చంచల్‌గుడా జైల్లో చంచలంగా పచార్లు చేస్తున్నాడు అక్రమార్కుడు. ఇంతలో కొందరు ఖైదీలు గుంపుగా దగ్గరకు వచ్చారు. వారిలో బలిష్ఠంగా ఉన్నవాడొకడు చటుక్కున వచ్చి అక్రమార్కుడి చేతులు పట్టుకున్నాడు.
'తప్పదు. కాదనకూడదు. నేను అఖిలాంధ్ర ఖైదీల అధ్యక్షుణ్ని. మన వాళ్లంతా మీకు సన్మానం చేయాలనుకుంటున్నారు. తమరు ఒప్పుకోవాలి' అన్నాడు చొరవగా.
అక్రమార్కుడు మొహం చిట్లించాడు. 'ఉండవయ్యా! అసలే బెయిల్ రాక నేనేడుస్తుంటే సన్మానమేంటి మధ్యలో' అన్నాడు చిరాగ్గా.
'అమ్మమ్మా! ఎంత మాట. అసలు మీకు సన్మానం చేయడానికి కారణం అదే. మేమంతా చిన్నాచితకా దొంగతనాలు గట్రా చేసి వచ్చినోళ్లం. గబుక్కున చేసిందేదో రుజువైపోయి జైల్లో పడ్డాం. మరి మీరో? తమరి నేరాల చిట్టా ఓ పక్కన తేలేలా లేదు. ఒకదాన్ని లాగుతుంటే మరొకటి బయటపడుతోంది. అందుకే కాస్త పెద్ద మనసు చేసుకుని మా బోటివాళ్లకు కొన్ని చెడ్డ మాటలు చెప్పాలి. తప్పదు. పైగా మాకు ఓట్లు కూడా ఉన్నాయి' అన్నాడు ఖైదీల అధ్యక్షుడు.
ఆఖరి మాట అక్రమార్కుడికి బాగా నచ్చింది.
'ఏమిటో మీ అభిమానం మీరూను. సరే అలాక్కానీండి' అన్నాడు అక్రమార్కుడు.
* * *
మర్నాడు సభలో ముందుగా సభాధ్యక్షులు- 'వారు ఈ సన్మానానికి ఒప్పుకోవడమే మనందరి అదృష్టం. మన ఖైదీల్లో బాగా చదువుకున్నవారిని, కవుల్ని ఎంపిక చేశాం. వాళ్లిప్పుడు అక్రమార్కులవారిని వేదికపైకి ఆహ్వానిస్తారు' అన్నాడు.
వెంటనే కొందరు చెట్లకున్న ఆకులు తెంపి జల్లుతూ తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు.
'అగణిత అక్రమ వక్ర మార్గ వైతాళికా!
ద్విగుణీకృత దుశ్చరిత్ర దురంధరా!
చండ ప్రచండ నీచకృత్య నిర్నిరోధా!
బహుపరాక్... బహుపరాక్...'
అంటూ అక్కడున్న ఓ గట్టు ఎక్కించారు.
అధ్యక్షుడు గొంతు సవరించుకుని, 'దొంగల్లారా, నేరగాళ్లలారా! అక్రమార్కులవారు జైల్లో ఉన్నా బయటి నీచ రాజకీయాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. వారికి అనేక అత్యవసర అకృత్య కార్యకలాపాలు ఉన్నందున త్వరగా ముగించాలని కోరుతున్నాను' అన్నాడు.
వెంటనే ఓ ఖైదీ లేచి, 'ముందుగా నేనొక పద్యాన్ని ఆయన కోసం రచించాను' అంటూ మొదలు పెట్టాడు.
'చేత చిన్న ముద్ద చూపించి బులిపించి...
బంగారు భూముల్ని చుట్టబెట్టి...
సెజ్ తాయిలాలు సిరి దోచు పథకాలు...
కరకు నేతా! నిన్ను చేరి కొలుతు!'
ఖైదీలందరూ చప్పట్లు కొట్టారు.
ఆ ఖైదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, 'నేను బతికుండగా అనేక దోపిడిలు చేశాను. ఎన్నోసార్లు జైలుకు వస్తూ వెళ్తున్నాను. నేను చేసిన పనులు బయటపడినప్పుడు నాకెంతో సిగ్గుగా అనిపించేది. ఇప్పుడు ఈ అక్రమార్కులవారిని చూశాక నా భావాలెంత తప్పో తెలిసివచ్చింది. కోట్లు దోచుకుని కూడా ఈయనగారు సిగ్గనేది లేకుండా ఉండగలగడం అత్యద్భుతం. కోర్టుకు వెళ్లినప్పుడల్లా ఏదో ఘనకార్యం చేసినట్టుగా నవ్వుతుండటం ఆశ్చర్యకరం. ఇది మనలాంటి నీచులందరూ నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం' అన్నాడు.
తరవాత మరో ఖైదీ లేచి, 'నేను శ్రీమాన్ అక్రమార్కులవారికి ఒక కవితాంజలిని సమర్పించదలిచాను...' అంటూ గొంతు సవరించుకున్నాడు.
'ఎవ్వారి తరమవును ఈ వెధవ పనులు...
అవని నేరములందు అన్నిటను మిన్న...
అసురులైన ఈతీరు అందుటను సున్న...
అన్నన్న! ఇది కదా... అకృత్యమన్న!'
ఆపై అతడు తన ఉపన్యాసం కొనసాగిస్తూ, 'మనమందరం నీచమైన పనులుచేసి చెడ్డవాళ్లమని అనిపించుకున్నవాళ్లమే. కానీ ఈయన? పైకి మంచిగా కనిపిస్తూ, అందరికీ మంచి చేయడానికే తన అవతారమన్నట్టు నమ్మిస్తూ మనందరికన్నా ఎక్కువగా దోచారు. ఇంత దోచి కూడా జనానికి మేలు చేసినట్టు నమ్మబలుకుతున్నారు. ఆ నంగనాచి, నయవంచక నయావిధానాలను నేర్చుకోండానికి మనం ఎన్ని జన్మలెత్తాలో అర్థం కాకుండా ఉంది' అన్నాడు.
ఇలా కొందరు మాట్లాడాక అధ్యక్షుడు లేచి, 'ఇప్పుడు అక్రమార్కులవారు మనందరికీ నీచ నికృష్ట పనులు చేయడంలో ఎలాంటి నైపుణ్యం చూపించాలో వివరిస్తారు. శ్రద్ధగా విని మరింత చెడిపోవాలని కోరుతున్నాను' అన్నాడు.
నవ్వో, ఏడుపో తెలియని మొహంతో అక్రమార్కుడు లేచి, 'మీ అందరి అభిమానం చూస్తుంటే ఆనందంగా ఉంది. కాబట్టి, నాకు తెలిసిన కొన్ని చెడ్డమాటలు చెబుతాను. ఇవాళ ఎంత దోచుకున్నావన్నది కాదు ప్రశ్న. రేపు ఎంత దోపిడి చేస్తామనేదే పాయింటు. మీరందరూ ముందుచూపులేని మామూలు, సాదాసీదా, అమాయక నేరగాళ్లు. నేనలా కాదు. రానున్న కొన్నేళ్లపాటు నిరాటంకంగా, నిరంతరాయంగా, నిర్భయంగా, నిశ్చింతగా కోట్లకు కోట్లు దోచుకోవడానికి పథక రచన చేసిన నీచ రాజకీయవేత్తను. అన్నింటికన్నా పెద్దసంపద ప్రజాధనం. దాన్ని దోచుకోవాలంటే అధికారం కావాలి. అందుకు ముందుగా ప్రజల్ని నమ్మించాలి. నిజానికి అదొక కళ. అంత తొందరగా అలవడదు. ఒకసారి అధికారం అందాక అమాత్యుల నుంచి, అధికారుల నుంచి, అనుచరుల నుంచి అందరికీ అవినీతి రుచి చూపించాలి. అదే నా కల. ఇప్పటికే అధికారాన్ని అడ్డం పెట్టుకుని చాలా దోచాను. ఇవాళ జైల్లో ఉన్నా నాకు దిగులు లేదు. ఇది ఒకరకంగా ప్రజల్లో సానుభూతి కలిగించాలని ప్రయత్నిస్తున్నాను. నా కల నెరవేరితే మిమ్మల్నందరినీ విడుదల చేయిస్తాను. నా మంత్రివర్గ సహచరులుగా నియమించుకుంటాను' అంటూ ముగించాడు.
ఖైదీలందరూ ఆనందంతో చప్పట్లు మోగించారు. ఇంతలో పోలీసుల విజిల్ వినిపించడంతో అందరూ ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు.
PUBLISHED IN EENADU ON 18.03.2013
kev keka☺☺☺11☺☺☺☺☺
రిప్లయితొలగించండిnice thing....
రిప్లయితొలగించండిthank you very much...
రిప్లయితొలగించండి