శుక్రవారం, జూన్ 08, 2012

అవినీతి మాంత్రికుడు



అవినీతి మాంత్రికుడు

పట్టువదలని అక్రమార్కుడు శ్మశానంలోకి అడుగుపెట్టగానే 'సారొత్తారొత్తారే... వస్తారొత్తారొత్తారే...' అనే పాట వినిపించింది. రాజకీయ బేతాళుడు, పిశాచాలు కలిసి చెట్టుకింద స్టెప్పులేస్తూ కనిపించాయి.
అక్రమార్కుడు ఉబ్బితబ్బిబ్బైపోయి, 'ఇదేంటి బేతాళా, నువ్వు నాకు వశమైనట్టేనా?' అన్నాడు.

బేతాళుడు భళ్లున నవ్వి, 'వార్నీ, నీకు ఆశ చాలా ఎక్కువయ్యా! అందుకే రాష్ట్రాన్ని అంతలా దోచుకున్నావు! రోజూ ఒకేలా మొదలెట్టడం ఎందుకని ఇలా కొత్తగా ఆలోచించానంతే. బాగుందా?' అన్నాడు.

అక్రమార్కుడు డీలా పడిపోయి సమాధి మీద నీరసంగా కూలబడ్డాడు. బేతాళుడు దగ్గరకొచ్చి, 'ఏమయ్యా, జైల్లో ఆహారం సరిపోవడం లేదా? రోజూ నువ్వు తినేలా అక్రమాల సన్నబియ్యంతో అన్నం వండటం లేదా? అందులోకి కమ్మని కాసుల కలగలుపు పప్పు వడ్డించడం లేదా? గనులు కూరిన గుత్తొంకాయ కూర చేయించలేదా? ఖనిజాల ఖైమా సంగతేంటి? సెజ్‌ల పులుసైనా పెట్టారా లేదా? పెట్టుబడుల పచ్చడి వేశారా? రాకరాక వచ్చిన అతిథివి కదా, భూముల బొబ్బట్లు చేయించొద్దూ? ఆశలు తోడెట్టిన గడ్డపెరుగుతోపాటు జుర్రుకోవడానికి మారిషస్‌ నుంచి మాయాజాలం మామిడిపళ్లు తెప్పించొద్దూ? కనీసం నంజుకోవడానికి నల్లడబ్బైనా వేయాలి కదా? అవినీతి అప్పడాలు, వక్రబుద్ధి వడియాలు కూడా లేవా? ఎంత దారుణం... ఎంత దారుణం!' అంటూ వగలుపోయాడు. పిశాచాలన్నీ ముసిముసిగా నవ్వసాగాయి.

అక్రమార్కుడు దీనంగా మొహం పెట్టి, 'బేతాళా! నీకిది భావ్యమా? వశం చేసుకుందామని వచ్చానుకదాని ఇలా ఎగతాళి చేస్తావా? నాకు తెలిసి అలనాటి విక్రమార్కుడి కథలో బేతాళుడు కథలు చెబుతాడు కానీ, నీలా కబుర్లు చెప్పడు...' అన్నాడు ఉక్రోషంగా.

బేతాళుడు నవ్వుతూనే దగ్గరకు వచ్చి, 'భలేవాడివయ్యా అక్రమార్కా! అలనాటి ఆయనకు, ఇలనాటి నీకు పోలికెక్కడుంది చెప్పు? ఆ విక్రమార్కుడు అవక్రమ పరాక్రమవంతుడు. మరి నువ్వో? అక్రమ వక్రబుద్ధుడివి. ఆయన ప్రజారంజకుడు. నువ్వు ప్రజావంచకుడివి. ఆయన జనాన్ని రంజింపజేసి ఆనందపరిస్తే, నవ్వు ఏడిపించి ఓదారుస్తున్నావు. ఆయన బేతాళుణ్ని వశం చేసుకోవాలనుకున్నది పరోపకారం కోసం, ప్రజాహితం కోసం! నువ్వు నన్ను వశం చేసుకోవాలనుకుంటున్నది అధికారం కోసం, ప్రజాధనాన్ని మరింత దోచుకోవడం కోసం! చెప్పిన తేడాలు చాలా, ఇంకా చెప్పాలా?' అన్నాడు.

విసిగిపోయిన అక్రమార్కుడి మొహం కోపంతో ఎర్రబడిండి. చర్రుమంటూ లేచి, 'బేతాళా, వూరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. చూస్తూ ఉండు. త్వరలోనే నీకు బుద్ధిచెప్పే రోజు వస్తుంది. నీకు తెలియదేమో, నీకన్నాముందే నాకు ప్రజలంతా వశమయ్యారు, తెలుసా?' అన్నాడు ఆవేశంతో వూగిపోతూ!

ఆ మాటకు పిశాచాలన్నీ పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ కిందపడి దొర్లసాగాయి. బేతాళుడు కూడా శ్మశానం దద్దరిల్లేలా నవ్వి, 'అక్రమార్కా, నీకు చాలా తిక్కుందయ్యా! కానీ, దానికి ఓ లెక్క మాత్రం లేదు. అందుకే చట్టమన్నా, న్యాయమన్నా, నీతన్నా, నిజాయతీ అన్నా, ప్రజలన్నా, ప్రజాస్వామ్యమన్నా అస్సలు లెక్కలేకుండా అడ్డమైన అక్రమాలు చేశావు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నావు. అయినా నీ నోట ప్రజలనే మాట వచ్చింది కాబట్టి, ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు? ప్రజలు నిన్ను నమ్ముతున్నారని నువ్వెలా అనుకొంటున్నావు? నీకింత భరోసా ఎక్కడిది? జనాన్ని ఏ విధంగా ఆకట్టుకున్నావని భావిస్తున్నావు? అందుకు నువ్వు పాటించిన నయవంచక పద్ధతులు ఏంటి? ఈ ప్రశ్నలకు తెలిసి కూడా సరైన సమాధానాలు చెప్పకపోయావో... ప్రజల మనసు నువ్వంటే విరిగిపోయినంత ఒట్టు' అన్నాడు.

అక్రమార్కుడు దిగాలుపడిపోయాడు. బేలగా మొహం పెట్టి, 'నీ శాపంతో చెడ్డ చిక్కొచ్చింది బేతాళా! నువ్వంత మాటన్నాక చెప్పక తప్పుతుందా? రాక రాక మాకు అధికారం అంది వచ్చింది. దాని ఆధారంగా ఎదగాలంటే అమాయకమైన ప్రజానీకానికి మత్తు చవి చూపించాలి. వాళ్లకేదో మేలు చేస్తున్నట్టు ప్రచారం చేయాలి. అందుకే కొత్తకొత్త పథకాలు రచించాం. వాటి అమలు పేరిట వారికి కొంచెం విదిల్చి మేము, మా అనుయాయులు కోట్లకు పడగలెత్తాం. సోదాహరణంగా చెబుతాను, విను. జలపథకాల పేరిట ప్రాజెక్టులు మొదలుపెట్టాం. కానీ కాంట్రాక్టులన్నీ మా అనుచరులకే ఇచ్చాం. వాళ్లు పనులు చేసినా, చేయకపోయినా కోట్ల కొద్దీ రూపాయల బిల్లులు చెల్లించాం. అదీ చాలకపోతే అంచనాలు సవరించి మరీ సొమ్ములు విడుదల చేశాం. ఆ ధనమంతా ఎవరిది? ప్రజలనుంచి పన్నుల రూపంలో వసూలు చేసినదే. ఫలితంగా ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నా మేమంతా కోట్లు వెనకేసుకున్నాం. ఉపాధి పనుల పేరిట పేదలకు కొంత సొమ్ము పంచినట్టే పంచి, వాటి కోసం పెట్టే బిల్లుల పేరిట కిందిస్థాయి అధికారి నుంచి పైస్థాయి నాయకుల వరకు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పారేలా ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఫీజులు ఇప్పించినట్టే విదిల్చి, ఆ నెపంతో మా వారిచేత వందలకొద్దీ కాలేజీలు పెట్టించి గ్రాంటులు మంజూరు చేశాం. ఇప్పుడా కాలేజీలన్నీ అరకొర వసతులతో మూతపడ్డాయి. విద్యా ప్రమాణాలు కూడా దిగజారాయి. రోగాలకు చికిత్స పేరిట అస్మదీయ వైద్యులకు కోట్లు పంపిణీ చేశాం. ఇలా ఏం చేసినా ప్రజలకు గోరంత, మేం మెక్కేది కొండంత ఉండేలా చూసుకున్నాం. కానీ పాపం... ప్రజలు అమాయకులు. మా వల్ల అవినీతి వ్యవస్థాగతమైందని, అందువల్ల అడుగడుగునా అణగారిపోక తప్పదని తెలుసుకోలేరు. వాళ్ల అజ్ఞానం మీదనే నాకు అనంతమైన నమ్మకం. వాళ్ల అమాయకత్వమే నాకు రక్ష' అంటూ మనసులోని మాయనంతా వెల్లగక్కాడు.

బేతాళుడు నిట్టూర్చి, 'ఎంతగా దిగజారిపోయావు అక్రమార్కా! అవినీతి మాంత్రికుడిలా కనిపిస్తున్నావు. ఇంత పచ్చిగా నిజాలు చెప్పాక ఇక నాకిక్కడేం పని?' అంటూ శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు!



PUBLISHED IN EENADU ON 8.6.12

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి