మంగళవారం, ఏప్రిల్ 09, 2013

యువరాజ నీతి




కోటలో రాజమాత గంభీరంగా పచార్లు చేస్తున్నారు. ఎంతసేపు ఆలోచించినా ఏమీ పాలుపోలేదు.
'ఎవరక్కడ?'
'చిత్తం మహారాణీ...'
'వెంటనే ప్రధానామాత్యుని పిలిపించు...'
'అవశ్యం...'
రాజమాత పచార్లు చేస్తుండగానే ప్రధానామాత్యులవారు వచ్చారు.
'అమ్మా, పిలిపించారట...' అంటూ ఆగాడు. అంతకుమించి అతడేనాడూ మాట్లాడి ఎరుగడు.
'ప్రధానామాత్యా! యువరాజు సంగతి ఆందోళన కలిగిస్తున్నది. అతడేదేదో మాట్లాడుతున్నాడు. వాటి అర్థములేమిటో, మూలములేమిటో తెలియడం లేదు...'
ప్రధానామాత్యులవారు ఎప్పటిలాగే నవ్వీ నవ్వనట్టుగా నవ్వారు. ఆయన మాట్లాడరని తెలిసిన రాజమాత కొనసాగించారు...

'మీకు తెలియనిదేమున్నది? మా రాజవంశ చరిత్ర మొత్తము తమకు అవగతమే. మహారాజులుంగారు మరణించునాటికి యువరాజు వట్టి బుడతడు.అతడిపైనే ఆశలు పెట్టుకుని పెంచుకుంటూ వచ్చాను. సింహాసనం ఎక్కే అవకాశం వచ్చినా నేను తెరచాటునే ఉండిపోయి, అధికార పీఠం మీద మిమ్మల్ని కూర్చోబెట్టాను. ఎప్పటికైనా యువరాజులుంగారు ఆ పీఠం మీద కూర్చుంటారని ఆశ పడ్డాను. కానీ వారు దీన్ని అర్థం చేసుకున్నట్టు లేరు. వివాహం చేసుకోనన్నారు. పోన్లే అనుకున్నాను. పిల్లల్ని కంటే వాళ్లే వారసులనే భావం కలుగుతుందన్నారు. సరే, కుర్రతనమని వూరుకున్నాను. ఇక ఇప్పుడు అధికారమే వద్దంటే తట్టుకోలేకపోతున్నాను. ఈ సువిశాల భారతావనికి రాజై, నన్ను మురిపిస్తాడనుకుంటే ఈ మాటలేమిటి? ప్రజలకే అధికారం ఇవ్వాలంటాడేమిటి? అధికారాన్ని వికేంద్రీకరణ చేస్తానంటాడేమిటి? నా ఒక్కడి అధికారంవల్ల ఏమీ కాదంటాడే? ప్రజలందరికీ దాన్ని పంచుతానంటాడేమిటీ... హతవిధీ!'

ప్రధానామాత్యులవారు నోరు మెదపబోయారు. ఇంతలో రాజమాతే అందుకోవడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు.

'పిల్లవాడిని వైద్యుడికి చూపించాలనిపించింది. మీరేమంటారు?'

అలవాటుగా ఆయనేమీ అనలేదు. నవ్వీనవ్వనట్టు నవ్వబోయి నవ్వలేక, నవ్వనట్టు పెదిమలు బిగపట్టి నవ్వకుండానే తలూపి, 'నేను ఇప్పుడే పిలిపిస్తాను...' అని మాత్రం అనేసి వూరుకున్నారు.

కాసేపట్లోనే ప్రధానామాత్యులవారి వెంట రాజవైద్యుడు వచ్చాడు. వస్తూనే నమస్కరించి, 'అమ్మా... యువరాజులవారి మాటలు నేనూ విన్నాను. ప్రధానామాత్యుల ద్వారా తమరి ఆవేదనా అర్థం చేసుకున్నాను. నేనిప్పుడే వెళ్లి యువరాజులవారిని ఏకాంతంలో కలిసి మాట్లాడి అసలు సంగతేమిటో తెలుసుకుని వస్తాను' అన్నాడు.

రాజమాత గంభీరంగా తలూపారు.

రాజవైద్యుడు యువరాజుల గదిలోకి వెళ్లారు. బయట రాజమాత పచార్లు చేయసాగారు. ప్రధానామాత్యులవారు ఆమెకేసి చూస్తూ యథాప్రకారం నిర్భావం తొణికిసలాడే ముఖంతో నిశ్చలంగా నుంచున్నారు. కాసేపటికి రాజవైద్యులవారు బయటికి వచ్చారు.

* * *

రాజమాత, ప్రధానామాత్యులవారి ముందు ఆసీనుడైన రాజవైద్యుడు గొంతు సవరించుకున్నాడు.

'అమ్మా... మొదట యువరాజులంవారిని శారీరకంగా పరీక్షించాను. నిక్షేపంగా నిగనిగలాడుతూ ఉన్నారు. ఆపై ఆయనతో మాట్లాడి ఆయన మానసిక పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నించాను...'

రాజమాత ఆసక్తిగా మొహం పెట్టారు. ప్రధానామాత్యులవారు ఏ భావం కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డారు.

రాజవైద్యుడు కొనసాగించాడు. 'యువరాజులవారు అలా మాట్లాడటానికి నాకు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రథమ కారణం. వారు మీకంటే మేధావి. ఇప్పటి దేశ, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీ బాటనే ఎంచుకోవడానికి నిర్ణయించుకున్నారేమోననేది నా అనుమానం. అనగా... తమరు తెరవెనక ఉంటూ ప్రధానామాత్యులవారిని పీఠంపై కూర్చోబెట్టి అధికార దండమే వారికిచ్చి, ప్రచ్ఛన్నంగా ఆదేశాలిస్తూ ఆడిస్తున్నారే....'

రాజమాత చికాగ్గా మొహం పెట్టి, 'అంత విపులముగా అక్కర్లేదు. క్లుప్తంగా చెప్పండి...'

రాజవైద్యుడు సర్దుకుని, 'అదేనమ్మా... అధికార పీఠమునకు దూరంగా ఉంటూనే కీలక బాధ్యతలు చేపట్టి ముందుకుసాగే ఆలోచన ఆయనకూ ఉండి ఉండవచ్చు. అందువల్ల తప్పులకు బాధ్యతను మరొకరిపై నెట్టివేస్తూ, తాను మాత్రం స్వేచ్ఛగా ఉండటమన్నమాట. కారణమిదే అయిన, యువరాజులవారు అధికార చక్రం తిప్పుతూ మీకు ఆనందం కలిగించగలరనడంలో సందేహం లేదు'

'మరి రెండో కారణం?' అన్నారు రాజమాత ఆతృతగా.

'యువరాజులుంగారు భిన్నమైన మార్గంలో సాగుతున్నారనుకుంటాను. ఎప్పుడూ ఒకేలాంటి ఉపన్యాసముల వల్ల ఫలితం ఉండదన్నది ఆయన ఆలోచన కావచ్చు. అందువల్ల ప్రజలను కొత్తరీతిలో ఆకట్టుకునేలా మాట్లాడి అధికారం చేజిక్కించుకోవచ్చనే ఎత్తుగడ కావచ్చును. ప్రజల మద్దతంటూ ఏమాత్రం లభించినా ఎలాగూ పీఠం ఎక్కేది తానే కాబట్టి ఇలా మాట్లాడే అవకాశం ఉంది. అంటే- లోపల ఒకటి, బయట మరొకటన్నమాట. కారణమిదైనా తమరు చింతించాల్సిన అవసరం లేదు...'

'సరిసరి... మూడో కారణం ఏమిటంటారు?' అన్నారు రాజమాత, రాజవైద్యుడి సాగతీతకు అడ్డుకట్ట వేస్తూ.

'ఏముందమ్మా! తమకు, ఇతర రాజకీయ దురంధరులకు నచ్చినా నచ్చకపోయినా యువరాజులుంగారు నిజంగానే సరికొత్త విప్లవాత్మక మార్పులను కోరుకుంటూ ఉండి ఉండవచ్చు. నవసమాజ నిర్మాణం దిశగా ఆలోచిస్తుండవచ్చు'

'అంటే, ఏ కారణమో కచ్చితంగా చెప్పలేరన్నమాట' అన్నారు రాజమాత.

'అంతేకదమ్మా... మబ్బులో పొద్దు, మనసులో మాయ ఏం తెలుస్తాయనే సామెత ఉండనే ఉంది కదా?' అన్నాడు రాజవైద్యుడు.

రాజమాత నిట్టూర్చారు. ప్రధానమాత్యులవారు నిట్టూర్చబోయి ఆపేశారు!

PUBLISHED IN EENADU ON  9.4.2013

2 కామెంట్‌లు: