యా ఆ మొహం? నాకు తెలియదనుకోకులే. దీన్నే 'క్విడ్‌ ప్రొ కో' అని కూడా అంటారటగా? నువ్వు, నీ అనుచరులు కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు ఆర్జించింది దీంతోనేటగా? ఈ ఆటలో మెలకువలేంటో మాకూ నేర్పించవూ?' అన్నాడు బేతాళుడు, వచ్చే నవ్వు ఆపుకొంటూ.

ఏమనాలో తెలియని అక్రమార్కుడు వెంటనే బేతాళుణ్ణి భుజం మీద నుంచి దించి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూడసాగాడు.

బేతాళుడు పకపకమని, 'ఇదేంటయ్యా అక్రమార్కా! నేనేమైనా అమాయక ఓటర్ననుకున్నావా? కొంపదీసి చెంపలు నిమరవు కద? తల మీద ముద్దు పెట్టవు కద?' అన్నాడు.

అక్రమార్కుడు కనుబొమ్మలు ముడిచి, 'నువ్వు నిజంగానే బేతాళుడివా లేక సీబీఐ పంపిన విచారణాధికారివా?' అన్నాడు కోపంగా.

బేతాళుడు మళ్లీ భుజమెక్కి కూర్చుని, 'మొత్తానికి నీ అనుమానం బుద్ధి పోనిచ్చుకున్నావు కాదయ్యా! ఆఖరికి శవం కాలుతున్న వెలుగులో నీ వెనక పడే నీడను చూసి కూడా సీబీఐ అనుకునేలా ఉన్నావు... హ...హ్హ...హ్హ!' అంటూ నవ్వాడు.

అక్రమార్కుడి మొహం జేవురించింది. కోపంతో కళ్లెర్రజేసి, 'మీరంతా ఇంతే. భూత ప్రేత పిశాచ గణాలు! రాష్ట్రంలో పార్టీలు, అధికారులు, పోలీసులు అందరూ మీలాగే ఏకమయ్యారు. ప్రజలకు మేలు చేయడం కోసం మేమింత కష్టపడితే దానికి లేనిపోని అర్థాలు తీస్తారా? ఎవరూ చేయని పనులు చేస్తే లోటుపాట్లు వెతుకుతారా? మంచి చూడకుండా, చెడు చూస్తారా? కానీ గుర్తుంచుకోండి. ప్రజలంతా గమనిస్తున్నారు. తెలిసిందా?' అన్నాడు ఆవేశంగా.

శ్మశానంలో పిశాచాలన్నీ భళ్లున నవ్వాయి. బేతాళుడు పగలబడి నవ్వి, 'సర్లేవయ్యా! అలాగే కానీ! నీ నమ్మకం నేనెందుకు కాదనాలి? మరైతే ఇప్పుడీ శ్మశానంలో ప్రజలెవరూ లేరు కదా? కాబట్టి నిజాలు చెప్పు. నువ్వాడించిన భూదారుణాల గుట్టు విప్పు. ఏ ధైర్యంతో ఇన్ని అకృత్యాలకు ఒడిగట్టావు? ఎలా ఇందుకు పథక రచన చేశావు? ఈ ప్రశ్నలకు తెలిసి కూడా సరైన సమాధానాలు చెప్పకపోయావో... అధికార పీఠం ఎప్పటికీ అందనంత ఒట్టు!' అన్నాడు.

అక్రమార్కుడు కాసేపు నిరుత్తరుడయ్యాడు. తరవాత నెమ్మదిగా గొంతు పెగల్చుకుని, 'ఎంత మాటన్నావు బేతాళా! నేను కలలో కూడా ఊహించలేని విషయమిది. ఇక తప్పుతుందా? విను. అధికారం అందుబాటులోకి వచ్చేసరికి నేనొక చిన్న కంపెనీకి అధిపతిని మాత్రమే. రాకరాక వచ్చిన అధికారం అండతో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదగాలని భావించాను. అందుకు అనుగుణంగా అనుచర వర్గంతో కలసి పావులు కదిపాను. రాజధాని శివార్లలోని భూముల ధరల్ని రంకె వేయించడంతో మా పని మొదలు పెట్టాం. ముందుగానే అయినవారు, అనుంగు అధికారులు, ప్రముఖుల చేత భూములు కొనిపించి, అక్కడికి విదేశీ కంపెనీలు, రింగురోడ్లు, అంతర్జాతీయ ప్రాజెక్టులు రాబోతున్నట్లు ప్రచారం చేయించాం. అలా భూముల ధరలు పెరగడంతోనే అమ్మించి, సంపద సృష్టించడం ఎంత సులువో అస్మదీయులకు అర్థమయ్యేలా చేశాం. ఆపై అధికారులను ప్రలోభపెట్టి పనులు జరిపించాం. నా వ్యాపారాలలో పెట్టుబడి పెట్టిన వాళ్లకి కావలసిన భూముల్ని ధారాదత్తం చేయడానికి తెర తీశాం. ఏ పరిశ్రమకైనా, ప్రాజెక్టుకైనా రాష్ట్రంలోని బంజరు భూముల్నే ఇవ్వాలి. కానీ వాటికి ధర ఉండదు కాబట్టి పచ్చని పంట పొలాల్ని సైతం ఇవ్వడానికి సమకట్టాం. సెజ్‌లను సృష్టించి రైతుల భూముల్ని వశపరుచుకున్నాం. ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి మా పనులకు అభివృద్ధి ముసుగు వేశాం. ప్రాజెక్టులొస్తే పిల్లలకు ఉద్యోగాలొస్తాయని ఊదరగొట్టాం. గ్రామాల రూపురేఖలే మారిపోతాయని ఊరించాం. ఇలా గనులు, కొండలు, అరణ్యాలు సైతం తవ్వుకోవడానికి అనుమతులు ఇచ్చేశాం. ఇదే నువ్వంటున్న క్విడ్‌ ప్రొ కో కార్యక్రమం. ఇక చాలా?' అన్నాడు నీరసంగా.

అంతా విని పిశాచాలు సైతం బాధగా నిట్టూర్చాయి. బేతాళుడు బాధగా మొహం పెట్టి, 'ఎంత పని చేశావు అక్రమార్కా! మీ మాయాజాలం వల్ల ప్రాజెక్టులు, పరిశ్రమలేవీ రాకపోగా వేలాది మంది అమాయక ప్రజలు భూములు కోల్పోయారు. ఉపాధి కోల్పోయి కూలీలుగా మారారు. సర్లె... శ్మశానంలోనైనా నిజం చెప్పావు. సంతోషం. సరైన సమాధానం చెప్పాక ఇంకా నేనెందుకు నీ భుజం మీద వూరేగుతాను? వస్తా' అంటూ బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు!

PUBLISHED IN EENADU ON 4.6.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి