బుధవారం, జూన్ 06, 2012

నోరున్న నేరగాడి కథ


నోరున్న నేరగాడి కథ!


తాడిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే- 'దూడ గడ్డి కోసం' అన్నాడట వెనకటికో దొంగవెధవ! వాడెక్కింది కల్లుకోసమని తెలిసిపోతూనే ఉంది. అయినా నిజమేదో వాడిచేతే చెప్పిద్దామంటే అదీ అడ్డగోలు సమాధానం. 'చెట్టు మీద గడ్డి ఉంటుందా?' అని అడిగితే, పైనుంచి చూస్తే కింద గడ్డి కనబడదా అని జవాబు వచ్చే ప్రమాదముంది. బుకాయించేవారికి నోరే ఆధారం. వక్రమైన తెలివితేటలకు, మడత నాలుక కూడా తోడైతే అడ్డగోలు పనులెన్ని చేసినా- ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా వాగుతూ విషయాన్ని దారి మళ్లించవచ్చు.
'నోరుంటే బుర్ర కాస్తుంది' అని బోధించాడో గజదొంగ తన కొడుక్కి. వాడోసారి రాజుగారి ఉద్యానవనంలో గులాబీలు కోసి, అడ్డంగా దొరికిపోయాడు. భటులు తనిఖీ చేస్తే వాడి జేబుల నిండా బోలెడు పూలు. 'పద... రాజుగారి దగ్గరకి' అని తీసుకుపోసాగారు. వాడికి తండ్రి బోధ గుర్తొచ్చింది. అది తలచుకుని ఆలోచించేసరికి కర్తవ్యం బోధపడింది. భటుల వెంట నడుస్తూనే ఒకో గులాబీనీ నోట్లో వేసుకుని నమిలేశాడు. తీరా రాజుగారి దగ్గరకి వెళ్లేసరికి సాక్ష్యం లేకుండా పోయింది. నోరుంటే బుర్రెలా కాస్తుందో ఒంటపట్టినవాడు పెద్దయ్యాక తండ్రిని మించిన ఘరానా దొంగ అవుతాడని వేరే చెప్పాలా?

అమారా దేశంలో ఇలాగే ఓ కొరగాని కొడుకు ఉండేవాడు. వాడు చేయని దోపిడి లేదు. దోచని ఇల్లు లేదు. అడ్డమైన పనులూ చేసి అనుకోకుండా దొరికిపోయాడు. వాడిని విచారణాధికారి దగ్గరకు తీసుకుపోయారు. ఆయన అడిగే ప్రశ్నలకు వాడెలా వాగుతున్నాడో ఓసారి చూద్దాం.
'ఏరా? ఎందుకు దొంగతనం చేశావు?'
'నేనే కాదు, చాలామంది దొంగతనాలు చేశారు...'
'వాళ్ల సంగతి సరే, నీ సంగతి చెప్పు?'
'ముందు వాళ్ల సంగతి తేల్చి, నా సంగతి అడగండి...'
'నీ ఇంట్లో సోదాచేస్తే భారీగా దొంగ సొత్తు దొరికింది...'
'నాకన్నా ముందు చోరీలు చేసినవారందరి ఇళ్లూ సోదా చెయ్యండి...'
'వాళ్లనెందుకు సోదా చేయడం?'
'నన్ను సోదా చేశారు కాబట్టి...'
'నిన్ను సోదాచేస్తే ఏంటి తప్పు?'
'వాళ్లందరినీ సోదా చేయకపోతే తప్పు...'
'నువ్వు దొంగతనం చేస్తుండగా భటులు పట్టుకున్నారు...'
'ఇదంతా పెద్ద కుట్ర...'
'దొంగ వెధవను పట్టుకుంటే కుట్ర ఎందుకవుతుంది?'
'నేను దొంగతనం చేస్తున్నచోటికే భటులు ఎందుకు రావాలి? వేరేవాళ్లున్న చోటుకూ వెళ్లాలి కదా? నన్నే పట్టుకున్నారంటే అది కుట్రే కదా?'
'ఆ సంగతి సరే... నీ ఇంట్లో అంతంత డబ్బులెక్కడివి?'
'వ్యాపారాలు చేసి సంపాదించా...'
'ఏమిటా వ్యాపారాలు...'
'నా తెలివితేటలతో చేసినవి...'
'ఏమిటా తెలివితేటలు?'
'వ్యాపార రహస్యాలు చెప్పకూడదు...'
'సరే... నిద్రపోతున్న ప్రజల ఇళ్లలోకి ఎందుకు దూరావు?'
'వాళ్లకు మేలు చేద్దామని...'
'ఏమిటా మేలు?'
'మిమ్మల్ని దోచుకునే దొంగలుంటారు, అప్రమత్తంగా ఉండండీ అని చెప్పి లేపుదామని...'
'ఆ సంగతి పగలు చెప్పొచ్చుగా?'
'పగలు పడుకుని ఉండరుగా?'
'మరి వెళ్లినవాడివి వాళ్లనెందుకు లేపలేదు?'
'వాళ్లు మంచి నిద్రలో ఉన్నారని జాలేసి లేపలేదు...'
'మరైతే రాత్రుళ్లు పడుకుని ఉంటారని తెలిసి కూడా ఇళ్లలోకి ఎందుకు దూరడం?'
'పగలు దూరితే వూరుకోరు కాబట్టి...'
'అందుకే... వాళ్లు మత్తులో ఉండగా వాళ్ల సొత్తంతా దోచుకున్నావని నీ మీద ఆరోపణ ఉంది...'
'ప్రజల్ని దోచుకున్నారన్న ఆరోపణలు చాలామంది మీద ఉన్నాయి...'
'వార్నాయనో... నువ్వెక్కడ దొరికావురో!'
'దొరకలేదు... మీరే పట్టుకున్నారు'
విచారణాధికారి తల పట్టుకుని, 'ఒరే, దయచేసి నిజం చెప్పరా...'
'ఏది నిజం?'
'నువ్వు అబద్దాలాడుతున్నావన్నది నిజం...'
'కానీ అది అబద్ధం కదా?'
'మరి నిజమేంటి?'
'అయితే అబద్ధమేంటి?'
విచారణాధికారికి కడుపులో తిప్పింది. రాజుగారి దగ్గరకు వెళ్లి, 'ప్రభూ! వీడు చాలా ప్రమాదకారి. బయటకు వదిలితే అపాయం. వీడి చేత ఎప్పటికైనా నిజం చెప్పిస్తా, నాక్కొంచెం సమయం ఇవ్వండి' అని కోరాడు.
రాజుగారు సరేనన్నారు.

* * *
కొసమెరుపు: కరడు కట్టిన కరకువాడు... తేనె పూసిన కత్తి... గోముఖ వ్యాఘ్రం... పయోముఖ విషకుంభం... కపటి... కఠినుడు... మోసగాడై, వక్రమైన అపార తెలివితేటలున్న ఎలాంటి నేరస్తుణ్ని ప్రశ్నించినా జవాబులు ఇలాగే ఉంటాయనేది నిజం. అది అలనాటి విచారణాధికారి కథైనా, ఈనాటి సీబీఐ ముందున్న వాస్తవమైనా!


PUBLISHED IN EENADU ON 07.06.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి